టి20 వరల్డ్ కప్ ఫైనల్స్ కు పాకిస్థాన్.. న్యూజిలాండ్ ఇంటి ముఖం

టి20 వరల్డ్ కప్ లో కేవలం అదృష్టం కలిసి వచ్చి నాకౌట్ కు చేరుకున్న పాకిస్థాన్ సెమీస్ లో  అదరగొట్టింది. అన్ని విధాలుగా తన కంటే బలమైన న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ లో సమష్టి గా రాణించింది. చివరికి 7 వికెట్ల తేడాతో కవీస్ ను మట్టికరిపించి ఘనంగా ఫైనల్ లో అడుగు పెట్టింది. ఫైనల్ లో పాకిస్థాన్ ప్రత్యర్థి ఎవరన్నది తేలాలంటే గురువారం (నవంబర్ 10 వరకూ ఆగాల్సిందే. ఆ రోజు భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో విజేత జట్టుతో పాక్ ఫైనల్ లో తలపడుతుంది. ఇక న్యూజిలాండ్- పాకిస్థాన్ మ్యాచ్ విషయానికి వస్తే  అన్ని విభాగాల్లోనూ పాకిస్థాన్ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. ఆట మొత్తంలో ఎక్కడా న్యూజిలాండ్ కు అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యాన్నిప్రదర్శించింది.  టాస్ గెలిచిన న్యూజిలాండ్  తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ 42 బంతుల్లో 1 ఫోర్, ఒక సిక్స్ తో 46పరుగులు చేశాడు. డెరిల్ మిఛెల్ మెరుపు బ్యాటింగ్ తో 35 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ తో 53 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. దీంతో 153 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.  బాబర్ అజామ్ సరిగ్గా సమయానికి ఫామ్ దొరకపుచ్చుకున్నాడు. 43 బంతుల్లో 7 ఫోర్లతో 53 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ కూడా చెలరేగి ఆడటంతో ఏ దశలోనూ న్యూజిలాండ్ పోటీలో లేకుండా పోయింది.  రిజ్వాన్ 43 బంతుల్లో  5 ఫోర్లతో 57 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్ లో ఫిలిప్స్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తరువాత 19వ ఓవర్ చివరి బంతికి మహ్మద్ హారిస్ ఔటయ్యాడు.శాంట్నర్ బౌలింగ్ లో అలెన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. హారిస్ 26 బంతుల్లో రెండు ఫోర్లు 1 సిక్సర్ తో 30 పరుగులు చేశాడు. విజయానికి చివరి ఓవర్ లో పాకిస్థాన్ రెండు పరుగులు చేయాల్సి ఉంది. చివరి ఓవర్ తొలి బంతిని సౌథీ వైడ్ వేశాడు. ఆ తరువాతి బంతికి మసూద్ సింగిల్ తీసి లాంఛనం పూర్తి చేశాడు.  ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే పాకిస్థాన్ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. దీంతో పాకిస్థాన్ టి20 ఫైనల్ కు దూసుకెళ్లింది. 

అసలు ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు ఏమైంది?

ఒక ఎమ్మెల్యే అధికారులపై మండిపడతారు. మరో ఎమ్మెల్యే మహిళలను వెటకారం చేస్తారు. ఇంకో ఎమ్మెల్యే బూతులే స్తోత్రాలు మాదిరిగా మాట్లాడతారు. ఒక ఎమ్మెల్యే ప్రజల్ని ప్రాంతీయ విభేదాలతో రెచ్చగొడతారు. ఇంకొకరైతే రాజీనామా పేరుతో ఒక డ్రామాకు తెరలేపుతారు. ఒక మహిళా ఎమ్మెల్యే.. ఇప్పుడు మంత్రిగా ఉండి కూడా ‘మధ్య వేలు’ చూపించి మరీ యువతను రెచ్చగొడతారు. మరో ఎమ్మెల్యే, ప్రస్తుత మాజీ మంత్రి చొక్కా చేతులు మడతపెట్టి రౌడీలా రంకెలు వేస్తారు. మరో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అయితే.. ప్రతి మాటలోనూ వెటకారం నింపకుండా మాట్లాడరు. వైసీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి అయితే.. బిల్డప్ ల మీద బిల్డప్ లు ఇస్తుంటారు. వీరందరి ‘ముఖ్య’ నాయకుడు వారెవరినీ నియంత్రించే పనే చేయరు. పైగా వారిని ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో జనం మధ్యకు పంపిస్తుంటారు. ఇదండీ.. ప్రస్తుతం ఏపీలోని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, వారి ముఖ్య నేత తీరు.  వైనాట్ 175 అవుటాఫ్ 175  వైసీపీ అధినేతకు ఇప్పుడు పట్టుకున్న పిచ్చి ఇది. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో వైసీపీని గెలిపించి, తమ నెత్తి మీదకు తెచ్చుకున్న ఆంధ్రా జనం వచ్చే ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో జగన్ పార్టీని గెలిపించాలట. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతిపక్షం అనేదే లేకపోతే అధికార పార్టీకి కళ్లెం వేసేవారు ఎవరుంటారసలు? మొత్తానికి మొత్తం సీట్లలో వైసీపీయే గెలిచేస్తేనే.. తన అధికారదాహం తీరుతుందని ఆ పార్టీ అధినేత అనుకుంటున్నారా? అని జనం నుంచి ప్రశ్న వస్తోంది. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ తన నేతృత్వంలో రాష్ట్రాన్ని ఇప్పటికే అదఃపాతాళానికి నెట్టేశారనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ఆమడదూరం పోయింది. రోడ్ల దుస్థితి చూస్తే ముక్కున వేలేసుకోక తప్పదు. ఖజానా ఖల్లాస్ అయిపోయింది. రాజధాని ఏదంటే   చెప్పుకోలేని పరిస్థితి రాష్ట్ర ప్రజలకు అవమానంగా మారింది. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా జగన్ రెడ్డి ఏవేవో పనికిమాలిన పనులు చేస్తున్నారనే విమర్శలు ఎక్కువయ్యాయి. గత ఎన్నికల ముందు జగన్ గొప్పగా చెప్పిన ‘నవరత్నాలు’ ‘నవ ద్రోహాలు’గా మారాయంటూ పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్రాన్ని, ప్రజల్ని అప్పుల ఊబిలోకి నెట్టేసినా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మొత్తం ఎమ్మెల్యే స్థానాల్లో, ఎంపీ సీట్లలో విజయం సాధించాలట. లేదంటే సిటింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల సీట్లకు ఎసరు తప్పదని, వారి స్థానాల్లో కొత్తవారికి అవకాశం ఇస్తానని జగన్ రెడ్డి ప్రతి సందర్భంలోనూ వారిని బెదిరిస్తుండడం గమనార్హం. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల చెవుల్లో తమ అధినేత వార్నింగే ‘రింగ్ రింగ్’మంటూ మోగుతోంది. వచ్చే ఎన్నికల్లో తమకు సీటు దక్కే ఛాన్స్ లేదనుకుంటున్న కొందరు ఎమ్మెల్యేలైతే.. అవకాశం లేని చోట ఎంత కష్టపడి ఏమి లాభం అనుకుని నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నారు. పార్టీని ఎలా గెలిపించాలి? తనను ఎన్నుకున్న ప్రజల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే దాని కంటే.. మళ్లీ ఎలా సీటు సంపాదించాలనే అంశంపైనే మల్లగుల్లాలు పడుతున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. ఒక పక్కన సొంతంగా చేయించుకుంటున్న సర్వేల నివేదికలు, ఇంకో పక్కన ‘ఐ ప్యాక్’ బృందం తరచుగా అందజేస్తున్న సర్వే ఫలితాలు జగన్ ను గందరగోళంలో పడేస్తున్నాయంటున్నారు. అయినప్పటికీ ఆయన ‘బురదపాము కోపం’ మాదిరిగా తన పార్టీ ఎమ్మెల్యేలపై కస్సుబుస్సులాడుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఏతా వాతా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి భంగపాటు తప్పదనేది వాస్తవం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినా సరే ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ చందంగా తనకు 175 సీట్లు వచ్చి తీరాలనే పంతానికి జగన్ పోతుండడం గమనార్హం. ఆ క్రమంలోనే తన సిటింగ్ ఎమ్మెల్యేలను జనంలోకి తోస్తుండడం విశేషం. పోనీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలను స్థానిక ప్రజలు ఏమైనా గౌరవిస్తున్నారా? అంటే అలాంటిదేమీ లేదు. పైగా ముఖం మీదే వారిని సమస్యలపై కడిగిపారేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉందంటే.. ముందు గొయ్యి వెనుక నుయ్యి అన్నట్లు మారిపోయిందంటున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో జగన్ విఫలమయ్యారని, తమ తమ నియోజకవర్గాల్లో అయినా.. తాము ఏవైనా జనాలకు ఉపయోగపడే పనులు చేయనిస్తారా? అంటే అందుకు కావాల్సి నిధులు ఇవ్వరని వారు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారని తెలుస్తోంది. ఒక పక్కన అభివృద్ధి చేయలేని దుస్థితి.. మరో పక్కన జనం నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత.. ఇవన్నీ వెరసి వైసీపీ ఎమ్మెల్యేల్లో అసహనం.. ఆక్రోశం, ఆగ్రహం పెరిగిపోతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వాటి ఫలితంగానే వైసీపీ ఎమ్మెల్యేలు తన నిస్సహాయతను అధికారులపై రుద్దుతున్నారంటున్నారు. నిలదీసిన మహిళలను కూడా ఎగతాళి చేస్తున్న సంఘటలను జరుగుతున్నాయని చెబుతున్నారు. నోటికొచ్చినట్లు రంకెలేస్తున్నారని అంటున్నారు. జనం మధ్య విభేదాలు రెచ్చగొట్టి, తమ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వస్తున్నాయి.  అసలు ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు ఏమైంది? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఇహనో ఇప్పుడో కాంగ్రెస్ వేటు!

మునుగోడు ఉప ఎన్నిక పూర్తయ్యింది. ఫలితాలు వచ్చేశాయి. పోటీ ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్యే జరిగిందన్నది తేటతెల్లమైపోయింది. అన్ని పార్టీలూ ఫలితాలపై సమీక్షల్లో మునిగిపోయాయి. ఘోరంగా పరాజయం పాలైన కాంగ్రెస్ కూడా ప్రస్తుతం అదే పనిలో ఉంది. అయితే గెలుపోటములపై సమీక్ష చేయడానికి ఆ పార్టీకి ఏమీ లేదు. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నిక పరాజయం వెనుక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సోదరుడు, కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారని కాంగ్రెస్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసింది. పార్టీ స్టార్ క్యాంపెయినర్ అయి ఉండి కూడా ప్రచారంలో పాల్గొనక పోవడం, రాష్ట్రంలో జరిగిన రాహుల్ గాంధీ జోడో యాత్రకు సైతం డుమ్మా కొట్టడంతో ఆయన తన సోదరుడు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి విజయం కోసం తెరవెనుక యత్నాలు చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆరోపించడమేమిటి? బలంగా నమ్ముతోంది కూడా. పార్టీతో సంబంధం లేకుండా తన సోదరుడినే గెలిపించాలంటూ భాస్కరరెడ్డి ఫోన్ సంభాషణలు లీకై సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. అలాగే ఎన్నికలకు ముందు విదేశీ పర్యటనక వెళ్లిన కోమటిరె్డి వెంకటరెడ్డి అక్కడ తన సన్నిహితులతో కాంగ్రెస్ ఓటమి తధ్యమంటూ చెబుతున్న సంభాషణ వీడియోక్లిప్పింగ్ లు వైరల్ అయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లో ఉంటూనే ప్రత్యర్థి గెలుపునకు పరోక్షంగా సహకరించారంటూ వెంకటరె్డికి కాంగ్రెస్ ఇప్పటికే షోకాజ్ నోటీసు జరీ చేసింది. అయితే ఆ షోకాజ్ నోటీసుకు వెంకటరెడ్డి స్పందించలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇక ఆయన పై వేటువేయడమే తరువాయి అని ఆ వర్గాలు చెబుతున్నాయి.అన్నిటికీ మించి తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరుగుతుంటే.. మునుగోడు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉండి కూడా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులందరూ ఆ యాత్రలో పాల్గొని ఆయనతో అడుగు కలిపారు. ఒక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం రాహుల్ కాంగ్రెస్ జోడో యాత్ర వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ రెండు అంశాలనూ కలిపి చూస్తే సాంకేతికంగా వెంకటరెడ్డి కాంగ్రెస్ లోనే ఉన్నా మానసికంగా పార్టీతో తెగతెంపులు చేసుకున్నారని కాంగ్రెస్ ఒక అభిప్రాయానికి వచ్చేసింది.  ఈ నేపథ్యంలోనే షోకాజ్ నోటీసుకు కనీసం స్పందించను కూడా స్పందించని వెంకటరెడ్డిపై వేటు వేయడమే మేలని విస్తోంది. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా వెంటకరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధిష్ఠానాన్నికోరుతున్నారు. 

హాల్ టికెట్ పై సన్నీలియోన్ ఫోటో.. విచారణకు కర్నాటక విద్యాశాఖ ఆదేశం

హాల్ టికెట్ పై అభ్యర్థి పేరుకు బదులుగా శృంగార తార  సన్నీలియోన్ ఫొటో ఉండటం తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో కర్నాటక విద్యాశాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఉదంతంపై రాజకీయ విమర్శలు సైతం జోరందుకున్నాయి. కర్నాటకలో అధికార బీజేపీ సర్కార్ పై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. కర్నాటక టీచర్స్ రిక్రూట్ మెంట్ పరీక్షకు హాజరౌతున్న అభ్యర్థి హాల్ టికెట్ పై అభ్యర్థి ఫొటో బదులుగా శృంగార తార ఫొటో ఉండటంపై కర్నాటక కాంగ్రెస్ సామాజిక మాధ్యమ  చైర్ పర్సన్ బీఆర్ నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో బ్లూఫిల్మ్స్ చూసే పార్టీ నుంచి ఇటువంటి చర్యలు తప్ప మరే ఆశించగలమని దుయ్యబట్టారు.   అయితే కాంగ్రెస్ విమర్శలపై విద్యాశాఖ స్పందించింది.  అప్లికేషన్ సందర్భంలో అభ్యర్థి ఏ ఫొటోను అప్ లోడ్ చేస్తే సిస్టం ఆ ఫొటోనే తీసుకుంటుందని పేర్కొంది. అసలు హాల్ టికెట్ పై అభ్యర్థి ఫొటోకు బదులుగా సన్నీలియోన్ ఫొటో ఎలా వచ్చిందన్న దానిపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొంది. అభ్యర్థిని విచారించగా తన వివరాలన్నీ తన భర్త స్నేహితుడు అప్ లోడ్ చేశాడని చెప్పిందనీ, విచారణలో అసలు విషయం తేలుతుందని విద్యాశాఖ పేర్కొంది. ఇలా ఉండగా హాల్ టికెట్ లో అభ్యర్థి ఫొటో బదులుగా శృంగార తార సన్నీలియోన్ ఫోటో అంశం సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. కాగా ఇందుకు నైతిక బాధ్యత వహించి కర్నాటక విద్యాశాఖ మంత్రి నగేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇలా ఉండగా ఫొటో మారిపోవడంపై సమగ్ర విచారణకు ఆదేశించామనీ, త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని విద్యాశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. 

కింగ్ కోహ్లీకి గాయం.. రేపటి సెమీస్ లో ఆడతాడా?

భారత్ స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీ గాయపడ్డాడు. గురువారం (నవంబర్10) జరిగే సెమీ ఫైనల్ లో ఆడతాడా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. టి20 వరల్డ్ కప్ టోర్నీలో గురువారం (నవంబర్ 10) టీమ్ ఇండియా ఇంగ్లాండ్ తో తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఫైనల్ కు చేరాలన్నా, కప్ సాధించాలన్నా ముందు ఇంగ్లాండ్ తో జరిగే సెమీ ఫైనల్ లో విజయం సాధించి తీరాలి. అంతటి కీలక మ్యాచ్ ముందు కింగ్ కోహ్లీ గాయపడ్డాడన్న సమాచారం అభిమానుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. అయితే కోహ్లీ గాయం తీవ్రవైనది కాదనీ, కచ్చితంగా ఇంగ్లాండ్ తో జరిగే సెమీస్ లో కోహ్లీ ఆడతాడనీ టీమ్ ఇండియా వర్గాలు చెబుతున్నాయి. ఐసీసీ కూడా కోహ్లీ గాయం తీవ్రమైనదేమీ కాదని నిర్ధారించింది. ఇలా ఉండగా కీలక మ్యాచ్ ముందు ఆటగాళ్లకు ప్రాక్టీస్ అత్యంత అవసరం.. అయితే ప్రాక్టీస్ సెషన్ లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గాయాల పాటు కావడం తథ్యం. మంగళవారం ప్రాక్టీస్ సెషన్ లో టీమ్ ఇండియా స్కిప్పర్ రోహిత్ గాయపడిన సంగతి విదితమే. ఆ గాయం కూడా తీవ్రమైనది కాకపోవడంతో టీమ్ ఇండియా ఊపిరి పీల్చుకుంది. మరుసటి రోజే అంటే బుధవారం కోహ్లీ గాయపడ్డాడన్న వార్త అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. మొత్తం మీద ఇద్దరికీ తీవ్ర గాయాలు కాదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

గంగుల నివాసంలో ఈడీ, ఐటీ సోదాలు

మంత్రి గంగుల నివాసంలో ఐడీ, ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాలలో జరుగుతున్న తనిఖీల్లో భాగంగా మంత్రి నివాసంలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలలో ఏకకాలంలో ఈ దాడులు జరుగుతున్నాయి. మంత్రి గంగుల కమలాకర్, అలాగే గ్రనైట్ వ్యాపారుల నివాసాలు, కార్యాలయాలలో ఈ తనిఖీలు సాగుతున్నాయి. హైదరాబాద్ లోని జనప్రియ అపార్ట్ మెంట్, సోమాజి గూడలోని గ్రానైట్ వ్యాపారి నివాసంలోనూ, కరీంనర్ లోని గంగుల కమలాకర్ నివాసం, అలాగే ఆయనకు చెందిన గ్రానైట్ కంపెనీల్లోనూ ఈ సోదాలు జరుగుతున్నాయి. అలాగే మరి కొందరు గ్రానైట్ వ్యాపారుల నివాసాలు, కార్యాలయాలలో కూడా ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఈ సోదాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఫెమా నిబంధనల ఉల్లంఘనపై గతంలోనే ఈడీ నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నారు. మొత్తం 20 బృందాలు ఈ తనిఖీలలో పాల్గొన్నట్లు చెబుతున్నారు. 

వల్లభనేని వంశీకి మైండ్ బ్లాక్ అయ్యే కౌంటర్!

వల్లభనేని వంశీమోహన్. గన్నవరం ఎమ్మెల్యే. తెలుగుదేశం గుర్తుపై గెలిచిన వంశీ   ఆ తరువాత జగన్ చెంతకు చేరారు. వంశీకి వాచాలత ఎక్కువ అన్న విషయం రాజకీయాలతో పరిచయం ఉన్న అందరికీ తెలిసిందే.  ఆ మధ్యన టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వంశీ వ్యాఖ్యలు టీడీపీ, వైసీపీ నేతల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధాన్నే సృష్టించాయి. వంశీ వ్యాఖ్యలు చివరికి శాసనసభలోకి కూడా చొరబడ్డాయి. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి సభలోనే తీవ్ర అవమానం జరిగింది. అంతటి అవమానాన్ని భరించలేక చంద్రబాబు నాయుడు ‘ఈ కౌరవ సభలో ఉండను.. మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతా’ అని భీషణ ప్రతిజ్ఞ చేసే దాకా వ్యవహారం వెళ్లడానికి  వల్లభనేని వంశీ వ్యాఖ్యలే ప్రధాన కారణం అని చెప్పాలి. అలాంటి వంశీకి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఓ మహిళ తల మైండ్ బ్లాక్ అయిపోయే కౌంటర్ ఇచ్చారు.   నోరు మూయించారు. నోటికి ఎంత మాట వస్తే అంత అనేసే వంశీ ఆ మహిళ కౌంటర్ తో మళ్లీ నోరు ఎత్తకుండా చేశారు. ఊహించని పరిణామం ఎదురవడంతో వల్లభనేని వంశీ ఏమి చేయాలో… ఏమి చెప్పాలో తెలియక తికమక పడిపోయారు. విజయవాడ గ్రామీణ మండలం నిడమానూరులో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి..  వైసీపీ ఎమ్మెల్యే కాని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీ ప్రజాప్రతినిధులు చేస్తున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పర్యటిస్తుండగా సీహెచ్ భవాని అనే మహిళ ఆయనను నిలదీశారు. ‘గతంలో ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలు ఉండేవి. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్లిపోయాయి. దీంతో యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు’  అన్నారు. ‘మీ ముఖ్యమంత్రి జగన్ ను అడిగి పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తిరిగి తీసుకురండి’ అని కోరారు. సమస్యల గురించి భవాని చెబుతుండగానే.. వల్లభనేని వంశీలో వెటకారం తన్నుకొచ్చింది. ఆమెను ఉద్దేశించి ‘చూడండి అక్కా. మీరు ‘ఆ రెండు పత్రికలు’ బాగా చదువుతున్నట్లున్నారు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయితే.. భవాని మాత్రం స్పాంటేనియస్ గా  ‘వాటివల్లేగా మీరు పైకొచ్చింది’ అంటూ రిటార్డ్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా అవాక్కవడం అక్కడ ఉన్నవారందరి వంతు అయింది. దీంతో తడబాటును కొద్దిగా తమాయించుకుని.. ‘ఇక్కడి వాతావరణంలో ఉద్యోగులు పని చేయలేకపోవడంతో చాలా కంపెనీలు వెళ్లిపోయాయి’ అనగానే.. భవానీ కల్పించుకుని ‘మీరు ఇంకా హైదరాబాద్ నే అభివృద్ధి చేయాలని చూస్తున్నారు’ అని మళ్లీ ఘాటుగా రిప్లై ఇచ్చారు. భవానీ మాటలతో ఏం జవాబు చెప్పాలో తెలియని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బిత్తర చూపులు చూశారంటున్నారు.

సీజేఐగా డీవై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. 50వ సీజేఐగా ఆయన బుధవారం (నవంబర్9) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఆయన ఈ పదవిలో రెండేళ్లు అంటు 2024 నవంబర్ 10 వరకూ కొనసాగుతారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన సీజేఐ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి  రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పలు కీలక కేసుల తీర్పులను వెలువరించిన జస్టిస్ చంద్రచూడ్     తండ్రి వైవీ చంద్రచూడ్ కూడా సీజేఐగా  బాధ్యతలు నిర్వహించారు. దేశంలో అత్యంత ఎక్కువ కాలం పని చేసిన సీజైఐగా వైవీ చంద్రచూడ్ రికార్డు సృష్టించారు. ఆయన దాదాపు ఏడేళ్ల పాటు సీజేఐ పదవిలో ఉన్నారు. ఇక జస్టిస్ డీవై చంద్రచూడ్ విషయానికి వస్తే అయోధ్య భూవివాదం కేసు, వ్యక్తిగత గోప్యత హక్కు కేసు, శబిరమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, ఆధార్ చెల్లుబాటు వంటి కేసుల తీర్పు వెలువరించిన ధర్మాసనాల్లో ఆయన కూడా ఉన్నారు. 1959 నవంబర్ 11న జన్మించిన జస్టిస్ డీవై చంద్రచూడ్..  సుప్రీం కోర్టులో, బోంబే హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు.  1998 జూన్‌లో బోంబే హైకోర్టులో సీనియర్‌ న్యాయవాది హోదా పొందారు. అదే ఏడాది భారత అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా నియమితులయ్యారు.  2000 మార్చి 29న బోంబే హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు. 2 013 అక్టోబరు 31న అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.  

మునుగోడు మెజారిటీపై కేసీఆర్ అసంతృప్తి.. ఇన్ చార్జ్ మంత్రిపై ఫైర్

మునుగోడు ఉప ఎన్నికలో విజయం పట్ల టీఆర్ఎస్ నేతలంతా సంబరాల్లో ఉంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రం మెజారిటీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక విజయం తరువాత కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకునేందుకు మునుగోడు నుంచి విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి, మంత్రి  జి. జగదీశ్వర్ రెడ్డి ప్రగతి భవన్ కు వెళ్లారు.   ఈ సందర్భంగా మునుగోడులో విజయం సాధించినందుకు కూసుకంట్లను, ప్రచారంలో బాగా పని చేసినందుకు మంత్రి జగదీశ్వరరెడ్డిని అభినందించాల్సింది పోయి కేసీఆర్ మెజారిటీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ప్రచారం విషయంలో అలసత్వం ప్రదర్శించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వామపక్షాలతో పొత్తు పెట్టుకుని మరీ రంగంలోకి దిగినా.. విజయం ఘనంగా లేకపోవడం.. అంచనా మేరకు మెజారిటీ రాకపోవడం పట్ల కేసీఆర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. ఒక వైపు కమ్యూనిస్టుల మద్దతు, మరో వైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలిపోయే విధంగా పెద్ద సంఖ్యలో అభ్యర్థులూ ఉన్నా కూడా మెజారిటీ పెరగకపోవడమేమిటని కేసీఆర్ మంత్రి జగదీశ్వరరెడ్డిని ప్రశ్నించినట్లు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు ఇన్ చార్జలుగా ఉన్న చోట్ల కూడా మెజారిటీ ఎందుకు రాలేదని ప్రశ్నించినట్లు సమాచారం. ఒక వేళ కమ్యూనిస్టులను కలుపుకుపోకుండా ఉన్నట్లైతే పార్టీ పరువు గంగలో కలిసేదే కదా అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. కేవలం కమ్యూనిస్టుల వల్లే మునుగోడులో మనం గెలిచామని కేసీఆర్ అన్నారు. అంతే కాకుండా బీజేపీకి ఏ మాత్రం పట్టు లేని మునుగోడులో ఆ పార్టీకి 87 వేల ఓట్లు రావడాన్ని కేసీఆర్ చాలా సీరియస్ గా తీసుకున్నారని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. కేవలం తన చొరవ వల్లే వామపక్షాలు తెరాసకు మద్దతు ఇచ్చాయనీ, ఇంత మందిని నియోజకవర్గంలో  మోహరించి మానిటర్ చేయమంటే ఏం చేశారనీ, ఆశించిన స్థాయిలో ఓట్లు ఎందుకు రాబట్టలేకపోయారనీ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. 

వైసీసీలో లుకలుకలు.. ముదిరిన విభేదాలు.. జిల్లా అధ్యక్షపదవులకు రాజీనామాలు!

జగన్ పార్టీలో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. పార్టీ జిల్లా అధ్యక్ష పదవులకు సీనియర్లు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. పార్టీ పరువు బజారున పడకండా ఉండేందుకు రాజీనామాల ప్రకటన వద్దని వైసీపీ అగ్రనాయకత్వం బుజ్జగింపులను కూడా వినే పరిస్థితుల్లో సీనియర్లు లేరు. పార్టీ ప్రతిష్ట మంటగలిసినా బేఫికర్ అంటూ తమ అసమ్మతి గళాన్ని విప్పుతున్నారు. వారిలో అసంతృప్తి ఎంతగా గూడు కట్టుకుందంటే.. తమ రాజీనామాతో హైకమాండ్ ను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశమే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. పార్టీలో అసమ్మతి జ్వాలలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయన్న వార్తలు చాలా కాలంగానే వినవస్తున్నాయి. వైసీపీ శ్రేణులు కూడా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచేందుకు ఏమీ పెద్దగా ప్రయత్నించలేదు. జగన్ ఎప్పుడైతే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారో.. నాటి నుంచే వైసీపీ అప్పటి దాకా మూసి ఉంచిన గుప్పెట తెరిచేసినట్లైంది. జగన్ మాటే వేదం, ఆయన నిర్ణయమే శిరోధార్యం అంటూ పార్టీలో అప్పటి దాకా ఉన్న బిల్డప్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తరువాత మటు మాయమైంది. బహిరంగంగా నిరసనలు వెల్లువెత్తాయి, జగన్ స్వయంగా బుజ్జగింపులకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. సరే ఎలాగో అప్పటికి పరిస్థితి సద్దుమణిగినా.. అప్పటి నుంచి వైసీపీలో అసమ్మతి జ్వాలలు నివురుగప్పిన నిప్పులా అలాగే ఉన్నాయి. తాజాగా అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి కాపు రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు. ఇక ఆయన స్థానంలో మరొకరిని నియమించాలన్నా ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొని ఉంది. కానీ ఈ పరిస్థితి ఒక్క అనంతపురం జిల్లాకే పరిమితం కాలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి మాజీ మంత్రి సుచరిత రాజీనామా చేశారు. ఇదే దారిలో పలు జిల్లాల అధ్యక్షులు ఉన్నారని చెబుతున్నారు. వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్ష పదవులను ఒక బుజ్జగింపు విధానంగా మార్చింది. తొలి సారి మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన వారికీ, అలాగే మంత్రిపదవులు ఆశించి రానివారికీ తాయిలం ఇచ్చినట్లుగా జిల్లా అధ్యక్ష పదవులను కట్టబెట్టింది. మీమీ జిల్లాలలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే ఆ అభ్యర్థికి మంత్రి పదవి గ్యారంటే అని జగన్ బంపరాఫర్ కూడా ఇచ్చారు. అంటే జిల్లా అధ్యక్షులకు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అవకావం ఉండదు.. ఎవరినో గెలిపించడానికి, వారికి మంత్రిపదవి ఇప్పించడానికి కష్టపడాలా అన్న భావన వారిలో నెలకొంది. ఈ కారణంగానే పార్టీ పదవులంటే వద్దు బాబోయ్ అని పారిపోయే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది.

తప్పుడు లెక్కలలో జగన్ ప్రావీణ్యం.. సత్యకుమార్

ఏపీని అన్ని విధాలా భ్రష్టు పట్టించిన సీఎం జగన్ తప్పుడు లెక్కలు చూపించడంలో కూడా సిద్ధహస్తుడు అయ్యారా? బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్ తన ట్విటర్ వేదిక చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే నిజమే అనిపించక మానదు. చివరికి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించాల్సిన కార్యక్రమంలో కూడా తప్పుడు లెక్కలతో నింపేశారని సత్యకుమార్ ‘జల్ జీవన్ మిషన్- హర్ ఘర్ జల్’ నివేదికలోని స్క్రీన్ షాట్ తో సహా తెరమీదకు తీసుకొచ్చారు. ‘తప్పుడు లెక్కలు, ఉత్తుత్తి ప్రకటనలతో ప్రజలను మోసం చేసే సీఎం వైఎస్ జగన్ జల్ జీవన్ మిషన్ లెక్కలనూ టాంపరింగ్ చేశారని సత్యకుమార్ ఆరోపిస్తున్నారు. ఏపీలో 3 వేల 544 గ్రామాలకు నూరు శాతం కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్లు లెక్కలు చూపారు. కానీ 735 అంటే కేవలం 20 శాతం గ్రామ పంచాయతీలు మాత్రమే పని పూర్తి అయినట్లు సర్టిఫికెట్లు ఇచ్చాయి. మిగిలిన 80.26 శాతం మోసం’ అంటూ సత్యకుమార్ చేసిన ట్వీట్ అందరినీ ఆకర్షిస్తోంది. గ్రామాల్లోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ చేపట్టింది. అయితే.. ఆశించిన ఫలితాలు సాధించడంలో ఏపీ ఘోరంగా విఫలమైందని సత్యకుమార్ దుయ్యబడుతున్నారు. జల్ జీవన్ మిషన్ పథకాన్ని ఏపీలో వంద శాతం అమలు చేసినట్లు కేంద్రానికి వైసీపీ ప్రభుత్వం నివేదిక పంపించిందని సత్యకుమార్ తెలిపారు. అయితే.. జల్ జీవన్ మిషన్ నివేదిక ప్రకారం కేవలం 20 శాతం గ్రామాలకు మాత్రమే ఈ పథకం ఫలాలు అందాయని ఆయన చెబుతున్నారు. ఈ విషయమై వైసీపీ ప్రభుత్వం పైన, ఏపీ సీఎం జగన్ పైన సత్యకుమార్ ఘాటుగా విమర్శల దాడి చేస్తున్నారు. తప్పుడు సలహాలు ఇచ్చేందుకే జగన్ ప్రత్యేకంగా 45 మంది సలహాదారులను పెట్టుకున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. తప్పుడు సలహాలు ఇచ్చేందుకు ఆ సలహాదారులకు 130 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సోషల్ మీడియాలో దుయ్యబడుతున్నారు. తప్పుడు ప్రచారం చేస్తూనే జగన్ ఈ మూడున్నరేళ్లుగా పాలన లాగించారని సత్యకుమార్, నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

ప్రేమ కోసం పురుషుడిగా మారిన స్త్రీ.. లింగమార్పిడి చేయించుకుని మరీ వివాహం

వాళ్లది విచిత్ర ప్రేమ. ప్రేమించుకునేందుకు  అడ్డురాని లింగభేదం తీరా పెళ్లి చేసుకుని కలిసి జీవిద్దామని నిర్ణయించుకునే సమయంలో వచ్చింది. దీంతో ఆ సమస్యను అధిగమించేందుకు వారిలో ఒకరు లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న  ఉదంతం ఇది.  రాజస్థాన్ కు చెందిన మీరా  ఓ పాఠశాలలో డ్రిల్ మాస్టారుగా పని చేస్తోంది. అదే పాఠశాలలో చదువుకుంటున్న కల్పనతో ప్రేమలో పడింది. ఇరువురికీ స్నేహం కుదిరింది. కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడాన్ని సమాజం అంగీకరించదు కదా ఏం చేద్దాం అన్న ఆలోచనలో పడ్డారు. సరిగ్గా అప్పుడే మీరాకు ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అంతే వెంటనే తాను లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని పురుషుడిగా మారిపోవాలని నిర్ణయించుకుంది. వెంటనే తన ఆలోచనను కార్యరూపంలోకి పెట్టేసింది. ప్రేమను గెలిపించుకోవడం కోసం పురుషుడిగా మారింది. ఆ తరువాత మీరా, కల్పనలిద్దరూ తమ తమ కుటుంబాలను ఒప్పించి పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. 

విభజన సమస్యలపై ఒంటి చేతి చప్పట్లా? కేంద్రానికి చిత్తశుద్ధి ఏదీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్ల కావస్తోంది. ఇప్పటికీ విభజన సమస్యలు అలాగే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలే పరిష్కారం కాలేదు. ఇది ఇరు రాష్ట్రాల మధ్యా అగాధానికీ, వివాదాలకూ దారి తీస్తోంది. అయినా కేంద్రం ఈ విషయంలో తన తాత్సార వైఖరిని ఇసుమంతైనా విడువడం లేదు. ఎప్పుడో తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా విభజన సమస్యలు ఉన్నాయని గుర్తుకు వచ్చినప్పుడు నామ్ కే వాస్తే ఓ సమావేశం ఏర్పాటు చేయడం.. ఇరు రాష్ట్రాల అధికారులనూ సమావేశ పరిచి కొద్ది సేపు ముచ్చట్లాడి మరోసారి కలుద్దాం అంటూ ముగించేయడమే ఈ ఎనిమిదేళ్ల కాలంలో జరుగుతూ వస్తోంది. ఇప్పుడు మరో మారు కేంద్రం అదే చేస్తోంది. అయితే ఈ సారి ఉభయ రాష్ట్రాల మధ్యా సమస్యల పరిష్కారం కోసం చర్చించేందుకు ఒక రాష్ట్రానికి మాత్రమే ఆహ్వానం పంపింది. ఒంటి చేతి చప్పట్లతో ఉభయ రాష్ట్రాల మధ్యా పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలను పరిష్కరించేస్తానంటోంది. ఇంతకీ విషయమేమిటంటే.. విభజన సమస్యల పరిష్కారం కోసం చర్చించేందకు ఈ నెల 23న కేంద్రం ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఆ మేరకు సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఏపీకి ఆహ్వానం పింపింది. అయితే తెలంగాణకు మాత్రం ఎలాంటి ఆహ్వానం లేదు. విభజన సమస్యల పరిష్కారం కోసం సమావేశం అన్న సమాచారం మీడియా ద్వారా తెలుసుకున్న తెలంగాణ ఈ విషయంలో కేంద్రాన్ని సంప్రదించింది. అయితే కేంద్రం నుంచి ఎటువంటి సమాచారం లేదు. దీంతో 23నాటి సమావేశానికి కేంద్రం ఒక్క ఏపీకే ఆహ్వానం పంపిందన్న విషయం రూఢీ అయ్యింది. ఇంతకూ తెలంగాణకు ఎందుకు ఆహ్వానం పంపలేదయ్యా అంటే.. గతంలో జరిగిన సమావేశాలలో తెలంగాణ వైఖరి సానుకూలంగా లేదన్న సమాధానం వచ్చింది. అడిగిన ఏ సమాచారాన్నీ కేంద్రానికి తెలంగాణ ఇవ్వడం లేదనీ, అందుకే విభజన సమస్యలపై ఈ నెల 23న ఏర్పాటు చేసిన సమావేశానికి తెలంగాణకు ఆహ్వానం పంపలేదనీ కేంద్రం వర్గాలు చెబుతున్నాయి. దీంతో 23నాటి సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరు కావడం లేదు. మరి ఒక ఏపీ నుంచి మాత్రం అధికారుల బృందం మాత్రం హాజరు కావడం వల్ల ఈ సమావేశం ద్వారా సాధించేదేముంటుందన్నది ప్రశ్న.  

ఏపీలో అత్యంత కాలుష్య నగరం విశాఖపట్నం

ఏపీలో అత్యంత కాలుష్య నగరంగా విశాఖపట్నం నిలిచింది. గాలి నాణ్యతా ప్రమాణాల ఆధారంగా కాలుష్య నియంత్రణ బోర్డు దేశంలోని అత్యంత కాలుష్య  నగరాల జాబితాను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 163 నగరాలకు సంబంధించిన వివరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఏపీలో అత్యంత కాలుష్య నగరంగా ఆ జాబితాలో చోటు చేసుకుంది. ఇంకా రాష్ట్రంలో రాజమహేద్రవరం, ఏలూరు, తిరుపతి, అనంతపురం నగరాలలో కూడా గాలి నాణ్యత తగినంత స్థాయిలో లేదని  కాలుష్య నియంత్రణ బోర్డు  వెల్లడించింది. ఇక దేశంలో అత్యంత కాలుష్య నగరం రాజధాని ఢిల్లీ మహానగరం అనుకుంటాం, కానీ ఈ సారి ఆ స్థానాన్ని బీహార్ లోని కటిహార్ నగరానికి దక్కింది. 2.40 లక్షల జనాభా గల ఈ నగరంలో గాలి నాణ్యత 360 పాయింట్లకు పడిపోయినట్లు సీపీసీబీ తన నివేదికలో పేర్కొంది. ఆ తరువాతి స్థానాలలో వరుసగా ఢిల్లీ (354 పాయింట్లు), నోయిడా (328), గాజియాబాద్‌ (304) నగరాలు ఉన్నాయి. ఇక తెలంగాణలో కాలుష్య నగరంగా హైదరాబాద్ తన గుర్తింపును నిలబెట్టుకుంది. 

ఘర్షణాత్మక స్థాయి దాటిన గవర్నర్, తెరాస సర్కార్ విభేదాలు!

వ్యవస్థల మధ్య, వ్యక్తుల మధ్య విభేదాలు ఉంటే ఉండవచ్చును. కానీ, వ్యక్తుల మధ్య, వ్యవస్థల మధ్య విబేధాలు ఘర్షణాత్మక స్థాయికి చేరుకోవడం ఎంత మాత్రం ఎంతమాత్రం అభిలషణీయం కాదు.   ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ తో ఢీ అంటే ఢీ అంటున్న రాష్ట్రాలలో   గవర్నర్లు చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంటారనడానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. గతంలో బెంగాల్ లో ధన్‌కడ్ వ్యవహరించిన విధానం, తమిళనాడులో గవర్నర్ తీరు, ఇక కేరళలో అయితే చెప్పనవసరం లేదు, ఏకంగా మంత్రుల్ని తీసేయాలని కూడా  గవర్నర్ ఆదేశాలిచ్చేస్తున్నారు.   జార్ఖండ్‌లో గవర్నర్ ప్రభుత్వాన్ని కూల్చే పనిలో ఉన్నారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇక తెలంగాణలో అయితే అయితే, తెలంగాణ ప్రభుత్వం,  ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్  మధ్య నెలకొన్న ఘర్షణాత్మక స్థాయి దాటేసిందనడానికి ఇసుమంతైనా సందేహించాల్సిన అవసరం లేదు.    అసెంబ్లీ ఆమోదించిన బిల్లలను గవర్నర్ తిరస్కరించడమూ లేదు.. ఆమోదించడమూ లేదు. పెండింగ్ లో పెట్టేసి  వివరణ ఇవ్వాలంటూ మంత్రులకు సమాచారం ఇస్తున్నారు. యూనివర్శిటీలకు సంబంధించిన ఓ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. చట్ట ప్రకారం.. రాజ్యాంగం ప్రకారం యూనివర్శిటీలకు చాన్సలర్‌గా గవర్నర్ ఉంటారు. కానీ అది గౌరవ మర్యాదల వరకే. పాలన అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. అయితే తెలంగాణ గవర్నర్ తమిళిసై మాత్రం   ఈ బిల్లులపై చర్చించాలని.. కొన్ని డౌట్స్ క్లియర్ చేయాలని విద్యా మంత్రి సబితకు ఏకంగా ఆదేశాలిచ్చేశారు.  మంత్రి సబిత అయితే.. తనకు ఎలాంటి ఆదేశాలు లేఖ రాలేదని.. అందువల్ల తనకు   రాజ్ భవన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు. ఒక్క యూనివర్శిటీలకు సంబంధించిన సవరణ బిల్లులే కాకుండా.. మరో నాలుగైదు బిల్లులు రాజ్ భవన్‌లోనే పెండింగ్ లో ఉన్నాయి. అలా అనే కంటే తిరస్కరణకూ, ఆమోదానికీ కూడా నోచుకోకుండా త్రిశంకు స్వర్గంలో ఉన్నాయి. గత అసెంబ్లీ సమావేశాలు ముగిసినప్పటి నుంచి పరిస్థితి స్టాండ్ స్టిల్ గా అలాగే ఉంది. వాటికి గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే గెజిట్ విడుదల చేసి అమలు చేయడానికి అవకాశం ఉంటుంది.   ఒక వేళ వాటిని  వెనక్కి పంపితే.. తెలంగాణ సర్కార్ ఏం చేయాలనుకుంటుందో అది చేస్తుంది. కానీ అటు ఆమోదించకుండా.. ఇటు తిరస్కరించకుండా తమిళిసై చేస్తున్న రాజకీయం టీఆర్ఎస్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆగ్రహాన్ని కలిగిస్తోంది.   నిజానికి, ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య ఘర్షణాత్మక వైఖరి పాలనకు అవరోధంగా ఉంది. ఇద్దరూ తగ్గేదేలే అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇక్కడ సీఎం కేసీఆర్ ఘర్షణాత్మక వైఖరి ఒక్క గవర్నర్’తో మాత్రమే కాదు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీతో కూడా.     ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చిన ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి ప్రోటోకాల్ పాటించలేదు. ముఖం చాటేశారు.  సరే అదలా ఉంటే, తెలంగాణ గవర్నర్’గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న తమిళిసై సౌందర్ రాజన్  మూడేళ్లుగా తను ఎదురైన చేదు అనుభవాలను ఏకరువు పెట్టారు. ఎట్ హోంకు వస్తానని చెప్పిన సీఎం రాలేదని ఆమె అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలనే తానీ విషయం చెబుతున్నారని పేర్కొన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్న సమయంలో ఇలా వివక్ష చూపడం సరైంది కాదని గవర్నర్ హితవు పలికారు.  ప్రజలను కలవాలని అనుకున్న ప్రతిసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. గతంలో మేడారం జాతరకు వెళ్లేందుకు హెలికాప్టర్‌ అడిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమ్మక్క- సారక్క జాతరకు వెళ్లేందుకు రోడ్డు మార్గంలో 8 గంటలు ప్రయాణించానని ఆమె గుర్తు చేశారు. తాను ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు. కొన్ని విషయాలు బయటకు చెప్పడం మంచిది కాదని ఈ సందర్భంగా గవర్నర్ వ్యాఖ్యానించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పేదల కోసం తన పని కొనసాగిస్తుంటానని తమిళిసై చెప్పారు. తనకు గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా పట్టించుకోననని.. రాజ్‌భవన్‌ను గౌరవించాలి కదా అని కూడా ఆమె అంటున్నారు. ఎన్నో యూనివర్సిటీలు, హాస్టళ్లను సందర్శించానని, విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నానని గవర్నర్ అన్నారు. బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల సమస్యలు చూసి చలించిపోయానని ఆమె గుర్తు చేసుకున్నారు. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రికి లేఖలు రాశానని చెప్పారు. ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించానని తమిళిసై చెప్పారు.నిజానికి,గడచిన మూడు సంవత్సరాలు అనేకంటే, హుజురాబాద్’ పరాభవం మొదలు ముఖ్యమంత్రిలో మార్పు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హుజూరాబాద్ ఓటమి తర్వాతనే ముఖ్యమంత్రి అటు ప్రధాని మోడీ    ఇటు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’ తో దూరం పెరిగిందని పరిశీలకులు అంటున్నారు.   రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారానికి మాత్రమే ముఖ్యమంత్రి రాజ్ భవన్ గడప తొక్కారు. మరో వంక స్వాతంత్ర, గణతంత్ర  దినోత్సవ వేడుకల సందర్భంగానూ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ , ముఖ్యమంత్రి ఎవరి దారి వారిది అన్నట్లుగా ఎడముఖం పెడ ముఖంగానే ఉంటున్నారు. చివరకు, రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో, గవర్నర్ ప్రసంగం లేకుండానే సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మరో వంక గవర్నర్ ప్రొటోకాల్ వివాదం ఢిల్లీ వరకు వెళ్ళింది. ఆమె ప్రొటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించి, ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం సృష్టించాయి. కాగా, రాజ్యాంగబద్ద వ్యవస్థల మధ్య ఘర్షణాత్మక వైఖరి మంచిది కాదని ఇలాంటి పరిస్థితి చిలికి చిలికి గాలివానగా మారి రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే ప్రమాదం లేక పోలేదని రాజ్యాంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా వర్సిటీ నియామకాల విషయంలో మరో సారి గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఘర్షణాత్మక వైఖరి బట్టబయలైంది. ఇదెంత వరకూ దారి తీస్తుందో చూడాలి. 

నిర్మాణాలు తెలియదు కానీ.. మహా జోరుగా కూల్చివేతలు.. జగన్ సర్కార్ స్పెషాలిటీ!

నిర్మాణాలు, అభివృద్ధిని పట్టించుకోకపోయినా ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ విధ్వంసాల విషయంలో మాత్రం తెగ ఉత్సాహంతో పని  చేస్తోంది. ప్రజా వేదిక కూల్చివేతతో ఆరంభమైన విధ్వంస కాండ ఈ మూడున్నరేళ్లలో రెట్టించిన ఉత్సాహంతో కొనసాగిస్తూనే ఉంది. మొన్నటికి మొన్న మంగళగిరి ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ పేరిట ఇళ్లను కూల్చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు విశాఖలోనూ కూల్చివేతల పర్వం కొనసాగించింది. మంగళగిరి ఇప్పటం లో జనసేన ఆవిర్భావ సదస్సుకు స్థలం ఇచ్చారన్న కక్షతో ఆ పార్టీ మద్దతు దారుల ఇళ్లు లక్ష్యంగా కూల్చివేతలకు పాల్పడిన జగన్ సర్కార్ విశాఖలో ప్రధాని మోడీ పర్యటన పేర ఈ కూల్చివేతల పర్వం కొనసాగించింది.  విశాఖ ఆంధ్రా వర్సిటీ మైదానం సమీపంలోని దుకాణాలను అధికారులు రాత్రికి రాత్రి జేసీబీలతో కూల్చివేశారు. నిజానికి ఈ నెల 12న ఆంధ్రావర్సిటీలో జరగనున్న ప్రధాని మోడీ సభ కోసం ఈ దుకాణాలను కూల్చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు వాటిని మూసి ఉంచితే సరిపోతుంది. అధికారులు తొలుత ఆయా దుకాణదారులను అదే సమాచారం ఇచ్చారు. నవంబర్ 12న మోడీ సభ కారణంగా ఆ రోజు దుకాణాలు తెరవవద్దని ఆదేశించారు. అందుకు దుకాణ దారులు అంగీకరించారు కూడా. కానీ అంతలోనే ఏమైందో ఏమో కానీ సోమవారం(నవంబర్7) అర్ధరాత్రి చెప్పా పెట్టకుండా, కనీసం దుకాణ దారులకు సమాచారం కూడా ఇవ్వకుండా దుకాణాలను  జేసీబీలతో కూల్చేశారు. మంగళవారం ఉదయం తమ దుకాణాలను తెరుద్దామని వచ్చే వరకూ ఈ కూల్చివేతల సంగతి దుకాణదారులకు తెలియనే తెలియదు. గత పాతికేళ్లుగా తాము అక్కడే తమ వ్యాపారాలు చేసుకుంటున్నామనీ, కనీస సమాచారం లేకుండా తమ దుకాణాలను కూల్చివేయడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోడీ సభ రోజున దుకాణాలు తెరవవద్దని మాత్రమే తమకు సమాచారమిచ్చారని వారు చెబుతున్నారు. అలా కాకుండా దుకాణాలను కూల్చేస్తామని చెప్పి ఉంటే వాటిలోని విలువైన వస్తువులు, సామగ్రిని తరలించుకునే వాళ్లం కదా అని ప్రశ్నిస్తున్నారు. ఉక్రెయిన్ మీద రష్యా అణుబాంబు వేసినట్లుగా జగన్ ప్రభుత్వం తమ మీద కూల్చివేతల బాంబు వేసిందన్నారు.   ఇలా ఉండగా ఈ కూల్చివేతలపై విపక్షాలు మండి పడుతున్నాయి. సంబంధం లేకుండా తగుదునమ్మా అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి మోడీ పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు నడుం బిగించడమేమిటి? ఇప్పుడు ఆ సభకు ఎంత మాత్రం అడ్డు కానీ దుకాణాలను కూల్చివేయడమేమిటని ప్రశ్నిస్తున్నాయి. విశాఖ కబ్జాల పర్వంలో ఇది కూడా ఒక భాగమేనని ఆరోపిస్తున్నాయి. ఈ స్థలం మీద విజయసాయి కన్ను పడటం వల్లనే దుకాణదారులు రోడ్డు పాలయ్యారని ఆరోపిస్తున్నాయి. ప్రధాని మోదీ పర్యటనను అవకాశంగా తీసుకుని దుర్మార్గంగా దుకాణాల కూల్చివేతకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు.   

నడి రోడ్డుపై తాచుపాము.. స్తంభించిన ట్రాఫిక్

ఉమ్మడి ప్రకాశం జిల్లా డోర్నాల-మార్కాపురం ప్రధాన రహదారిపై దాదాపు గంట సేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇందుకు ఆ రోడ్డుపై యాక్సిడెంట్ జరగడమో, రోడ్డుకు అడ్డంగా చెట్టు పడిపోవడమో, ఏదైనా వాహనం మరమ్మతు కోసం నిలిచిపోవడమో కాదు. ఒక పాము. నడిరోడ్డుపై పాము పడగవిప్పి దర్శనమిచ్చింది. వాహనాల లైట్లు, హారన్ల మోతతో బెంబేలెత్తిన ఆ పాము నడిరోడ్డుపై పడగ విప్పి అలా ఉండిపోయింది. దీంతో రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి. ఎవరూ ముందుకు కదలడానికి ధైర్యం చేయలేదు. అలాగే పాము వెళ్లే వరకూ వాహనదారులు ఆగిపోయారు. చివరికి ఆ పాము అరగంట తరువాత నెమ్మదిగా రోడ్డు పక్కనున్న పొలాలలోకి వెళ్లిపోయింది. ఆ తరువాతే ఆ రోడ్డు పై ట్రాఫిక్ క్లియర్ అయ్యింది. 

నేపాల్ లో 6.3 తీవ్రతతో భూ కంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు

నేపాల్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ఆ భూ కంప తీవ్రత 6.3గా నమోదైంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత సంభవించిన భూ కంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు వెంటనే తెలియరాలేదు. భూమికి 10 కిలోమీటర్ల  లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జాతీయ సిస్మోలజీ కేంద్రం ప్రకటించింది.   5 గంటల వ్యవధిలో నేపాల్ లో రెండు సార్లు భూమి కంపించింది. తొలుత మంగళవారం రాత్రి 9 గంటల  సమయంలో రిక్టర్‌ స్కేల్‌పై 4.9 తీవ్రతతో భూమి కంపించిందని సిస్మోలజీ సెంటర్ పేర్కొంది.  కాగా నేపాల్ లో సంభవించిన ఈ భూకంపం కారణంగా భారత్ లోని ఢిల్లీ, నొయిడా పరిసర ప్రాంతాలలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి.  దీంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి రోడ్లపైకి చేరుకున్నారు. నేపాల్ 2015లో   7.8 తీవ్రతతో సంభవించిన   భూకంపం విధ్వంసం సృష్టించిన సంగతి విదితమే. ఈ భూకంపం కారణంగా దాదాపు 8 లక్షల భవనాలు ధ్వంసమయ్యాయి. 9,000 మంది మరణించారు. 22,000 మందికి పైగా గాయపడ్డారు గాయపడ్డారు. భూకంపం వల్ల 800,000 ఇళ్లు, పాఠశాల భవనాలు కూడా అప్పట్లో కూడా ఈ భూకంప ప్రకంపనలు ఢిల్లీ సహా పలు నగరాలను వణికించాయి.

మునుగోడులో మా విజయం వామపక్షాల చలవే.. అంగీకరించిన టీఆర్ఎస్

మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు వామపక్షాల చలవే అని టీఆర్ఎస్ అంగీకరించింది.   కమ్యూనిస్టుల వల్లే తాము గెలిచామని మునుగోడు ఎలక్షన్‌కు ఇంచార్జ్‌గా వ్యవహరించిన మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. దీనిని బట్టే మునుగోడు విజయం బలుపు కాదన్న వాస్తవాన్ని టీఆర్ఎస్ అంగీకరించినట్లైంది. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి సహకరించినందుకు వామపక్షాలకు కృతజ్ణతలు తెలిపిన మంత్రి జగదీష్ రెడ్డి నేరుగా వారి కార్యాలయానికి వెళ్లి మరీ ధన్యవాదాలు చెప్పి వచ్చారు. వామపక్షాలు టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలిపాయనీ, స్వయంగా ప్రచారంలోనూ పాల్గొన్నాయనీ జగదీశ్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. బీజేపీ కుట్రలను  ఎదుర్కోవాలనే వ్యూహంలో భాగంగానే వామపక్షాలు తమకు అండగా నిలిచాయని చెప్పారు. ఒక విధంగా మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి క్రెడిట్ మొత్తం వామపక్షాలకు ఇచ్చేసినట్లు టీఆర్ఎస్ తీరును బట్టి తెలుస్తోంది. ప్రజలతోనే మా పొత్తు, పార్టీలతో కాదు అంటూ ఇంత కాలం చెబుతూ వచ్చిన టీఆర్ఎస్ అధినేత.. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయం వెన్నాడటంతో వామపక్షాలను శరణు జొచ్చారు. గతంలో కమ్యూనిస్టులా వారెక్కడున్నారు అంటూ ఎద్దేవా చేసిన కేసీఆర్.. ఇప్పుడు వారిని వెతుక్కుంటూ వెళ్లి మరీ పొత్తు పెట్టుకున్నారని విపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో వామపక్షాల ఓటు పది వేల వరకూ ఉంటుందని అంచనా. సరిగ్గా వామపక్షాల ఓట్లే టీఆర్ఎస్ కు మెజారిటీ తీసుకువచ్చాయని చెప్పవచ్చు. ఆ ఓట్లే కనుక టీఆర్ఎస్ కు రాకుండా ఉంటే మునుగోడులో విజయం అందని ద్రాక్షగానే మిగిలి ఉండేదన్న విషయం అర్ధం కావడంతోనే కేసీఆర్ మంత్రిని సీపీఎం కార్యాలయానికి పంపి మరీ ధన్యవాదాలు చెప్పించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదీ కాక.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కు మద్దతుగా ఏ పార్టీ ముందుకు రాని పరిస్థితుల్లో కేసీఆర్ పూర్తిగా వామపక్షాల మీదే ఆధారపడ్డారనీ, బీజేపీ వ్యతిరేక విధానాలకు ఒక సిద్ధాంతం పునాదిగా వామపక్షాలను తోడు తెచ్చుకున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే కమ్యూనిస్టులా వాళ్లెక్కడ ఉన్నారన్న ఆయన ఇప్పుడు వారినే కోరి దగ్గరకు చేర్చుకున్నారంటున్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పొత్తులో భాగంగా వారికి ఎన్ని సీట్లిస్తారు? అసలు ఇస్తారా అన్న ప్రశ్నలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.    పైగా జాతీయ రాజకీయాల్లోనూ కమ్యూనిస్టుల మద్దతు కేసీఆర్ కు అవసరమాయే. అందుకే ప్రజలతోనే పొత్తన్న కేసీఆర్ ఇప్పుడు పొత్తులు ఉంటేనే ప్రజల వద్దకు అంటున్నారని సెటైర్లు పేలుతున్నాయి.