ఇప్పటంలో ఏం జరుగుతోందసలు?
posted on Nov 5, 2022 @ 2:18PM
మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటంలో రోడ్డు విస్తరణ నెపంతో 53 ఇళ్లు, ప్రహారీగోడలను అధికారులు కూల్చివేశారు. ఈ కూల్చివేతలు ఇప్పుడు ఏపీలో తీవ్ర వివాదానికి దారితీశాయి. ఇప్పటం గ్రామంలో అనేక మంది జనసేన మద్దతుదారులు ఉన్నారు. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు వారు ధైర్యంగా ముందుకు వచ్చి స్థలం ఇవ్వడమే ఇప్పుడు ఈ కూల్చివేతలకు కారణమని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ‘కూల్చివేతల ప్రభుత్వం కూలిపోతుంద’ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వ విధ్వంసానికి ఇది పరాకాష్ట అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఫైరయ్యారు. ఇప్పటంలో రాజకీయ కక్షతోనే ఇళ్లు కూల్చివేశారని బాధితులతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.
ఈ నేపథ్యంలో ఇప్పటంలో అసలు ఏమి జరుగుతోందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటంలో బాధితులను పరామర్శించి, వారికి మద్దతుగా నిలిచేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం ఆ గ్రామానికి బయలుదేరారు. అయితే.. అంతకు ముందే పవన్ కళ్యాణ్ వాహనం వెళ్లే దారికి అడ్డంగా పోలీసులు కంచెలు వేశారు. అయినప్పటికీ పవన్ తన వాహనంలో ముందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పవన్ వాహనం దిగి కొంతదూరం నడిచి వెళ్లారు. ఈ క్రమంలో వేలాది మంది ఆయన మద్దతుదారు వచ్చి పవన్ కళ్యాణ్ వెంట నడిచార. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని పవన్ మరో వాహనంలో ఇప్పటం చేరుకుని, ఇళ్లు కూలగొట్టిన ప్రాంతాలను పరిశీలించి, బాధితులను పరామర్శించి, సంఘాభావం తెలిపారు. ‘ఇప్పటం చిన్న గ్రామం. కాకినాడా లేదా రాజమండ్రీయా.. రోడ్లు వెడల్పు చేయడానికి? ఎమ్మెల్యే ఆర్కే ఇల్లు ఉన్న పెదకాకానిలో రహదారి ఎందుకు విస్తరించడం లేదు? బాధితులతో కనీసం మాట్లాడకుండా ఆపేందుక మీరెవరు? మా సభకు ఇప్పటం గ్రామస్థులు స్థలం ఇచ్చారనే కుట్ర చేసి వారిని ఇబ్బంది పెడుతున్నారు. వైసీపీ నేతలూ.. ఇడుపులపాయలో మేము హైవే వేస్తాం. గుంతలు పూడ్చలేరు. రోడ్లు వేయలేరు గానీ.. విస్తరణ కావాలా? ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా. కూల్చివేస్తున్నవారికి పోలీసులు కొమ్ము కాస్తున్నారు. పోలీసులు అడ్డుకున్నా జనసైనికులు మౌనంగా ముందుకు నడవండి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసే పోరాటంలో వెనక్కి తగ్గేది లేదు. అరెస్టులకు భయపడేది లేదు. దేనికైనా సిద్ధమే. వైసీపీ వాళ్లకు చెబుతున్నా.. మా మట్టిని కూల్చారు. మీ కూల్చివేత తథ్యం’ అని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు.
జనసేన పార్టీ ఆవిర్భావ సభను అమరావతిలో నిర్వహించాలని సభాస్థలి కోసం ఆ పార్టీ నేతలు అన్వేషించిన సమయలో సభకు ఎక్కడా చోటు దొరకకుండా అధికార వైసీపీ నేతలు బెదింపులకు పాల్పడ్డారు. హెచ్చరికలు కూడా చేశారు. ఆ సందర్భంలోనే ఇప్పటం గ్రామస్తులు ధైర్యంగా ముందుకు వచ్చి జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారు. దాంతో జనసేన ఆవిర్భావ సభ జరిగిపోయింది. అప్పటి నుంచీ ఇప్పటం తమకు అధికార పార్టీ నుంచి వేధింపులు, బెదిరింపులు మొదలయ్యాయని బాధితులు వాపోతున్నారు. మార్చిలో జనసేన సభ జరిగిన తర్వాత ఏప్రిల్ లోనే రోడ్డు విస్తరణ పేరుతో అధికారులు ఇప్పటం గ్రామస్తులకు నోటీసులు ఇచ్చారు.
నిజానికి ఇప్పటం ప్రధాన రహదారికి కాస్త దూరంగా ప్రశాంతంగా ఉండే గ్రామం. ఇప్పటం మీదుగా వాహనాల రాకపోకలు కూడా ఉండవు. అయినప్పటికీ గ్రామంలో ఇప్పటికే 70 అడుగుల రోడ్డు ఉంది. దాన్ని ఇప్పుడు 120 అడుగులకు విస్తరించాలని స్థానిక ప్రజాప్రతినిధి ఉవ్విళ్లూరిపోతున్నారట. అయితే.. ఆ ప్రజాప్రతినిధి ఉత్సాహానికి, ఉవ్విళ్లూరడానికి కారణం కక్ష సాధింపు ఒక్కటే అంటున్నారు. ఎన్నికల్లో తమకు ఓటు వేయని వారి ఇళ్లను రోడ్డు విస్తరణ వంకతో తొలగించాలని ఆ ప్రజాప్రతినిధి, వైసీపీ సర్కార్ కుట్ర చేయడమే ఈ మొత్తం విధ్వంస కాండకు కారణం అంటున్నారు. ప్రధాన రహదారి నుంచి ఇప్పటం గ్రామానికి వెళ్లే అప్రోచ్ రోడ్డు కేవలం 15 అడుగులు మాత్రమే ఉంది. మరో రెండు మార్గాలు కూడా ఇరుకుగానే ఉన్నా జగన్ సర్కార్ పట్టించుకోలేదు. కానీ.. ఇప్పుడు వైసీపీ సర్కార్ కూల్చేసిన ఇళ్లున్న రోడ్డు 70 అడుగులు ఉంది. ప్రధాన రహదారి నుంచి గ్రామానికి వెళ్లే రోడ్డును వెడల్పు చేసే యోచన చేయని వారికి ఇప్పటికే చాలినంత వెడల్పుతో ఉండే గ్రామంలోని రోడ్డును 120 అడుగులకు వెడల్పు చేయాలనడం వెనకు కుట్ర, కక్ష తప్ప మరేమీ లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ దుర్మార్గాన్ని అడ్డుకునేందుకు యత్నించిన జన సైనికులు, వీర మహిళలను అదుపులోకి తీసుకుని, సర్కార్ దుర్మార్గానికి అండగా నిలవడం ఏమిటని పోలీసులపై ఇప్పటం బాధితులు దుమ్మెత్తి పోస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఇప్పటంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సందర్శించి, గ్రామ సభలో ప్రసంగిస్తున్నప్పుడు విద్యుత్ సరఫరా నిలిపేసిన జగన్ సర్కార్ కుటిల బుద్ధి గురించి జనం చెప్పుకుంటున్నారు. కూల్చివేత నోటీసులపై ఇప్పటం గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఏ క్షణంలో అయినా హైకోర్టు ఆదేశాలు రావచ్చని.. ఆగమేఘాల మీద ఈ నెల 4వ తేదీన కూల్చివేతలకు తెగబడడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న వైసీపీ సర్కార్ ఇప్పటంలో విశాలంగా ఉన్న రహదారిని విస్తరించే నెపంతో ఇళ్లు, ప్రహారీ గోడలను కూల్చివేయడం కక్షపూరితం, కుట్రలో భాగం కాక మరేమిటని ప్రశ్నిస్తున్నారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో విలీనమైన గ్రామాల్లోని రోడ్లు ఇప్పటంలోని రహదారికన్నా ఇరుకుగానే ఉన్నా తమ గ్రామంలోనే విస్తరించడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు విస్తరణ పేరుతో తమను వైసీపీ సర్కార్ భయాందోళనలకు గురిచేస్తోందని ఇప్పటం గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.