ఏపీలో అడుగు పెట్టేందుకు కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా?
తెలుగు రాష్ట్రాలలో, ఆమాట కొస్తే దేశంలో రాజకీయాలే కాదు, రాజకీయ చర్చలు,విశ్లేషణలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. చిత్ర విచిత్రంగా వంపులు తిరుగుతున్నాయి. కొత్త కొత్త ఎత్తులు, వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే, రాజకీయాల దారిలోనే రాజకీయ విశ్లేషకులు సాగుతున్నారు. వాస్తవాల కంటే ఉహాలకు, వ్యూహాగానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి నేపధ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న, ‘జాతీయ’ నిర్ణయం సహజంగానే రాజకీయ, మీడియా వర్గాల్లో సంచలనంగా మారింది. చర్చోపచర్చలు సాగుతున్నాయి. నిజానికి కేసీఆర్ తీసుకున్న పార్టీ పేరు మార్పు నిర్ణయం ఇప్పటికిప్పుడు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుందని,కేసీఆర్ సహా ఎవరు ఉహించడం లేదు. ఆశించడం లేదు.
నిజానికి ప్రాంతీయ వాదం పునాదిగా, రాజకీయంగా (గిట్టని వాళ్ళు ఆర్థికంగా కూడా అంటారు) ఎదిగిన తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఆయన అవసరాల కోసం కాలం చెల్లిన తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని పక్కన పెట్టి జాతీయ నినాదాన్ని అందుకున్నారు. అందుకోసంగా, ఆయన దసరా పండగ రోజున తెలంగాణ భవన్ వేదికగా, తెరాస పార్టీ పేరును మార్చారు. భారతీయ రాష్ట్ర సమితిగా నామకరణం చేశారు.
ఒక విధంగా చెప్పాలంటే జాతీయ రాజకీయాల్లో ఎంట్రీకి అడ్డుగా ఉన్న ‘తెలంగాణ’ అనే పదాన్ని తెసీసి ‘భారతీయ’ అనే పదాన్ని చేర్చారు. నిజానికి ఆ క్రతువుకు ఏమి పేరు పెట్టినా ప్రొఫెసర్ కోదండ రామ్ చెప్పినట్లుగా ఈ మొత్తం క్రతువు వెనక ఉన్న మూల మంత్రం మాత్రం తెలంగాణలో అధికారాన్ని, కుటుంబ పాలనను నిలుపుకోవడం. ఇదొక్కటే ఇప్పుడు కేసీఅర్ ముందున్న లక్ష్యం. ఇదొక్కటే ఆయన ముందున్నసవాలు. తెలంగాణ సెంటిమెంట్ను అడ్డు పెట్టుకుని, 1200 మంది యువకుల బలిదానాల బాటలో అధికార పీఠాన్ని అందుకున్న కేసీఆర్ ఇప్పుడు కొత్త దారిని ఎంచుకున్నారు అనే వాళ్ళున్నారు.
సరే, తెరాస పేరును కేసీఆర్ ఎందుకు బీఆర్ఎస్ గా మార్చారు? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను బీఆర్ఎస్ ఎలా ప్రభావితం చేస్తుంది. జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని పక్కన పెడితే, దాయాది రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై బీఆర్ఎస్ ప్రభావం ఎలా ఉంటుంది? ఎంతవరకు ప్రభావితం చేస్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అధికార వైసీపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలను బీఆర్ఎస్ ఎలా ప్రభావితం చేస్తుంది? ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే ఆసక్తికర చర్చ సాగుతోంది.
అయితే, ఇందుకు సంబంధించి ఎవరెన్ని విశ్లేషణలు చేసినా, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు లేకుండా ఓ చిన్న చిరునవ్వుతో చేసిన విశ్లేషణ ముందు అవన్నీ దిగతుడుపే. బీఆర్ఎఎస్ పై సాధికారిక వ్యాఖ్య ఎవరైనా చేశారంటే అది చంద్రాబాబు ఒక్కరే. ఏపీ రాజకేయాలపై బీఆర్ఎస్ ప్రభావం గురించి మాత్రమే కాదు., అసలు బీఆర్ఎస్ గురించి ఇంతవరకు వచ్చిన విశ్లేషణలు అన్నిట్లోకి చద్రబాబు ‘చిరునవ్వు’ ఒక్కటే సాధికారిక విశ్లేషణ అనుకోవచ్చును. అవును బీఆర్ఎస్ గురించి చంద్రబాబు చేయని విశ్లేషణ, ఆయన అనుభవానికి, విజ్ఞతకు అద్దం పడుతోంది.
ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయం అయితే చెప్పనే అక్కరలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నంత వరకు మోడీ, షా సిట్టంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఆయన ముందు మరో ఆప్షన్ లేదు. మోడీ షా కూర్చోమంటే కూర్చోవాలి నుంచో మంటే నుంచోవాలి లేదంటే ఏమిజరుగుతుందో వేరే చెప్పనక్కర లేదు. నిజానికి, జగన్ రెడ్డి 2019 ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకముందే, బీజేపీకి సరెండర్ అయిపోయారు. ప్రత్యేక హోదా విషయంలో మోడీ దయ మన ప్రాప్తం అని చేతులేత్తేసింది మొదలు ఇంత వరకు మళ్ళీ ఆయన ఎత్తిన చేతులు దించలేదు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ఎన్నికల విషయంలోనే కాదు, పార్లమెంట్ లో వివాదాస్పద బిల్లుల ఆమోదం వరకు ఎక్కడా, కేంద్రానికి రుచించని నిర్ణయం ఏదీ తీసుకోలేదు. ఎక్కడి వరకో ఎందుకు, కొద్ది రోజుల క్రితం, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఉప రాష్ట్రపతి జగదేష్ ధన్కర్ కు వంగివంగి దండాలు పెడుతున్న దృశ్యం చూస్తేనే వైసీపీ స్టాండ్ ఏమిటో అర్థమవుతుంది.
అయితే బీఆర్ఎస్ ప్రభావం ఏపీ రాజకీయాలపై అసలే ఉండదా అంటే ఉంటుంది. నిజానికి, ఒక్క ఏపీలోనే కాదు దేశంలో ఏ ఒక్క ఒక రాష్ట్రం నుంచి పేరున్న పార్టీలు ,వ్యక్తులు ఎవరు కూడా కేసేఆర్ తో చేతులు కలిపేందుకు సిద్ధంగా లేరు. అయినా, ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. చిన్నా చితక పార్టీలు, ప్రజా సంఘాలను కూడగట్టి జాతీయ రాజకీయాల్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో.. బీఆర్ఎస్ ప్రభావం ఏపీ పై అసలే ఉందని చెప్పలేము కానీ ఆ ప్రభావం ఎలా, ఎంత ఉంటుందనేది మాత్రం, ఇప్పుడే చెప్పే విషయం కాదు.
అదలా ఉంటే బీఆర్ఎస్ ఏపీలో ఎంటర్ కావడానికి ముందు చాలా హార్డిల్స్ దాట వలసి ఉంటుంది. కొవిడ్ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఏపీ కొవిడ్ రోగులను సరిహద్దుల వద్దే అడ్డుకున్న కేసీఆర్, అదే సరిహద్దు దాటి ఏపీలో ఎంటర్ అవుతానంటే, ఆ రాష్ట్ర ప్రజలు అనుమతిస్తారా? తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆంధ్రులను అవమానించిన తీరును మరిచి పోతారా? నిన్నగాక మొన్న తెలంగాణ శాసన సభలో ఏపీపై విషం చిమ్మిన కేసీఆర్ కు ఆ రాష్ట్ర ప్రజలు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారా? కేసీఆర్ నేను మరిపోయాను అంటే ఏపీ ప్రజలు నమ్ముతారా? కేసీఆర్ నమ్మించగలరా? అవును ఆయనకు రాజకీయ టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు అన్నీ కొట్టిన పిండి ఆయినా, ఆయన ఏపీ ప్రజలను నమ్మించగల రని అనుకున్నా, అది పొరపాటే అవుతుంది.
నిజానికి, కేసీఆర్ ఏపీలో ఎంటర్ అవ్వాలంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఒక సారి కాదు, వెయ్యి సార్లు ముక్కు నేలకు రాసి, క్షమాపణలు చెప్పవలసి ఉంటుందని అంటున్నారు.
కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా? ఏపీ ప్రజలకు క్షమాపణలు చెపుతారా? అది జరగని పని, అ దే జరిగితే, తెలంగాణ నూకలు చెల్లినట్లే అవుతుంది. సో .. అది జరగదు. నిజానికి, ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెట్టినట్లు, ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ వేలు పెట్టలేరు, అందుకే ఆయన ఇంతవరకు ఏపీ విషయంలో గుంభనంగా, మైదానాన్ని ఊహాగానాలకు వదిలేశారని అంటున్నారు.