జగన్ కు వ్యతిరేకంగా కేసీఆర్ పీకే వ్యూహాలు?
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ను, వైసీపీని బలహీన పర్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక వేస్తున్నారా? కేంద్రంలో అధికార పార్టీ బీజేపీతో తాను విభేదిస్తుంటే.. తమ పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్ర సీఎం జగన్ మాత్రం ఆ బీజేపీతోనే అంటకాగుతుండడం కేసీఆర్ కు ఏమాత్రం నచ్చడం లేదా? అటు నదీ జలాల విషయంలో ఇటు ప్రాజెక్టుల విషయంలో మరో పక్కన విద్యుత్ బకాయిల విషయంలో ఉమ్మడి ఆస్తుల వ్యవహారంలో ఏపీతో ఏదో ఒక సమస్య ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బలహీనపర్చాలనే యోచనలో కేసీఆర్ ఉండి ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
దాంతో పాటు కేసీఆర్ ఇటీవలే తమ టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా ప్రకటించారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కనీసం నాలుగు రాష్ట్రాల్లో అయినా పోటీ చేయాల్సి ఉంది. దాంతో పాటు ఆయా రాష్ట్రాల్లో కనీసం 6 శాతం ఓట్లు సంపాదిస్తేనే.. బీఆర్ఎస్ కు జాతీయ పార్టీగా గుర్తింపు వస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పోటీలో దిగాలంటే.. బలంగా ఉన్న వైసీపీని ఢీకొట్టాలి.. లేదంటే దానితో సర్దుబాటు అయినా చేసుకోవాలి. కానీ ప్రస్తుతం 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో వైసీపీ బలంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ కు జగన్ ఏమాత్రం చోటిచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చంటున్నారు.
ఈ నేపథ్యంలోనే గురువారం (నవంబర్ 3) కేసీఆర్ సుదీర్ఘంగా నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్ర బీజేపీ చేస్తోందని ఆరోపించారు. అదే విధంగా ఏపీ, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కూల్చేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అంతకు ముందే.. ప్రసిద్ధ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా గత ఎన్నికల్లో జగన్ పదవీ దాహానికి అనవసరంగా సాయం చేశానని అన్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని అనడం ఎంత మాత్రం కాకతాళీయం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసలు జగన్ ప్రభుత్వం పతనమయ్యేలా పీకే, కేసీఆర్ ల ఏదైనా ప్రణాళిక రూపొందించారా అన్న అనుమానాలు సైతం వారు వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల వ్యూహాలు వేసేందుకు ఐప్యాక్ సంస్థను ప్రశాంత్ కిశోర్ ఏర్పాటు చేశారు. అటు కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలో రావడానికి, ఇటు ఢిల్లీలో కేజ్రీవాల్ కు, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ విజయం సాధించడానికి, తమిళనాడులో స్టాలిన్ కు, ఏపీలో జగన్ కు, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాలు వచ్చేందుకు ఇంతకు మందు ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు రచించారు. అయితే.. తాను ఫుల్ టైమ్ రాజకీయ వేత్తగా మారిపోయి.. బీహార్ లో పాదయాత్ర చేస్తున్న క్రమంలో ఐప్యాక్ కు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ కేసీఆర్- ప్రశాంత్ కిశోర్ మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయని పరిశీలకలు చెబుతున్నారు. వీరిద్దరూ కూడా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారే. దాంతో శత్రువకు శత్రువు మిత్రుడంటారు కదా? అలా అన్నమాట. ప్రశాంత్ కిశోర్ వ్యూహాలతో ఢిల్లీలో చక్రం తిప్పాలని కేసీఆర్ ఉబలాటపడుతున్నారంటున్నారు. దీంట్లో భాగంగానే వారిద్దరూ ప్రగతి భవన్, ఫాంహౌస్ లలో పలు మార్లు భేటీ అయ్యారు. పలు వి వ్యూహాలు రచించారు. పనిలో పనిగా ఏపీలో జగన్ ను, వైసీపీపి కూడా బలహీనం చేసే వ్యూహం ఏదో రచించి ఉంటారని పరిశీలకులు అంటున్నారు. అందుకే కొద్ది రోజుల వ్యవధిలోనే ఇద్దరి నోటా జగన్ మాట వినిపించిందని విశ్లేషిస్తున్నారు.
బీజేపీతో అంటకాగుతున్న జగన్ ను ఆ పార్టీ నుంచి దూరం చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు. బీజేపీకి దూరం కావాలని ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహాను జగన్ తిరస్కరించి ఉండొచ్చని, అందుకే పీకే జగన్ కు సహాయం చేసి తప్పు చేశానని వ్యాఖ్యానించారని చెబుతున్నారు. మొదట్లో కేసీఆర్, జగన్ బీజేపీకి మద్దతుగానే నిలిచారు. పెద్ద నోట్ల రద్దు, 370 ఆర్టికల్ రద్దు, జీఎస్టీ, ఉమ్మడి పౌరసత్వం, వ్యవసాయ చట్టాలు వంటి మోడీ నిర్ణయాలకు అప్పట్లో పార్లమెంట్ లో బీజేపీకి వైసీపీ, టీఆర్ఎస్ కూడా పూర్తి సహకారం, మద్దతు అందించాయి. కానీ ఇటీవల జరిగిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా బీజేపీతో టీఆర్ఎస్ విభేదించింది. కానీ.. జగన్ మాత్రం ఇప్పటికీ బీజేపీకి మద్దతు కొనసాగిస్తున్నారు. ఇదే కేసీఆర్ కు నచ్చడం లేదని అంటున్నారు. నిజానికి అన్ని విధాలా తమతో కలిసి వస్తున్న జగన్ సర్కార్ ను కూల్చే అవసరం బీజేపీకి లేదని పరిశీలకులు అంటున్నారు. అయినప్పటికీ.. ఏపీలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కేసీఆర్ చెప్పడం వెనుక ఇరు పార్టీల మధ్యా చిచ్చు రగల్చాలన్న లక్ష్యమే ఉందని అంటున్నారు. మొత్తానికి బీజేపీపైన, ఆ పార్టీ పెద్దల పైన జగన్ లో అనుమానం బీజాలు నాటడం ద్వారా ఇటు కేసీఆర్, అటు ప్రశాంత్ కిశోర్ ఏదో ప్రయోజనాన్ని ఆశిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.