కొడాలి నాని హత్యకు కుట్ర..ట ?
posted on Oct 11, 2022 @ 5:40PM
ఆగండాగండి. తొందరపడకండి. హెడ్లైన్ చూసి, మాజీ మంత్రి కొడాలి నాని హత్యకు కుట్ర జరుగుతోందని, ఎవరో అలాంటి కుట్ర ఏదో చేస్తున్నారనినే నిర్ణయానికి వచ్చేయకండి. నిజానికి, ఆయన మంత్రి పదవి పోయినప్పటి నుంచి ఒక విధమైన డిప్రెషన్ లోకి వెళ్ళారో ఏమో మనకు తేలియదు కానీ ఆ మధ్యన సోషల్ మీడియాలో వైరల్ అయిన, పశువుల కొష్టంలో మాజీ మంత్రి పడక సీన్ దృశ్యాలు చుసిన వారు మాత్రం ఆయన డిప్రెషన్ లోకి వెళ్లారనే నిర్ణయానికే వచ్చారు. సరే, ఆయన డిప్రెషన్ లోకి వెళ్ళారో లేక ఇంకేదైనా పనిలో బిజీ అయిపోయారో ఏమో కానీ ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కడ అంతగా కనిపించ లేదు. వినిపించడం లేదు.
నిజానికి మాజీ మంత్రి కొడాలి నాని మాత్రమే కాదు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫస్ట్ కాబినెట్ లో పని చేసిన మాజీ మంత్రులు చాలా వరకు సైలెంటై పోయారు. ఇప్పటికే, మూట కట్టుకున్న పాప, పుణ్యాలు చాలనుకున్నారో జనంలోకి వెళ్లి ‘దీవెనలు’ అందుకోవడం ఎందుకని అనుకున్నారో ఏమో కానీ, చాలా వరకు పార్టీ కార్యకలాపాలకు కూడా మాజీలు దూరంగానే ఉంటున్నారని అంటున్నారు.
అయితే, ఈ మధ్య ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి, గడపగడపకు కార్యక్రమం విషయంలో అశ్రద్ధ వహిస్తే, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని గట్టిగా హెచ్చరిక చేయడంతో మాజీ మంత్రులు మెల్ల మెల్లగా కదులుతున్నారు. నిజానికి గడపగడపకు వెళ్ళినా ఇంటింటికి వెళ్లి మనిషి మనిషికి వంగి వంగి దండాలు పెట్టినా జనం వైసీపీకి మరో అవకాశం లేదని, ముఖం మీదనే చెప్పేస్తున్నారనుకోండి అది వేరే విషయం. నిజానికి, ఇప్పటికే ఎమ్మెల్యేలు అందరికీ ఆ నిజం తెలిసి పోయింది. అయితే, ముఖ్యమంత్రి ముచ్చట ఎందుకు కాదనాలని, మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు కూడా మొక్కుబడిగా ‘లెక్క’ కోసం గడప గడపకు వెళ్లి వస్తున్నారు.
అదే క్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని కూడా కొద్ది రోజులుగా నియోజక వర్గంలో ఇంటింటికి వెళ్లి దండాలు పెడుతున్నారు. పనిలో పనిగా నోటికి పని చెబుతున్నారు. తనదైన స్టైల్లో తెలుగు దేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మీడియాను తమ వైపు తిప్పుకునేందుకు జగన్ రెడ్డిని కాసింత ప్రసన్నం చేసుకునేందుకు, జూనియర్ ఎన్టీఆర్ ను అడ్డుపెట్టుకుని తెలుగు దేశం పార్టీలో చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పార్టీలో నెంబర్ టూ గా ఎదిగి పార్టీ కోసం పాదయాత్రకు సిద్ధమవుతున్న లోకేష్ ను కాదని సిన్మాల్లో జీగా ఉన్న జూనియర్ ఎన్టీఅర్ పార్టీ పగ్గాలు చేపట్ట్టాలని తెలుగు దేశం పార్టీ నేతలు
కోరుకుంటున్నారని తప్పుడు ప్రచారం సాగిస్తున్నారు. నిజానికి, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో జూనియర్ రియాక్ట్ అయిన తీరుతో ఆయన తెలుగు దేశం పార్టీకి మరింతగా దూరమయ్యారనే అభిప్రాయమే అందిరిలో వుంది. అలాంటిది జూనియర్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని పార్టీ నాయకులే కోరుకుంటున్నారంటే, అంతకు మించిన అభూత కల్పన, దిగజారుడు రాజకీయం ఇంకొకటి ఉండదని, కొడాలి అనుచరులే అంటున్నారు.
ఇదే క్రమంలో కొడాలి నానీ, తాను చంద్రబాబు నాయుడు కుట్రలపై నిజాలు చెబుతుండడంతో.. తనను హత్య చేయించే ప్రయాత్నాలు చేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయని ఎవరూ నమ్మని.. ఎవరిదాకానో ఎందుకు కనీసం ఆయన అంతరాత్ర్మ అయినా నమ్మని పచ్చి అబద్ధాన్ని చెప్పుకొచ్చారు. అయినా తాను దేనికీ భయపడేది లేదని ముక్తాయింపు నిచ్చారు, అయితే, హత్యలు చేసిది ఎవరో, చేయించేది ఎవరో... ఆదరికీ తెలిసిన విషయమే. అయితే, రాజకీయంగా ఇప్పటికే అయిపోయిన నాని, ఈ విధంగా సానుభూతి సంపాదించాలని అనుకుంటునట్లున్నారు.. అదీ కొడాలి నాని హత్యకు కుట్ర ? హెడ్డింగ్ వెనక ఉన్న కథ.