విపక్ష నేతపై దాడి జరిగితే చర్యలు పక్కన పెట్టి కాకమ్మ కబుర్లా..?!
posted on Nov 5, 2022 @ 10:55AM
తెలుగుదేశ అధినేత చంద్రబాబు నందిగామ పర్యటనలో జరిగిన సంఘటనపై పోలీసులు ఒకలా, అధికార వైసీపీ నేతలు ఒకలా స్పందిస్తున్నారు. మొత్తం మీద ఇద్దరి స్పందనా ఆయనపై దాడిని సమర్ధించేందుకు చేస్తున్న ప్రయత్నంగానే ఉంది. విజయవాడ సీపీ అయితే దూడ మేత కోసం తాటిచెట్టు ఎక్కారన్న చందంగా బాబుపై పూలవర్షం కురిపించారనీ, ఆ సమయంలో పొరపాటుగా రాయో, రాయిలాంటి వస్తువో పడి ఉంటుందని అన్నారు.
ఇక వైసీపీ వాళ్లయితే ఏకంగా ఈ దాడి సానుభూతి కోసం చంద్రబాబే స్వయంగా చేయించుకున్నారని పేర్కొన్నారు. నందిగామలో జరిగిన సంఘటనను ఒక సారి పరిశీలిస్తే.. ఇది ఉద్దేశపూర్వకంగా, పక్కా ప్రణాళికతో బాబును గాయపరచడమే లక్ష్యంగా జరిగిందని అవగతమౌతుందని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు రోడ్ షోకు అసంఖ్యాకంగా జనం తరలి వచ్చారు. పక్కన ఉన్న భవనాలపై నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనం చంద్రబాబుకు జేజేలు పలుకుతూ నిలుచున్నారు. రోడ్ షోలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఎత్తైన భవనం నుంచి ఓ రాయి సూటిగా చంద్రబాబు వైపు దూసుకు వచ్చింది. దానిని గమనించిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ క్షణంలో స్పందించి చంద్రబాబుకు అడ్డుగా నిలబడటంతో ఆయన చేతికి గడ్డానికి గాయమైంది.
కాగా ఈ దాడి జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంటే దాడి చేసింది ఎవరన్నది గుర్తించకుండా ఉండేందుకు ప్రణాళిక ప్రకారమే ఆ సమయంలో విద్యుత్ సరఫరాను నలిపివేశారని పరిశీలకులు అంటున్నారు. ఒక వేళ చంద్రబాబుకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మెరుపు వేగంతో స్పందించలేకపోయి ఉంటే.. ఆ రాయి నేరుగా చంద్రబాబుకే తగిలి ఉండేది. ఏడు పదుల వయస్సు పైబడిన వ్యక్తికి ఆ రాయి తగిలితే తీవ్ర గాయం అయ్యేదని అంటున్నారు.
ఇంతటి తీవ్ర విషయాన్ని సీరియస్ గా తీసుకుని దాడికి పాల్పడిన వారెవరన్నది ఆరా తీయాల్సిందిపోయి.. పోలీసులు పూలవర్షం అంటూ, వైసీపీ నాయకులు సానుభూతి కోసం ఆడుతున్న డ్రామా అంటే విషయాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించడం దారుణమన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.