కమలం లక్ష్యం కారు కాదు కాంగ్రెస్సే!
మునుగోడు ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అందులో అనుమానం లేదు. అధికార తెరాస మునుగోడును ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కంటున్న జాతీయ రాజకీయలకు లాంచింగ్ ప్యాడ్ గా భావిస్తోంది. అందుకే హడావిడిగా పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి( బీఆర్ఎస్) గా మార్చుకుంది. అయితే, సాంకేతిక ఇబ్బందుల కారణంగా పేరు మార్పు ప్రక్రియ పూర్తి కాకపోయినా, పార్టీ నాయకత్వం మాత్రం బీఆర్ఎస్ ప్రస్థానం మునుగోడు గెలుపు నుంచే మొదలవుతుందని భావిస్తోంది.
అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరినీ మునుగోడుకు తోలారు. నియోజక వర్గాన్ని సాధ్యమైనన్ని ముక్కలు చేసి, ఒక్కొక్క ముక్కకు ఒక్కొక్క నేతను ఇంచార్జిగా నియమించారు. ఉపఎన్నిక పోలింగ్ వరకు ఇంటి ముఖం చూడకుండా, మునుగోడులోనే మకాం వేయాలని ఆదేశాలు జారీ చేశారు. చివరకు ముఖ్యమంత్రి కేసేఆర్ కూడా కేవలం 2500 ఓట్లున్న చిన్న గ్రామానికి ఇంచార్జిగా వెళుతున్నారు. అంటే మునుగోడు ఉపన్నికను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్ధం చేసుకోవచ్చును.
మునుగోడు ఉప ఎన్నికను తెరాస జాతీయ రాజకీయ ప్రస్థానానికి లాంచింగ్ ప్యాడ్ గా భావిస్తుంటే, బీజేపీ, దక్షిణాదిన మరీ ముఖ్యంగా తెలంగాణలో పార్టీ విస్తరణకు ప్రవేశ ద్వారంగా భావిస్తోంది. మునుగోడులో గెలిస్తే తెలంగాణ తమ ఖాతాలో చేరినట్లేనని బీజేపీ జాతీయ నాయకత్వం గట్టిగా విశ్వశిస్తోంది.ఆ ప్రభావం త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటక పైనా ఎంతో కొంత ఉంటుందని భావిస్తున్నట్లు తెల్సుస్తోంది. అందుకే మునుగోడు సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డిని, కాంట్రాక్టుతో కట్టిపడేసి, వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని అంటున్నారు.
నిజానికి, బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే రాజగోపాల రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికకు తలుపులు తెరిచారు. నిజానికి మునుగోడు ఉపఎన్నిక బీజేపీ జాతీయ నాయకత్వం కోరి తెచ్చుకున్న ఉపఎన్నిక. కాబట్టి సహజంగానే కమల పార్టీ, తమ అంబుల పొదిలో ఉన్న, అన్నిఅస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. అంతే కాదు ఉప ఎన్నికలో తెరాసను ఓడించేందుకంటే, కాంగ్రెస్ ను మూడవ స్థానానికి నేట్టివేసేందుకే వ్యూహాలు రచిస్తోందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి, కారుకు కమలానికి మధ్య కాంగ్రెస్ అడ్డులేకుండా చేసుకునేందుకే, కమల దళం మునుగోడు ఉప ఎన్నికను కోరి తెచ్చుకుందని అంటున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీని మూడవ స్థానానికి పరిమితం చేయడం అయ్యే పనేనా అంటే మాములుగా అయితే, కాకపోవచ్చును కానీ హస్తం పార్టీ ప్రస్తుతం ఎదుర్కుంటున్న అసాధారణ పరిస్థితుల్లో అంత ఈజీ టాస్క్ కాకపోయినా అసాధ్యం అయితే కాదని అంటున్నారు. మునుగోడు నియోజక వర్గాన్ని ఎంచుకోవడంలోనే బీజేపీ సగం గమ్యం చేరిందని విశ్లేషకులు అంటున్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్ కు ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలలో ఉన్న పలుకు బడిని, పట్టును, ఇతర అనుకూల, ప్రతికూల అంశాలను బేరీజు వేసుకునే బీజేపీ మునుగోడును ఎంపిక చేసుకుందని అంటున్నారు. అలాగే, రాష్ట్రంలో రాహుల గాంధీ భారత్ జోడో యాత్ర సాగుతున్న సమయంలోనే ఉప ఎన్నిక జరిగేలా షెడ్యూలు ఖరారు చేయడం కూడా బీజేపీ వ్యూహంలో భాగంగానే భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఉక్కరి బిక్కిరి చేసేందుకే బీజేపీ మునుగోడు ఉప ఎన్నికను ముందుకు తెచ్చిందని అంటున్నారు.
అదలా ఉంటే తాజా పరిణామాలను గమనిస్తే, బీజేపీ వ్యూహం కొంతవరకు పనిచేస్తున్నట్లే కనిపిస్తోంది. నిజానికి రాజగోపాల రెడ్డి బీజేపీలో చేరినా, ఆయన సోదరుడు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ కూడా అయిన వెంకటరెడ్డి మునుగోడు ప్రచారానికి మాత్రం దూరంగా ఉంటున్నారు. నిజానికి కోమటి రెడ్డి వెంకటరెడ్డిని నమ్ముకునే, పాల్వాయి స్రవంతి పోటీకి సిద్ధమయ్యారని అంటారు. అంతేకాదు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇష్టం లేకున్నా, వెంకట రెడ్డి సిఫార్సు మేరకే కాంగ్రెస్ అధిష్టానం, ఆమెకు టికెట్ ఇచ్చిందని అంటారు. కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతి కూడా కోమటి రెడ్డి మీద ఎన్నో ఆశలు పెట్టు కున్నారు. ఈరోజుకు కూడా ఆమె ‘అన్న వస్తాడు, గెలిపిస్తాడు’ అనే ఆశతోనే ఉన్నారు.అయితే, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, కుటుంబ సమేతంగా ఈ నెల ( అక్టోబర్) 15 న విదేశాలకు వెళుతున్నట్లు తెలుస్తోంది.
మళ్ళీ ఆయన ఉపఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతనే తిరిగొస్తారని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రచార సారధి మధు యాష్కీ గౌడ్ సహా మరి కొందరు ముఖ్య నాయకులు మునుగోడు బాధ్యతల నుంచి తప్పు కున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ కోమటి రెడ్డి విమానం ఎక్కేస్తున్నారు. కాంగ్రెస్ కు ఇదొక సెట్ బ్యాక్ అయితే, రాష్ట్రంలోకి రాహుల గాంధీ భారాత్ జోడో యాత్ర ప్రవేశిస్తున్న నేపధ్యంలో, యాత్ర ఏర్పాట్లు, పర్యవేక్షణకు ఇప్పటికే మునుగోడులో బాధ్యతలు నిర్వహిస్తున్న మరి కొందరు సీనియర్ నాయకులను వెనక్కి పిలిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సో .. ఈ పరిణామాలను గమనిస్తే, బీజేపీ మునుగోడు లక్ష్యం తెరాసను ఓడించడం కాదు, కాంగ్రెస్ ను బలహీన పరచడమే అని స్పష్ట మవుతోందని అంటున్నారు.