జర్నలిస్ట్ మాధ్యూకు నమస్తే .. క్షమాపణ
అదేదో టీవీ చానల్ లో, ‘నా షో నా ఇష్టం’ అంటూ కమెడియన్ చంటి ప్రెజంట్ చేసే కామెడీ షో ఏదో వచ్చింది. జనం కూడా ఆ షోను బానే ఎంజాయ్ చేసినట్లున్నారు. అవును, అదో కామెడీ షో కాబట్టి, జనం చూసినా, చూడక పోయినా, ఎంజాయ్ చేసినా చేయక పోయినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ అదే పని రాజకీయ పార్టీలు నాయకులు అదే తరహాలో ‘నా పత్రిక నా ఇష్టం’ అంటే కుదరదు. నా పత్రికలో నా ఇష్ట మొచ్చింది రాసుకుంటానంటే అసలే కుదరదు. ముఖ్యంగా. మీడియా మూడో కన్నుగా సోషల్ మీడియా కన్ను తెరిచిన తర్వాత సొంత పత్రికలలో పార్టీల నేతలు సోత్కర్షలకు దిగితే, ఇదిగో ఇలాగే నవ్వులపాలు కావలసి వస్తుంది. క్షమాపణలు చెప్పుకోవలసి వస్తుంది.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది తెరాస/ భారాస అధికార పత్రిక (మౌత్ పీస్), ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక, నమస్తే తెలంగాణ పత్రిక గురించే అయినా ఒక్క తెరాస మాత్రమే కాదు, ఒక్క నమస్తే, అనే కాదు.. చాలా వరకు రాజకీయ పార్టీలు సొంత పత్రికలు, సొంతగా టీవీ చానల్స్ పెట్టుకుంటున్నాయి. కాదంటే, సొంత పత్రికలు, సొంత ఛానల్స్ కంటే ఎక్కువగా తమను భుజాలకు ఎత్తుకునే పత్రికలు, మీడియా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. అందువలనే చాలా కాలం కిందటే మహాకవి శ్రీశ్రీ అంతటివాడు, ‘పెట్టుబడి దారులకు పుట్టిన విష పుత్రికలు మన పత్రికలు’ అన్నారు. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి పత్రికలు అన్నీ అని అనలేము కానీ, చాలా వరకు రాజకీయ బేహారుల చేతుల్లోకి వెళ్లి పోయాయి అనుకోండి వేరే విషయం..
ఇక అసలు విషయంలోకి వస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చురకైన పాత్రను పోషించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పేరులో అడ్డుగా ఉన్న తెలంగాణ పదాన్ని చెరిపేసి, భారతీయను చేర్చిన సందర్భంగా, తెరాస అధికార పత్రిక నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పట్ల దేశ విదేశాల ప్రముఖుల స్పందనలను సేకరించి ప్రచురించింది. సరే ఆ ప్రచురించేది ఏదో ఉన్నది ఉన్నట్లుగా, చెప్పింది చెప్పినట్లుగా ప్రచురిస్తే ఎవరికీ ఏ అభ్యంతరం ఉండక పోవును. కానీ రాజును మించిన రాజభక్తి చూపించే క్రమంలో కావచ్చు నమస్తే తెలంగాణ పత్రికలో పనిచేసే చేయి తిరిగిన సంపాదక రచయితలు కాళిదాసు కవిత్వం కొంత, తమ పైత్యం కొంత అన్నట్లుగా తమ పాండిత్యాన్ని కలిపి కథలు, ఇంటర్వ్యూలు ప్రచురించారు. అందులో భాగంగా ఈ దేశాన్ని ఒక్క కేసీఆర్ తప్ప ఇంకెవరు రక్షించలేరనే అభిప్రాయం వ్యక్త పరిచినట్లు పేర్కొంటూ కొందరు ప్రముఖుల ‘ఇంటర్వ్యూ’ ప్రచురించారు.
ఇలా వచ్చిన ఇంటర్వ్యూలలో న్యూడిల్లీలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు లిజ్ మాథ్యూ కూడా ఉన్నారు. అయితే తన ఫోటోతో సహా వచ్చిన ఇంటర్వ్యూ చూసిన ఆమె ఆశ్చర్యపోయారు. తాను అనని మాటలను తన నోట్లో ఎలా పెడతారని చాలా సీరియస్ గా రీయాక్ట్ అయ్యారు. నమస్తే తెలంగాణ తప్పుడు రాతలను ఖండిస్తూ ట్వీట్ చేశారు. రాజకీయాల్లో ఎవరైనా పార్టీలు పెట్టవచ్చని మాత్రమే తాను చెప్పానని స్పష్టం చేశారు.
మాములుగా అయితే నమస్తే ఇలాంటి ట్వీట్లను పట్టించుకోకపోయేదేమో కానీ మాథ్యూ ఘాటుగా లేఖ రాయడంతో, తప్పనిసరై క్షమాపణ ప్రచురించింది. అయితే, నమస్తే తెలంగాణ ఇలా తప్పులో కాలేయడం ఇదే మొదటి సారి కాదు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల రైతులు, గ్రామ సర్పంచ్ లు తెలంగాణలో అమలవుతున్న పథకాలను మెచ్చుకుంటున్నారని, తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని కోరుకుంటున్నారని ఇలాగే పేర్లు, ఫోటోలు పెట్టి కధనాలు ప్రచురించింది.
అప్పట్లోనూ అక్కడి రైతులు ఎవరి ఫోటోలను అయితే పత్రిక ప్రచురించిందో ఆ సర్పంచులు ఆ వార్తలను ఖండించారు. నమస్తే తెలంగాణ పత్రికను తగల పెట్టి మరీ తమ నిరసన తెలిపారు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు వలన తమ పంటపొలాలు నీటి మునిగి తాము నష్ట పోతున్నామని కేసేఆర్ ప్రభుత్వం ఫై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఇతర పత్రికలు కూడా కొంతవరకు తప్పుడు రాతలకే ఎక్కువ ప్రాధన్యత ఇస్తున్నా, నమస్తే తెలంగాణ పత్రిక ముఖ్యంగా కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు చూపు తిప్పిన తర్వాత ఈ దేశాన్ని రక్షించేందుకు పుట్టిన మహా పురుషునిగా వర్ణించే కథలు, కథనాలు ఎక్కువగా వస్తున్నాయని అంటున్నారు.
అయితే, తుమ్మి తధాస్తు అనుకున్నట్లుగా ఇలా వరసగా తప్పుడు కథనాలు ప్రచురించి, క్షమాణలు చెప్పుకుంటూ పొతే, చివరకు ఆపత్రికలో వచ్చే నిజాలను కూడా ప్రజలు నమ్మడం మానేస్తారు. నిజానికి, ఇప్పటికే నమస్తే పత్రికను తెలంగాణ ప్రజలు అంతగా నమ్మడం లేదని అంటున్నారు.