మునుగోడులో పోస్టర్ల రచ్చ
posted on Oct 12, 2022 7:13AM
కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి, ఇన్నాళ్లూ ఆ పార్టీలోనే కొనసాగిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు ఈ ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగాయి. మూడు పార్టీలూ ఈ ఉప ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రాజకీయం వేడెక్కింది. త్రిముఖ పోటీ అనివార్యమవ్వడంతో విమర్శలు,ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో మునుగోడు రాజకీయం రంజుగా మారింది. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ అభ్యర్థిగా మునుగోడు ఉప ఎన్నికల బరిలో నిలిచారు. తమ సిటింగ్ స్థానమైన మునుగోడులో కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్వాయి స్రవంతిరెడ్డి, అధికార టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో నిలిచారు.
గెలుపే లక్ష్యంగా మూడు పార్టీలూ ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నాయి. దీంతో నియోజకవర్గంలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి పార్టీ తమ అభ్యర్థి గెలుపే ధ్యేయంగా పకడ్బందీ వ్యూహాలు ప్రతివ్యూహాలతో పావులు కదుపుతోంది. తమ బలం పెంచుకోవడంతో పాటు ప్రత్యర్థి పార్టీల బలహీనతలపై దెబ్బకొట్టేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకునేందుకు వెనుకాడటం లేదు. ఒక పక్కన సోషల్ మీడియా వేదికగా ఆయా పార్టీలు తమకు అనుకూల కథనాలు వేసుకుంటూ మరో పక్కన ప్రత్యర్థి పార్టీలపై దుమ్మెత్తిపోసేందుకు, పరువు తీసి గంగలో కలిపి లబ్ధి పొందేందుకు యత్నాలు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే సోమవారం (అక్టోబర్ 10) బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేసిన కొన్ని గంటల్లోనే ఆయనకు వ్యతిరేకంగా ‘ఫోన్ పే మాదిరిగా.. కాంట్రాక్ట్ పే’ అంటూ మునుగోడు నియోజకవర్గం చండూరులో పోస్టర్లు వెలిశాయి. బీజేపీ పెద్దలు వెంట రాగా నామినేషన్ వేసిన రాజగోపాల్ రెడ్డి సీఎం కేఈఆర్, మంత్రి కేటీఆర్ లపై సవాళ్లు విసిరారు. ‘రాజగోపాల్ రెడ్డికి బీజేపీ 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిందని.. అది కాంట్రాక్ట్ పే’ అంటూ చండూరులోని ప్రతి గోడ, షాపులపై రాత్రికి రాత్రే వేలాది వాల్ పోస్టర్లు వెలవడం సంచలనంగా మారింది. ‘రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోమటిరెడ్డికి కేటాయించారు. ట్రాన్సాక్షన్ ఐడీ పేరుతో బీజేపీ 18 వేల కోట్లు’ అంటూ పోస్టర్లలో ముద్రించారు.
కాంట్రాక్ట్ పే కోసమే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారని టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. తమ పార్టీ నుంచి గెలిచి, ఇన్నాళ్లు ఆ పదవిని అనుభవించి, ఇప్పుడు రాజీనామా చేసి బీజేపీలో చేరి, ఎన్నికల బరిలో దిగిన రాజగోపాల్ రెడ్డిపైన కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి ఆరోపణలే చేస్తుండడం గమనార్హం. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టులకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
మునుగోడు ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన పార్టీలు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నికగా నిలవబోతోందని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. కాగా.. పోస్టర్ల వ్యవహారంపై బీజేపీ ఫైరవుతోంది. రాజగోపాల్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని విమర్శిస్తోంది.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కూడా రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు. 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కోసమే రాజగోపాల్ అమ్ముడుపోయారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పక్కన రాజగోపాల్ రెడ్డి పోస్టర్లు అంటించడం, మరో పక్కన కేటీఆర్ కూడా అదే విధంగా వ్యాఖ్యలు చేయడంతో ఉప పోరు మరింత రంజుగా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉప ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో మునుగోడులో రాజకీయ వేడి రోజు రోజుకూ పెరిగిపోతోంది.