కింగ్ కోహ్లీ కటౌట్ అదిరింది !
posted on Nov 5, 2022 @ 6:03PM
రాజు ఒక్కడే ఉంటాడు.. క్రికెట్ లోనూ అంతే.. యుగానికి ఒకడు లా ఈ తరానికి కోహ్లీ యే కింగ్.. సచిన్, ధోనీ, దాదా లు వెనకంజలో పడిపోయారు. ఇప్పటి అత్యాధునిక ధనాధన్ క్రికెట్ కి వీరుడు, కింగ్ అనదగ్గ వాడు కోహ్లీయే అని క్రికెట్ లోకం లక్షనోళ్ల పొగుడుతోంది... ఆరాధిస్తోంది. అత్యాధునిక రాజుకి, క్రికెట్ భగవాన్ కి నిలువెత్తు.. 36 అడుగుల కటౌట్ తో హైదరాబాద్ వీరాభిమానులూ వీరాభిమానం చాటుకుం టున్నారు.
క్రికెట్ అంటే కోహ్లీ.. కోహ్లీ అంటే వీరబాదుడు.. పరుగుల వరద అంటే అతనితోనే సాధ్యం. ఆమధ్య కొంత ఫామ్ కోల్పోయా డని నీరసపడిన క్రికెట్ అభిమానులకు మళ్లీ సరిగ్గా టీ20 ప్రపంచకప్ సమయానికి ఫామ్ లోకి తిరిగి వచ్చా సత్తా ప్రదర్శిస్తున్నాడు. టీ20 క్రికెట్ లో కోహ్లీ అత్యధికంగా 1065 పరుగులతో మొదటి స్థానంలో నిలిచాడు. ఇది ఆషా మాషీ వ్యవహారం కాదు. బుధవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 44 బంతుల్లో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచి మ్యాచ్ ని గెలిపించడంతో పాటు ఆ రికార్డును నెలకొల్పడం గమనార్హం. జట్టులో రోహిత్ శర్మ, కె ఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ వంటి హేమా హేమీలు ఉండవచ్చుగాక కోహ్లీ రూటే వేరు.. అతని రాక పరుగుల వరద. అతని జోరు పరుగుల హోరు.. ప్రేక్షకుల ఆనంద కెరటం. అదంతే గురూ.. అక్కడ అవతల ఎవరున్నా సరే.. ఇటు మనోడు బ్యాట్ తో రెచ్చిపోవడం ఖాయం అన్న ధీమా జట్టుకే కాదు.. ప్రేక్షకుల్లో ఉండడమే వారి గమనార్హం. ఇంతటి వీరాభిమానం పొందడం గతంలో సచిన్ కి ఆ తర్వాత దాదాకి ఆ తర్వాత ధోనీ కే సాధ్యమయింది. కానీ ఇప్పుడు క్రికెట్ లోకమంతా కోహ్లీ నామస్మరణతోనే గడిచిపోతోంది. అతను క్రికెట్ పిచ్చాడు.. భారీ స్కోర్ చేస్తేనే నిద్రపోతాడు.. అనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
కుటుంబ సభ్యులకు దూరంగా జట్టు సభ్యులతో కలిసి ఉంటున్న కోహ్లీ... తన బర్త్ డే వేడుకలను కూడా జట్టు సభ్యుల మధ్యే జరుపుకున్నాడు. కోహ్లీ బర్త్ డే సందర్భంగా శనివారం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేయగా... టీమిండియా మెంటల్ కండిషనింగ్ ఎక్స్ పర్ట్ ప్యాడీ అప్టాన్ తో కలిసి కోహ్లీ బర్త్ డే కేక్ ను కట్ చేశాడు.
ఇదిలా ఉంటే...బర్త్ డే సందర్భంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో టాలీవుడ్ హీరో స్థాయి ఎలివేషన్ ను కోహ్లీ అందుకున్నాడు. కోహ్లీ బర్త్ డేను పురస్కరించుకుని నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పరిధిలో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ వద్ద అతడి 50 అడుగుల ఎత్తున్న కటౌట్ వెలిసింది. క్రికెట్ లో సరికొత్త రికార్డులను లిఖిస్తూ సాగుతున్న కోహ్లీకి మరిచిపోలేని గుర్తుగా హైదరాబాదీ అభిమా నులు ఈ కటౌట్ ను ఆవిష్కరించారు.