మునుగోడు బరిలో టీడీపీ... అసలు ఏం జరుగుతోంది!
posted on Oct 12, 2022 @ 5:28PM
ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలవడంతో మునుగోడు ఉప ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేస్తుండగా, బిజెపి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. టీడీపీ తరఫున జక్కలి ఐదయ్య యాదవ్ బరి లోకి దిగడం ఖారారే. ఈయన అభ్యర్ధిత్వం పై గురువారం తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్ర బాబు నాయుడు ప్రకటన చేయవచ్చు.
ఈ నియోజకవర్గం టిఆర్ ఎస్‌కు చావో..రేవో.. అన్నట్టుగా మారిపోయింది. ఇన్ని పరిణామాల మధ్య అత్యంత తీవ్ర ఉత్కంఠగా మారిన మునుగోడు నియోజకవర్గం ఉపపోరులో.. తెలుగు దేశం పార్టీ(టీడీపీ) కూడా బరిలో దిగేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేం దుకు ఈ ఉప పోరు తమకు లాభిస్తుందని.. పార్టీ నాయకులు తలపోస్తున్నారు. ఈ మేరకు పార్టీ సభ్యత్వ నమో దుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది.
అయితే మునుగోడు ఉపఎన్నిక బరిలో ఉండాలా? లేదా? అన్న దానిపై అధిష్టానం నిర్ణయం కోసం స్థానిక నేతలు వేచి చూస్తున్నారు. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలతో సమావేశాన్ని నిర్వహించి, తాజా పరిస్థితులపై చర్చించారు. గతంలో మునుగోడు నియోజకవర్గంలో టీడీపీకి దాదాపు 5వేల సభ్యత్వం ఉంది. మరోసారి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టి, తమ సత్తా ఏమిటో తేల్చుకుందామని పలువురు నేతలు అధిష్టానంతో చర్చలు జరిపారు.
స్థానిక పరిస్థితులనుబట్టి పార్టీ నిర్ణయం తీసుకున్నది. నల్లగొండలో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంది. అదేసమయంలో గతంలో టీడీపీలో కలిసి పనిచేసిన కామ్రెడ్లు.. టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే, ప్రధాన పార్టీలకు టీడీపీ పోటీ.. జీర్ణించుకోలేని విషయమే. ఎందుకంటే.. దీనివల్ల ఓట్లు చీలతాయని అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.