బాలయ్య షోలో ఆగస్టు సంక్షోభం నాటి పరిస్థితులపై బాబు క్లారిటీ
posted on Oct 12, 2022 @ 11:00AM
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవరిస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' సీజన్-2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మిగతా టాక్ షోలకు భిన్నంగా బాలయ్య షో నడిపించిన తీరుతో సీజన్-1 పెద్ద హిట్ అయింది. అందుకే సీజన్-2 పై ప్రేక్షకుల్లో ఈ స్థాయిలో ఆసక్తి నెలకొంది. పైగా సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్ లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనడంతో అన్ని వర్గాలలోనూ ఈ కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన మంగళవారం విడుదలైన ప్రోమో ఆ ఆసక్తిని వంద రెట్లు పెంచేసింది. చంద్రబాబు తన వ్యక్తిగత, రాజకీయ విశేషాలను ఈ కార్యక్రమంలో ఎలాంటి శషబిషలకూ తావులేకుండా వివరించారని ప్రోమోను బట్టి అవగతమౌతోంది.
అన్నిటికీ మించి 1995లో తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన ఆగస్టు సంక్షోభానికి సంబంధించి ఇంత కాలం విమర్శల, అపవాదుల శిలువ మోసిన చంద్రబాబు తొలిసారిగా నాటి పరిణామాలను, అందుకు దారి తీసిన పరిస్థితులను బాలయ్య నోటి వెంటే చెప్పించారని ఈ ప్రొమోను బట్టి అర్ధమౌతుంది. గత 27 ఏళ్లుగా.. తన రాజకీయ పరిణితిని, పాలనా సమర్ద్యాన్ని నిర్ద్వంద్వంగా రుజువు చేసుకున్నా 1995 నాటి పరిణామాల విషయంలో విపక్షాలు, ప్రత్యర్థులు చంద్రబాబునే టార్గెట్ చేస్తూ విమర్శించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారనీ, కుటుంబ సభ్యులను ఆయనకు దూరం చేశారనీ ఇలా ఎన్నో రకాలుగా విమర్శలు గుప్పించారు.
అయితే ఆ విమర్శలన్నిటినీ చంద్రబాబే భరించారు. ఆంధ్రప్రదేశ్ భవిత కోసం, అభివృద్ధి కోసం, తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం.. ఎవరెన్ని రకాలుగా విమర్శించినా మౌనం వహించారు. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు పట్ల తనకున్న గౌరవాన్ని, భక్తిని ప్రదర్శిస్తూనే వచ్చారు. విజయవాడలోని హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టడం వంటి పలు చర్యల ద్వారా చంద్రబాబు ఎన్టీఆర్ పట్ల తనకున్న గౌరవ మర్యాదలను ప్రకటిస్తూనే ఉన్నారు. ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇన్నేళ్ల తరువాత.. తెలుగుదేశంలో నాడు ఎన్టీఆర్ పై తిరుగుబాటుకు దారి తీసిన పరిస్థితులపై తన నోటి ద్వారా కాకుండా... ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ నోటి ద్వారా చెప్పించి.. తనపై ఉన్న శిలువ భారాన్ని ఒకింత తగ్గించుకున్నారని అన్ స్టాపబుల్ 2 సెకండ్ ఎడిషన్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో చూసిన వారంటున్నారు. 1995 పరిణామాల అనంతరం ఎన్టీఆర్ కుటుంబం మొత్తం, తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం చంద్రబాబు వెనుక నిలబడటం ద్వారానే నాడు అది రాష్ట్ర భవిష్యత్ కు, ప్రగతికి, పురోగతికి, అభివృద్ధికి అనివార్యం అని నిరూపితమైంది.
అలాగే 1999 ఎన్నికలలో ప్రజలు కూడా చంద్రబాబు నాయకత్వానికి జై కొట్టడం ద్వారా చంద్రబాబు విధానాలకు ఆమోదముద్ర వేశారు. అయినా కూడా వెన్నుపోటు విమర్శను ఆయన ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పటి వరకూ ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఆ విమర్శలను ఖండిస్తూ, లేదా నాటి పరిస్థితులను వివరిస్తూ ఎవరూ బహిరంగంగా ప్రకటనలు చేయలేదు. అందరూ సమష్టిగా చంద్రబాబు వెంట నిలవడం ద్వారా తామేమనుకుంటున్నామో చెప్పకనే చెప్పారు. అయితే వారి మౌనం ప్రత్యర్థులు అవకాశంగా తీసుకుని ఇన్నేళ్లుగా సందర్భం వచ్చినా, రాకున్నా, సమయం అయినా కాకున్నా.. అవే విమర్శలు గుప్పిస్తూ వికృతానందం పొందుతున్నారు. ఇప్పుడు అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2 తొలి ఎపిసోడ్ లో వారి విమర్శలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టక తప్పని రీతిలో చంద్రబాబు బాలయ్య చేతే సమాధానం చెప్పించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.