పార్టీ పేరు మారితే.. భవిత మారుతుందా?
posted on Oct 11, 2022 @ 4:15PM
ఎవరి నమ్మకాలు వారివి. చేతులకు దారాలు కట్టుకుంటే పరీక్షల్లో పాసవుతామని పిల్లలు నమ్ముతారు. పిల్లలే కాదు పెద్దలు కూడా నమ్ముతారు. అలాగే, పేరు మారిస్తే కలిసొస్తుందని నమ్మే వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఎవరిదాకానో ఎందుకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు, యడ్యూరప్ప తమ పేరును యడ్యూరప్ప( Yeddyurappa) నుంచి యెడియూరప్ప(Yediyurappa)గా మార్చుకున్నారు.
అలాగే, న్యూమరాలజీ మీద నమ్మకమున్న మరి కొందరు నాయకులు, సినిమా ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా పేరును, పేరులోని అక్షరాలను అటూ ఇటుగా మార్చుకుని, తమ అదృష్టాన్ని పరిక్షించుకున్న సందర్భాలు లేక పోలేదు. అయితే అందులో ఎంత మంది అదృష్ట గీతాలు మారాయో మాత్రం మనకు తేలియదు. అయితే ఇప్పుడు వ్యక్తులే కాదు. రాజకీయ పార్టీలు కూడా పేరు మార్చుకుంటే ఫలితం ఉంటుదనే ఆలోచనలు చేస్తున్నాయి. ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస) పేరును భారత రాష్ట్ర సమితి ( భారాస) గా మార్చారు. అయితే, తెరాస కలిసిరాని పేరా ? అంటే కానే కాదు. గతంలోనూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చాలా ప్రయత్నాలే జరిగాయి. చెన్నా రెడ్డి మొదలు ఇంద్రా రెడ్డి వరకు పార్టీలు పెట్టారు, ఉద్యమాలు నడిపారు.
కానీ సక్సెస్ కాలేక పోయారు. నిజానికి, ఈ అనుభవంతోనే కేసీఆర్ తెరాస స్థాపించినప్పుడు చాలామంది ‘ఎంతమందిని చూడలేదు, ఈయనా అంతే’ అంటూ పెదవి విరిచారు. తెరాస కూడా పుబ్బలో పుట్టి మఖలో మాయమై పోవడం ఖాయమనే అనుకున్నారు. కానీ ఏమి జరిగిందో అందరికి తెలిసిందే. తెరాస జెండా నీడనే తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కల నిజమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అంతే కాదు, తెరాస జెండా నీడనే కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కొడుకు, కూతురు, మేనల్లుడు ఇలా అయన కుటుంబంలోని ముఖ్యులు పదవులు పొందారు. బంధు, మిత్రుల వ్యాపారాలు వృద్ధి చెందాయి. ఎవరు ఎన్ని వందల వేల కోట్లు సంపాదించారో లెక్కలు లేవు కానీ, తెరాస జెండా నీడన చాలామంది అపర కుబేరులయ్యారని అంటారు. వ్యక్తుల విషయం ఎలా ఉన్నా తెరాసకు దేశంలో ఏ పార్టీకీ లేనంత ఆస్తులు కూడా బెట్టారు. ఏకంగా చార్టర్డ్ ఫ్లైట్ కొనే స్థాయికి పార్టీ ఎదిగింది. అయినా, జాతీయ రాజకీయాలలో జెండా ఎగరేసే లక్ష్యంతో తెరాస పేరును భారాసగా మార్చారు. తెలంగాణ రాష్ట్ర సమితిలోంచి తెలంగాణని చెరిపేసి, దేశమంతా ఆమోదించే విధంగా ‘భారత’ పదాన్ని చేర్చారు. బీఆర్ఎస్ ను రాష్ట్ర ప్రజలు ఎంతవరకు ఆమోదిస్తారో, దేశ ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారో, చివరకు ఈ పేరు మార్పు ఎలాంటి ఫలితం ఇస్తుందో .. చూడవలసి వుంది.
అదలా ఉంటే వందేళ్ళు నిండిన భారత జాతీయ కాంగ్రెస్ పేరును మార్చే ఆలోచన ఒకటి ఈ మధ్య కాలంలో తెర మీదకు వచ్చింది. కాంగ్రస్ అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేస్తున్న కేరళ ఎంపీ శశి థరూర్ భారత జాతీయ కాంగ్రెస్ పేరును యువ భారత్ కాంగ్రెస్ అంటూ మారిస్తే ఎలా ఉంటుందనే చర్చను తెర మీదకు తెచ్చారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సాగిస్తున్న భారత్ జోడో యాత్రకు యువత నుంచి వస్తున్న స్పందన నేపధ్యంగా ఆయన ఈ ప్రతిపాదన చేశారు. సరే, ఆయన ఈ సమయంలో ఇలాంటి ప్రతిపాదన ఎందుకు చేశారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ యువ ఓటర్లు (నాయకులను) ఆకట్టుకునేందుకే ఆయన, ఈప్రతిపాదన చేశారా? లేక కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తప్పదనే నిర్ణయానికి వచ్చిన నేపధ్యంలో, కాంగ్రెస్ ఐడియాలజీ పునాదిగా,యువతకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త పార్టీని ఏర్పాటు చేసే ఆలోచనతో థరూర్ ఉన్నారా? అందుకే ఆయన తమ అభిప్రాయాన్ని కాంగ్రెస్ సీనియర్లకు వినిపించేలా గట్టిగా నొక్కి వక్కాణిస్తున్నారా, అంటే, ‘ఎస్’ ఆర్ ‘నో ‘అనే సమాధానం అయితే రావడం లేదు.అయితే, అదెలా ఉన్నా కాంగ్రెస్ పేరు మార్పు చర్చకు అయితే థరూర్ తెర తీశారు. అయితే పేరు మారితే పార్టీ భవిత మారుతుందా? అంటే, ఏమో ... న్యూమరాలజీ , సంఖ్యా శాస్త్రం ఏమి చెపుతుందో ..చూడాలి.