సెమీస్ కి ఇంగ్లండ్... ఆసీస్ ఆశలు గల్లంతు
posted on Nov 5, 2022 @ 5:42PM
టీ20 ప్రపంచకప్ సూపర్ 12 విభాగంలో శనివారం జరిగిన మ్యాచ్ లో జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ వీరవిహారంతో ఇంగ్లండ్ లంకపై 4 వికెట్ల తేడాతో గెలిచి సెమీస్ సీటు ఖాయం చేసుకుంది. ఇంగ్లండ్ విజయంతో టోర్నీ ఆతిథ్య మిస్తున్న ఆసీస్ కు సెమీస్ ఆశలు గల్లంతయినట్టే. లంక 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన లంక ముందుగా బ్యాట్ చేయడానికి ఆసక్తి చూపింది. మంచి బ్యాటింగ్ ట్రాక్ మీద గౌరవప్రద స్కోర్ చేసి ప్రత్యర్ధిని తన బౌలర్లు, ఫీల్డింగ్ సామర్థ్యంతో నిలువరించవచ్చని కెప్టెన్ దశున్ శంక అనుకున్నాడు. లంక ఇన్నింగ్స్ లో పథుమ్ నిస్సంక తన బ్యాటింగ్ సత్తాను ప్రదర్శించి 45 బంతుల్లో 67 పరుగులు చేయడంలో జట్టుకు భారీ స్కోర్ చేసే అవకాశాలు కల్పించాడు. అలాగే భానుక రాజపాక్స 22 బంతుల్లో 22 పరుగులు చేయడంలో జట్టు స్కోర్ ను పరుగులుపెట్టించాడు. అయితే వారిద్దరు తప్ప మిగతావారెవ్వరూ ఇంగ్లండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొనలేక పోయారు. మార్క్ ఉడ్ 26 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకోగా, ఆదిల్ రషీద్, సామ్ కురన్, స్టోక్స్ చేరో వికెట్ తీసుకు న్నారు.
గ్రూప్ 1లో ఈ మ్యాచ్ లంకకు అత్యంత కీలకంగానూ మారింది. కానీ భారీ స్కోర్ చేయలేకపోవడంతో ఇంగ్లండ్ ను బౌలర్లు, ఫీల్డింగ్ సామర్ధ్యంతో అడ్డుకోవాలని ప్రయత్నించింది. 142 పరుగుల లక్ష్యంతో దిగిన ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ వీర బాదుడుతో లంక బౌలర్లు బెంబేలెత్తారు. వారి ధాటికి ఇంగ్లండ్ మొదటి వికెట్ కు 75 పరుగులు లభించాయి. కానీ ఆ తర్వాత ఇంగ్లండ్ బ్యాటర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 65 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడం లంక ఫీల్డింగ్ ఎంత పకడ్బందీగా, వ్యూహాత్మకంగా చేపట్టింది అర్ధమవుతుంది. ముఖ్యంగా లంక బౌలర్లు వానిందు హసరంగ, ధనంజయ డి సిల్వా, లహిరు కుమార ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను దెబ్బతీయగలిగారు. కానీ బెన్ స్టోక్స్ ఎప్పటిలానే దాడి చేసి జట్టు ఇన్నింగ్స్ ను నిలబెట్టడంలో 36 బంతుల్లో 42 పరుగులు చేశాడు. కానీ అందులో కేవలం రెండే ఫోర్లు ఉన్నాయి. చివరగా క్రిస్ ఓక్స్ కొట్టిన ఫోర్ తో ఇంగ్లండ్ విజయం సాధించింది.
దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ రన్ రేట్ ఆధారంగా సెమీస్ అవకాశాలు కోల్పోయింది. శుక్రవారం ఆఫ్ఘనిస్తాన్ తో తలపడిన మ్యాచ్ లో గెలచినప్పటికీ రన్ రేట్ లెక్కన చూపినపుడు ఇవాళ ఇంగ్లండ్ రన్ రేట్ బాగా మెరుగ్గా ఉండడం తో ఆస్ట్రేలియా కు సెమీస్ చేరే అవకాశాలు దెబ్బతిన్నాయి.