జింబాబ్వేను ఓ ఆటాడుకున్న టీమ్ ఇండియా.. 71 పరుగుల తేడాతో సునాయాస విజయం
posted on Nov 6, 2022 @ 4:14PM
సూపర్ 12 లో చివరి మ్యాచ్ లో జింబాబ్వేపై ఇండియా ఘన విజయం సాధించి గ్రూప్ 2లో అగ్రస్థానాన్ని దక్కించుకుని ఘనంగా సెమీస్ కు చేరింది. ఈ మ్యాచ్ లో అన్ని విభాగాల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం సాధించి 71 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఫామ్ లోకి వచ్చిన రాహుల్ ఈ మ్యాచ్ లో కూడా రాణించి హాఫ్ సెంచరీ చేశాడు.
అయితే భారత్ ఇన్నింగ్స్ లో హై లైట్ మాత్రం సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగే. సూర్యకుమార్ యాదవ్ పాతిక బంతుల్లో 61 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ స్కోరులో నాలుగు సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. స్కిప్పర్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 15 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే కోహ్లీ సాధికారికంగా ఆడి 26 పరుగులు చేశాడు. దినేష్ పాండ్యా స్థానంలో జట్టులోకి వచ్చిన రిషభ్ పంత్ కూడా విఫలమయ్యాడు. 5 బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులు చేసి ఔటయ్యాడు. హార్ధిక్ పాండ్యా 18 పరుగులు చేశాడు.
జింబాబ్వే బౌలర్లు ఆరంభంలో భారత బ్యాట్స్‌మెన్లను కట్టడి చేసినా.. ఆ తరువాత చేతులెత్తేశారు. మరీ ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ క్రీజ్ లోకి వచ్చిన తరువాత బౌలర్లు బౌండరీలు ఇవ్వడానికే బౌల్ చేస్తున్నారా అన్నట్లుగా సీన్ మారిపోయింది. 187 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే ఏ దశలోనూ లక్ష్య ఛేదన దిశగా సాగలేదు.
భారత బౌలర్లు సమష్టిగా రాణించడంతో 17.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జింబాబ్వే బ్యాటర్లలో సికందర్ రజా 24 బంతుల్లో 34 పరుగులు, రియాన్ బర్ల్ 22 బంతుల్లో 35 పరుగులు మాత్రమే రాణించారు. మెరుపు బ్యాటింగ్ తో ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్యకుమార్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.