కాంగ్రెస్ కదులుతోంది తస్మాత్ .. జాగ్రత్త .. మోడీ మాట
posted on Oct 12, 2022 @ 10:31AM
గుజరాత్ లో కాంగ్రస్ పార్టీ చాప కింద నీరులా విస్తరిస్తోందా? మోడీని తిట్టకుండా, మొట్ట కుండా, ఒక మాటైనా అనకుండా, గ్రామీణ ప్రాంతాలలో సైలెంట్ గా ప్రచారం సాగిస్తోందా? అంటే, అవుననే అంటున్నారు. అది కూడా ఎవరో కాదు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీనే కాంగ్రెస్ పార్టీ విషయంలో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలని తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కొత్త పంథాలో గ్రామీణ ప్రాంతాలో సైలెంట్ గా నిశ్శబ్ద విప్లవానికి పావులు కదుపుతోంది తస్మాత్ జాగ్రత్త అని మోడీ హెచ్చరించారు. అయితే, నిజంగా గుజరాత్ లో కాంగ్రెస్ బలం పుంజుకుంటోందా? వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా? లేక బీజేపీకి రియల్ థ్రెట్ గా భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ కు అక్ష్సిజన్ అందించే ప్రయత్నం మోడీ చేస్తున్నారా? ఎవరి వ్యూహం ఏమిటి అంటే ఎవరి వ్యూహాలు వారికుంటాయి, అంటున్నారు విశ్లేషకులు. వివరాలోకి వెళితే ...
రాజకీయ పార్టీల సిద్ధాంతాలు ఏవైనా అధికారం తప్ప అసలు వేరే సిద్ధాంతాలే లేని పార్టీలే అయినా ఎన్నికల వ్యూహాలు వ్యూహ కర్తలు అయితే ఉంటారు. సహజంగానే రాజకీయ పార్టీలు వ్యూహాలు, ఎత్తుగడలను ఎప్పటి కప్పుడు మార్చుకుంటాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతాయి. (అఫ్కోర్స్ పిడివాదం వదలని కమ్యూనిస్టులు ఉంటారనుకోండి అది వేరే విషయం.) అయితే అందులోనూ ఎన్నికలు జరుగుతోంది, ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్ అయినప్పుడు వ్యూహ ప్రతి వ్యూహాలు ఎంత పదునుగా ఉంటాయో వేరే చెప్పనక్కరలేదు.
మరో రెండు నెలలలో డిసెంబర్ చివరి లోగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అయితే, ఇప్పటికే అక్కడ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. ప్రధాని మోడీ సహా బీజేపీ అగ్ర నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విమర్శలను లెక్క చేయకుండా వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వరసగా ఐదుసార్లు విజయ సాధించిన బీజేపీ ఆరో విజయం కోసం ఏ ఒక్క అవకాశాన్నీ వదులు కోకుండా ముందుకు సాగుతోంది.
నిజానికి, గుజరాత్ లో మళ్ళీ గెలుపు బీజీపీదే అని ప్రీ పోల్ సర్వేలు, కోడై కూస్తున్నాయి. అంతే కాదు, కాంగ్రెస్ పార్టీకి గతంలో వచ్చిన 77 సీట్లలో సగం కూడా ఈసారి రావని, బీజేపీ గతంలో కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధించి స్పష్టమైన భారీ మెజారిటీ తో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రీ పోల్ సర్వేలు ఘంటా పథంగా చెపుతున్నాయి.
అయినా, ప్రధాని మోడీ పార్టీ క్యాడర్ ను హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పని పోయిందని, అనుకోవద్దని, కొత్త పంథాలో, కొత్త వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ కదులుతోందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ తనను దూషించడం మానేసిందని, గ్రామీణ ఓట్లను సొంతం చేసుకోవడం కోసం నిశ్శబ్దంగా పని చేసుకుంటోందని చెప్పారు. ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. అయితే, నిజంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనే భయం మోడీని వెంతడుతోందా?అంటే భయపడుతున్నారో లేదో కానీ ఇగ్నోర్ అయితే చేయడం లేదని అంటున్నారు. మరోవంక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఆశలు వదులుకుందని అందుకే రాహుల్ గాంధీ భారత్ జోడు యాత్రలో, గుజరాత్ ను చేర్చలేదని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయినా మోడీ క్యాడర్ ను ఎందుకు హెచ్చరించారు? ఇప్పడు రాజకీయ, మీడియా వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది.
నిజానికి మోడీ,షా జోడీ మార్క్ రాజకీయాలను గమనిస్తే ప్రత్యర్ధుల బలహీనత కంటే, బలం పైనే దృష్టి పెడతారని అంటారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సూక్తిని పాటిస్తారని అంటారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మోడీ జోలికి వెళ్ళక పోయినా, మోడీ మాత్రం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం వెనక, (మన కేసీఆర్ భాషలో చెప్పాలంటే, నువ్వు గోకినా గోకకపోయిన నేను గోకుతూనే ఉంటా అన్నట్లుగా) రాష్ట్రంలో చురుగ్గా అడుగులు వేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని కట్టడి చేసే వ్యూహం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అదే సమయంలో గుజరాత్ అస్మిత నినాదాన్ని మోడీ మళ్ళీ మరోమారు తెరపైకి తెచ్చారని అంటున్నారు. అందుకే ఆయన గడచిన 20 ఏళ్లుగా గుజరాత్ రాష్ట్రాన్ని అపఖ్యాతిపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యతిరేక శక్తులు ఇప్పటికీ అదే పనిలో ఉన్నాయని అన్నారు.
అంతే కాదు ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు నిశ్శబ్దంగా ఉంటున్నా గతంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనను మృత్యు బేహారిగా దూషించిన విషయాన్ని మరిచి పోరాదని గుర్తు చేస్తూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ రభస సృష్టించే పనిని ఇతరులకు కాంట్రాక్టు ఇచ్చారన్నారు. ఢిల్లీ నుంచి గుజరాత్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నేవారి నియంత్రణలోనే ఈ వ్యూహం అమలవుతోందన్నారు. అంటే మోడీ ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్ గానే ఈ వ్యాఖ్యలు చేశారని పరిశీలకులు అంటున్నారు.
నిజానికి బీజేపీ నవంబర్/డిసెంబర్ లో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను, అసెంబ్లీ ఎన్నికలుగా మాత్రమే చూడడం లేదు. 2024 లోక్ సభ ఎన్నికలకు జరిగే మరో సెమీఫైనల్ గానే చూస్తోంది. ఈ సంవత్సరం (2022) మొదట్లో జరిగిన ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు తొలి సెమి ఫైనల్ అయితే సంవత్సరం చివరలో జరుగతున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను సెకండ్ సెమీఫైనల్ గా నెక్స్ట్ ఇయర్ జరిగే కర్ణాటక,తెలంగాణ సహా మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను చివరి సెమీఫైనల్ గా భావిస్తోంది.
ఇప్పటికే తొలి సెమీఫైనల్ ను ఫోర్ వన్ స్కోర్’తో గెలిచిన బీజీపీ సెకండ్ సెమి ఫైనల్ లో స్వీప్ చేస్తే, చివరి సెమి ఫైనల్ కు గెలుపు అవకాశాలు మెరుగవుతాయని భావిస్తోంది. అలాగే ఆ వెంటనే వచ్చే 2024 ఫైనల్ లో హట్రిక్ సాధించవచ్చనే వ్యూహంతో మోడీ,షా జోడీ ముందుకు సాగుతోందని అంటున్నారు. ఏది ఏమైనా, ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా ఎన్నికలంటే వ్యూహాలు,ఎత్తుగడలు. చివరకు, జో జీతేగా వోయీ సికిందర్. ఎలా గలిచారు అనేది అప్రస్తుతం.