బీఆర్ఎస్.. జాతీయ, ప్రాంతీయ ద్విపాత్రాభినయం..క్లిక్ అయ్యేనా?
అనుకున్నట్లే జరిగింది. రెండు దశాబ్దాల క్రితం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా, ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస) భారత రాష్ట్ర సమితి (భారాస) గా పేరు మార్చుకుంది. జాతీయ పార్టీగా ఎదిగే దిశగా తొలి అడుగు వేసింది. తెరాస /భారాస అధ్యక్షుడు కల్వకుట్ల చంద్రశేఖర రావు 68 ఏళ్ల వయసులో తమ రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అయితే, పేరు మారినా, ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా కొత్తగా ప్రస్థానం మొదలు పెట్టినా, పార్టీ కార్యక్షేత్రం మారలేదని, కొత్త పాత పార్టీల వ్యవస్థాపక అధ్యక్షుడు హోదాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, స్పష్టం చేశారు. భారత రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నాన్నామని చెప్పారు. అంతే,కాదు, ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేకుండా, రాకుండా తెలంగాణ ముఖ్యమంత్రిగా తానే ఉంటానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా ఉంటూనే, దేశమంతా పర్యటిస్తానని కేసేఆర్ స్పష్టం చేశారు. అలాగే, కార్యక్షేత్రం వదిలేది లేదని, ఈ విషయంలోనూ ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదని చెప్పారు.
అయితే, నిజంగానే కేసీఆర్ ఎప్పటిలా జోడు పదవుల్లో కొనసాగుతారా ? సమయం సందర్భం చూసుకుని, ముఖ్యమంత్రి పదవిని మరొకరికి అప్పగిస్తారా,అనేది చూడవలసి వుంది. నిజానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి స్వయంగా కేసీఆర్ చేసిన, నిన్నటి (బుధవారం) ముగింపు ప్రకటన వరకు ఆయనే తెరాస పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. అలాగే, 2014 నుంచి ఈ రోజు వరకు పార్టీ అధ్యక్ష పదవితో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగానూ జోడు పదవులలో కొనసాగుతున్నారు. అఫ్కోర్స్, కుమారుడు కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షునిగా, చేదోడు వాదోడుగా ఉన్నారనుకోండి, అది వేరే విషయం.
అయితే, రాష్ట్ర స్థాయిలో సాధ్యమైన జోడు పదవుల స్వారీ జాతీయ స్థాయిలో సాధ్యమవుతుందా? ఈ ఏర్పాటు ఎంత కాలం కొనసాగుతుంది? అనేది, ఇప్పుడే తెలిసే విషయం కాదు. నిజమే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదివితో పాటు, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా జోడు పదవులు తనకే కావాలని కోరుకున్న ఆ రాష్ట ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,అశోక గెహ్లాట్ ఎదురైన అవరోధాలు, అడ్డంకులు, కేసేఆర్’ కు లేవు. కాంగ్రెస్ పెట్టుకున్న ఒక వ్యక్తికి ఒకే పదవి నియమం తెరాసకు పెట్టుకోలేదు. అంతేకాదు, అది తెరాస అయినా భారాస అయినా,గులాబీ పార్టీ కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరే కాబట్టి, రాజస్థాన్’ పరిణామాలను ఇప్పటి కిప్పుడు తెలంగాణలో ఉహించలేము.
కానీ, కేంద్ర ఎన్నికల సంఘం తెరాస పేరు మార్పును అధికారికంగా గుర్తించి, తెరాస అధ్యక్షుడు కేసేఆర్, భారాస అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత, సంస్థాగత మార్పులు చేపట్టక తప్పక పోవచ్చును. అలాగే, అలాంటి ఆలోచన గులాబీ బాసుకు లేక పోలేదని అంటున్నారు. అయితే, తెరాస పేరు మార్పు,అనుకున్నట్లుగా ఒకటి రెండు రోజుల్లో తేలిపోతుందా, లేదా అనేది, కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, సో అంత వరకు సంస్థాగత మార్పులు ఉండవనే అంటున్నారు.
అదలా ఉంటే, ముఖ్యమంత్రి కేసీఆర్,ఓ వంక జాతీయ వాదాన్ని ఎత్తు కుంటూనే, తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ వాదాన్ని వదిలేది అంటున్నారు. ముఖ్యమంత్రి కేసేఆర్ తమకున్న అనుభవంతో జోడు పదవులను సమర్ధవంతంగా నిర్వర్తించ వచ్చునేమో కానీ, జోడు విధానాలను, జోడు వాదాలను ఎలా, సమన్మయ పరచు కుంటారు అనేది, ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా వుందని అంటున్నారు. రెండు దశాబ్దాల తెరాస చరిత్ర, కేసీఆర్ రాజకీయ జేవిత చరిత్ర మొత్తం తెలంగాణ కేంద్రంగానే సాగిందనేది కాదన లేని నిజం.
కేసేఅర్’ కు జాతీయ స్థాయిలో ఏదైనా గుర్తింపు ఉందంటే, అది తెలంగాణ ఉద్యమ నేతగా, తెలంగాణ అస్తిత్వ వాదంతో ముడిపడి ఉన్నగుర్తింపే కానీ, మరొకటి కాదు. అయితే, ఆ ప్రస్తావన ఎక్కడా రాకుండా, ఎనిమిదేళ్ళలో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలనే జాతీయ ఎజెండాలో చేర్చారు. అందులోనూ ప్రధానంగా సంక్షేమ పధకాలను, మరీ ముఖ్యంగా కౌలు రైతలకు కాదని, వందల ఎకరాల భూములు, వందల కోట్ల ఆస్తులు ఉన్న మంత్రి మల్లా రెడ్డి వంటి భూస్వాములు, రాజకీయ, వ్యాపార రంగాలలో స్థిరపడిన ధనినికులు, ప్రభుత్వ ఉద్యోగులకు సహా భూస్వాములకు ప్రజల సొమ్మును దోచి పెడుతున్నారనే ఆరోపణలున్న రైతు బంధు, ఇంకా రాష్ట్ర్రంలోనే పూర్తి స్థాయిలో పట్టాలేక్కని దళిత బంధు, గిరిజనబందు వంటి పథకాలనే తెలంగాణ మోడల్’ గా ప్రముఖంగా పేర్కొంటున్నారు. ఈ ఎజెండాకు దేశ ప్రజలు ఎంతవరకు ఆమోదిస్తారు అనేది ఎలా ఉన్నా, జంట పదవులు, జోడు వాదాలలో భారాస ప్రస్థానం ఎలా ముందుకు సాగుతుంది అనేది, చూడవలసి ఉందని అంటున్నారు.