దేశంలో ప్రజాస్వామ్యానికి బీజేపీతో పెను ప్రమాదం.. కేసీఆర్
ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంపై కేసీఆర్ మౌనం వీడారు. బీజేపీ రాష్ట్రాల ప్రభుత్వాల కూల్చివేతకు సాగిస్తున్న దుర్మార్గం, పన్నుతున్న కుట్రలకు సంబంధించి దాదాపు మూడు గంటల వీడియోను విడుదల చేశారు. దేశానికి బీజేపీ పెను ముప్పుగా పరిణమించిందని ఆరోపించారు. బీజేపీ కుట్రలు, కుతంత్రాలకు సంబంధించి వివరాలను సాక్ష్యాధారాలతో సహా న్యాయమూర్తులకు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అందజేసినట్లు చెప్పారు.
దేశంలో ప్రజాస్వామ్యానికి బీజేపీ పెను ప్రమాదంగా మారిందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలపై కేసీఆర్ తొలిసారిగా గొంతు విప్పారు. దేశంలో బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేయడానికి బీజేపీ తరఫున ఏకంగా ఒక ముఠాయే పని చేస్తోందన్నారు. ఈ ముఠాకు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నాయకులని ఆరోపించారు. దేశంలో ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాలలో ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందనీ, ఇప్పుడు తెలంగాణ, ఢిల్లీ, ఏపీలలో ప్రభుత్వాలను కూల్చేయాలని చూస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. తానేమీ ఆధారరహితంగా ఆరోపణలు చేయడం లేదన్నారు. ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలూ ఉన్నాయన్నారు.
బీజేపీ 2016 నుంచే బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల కూల్చివేతకు ప్రయత్నాలు ప్రారంభించిందని కేసీఆర్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన కాల్ లిస్ట్ మొత్తం తమ వద్ద ఉందన్నారు. దాదాప 70 వేల పేజీల సమాచారం ఉందని, ఈ సమాచారాన్ని అందరు న్యాయమూర్తులకు, దేశంలోని బీజేపీయేతర రాష్ట్రాల ప్రభుత్వాలకు పంపామనీ, అలాగే మీడియాకు కూడా అందజేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలోనూ ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేలు ఉన్నారనీ, అయితే వారెవరినీ తాము అనైతిక పద్ధతుల్లో చేర్చుకోలేదని కేసీఆర్ అన్నారు. వారంతా స్వచ్ఛందంగా, టీఆర్ఎస్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు నచ్చి వచ్చి చేరారని, తాము స్వచ్ఛందంగా టీఆర్ఎస్ లో చేరుతామని లేఖలు ఇచ్చిన తరువాతే చేర్చుకున్నామన్నారు.
ఈ విషయంలో ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా తాను సిద్ధమని కేసీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారనీ, ప్రజాస్వమ్య హననం దేశానికి చాలా ప్రమాదకరమని అన్నారు. ఎనిమిదేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ దేశంలోని అన్ని రంగాలనూ సర్వ నాశనం చేసేసిందన్నారు. నిరుద్యోగం పెరిగింది, రూపాయి విలువ పతనం అయ్యింది. విభజన రాజకీయాలతో దేశంలో ద్వేష వాతావరణాన్ని తీసుకువచ్చిందన్నారు.
ఫామ్ హౌస్ కుట్ర బయటపడిన రోజునే ఈ విషయాలన్నీ చెప్పవచ్చు.. కానీ మునుగోడు ఉప ఎన్నికలో లబ్ధి కోసం మాట్లాడానంటారనే ఇంత వరకూ ఆగానని కేసీఆర్ చెప్పారు. అక్టోబర్ లో రామచంద్రభారతి హైదరాబాద్ వచ్చి ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడానికి చేసిన ప్రయత్నాలను వారు నాకు చెప్పారు. తాండూరు ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీ ఉందని కేసీఆర్ వివరించారు. ఇప్పటికే మోడీ సర్కార్ ను, ఆయన విధానాలను వ్యతిరేకించే పార్టీలు, పార్టీల నాయకులపై ఐటీ, సీబీఐ, ఈడీలను ఉపయోగించుకుని వేధిస్తున్నారు. మా ఎమ్మెల్యేలకూ అదే చెప్పారు.
కమలం గూటికి చేరితే ఆ వేధింపులు ఉండవని హామీ ఇచ్చారని, అలాగే బీజేపీలో చేరే ప్రతి ఎమ్మెల్యేకూ వంద కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారనీ కేసీఆర్ తెలిపారు. అంత డబ్బు వారికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తమ వద్ద ఉన్న సమాచారాన్నీ, ఆధారాలనూ న్యాయమూర్తులకు అందజేశామన్నారు. ఈవీఎంలు ఉన్నంత వరకూ బీజేపీకి ఢోకా లేదని ఎమ్మెల్యేల కోనుగోలు కోసం వచ్చిన వ్యక్తులు చెప్పారు.