బోర్ కొట్టు..మందు తాగు!
posted on Oct 11, 2022 @ 5:36PM
అదేదో సినిమాలో భారీ ఆయిల్ పైపులు అండర్‌గ్రౌండ్‌లో అమర్చి విలన్ తాలూకు పేద్ధ ఆయిల్ ట్యాంక్ నుంచి అమాంతం రెండు మూడు రోజుల్లో ఆయిల్ అంతా లాగేస్తారు. అప్పటివరకూ పేద్ద ఆయిల్ ట్యాంక్ ని పెద్ద మేడలో కిటికీలోంచి చూసుకుంటూ విలన్ తెగ ఆనందిస్తుంటాడు. కానీ ఓ మధ్యాన్నం అంతా అయిపోయి ఒక్క ఫోన్ కాల్ కోట్ల ఆస్తిని తుడిచేస్తుంది. ఇంత కాకున్నా ఆ మొదటి భాగం మాత్రం వాస్త వంగా ఒక గుడుంబా కింగ్ పక్కా జిరాక్స్ చేశాడు మరో విధంగా.. లాభం చేకూరేలా!
అయితే మధ్యప్రదేశ్‌లో ఒక గ్రామంలో నీరసంగా ఒక వ్యక్తి బోరు దగ్గరకి వెళ్లాడు. పంపు కొట్టగానే నీళ్లు వచ్చాయి. అవి మంచినీళ్ల నుకుని నోట్లో పోసుకోగానే ఏదో తేడా అనిపించింది. రెండురోజుల క్రితం తాగిన సారా గుర్తొచ్చింది. అనుమానించి మళ్లీ కొంచి బలంగా బోర్ కొట్టి చిన్న గ్లాసు నింపుకుని మరీ తాగి అదే.. అని తెగ ఆనందపడుతూ అరుస్తూ తాగి తూలి పడ్డాడు.
కొంతమంది అటుగా వెళుతూ పడిపోయిన ఈ వ్యక్తి ని చూసి ఈడ గూడ మందుకొట్టి పడ్డాడ్రా అనుకుని దగ్గరి కెళ్లారు. పంపుకొట్టి నీళ్లు అనుకుని అదే గ్లాసుడు అతని మీద పోశారు. ఠక్కున లేచి నోరెళ్లబెట్టి మరీ తాగాడు. ఏందిరా అయ్యా.. అంటే.. మందు.. మందురా బాబు.. మందు! అంటూ అరిచి గోల చేశాడు. వచ్చినవాళ్లు ఆశ్చర్యంగా, కాస్తంత ఖంగారుగానూ అతనికేసి చూశారు. మావా ఇందులోనే ఏదో మత్తు ఉంది అంటూ ఓ కుర్రాడు. పడిపోయిన ఆ వ్యక్తిని అవతలకి తీసికెళ్లి కూచోబెట్టాడు. అప్పుడు ఆ పంపు రహస్యం చెప్పాడు. బోర్ నీల్లనుకునేర్రా..అది మందు! అని అన్నాడు. ఆ కుర్రాడికి గీత వినిపించి నంత యింది.
పరుగున వచ్చి అతనూ బోర్ కొట్టాడు.. అవును అతను చెప్పింది కరెష్టే..మావా.. అన్నాడు రెండు గుక్కలు తాగి. మధ్యప్రదేశ్ లో ఒక గ్రామంలో సీన్ ఇది. అక్కడ అక్రమ మద్యం రవాణా చేసేవారు, లోకంలో ఎవ్వరూ ప్రదర్శించలేని తెలివి తేటలు ప్రదర్శించి, జనానికి మద్యం పోస్తూ డబ్బు వీలయినంత గణిస్తున్నారు. అందులో భాగమే ఈ బోర్ పంపు ఆలోచన. ఇంతకీ విషయమేమంటే.. కొందరు అక్రమమద్యం అమ్మే వాళ్లు పెద్ద పెద్ద మద్యం డ్రమ్ములు భూమిలో పాతిపెట్టారు. పైన బోర్‌కి వాటిని కనెక్ట్ చేశారు. అంతే జనానికి, పోలీసులకి అనుమానం లేకుండా సాగుతూ వచ్చింది. కానీ దొంగపని ఎన్నాళ్లు సాగుతుంది? తాగి తూలినవారే రగస్యం బయటపెట్టేశారు!