బాణసంచా గోడౌన్ లో పేలుడు.. నలుగురు సజీవదహనం

బాణ సంచా గోడౌన్ లో గురువారం (నవంబర్ 10)సాయంత్రం సంభవించిన భారీ పేలుడులో కనీసం నలుగురు మరణించారు. మరో పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.   తాడేపల్లి గూడెం సమీపంలోని కడియుద్ద వద్ద ఈ దారుణ ఘటన సంభవించింది. ఈ దుర్ఘటనలో నలుగురు సజీవదహనమయ్యారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు అనంతరం గోడౌన్ మంటల్లో చిక్కుకుంది. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని తాడేపల్లి గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పేలుడు శబ్దాలు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వరకూ వినిపించాయని చెబుతున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. బాణసంచా గోడౌన్ ఊరికి దూరంగా ఉండటంతో ఫైరింజన్ సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ఆలస్యమైందని చెబుతున్నారు.  తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో జరిగిన పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.పది లక్లు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఏలూరు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, డీఐజీ పాల్ రాజ్ సందర్శించారు. 

బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ఐదుగురు మృతి

తమిళనాడులోని ఓ బాణ సంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మధురైూ సమీపంలోని తిరుమంగళంలో జరిగిన ఈ సంఘటనలో మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెబుతున్నారు.   మదురైలోని తిరుమంగళంలో ఓ క్రాకర్స్‌ తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.  తిరుమంగళా పురంలోని అగు జైలు గ్రామంలోని ఓ ప్రైవేట్‌ బాణసంచా తయారీ కర్మాగారంలో ఈ పేలుడు సంభవించింది. దుర్ఘటన జరిగిన సమయంలో కర్మాగారంలో . 15 మందికి పైగా కార్మికులు ఉన్నారు. పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది. మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సంఘటన సంభవించిన ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, మాంసంముద్దలుగా మారిన శరీర భాగాలతో భీతావహంగా మారింది. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.  

తెరాసకు తుమ్మల గుడ్ బై? తెలుగుదేశం గూటికేనా?

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెరాసకు గుడ్ బై చెప్పనున్నారా? అంటే పరిశీలకులు ఔనంటూ విశ్లేషిస్తున్నారు. ములుగు జిల్లాలో తన అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన ఆయన ఆ సమావేశానికి హాజరయ్యేందుకు గురువారం (నవంబర్ 10) దాదాపు 350 కార్లలో వాజేడుకు బయలుదేరారు. అంతకు ముందు ఉదయం ఆయన భద్రాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా భారీ ర్యాలీతో వాజేడు కు బయలు దేరారు. కాగా ఆయన ఆత్మీయ సమ్మేళనం ఉద్దేశం, లక్ష్యం పార్టీ మార్పుపై చర్చించేందుకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తుమ్మల ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, మద్దతు దారులు, అనుచరులు పాల్గొన్నారు. ఈ సమ్మేళనంలో ఆయన తెరాసను వీడటంపై చర్చించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సమ్మేళనంపై ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా ఉండటం కూడా తుమ్మల పార్టీ మారుతున్నారన్న ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. అయితే తుమ్మల తెరాసను వీడుతారన్న ఊహాగానాలు గత కొంత కాలంగా రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతున్నాయి. తెరాసలో ఇటీవలి కాలంలో తుమ్మల ప్రాధాన్యత తగ్గింది. తగ్గిందనే దాని కంటే ఆయనే పార్టీ వ్యవహారాలలో చురుగ్గా పాల్గొనడం లేదనీ, తనంత తానుగానే పార్టీకి దూరంగా ఉంటున్నారనీ ఆయన మద్దతు దారులు అంటున్నారు.  ఇటీవలి కాలంలో తుమ్మల కాంగ్రెస్, బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లారని కూడా ప్రచారం జరిగింది. అలాగే ఆయన తెలుగుదేశంకు చేరువ అవుతున్నారన్న చర్చా తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే వాజేడులో తుమ్మల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  తెలంగాణలో పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశగా తెలుగు దేశం కూడా తన వ్యూహాలకు పదును పెడుతుండటం, తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా బలమైన బీసీ నేత కాసాని జ్ణానేశ్వర్ కు పార్టీ అధినేత చంద్రబాబు పగ్గాలు అప్పగించడంతో ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పుంజుకుంటుందన్న అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తెరాసను వీడి తుమ్మల హోం కమింగ్ అంటూ తెలుగుదేశం పంచన చేరు అవకాశాలు లేకపోలేదన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. 2014లో తెరాస గూటికి చేరిన తుమ్మల అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలయ్యారు. అయితే ఆ తరువాత కేసీఆర్ ఆయనను ఎమ్మెల్సీగా గెలిపించి తన కేబినెట్ లో పదవి కూడా ఇచ్చారు. అయితే గత ఎన్నికలలో ఓటమి తరువాత తుమ్మలకు తెరాసలో ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది. మరో సారి ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం ఇస్తారని తుమ్మల ఆశించారు. అయితే కేసీఆర్ ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన తుమ్మల పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు. ఆయన బీజేపీ గూటికి చేరుతారని గతంలో బలంగా వినిపించినా తుమ్మల ఖండించారు. అలాగే కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారనీ వదంతులు వినిపించాయి. అయితే తుమ్మల వాటిపై ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఆత్మీయ సమ్మేళనం అంటూ పెద్ద సంఖ్యలో మద్దతు దారులను సమీకరించి సమావేశం పెట్టడంతో ఆయన తెరాసను వీడటం ఖాయమేనని అంటున్నారు. అయతే అయన ఏ పార్టీలోకి వెళతారన్నది మాత్రం ఇతమిథ్ధంతా తెలియరాలేదు. ఇంకో వైపు ఇదేరోజు (నవంబర్10) తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా కాసాని జ్ణానేశ్వర్ ప్రమాణ స్వీకారం చేయడం, అదే రోజు తుమ్మల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం కాకతాళీయమేనా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. 

ఇండియా ఇంటికి ... టి20 ఫైనల్లో పాక్ ప్రత్యర్థి ఇంగ్లాండ్

క్రికెట్ ప్రపంచం కలల మ్యాచ్ కల్ల అయిపోయింది. టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో చిరకాల ప్రత్యర్థులు పాక్, భారత్ మధ్య మ్యాచ్ జరిగితే చూడాలని ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా కోరుకున్నారు. అదే జరుగుతుందని ఆ  క్రికెట్ ఫీస్ట్ కు ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ వేదిక ఔతుందని విశ్లేషణలు కూడా సో కాల్డ్ క్రీడా పండితులు చేసేశారు. కానీ గురువారం జరిగిన సెమీ ఫైనల్ లో కనీస పోటీ కూడా ఇవ్వకుండా భారత్ చేతులెత్తేసింది. భారత్ నిర్దేశించిన 168 పరుగుల విజయ లక్ష్యాన్ని ఒక్కవికెట్ కూడా నష్టపోకుండానే ఉఫ్ మని ఊదేసింది.  తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ ఎంచుకున్న ఇంగ్లాండ్ భారీ స్కోరు చేయకుండా భారత్ ను నిర్దేశించింది. హార్ధిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో రాణించినా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి  168 పరుగులకే పరిమితమైంది.  స్కిప్పర్ రోహిత్ శర్మ మరో సారి విఫలమయ్యాడు. ఫామ్ లోకి వచ్చాడనుకున్న రాహుల్ సైతం  నిరాశ పరిచాడు. 360 డిగ్రీల బ్యాటర్ అంటూ ఆశలు పెట్టుకున్న  సూర్య కుమార్ యదవ్ కూడా విఫలమవ్వడంతో భారత్ ఓ మోస్తరు  లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. అయితే ఆ లక్ష్యాన్నికాపాడుకోవడంలో భారత్ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఇంగ్లాండ్ పది వికెట్ల ఆధిక్యతతో సెమీస్ లో భారత్ ను చిత్తు చేసి ఘనంగా ఫైనల్ కు చేరుకుంది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా కేవలం 16 ఓవర్లలోనే అంటే ఇంకా నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో ఫైనల్ లో ఇంగ్లాండ్.. పాకిస్థాన్ లు తలపడనున్నాయి. భారత బౌలర్లు సమష్టిగా విఫలమైన వేళ ఇంగ్లాండ్ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. బట్లర్ 49 బంతుల్లో  9 ఫోర్లు, 3సిక్సర్లతో 80 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మరో ఓపెనర్ హేల్స్ 47 బంతుల్లో 7 సిక్స్ లు 4 ఫోర్లతో 86 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఇంగ్లాండ్16 ఓవర్లలో వికెట్ నష్ట పోకుండా 160 పరుగులు చేసింది. 

ఏపీలో సైతాన్ ప్రభుత్వం.. పంచుమర్తి అనూరాధ

ఏపీలో ఉన్నది సైతాన్ సర్కార్ గా తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ అభివర్ణించారు. దేశంలో ఎక్కడ ఏ అవినీతి జరిగినా ఆ మూలాలూ  లింకులూ ఏపీలోని వైసీపీ నేతలతో ముడిపడి ఉంటాయనీ, అందుకు తాజా నిదర్శనమే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శరత్ చం ద్రారెడ్డి అరెస్టు అని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో   వైసీపీ లింకులు బయటపడ్డాయా అంటే తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాథ ఔననే అంటున్నారు.  ఈ స్కాములో అరెస్టయిన శరత్ చంద్రారెడ్డి స్వయానా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి అన్న అని పంచుమర్తి అనురాధ అన్నారు. గురువారం(నవంబర్ 10)న మీడియాతో మాట్లాడిన ఆమె  ఇసుక, మద్యం, మైన్, బియ్యం, అంబులెన్సులు ఇలా అన్ని మాఫియాలూ జగన్ హయాంలోనే ఏపీలో విజృంభించాయని అన్నారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు ఎయిమ్స్ ఆసపత్రికి గుక్కుడు నీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితే నిలువెత్తు నిదర్శనమన్నారు. ప్రభుత్వాసుపత్రులే అత్యాచార కేంద్రాలుగా మారిన దౌర్భాగ్య పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ దిగజారిందని ధ్వజమెత్తారు.  చంద్రబాబు గారి పాలనా సామర్థ్యం, దార్శనికతకు మెడ్ టెక్ జోన్, జెనోమ్ వ్యాలీ నిదర్శనం అయితే.. జగన్ దౌర్బాగ్య పాలనకు కూల్చివేతలు, విధ్వంసాలు నిదర్శనమని పంచుమర్తి అనూరాధ ధ్వజమెత్తారు.  హైదరాబాద్ లాంటి కర్ఫ్యూ సిటీని కరోనా వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. అదే జగన్ పాలనలో  కంటి వెలుగు అంటూ కళ్ల జోళ్లు కూడా ఇవ్వని నిర్వాకాలు రోజు కళ్లెదుట సాక్షాత్కరిస్తున్నాయని విమర్శించారు.  కొవిడ్ సమయంలో రోగులకు భోజనం సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని జగన్ రెడ్డి ప్రజారోగ్యం ఎలా కాపాడతారని ప్రశ్నించారు. ఫోన్ చేయగానే కుయ్ కుయ్ మంటూ వస్తాయన్న అంబులెన్స్ ల జాడ లేక బిడ్డల శవాలను భుజాలపై వేసుకెళుతున్న ఘటనలు జగన్ రెడ్డి పాలనా వైఫల్యాలకు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు.    జగన్ రెడ్డిది దేవుడి ప్రభుత్వం కాదు..సైతాన్ ప్రభుత్వమని అభివర్ణించారు. 

ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 169 పరుగులు.. ఫైనల్ కు చేరేనా?

ఇంగ్లాండ్ సెమీస్ గండం దాటి ఫైనల్ కు చేరాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 169 పరుగులు చేయాలి. అదే బిగ్ ఫైనల్ మ్యాచ్ చూడాలంటే మాత్రం భారత్ ఇంగ్లాండ్ ను  లక్ష్య ఛేదన చేయకుండా నిరోధించాలి. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ భారత్ పరుగుల వరద పారించకుండా అడ్డుకుంది. కీ బౌలర్లు గాయాలతో అందుబాటులో లేకున్నా.. భారత్ ను నియంత్రించగలిగింది. కోహ్లీ, హార్ధిక్ పాండ్యా మినహాయిస్తే రాహుల్, రోహిత్, పంత్, ఆఖరికి సూర్యకుమార్ యాదవ్ కూడా స్వేచ్ఛగా పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు. ముందు విరాట్ కోహ్లీ తన కింగ్ లైక్ ఇన్నింగ్స్ తో 40 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ స్కోరులో ఒక సిక్సర్ నాలుగు ఫోర్లు ఉన్నాయి. సూపర్ ఫామ్ లో ఉన్న కోహ్లీ టి20 వరల్డ్ కప్ లో రెండు చేతులా పరుగులను పిండుకుంటున్నాడు. సూపర్ 12 మ్యాచ్ లో పాకిస్థాన్ పై చెలరేగిన తరువాత వెనక్కు తిరిగి చూడటం లేదనే చెప్పాలి. ఫామ్ పై విమర్శలు చేసిన నోళ్లే ఇప్పడు పొగడ్తల వర్షం కురిపించేలా కోహ్లీ ట్రాన్స్ ఫార్మ్ అయ్యాడు. ఇంగ్లాండ్ తో టి20 సెమీఫైనల్ మ్యాచ్ లో ఒక వైపు వికెట్లు టపటపా పడుతున్నా.. ఎక్కడా తగ్గకుండా హాఫ్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో ఒక వరల్డ్ రికార్డు కోహ్లీ ఖాతాలోకి వచ్చి చేరింది. టి20ల్లో నాలుగు వేల పరుగుల మైలు రాయిని దాటిన ఏకైక బ్యాటర్ గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లో 50 పరుగులు చేసిన కోహ్లీ జోర్డాన్ బౌలింగ్ లో షార్ట్ థర్డ్ మ్యాన్ లో ఉన్న రషిద్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తరువాత హార్ధిక్ పాండ్యా పరుగుల ప్రభంజనం చూపాడు. ఎడాపెడా సిక్సర్లు బాది స్కోరును పరుగులెత్తించాడు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ కనీసం 150 పరుగులైనా చేయగలుగుతుందా అన్న దశ నుంచి చివరి ఓవర్ చివరి బంతికి ఔటయ్యే వరకూ హార్దిక్ పాండ్యా పరుగుల వదర పారించారు. 33 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 190 స్ట్రైక్ రేట్ తో 63 పరుగులు చేశాడు. చివరి ఓవర్ చివరి బంతిని కూడా స్క్వేర్ లెగ్ దిశగా బౌండరీకి తరలించినప్పటికీ.. స్టాన్స్ నియంత్రించుకోవడంలో విఫలమై హిట్ వికెట్ అయ్యాడు. మొత్తం మీద ఇంగ్లాండ్ కు టీమ్ ఇండియా చాలెంజింగ్ టార్గెట్ నే ఇచ్చింది. బంతి కొద్దిగా ఎక్స్ ట్రా బౌన్స్ ఔతున్న పిచ్ పై భారత్ చేసిన స్కోరు మరీ తీసిపారేయాల్సింది కాదు. బౌలర్లు క్రమశిక్షణతో రాణిస్తే ఇంగ్లాండ్ కు ఈ టార్గెట్ ఛేజ్ చేయడం అంత సులువు కాదు. మొత్తానికి ప్రస్తుతానికైతే ఈ మ్యాచ్ లో ఇరు జట్లకూ సమాన విజయావకాశాలున్నాయని చెప్పాలి. చూద్దాం ఇంగ్లాండ్ బ్యాటర్లు ఏం చేస్తారో? నిర్ణీత 20 ఓవర్లలో టీమ్ ఇండియా 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ గెలవాలంటే  ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 169 పరుగులు చేయలి.

వైసీపీ నేతల్లో ఓటమి భయం.. మునుగోడు ఫలితం చూసి మన పరిస్థితేంటన్న జంకు

గత ఎన్నికల్లో 151 సీట్లు కైవసం చేసుకున్నాం... వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో 175కి 175 సీట్లలో మన పార్టీ వారే కూర్చోవాలనే ఆసాధ్య లక్ష్యన్ని ఏర్పరుచుకుని వైసీపీ అధినేత జగన్  అడుగులు వేస్తున్నారని.. ఆ క్రమంలో పార్టీలోని కీలక నేతలను సైతం ఆ దిశగా పరుగులు పెట్టించేస్తున్నారనే ఓ టాక్  పార్టీలో వైరల్ అవుతోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో మన పార్టీని మన పథకాలే గెలిపిస్తాయంటూ.. వివిధ సమీక్షా సమావేశాల్లో సీఎం జగన్.. నేతలకు చెబుతున్నారని  అయితే ఆయనకున్న ధీమా మాత్రం పార్టీ నేతలలో ఇసుమంతైనా కనిపించడం లేదనీ వైసీపీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.  అయితే తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక ఫలితం చూశాక.. వచ్చే ఎన్నికల్లో గెలుపు  జగన్ భావిస్తున్నంత తేలిక ఎంత మాత్రం కాదన్న అభిప్రాయం వైసీపీలో వ్యక్తం అవుతోంది. గెలుపు ధీమా కోల్పోయి ఓ విధమైన అలజడి వైసీపీ  మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న అభ్యర్థుల్లో మొదలైయిందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫోరైడ్ సమస్యను నిర్మూలించేందుకు కేసీఆర్ ప్రభుత్వం గతంలో కోట్లాది రూపాయిలు వెచ్చించి.. మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టిందని... దీంతో గత నాలుగైదేళ్లుగా ఆ జిల్లాలో ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదని.. అలాగే దళిత బంధు, కల్యాణ లక్ష్మీ, రైతు బంధు తదితర పథకాలను కొట్లాది రూపాయిలు అప్పుగా తీసుకొచ్చి మరీ ఆ కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తోందని.. ఇన్ని పథకాలు ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్నా.. మునుగోడులో విజయం కోసం గులాబీ పార్టీ చెమటోడ్చాల్సి వచ్చింది. అంత కష్టపడ్డా చచ్చీ చెడీ పది వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గట్టెక్కింది. అది కూడా   వందల కోట్ల రూపాయిలు వ్యయం చేస్తేనే వచ్చింది.  సొమ్ముల పందేరంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆ విషయంలో టీఆర్ఎస్ తో పోటీ పడలేకపోవడంతోనే టీఆర్ఎస్ విజయం సాధ్యమైందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. చెప్పుకోవడానికీ, చూపించుకోవడానికీ ఎంతో కొంత చేసిన టీఆర్ఎస్ పరిస్థితే అలా ఉంటే.. ప్రగతి ఊసే పట్టించుకోని వైసీపీ పరిస్థితి వచ్చే ఎన్నికల్లో ఏమౌతుందో ఊహించుకోవాలంటేనే భయంగా ఉందన్న భావన వైసీపీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతోంది.    ఇలాంటి నేపథ్యంలో జగన్ వివిథ పథకాల పేరుతో లబ్దిదారుల ఖాతాల్లో వేస్తున్న నగదు వల్ల వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే గ్యారంటీ అయితే తమకు లేదని వైసీపీ నాయకులే అంతర్గతసంభాషణల్లో ఒకరితో  ఒకరు చెప్పుకుంటున్నపరిస్థితి కనిపిస్తోంది.   ఆ క్రమంలోనే ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన వివిధ జిల్లాల అధ్యక్షులు.. వరుసగా ఎవరికి వారు.. రాజీనామాల బాట పట్టినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టి.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు చూసుకునే కంటే.. ఆ పదవికీ రాజీనామా చేయడం వల్ల తన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేయడం ద్వారా మళ్లీ ప్రజల్లోకి వెళ్లి.. వారి చిన్నా చితక సమస్యలు పరిష్కరించడం వల్ల.. మన ఎమ్మెల్యే గారు మనతోనే ఉన్నారంటూ.. ఓ విధమైన కలరింగ్ ఇవ్వడం వల్ల కొంతలో కొంత వారికి మేలు చేయడమే కాకుండా.. మనకు మేలు జరుగుతోందనే భావనతోపాటు... ఎన్నికల వేళ అప్పటి పరిస్థితిని బట్టి ఓటర్ల నాడిని అంచనా వేసి.. నోట్లు పంచితే అదే తమకు పదివేలు అనుకునే స్థితికి ఫ్యాన్ పార్టీలోని ప్రజా ప్రతినిధులంతా వచ్చేశారని.. అలా కాకుంటే... మన పరిస్థితి మునుగుడే అనే ఓ టాక్ అయితే ఫ్యాన్ పార్టీలో వాడి వేడిగా సాగుతోందని సమాచారం. ఏదీ ఏమైనా.. ఓటు వేసే ఓటరు నాడీ.. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థి నాడి..ఇద్దరిది ఓటుకు నోటుతో పెనవేసుకుపోయి ఉందని.. జగన్ పార్టీలోని ప్రజాప్రతినిధుల్లో ఓ టాక్ అయితే ఆ పార్టీ గుర్తు ఫ్యాన్ సాక్షిగా గింగరాలు తిరుగుతూ హల్‌చల్ చేస్తోందని చెబుతున్నారు.

వైసీపీ నేతల్లో నైరాశ్యం.. పక్క చూపులు చూస్తున్న వైనం

విధ్వంసాలు, కూల్చివేతలు, దశాబ్దాలుగా కొనసాగుతున్న సంస్థలు, వ్యవస్థల పేర్ల మార్పిడి, విగ్రహాల కూల్చివేతలు, ఆర్థిక పరిస్థితి అధ్వాన్నం, అభివృద్ది ఆమడదూరం, ప్రాజెక్టుల నిర్మాణంలో చెప్పలేనంత జాప్యం, కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయించే చేవ లేకపోవడం, ఉన్న పరిశ్రమలు, సంస్థలు భయంతో పారిపోయేలా చేసే విధానాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పేచీలు, రాజధాని లేకుండా చేసిన వైనం, మూడు రాజధానుల జపంతో మూడు ముక్కలాట. రోడ్లు లేని దుస్థితి. కనీసం మరమ్మతులైనా చేయని తీరు. జనం మధ్యకు రాకుండా ముఖం చాటేస్తున్న వైనం.. వచ్చినా.. అడ్డు తెరలు, సామాన్యులు దరి చేరనివ్వకుండా భద్రతా వలయం.. కనీసం ఎమ్మెల్యేలకైనా ముఖ్య నేత అపాయింట్ మెంట్ దొరకని విధానం.. నవరత్నాల పేరుతో నవ విధాల ద్రోహం.. ఎవరినీ లెక్కచేయనితనం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో.. ఘనత వహించిన ఏపీ సీఎం తీరుతో ఇప్పుడు రాష్ట్రంలో అధికార పార్టీ గ్రాఫ్ రోజు రోజుకూ దిగజారిపోతోందనే అంచనాలు పెరిగిపోతున్నాయి. ‘ఒక్క ఛాన్స్ ఇవ్వండి’ అని 2019 ఎన్నికల ముందు.. ఊరూరా తిరిగి అర్థించిన వైసీపీ అధినేత తీరా అధికార పీఠం ఎక్కిన తర్వాత చేస్తున్న పనులతో రాష్ట్ర ప్రజలు విసుగెత్తిపోతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి, జగన్ కు పల్లెల్లో అధికశాతం జైకొట్టాయి. పట్టణ ప్రజల్లోనూ ఎక్కువ మంది ఆయనకే ఓటు వేశారు. యువకుడైన జగన్ ఏపీ అభివృద్ధికి, తమ బాగు కోసం ఏదో చేస్తారనే ఆశతో ఓట్లు వేసి భారీ విజయం కట్టబెట్టారు. నిజానికి పట్టణ ఓటర్ల మద్దతు ఎప్పుడూ చంద్రబాబుకే ఉండేది. చంద్రబాబు హయాంలో వచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పట్టణ యువకుకు ఎక్కువ ఉపాధి అవకాశాలు వచ్చాయి. ఆర్థికంగా వారు ఎదగారు. బాబు చేసిన అభివృద్ధి ఫలాలు అందరికి పూర్తిగా అందాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజిత ఏపీగా మారిన తర్వాత తొలిసారి 2014లో వచ్చిన ఎన్నికల్లో చంద్రబాబు దార్శనికతను, కార్యదక్షతను గుర్తించి గెలిపించారు. హైదరాబాద్ కన్నా దీటైన రాజధానిని నిర్మిస్తారని భావించారు. చంద్రబాబు నేతృత్వంలో ఏపీలో అభివృద్ధి ఆకాశమే హద్దు అవుతుందని ఆశించారు. అయితే.. విభజన గాయాలు, ప్రత్యేక హోదాను చంద్రబాబు సాధించలేకపోయారనే బాధతో జగన్ కి ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఏపీలోని 25 పార్లమెంటరీ స్థానాల్లోనూ వైసీపీని గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ తీరా ఎన్నికలయ్యాక మాట మార్చడం జనానికి నచ్చలేదు. 22 ఎంపీ స్థానాల్లో వైసీపీని గెలిపించిన తర్వాత బీజేపీ సర్కార్ కు మన అవసరం లేదు. ప్రత్యేక హోదా సాధించడం కష్టం అని మడమ తిప్పేయడంతో జనంలో వ్యతిరేకత మొదలైంది. పాలన ప్రారంభించిన తొలినాళ్లలో ప్రజా వేదికను కూలగొట్టడం ద్వారా విధ్వంస పాలనకు తెరలేపడం రాష్ట్ర జనానికి నచ్చలేదు. చంద్రబాబు హయాంలో పరుగులు పెట్టిన ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ‘రివర్స్ టెండరింగ్’ నెపంతో నిలిపేయడాన్ని జనం జీర్ణించుకోలేకపోయారు. నవరత్నాలు పేరుతో సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నామంటూ.. అభివృద్ధిని అస్సలు పట్టించుకోకపోవడంతో వైసీపీ సర్కార్ పై వ్యతిరేక భావనలు మరింత పెరిగాయి. పథకాల పేరు చెప్పి రాష్ట్ర ఖజానాలోని నిధుల్ని ఇష్టారీతిన ఖర్చుపెట్టేసి, చివరికి ఏపీకి, ఏపీ ప్రజల నెత్తిన మోయలేని అప్పుల భారం పెట్టిన జగన్ తీరుపై జనంలో ఆగ్రహం ఎక్కువైంది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంటే.. వారంతా రోడ్లపైకి వచ్చి పోరాటాలు, ఉద్యమాలు చేసే దాకా పరిస్థితి వెళ్లింది. మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధానే లేకుండా చేసిన జగన్ ను, ఆయన పాలనను, వైసీపీ సర్కార్ ను జనం దుమ్మెత్తి పోస్తున్నారు. నిరు పేదలకు గత ప్రభుత్వాలు దశాబ్దాల క్రితమే ఇచ్చిన ఉచిత ఇళ్లకు క్రమబద్ధీకరణ పేరుతో ఇప్పుడు డబ్బులు కట్టాలన్న వైసీపీ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఇలాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో జనంలో వైసీపీకి బాగా గ్రాఫ్ తగ్గిపోయిందంటున్నారు. మరీ ముఖ్యంగా అక్షర జ్ఞానం ఉన్న పట్టణ ప్రజల్లో వైసీపీ సర్కార్ తప్పిదాలపై వ్యతిరేకత మరింత తీవ్రంగా ఉందంటున్నారు. అంతే కాదు.. జగనే స్వయంగా చేయించుకున్న సర్వేలు, ఎన్నికల వ్యూహాలు రచించే ఐప్యాక్ బృందం సర్వేల్లోనూ జనం నుంచి వ్యతిరేకతే స్పష్టమైందని తేలింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులపై జగన్ చీటికి మాటికి ఫైర్ అవుతున్నారనే వార్తలు బయటికి వస్తున్నాయి. ఒక పక్కన అభివృద్ధి లేదు.. పైగా తామేదో గొప్ప పనులు చేసినట్లు జనాన్ని ఊదరగొట్టాలంటూ గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో తమను జగన్ పంపుతుంటే.. ఏం చేయాలో తెలియక ప్రజా ప్రతినిధులు కుమిలిపోతున్నారంటున్నారు. చేయని అభివృద్ధి గురించి ఏమి చెప్పాలి?.. సమస్యలపై స్థానికులు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం ఇవ్వాలో తెలియక నిలువునా వారు జావగారిపోతున్న ఘటనలు ఉన్నాయి. ఇక.. వైసీపీలో కొత్త ముసలం పుట్టింది. పార్టీ జిల్లాల అధ్యక్ష పదవుల నుంచి సీనియర్లు ఒక్కొక్కరూ తప్పుకుంటున్నారు. ముందుగా తానేటి వనిత గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిని వదిలేశారు. తాజాగా కాపు రామచంద్రారెడ్డి అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇదే బాటలో మరికొందరు నేతలు కూడా పయనించే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమకు సీటు వచ్చే అవకాశం లేదకుంటున్న కొందరు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని, ఆయా పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇంతకాలం జగన్ చెప్పిందే విన్న వారంతా తమ అధినేతపై అసంతృప్తి పెంచుకున్నారంటున్నారు. పార్టీ బాస్ ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశమే రాజీనామాలు చేస్తున్న వారిలో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

టి20 వరల్డ్ కప్ సెమీస్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

టీమ్ ఇండియా, ఇంగ్లాండ్ ల మధ్య టి20 సెమీ ఫైనల్ మ్యాచ్ మరి కొద్ది సేపటిలో ప్రారంభం కానున్నది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టే పాకిస్థాన్ తో జరిగే ఫైనల్ మ్యాచ్ లో తలపడుతుంది. అత్యంత కీలకమైన ఈ మ్యాచ్ లో టాస్ ఇంగ్లాండ్ ను వరించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కి వేదిక అయిన అడిలైడ్ లో భారత్ కు ఇంగ్లాండ్ తో పోలిస్తే మెరుగైన రికార్డు ఉంది. అలాగే పొట్టి కప్ ప్రపంచ కప్ లో కూడా ఇంగ్లాండ్ కంటే బారత్ దే పై చేయి. ఈ రికార్డులన్నీ భారత్ కే అనుకూలంగా ఉన్నాయి. దీంతో భారత్ అభిమానుల్లో ఇంగ్లాండ్ పై విజయం సాధించి ఫైనల్ లో  చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడుతుందన్న ధీమా వ్యక్తమౌతోంది. ఏది ఏమైనా ఈ రోజు ఏ జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేస్తే ఆ జట్టుదే విజయం. ఇరు జట్లూ సమఉజ్జీలుగా ఉన్న నేపథ్యంలో హోరాహోరీ పోరు తప్పదని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. 

సానియామీర్జా..షోయెబ్ అక్తర్ డైవోర్స్?!

'స్పోర్ట్స్ ప్రపంచంలో అత్యంత పాపులర్ జంట విడాకులకు సిద్ధమైంది. భారత్ కు చెందిన సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ లు పుష్కర కాలం  కిందట వివాహబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇప్పుడా జంట విడాకులకు రెడీ అయినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఇండియన్ టెన్నీస్ స్టార్ సానియామీర్జా విడాకులు తీసుకోబోతున్నారా? పాకిస్థాన్ క్రికెటర్ షోయెబ్ అక్తర్ తో ఆమె వైవాహిక జీవితానికి ఎండ్ కార్డ్ పడబోతోందా అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. పరస్పర అంగీకారంతో విడాకుల నిర్ణయానికి వచ్చామని సానియా మీర్జా భర్త షోయేబ్ అక్తర్ చెప్పేశారు. ఈ విషయాన్ని అక్తర్ సన్నిహితుడొకరు మీడియాకు వెల్లడించారు. సానియా, షోయెబ్ అక్తర్ లు ఇప్పటికే విడివిడిగా ఉంటున్నారనీ, విడాకులకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందనీ, అది పూర్తయిన వెంటనే వారిరువురూ తాము విడిపోయిన విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారనీ పాక్ మీడియా సంస్థ పేర్కొంది. సానియా ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. షోయెబ్ అక్తర్ అయితే టి20 ప్రపంచ కప్ అనలిస్ట్ గా పాకిస్థాన్ లోనే ఉన్నాడు. అసలు వీరిద్దరూ విడాకులు తీసుకొంటారన్న వార్తకు ఆధారం ఇటీవల సానియా మీర్జా చేసిన ఒక పోస్టు. సానియా తన కుమారుడు ఇజాన్ బర్త్ డే సందర్భంగా జరిగిన వేడుకల్లో షోయెబ్ ఉన్నప్పటికీ.. సానియా మీర్జా మాత్రం ఆ వేడుకలకు సంబంధించి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన ఫొటోలలో ఎక్కడా షోయెబ్ అక్తర్ కనబడకుండా జాగ్రత్త పడ్డారు. ఇదే వారిరువురి మధ్యా సఖ్యత లేదనడానికి నిదర్శనంగా నెటిజన్లు చెబుతున్నారు. సానియా ఆ పోస్టు పెట్టినప్పటి నుంచీ వీరిరువురూ విడాకులు తీసుకోనున్నారన్న వార్తలు సామాజిక మాధ్యమంలో తెగ కనిపించాయి. ఇప్పుడా వార్తలే వాస్తవమని షోయెబ్ అక్తర్ సన్నిహిత మిత్రుడొకరు ధృవీకరించారు. షోయెబ్ సానియాలు 2010 ఏప్రిల్ 12న హైదరాబాద్ లో వివాహం చేసుకున్న సంగతి విదితమే. 

టి20వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా వర్సెస్ పాకిస్థాన్? ఇంగ్లాండ్ అడ్డంకిని టీమ్ ఇండియా దాటేస్తుందా?

ప్రపంచ క్రికెట్ మొత్తం ఎదురు చూస్తున్న కలల మ్యాచ్ ఏదైనా ఉందంటే అది టి20 ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్- పాకిస్థాన్ మధ్య మ్యాచే. అయితే ఆ కలల మ్యాచ్ జరగాలంటే గురువారం (నవంబర్10) ఇంగ్లాండ్ తో జరగనున్న మ్యాచ్ లో ఇండియా గెలిచి తీరాలి. ఇప్పటికే పాకిస్థాన్ టి20 వరల్డ్ కప్ ఫైనల్ బెర్త్ ను రిజర్వ చేసేసుకుంది. బుధవారం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో సాధికారక విజయం సాధించిన ఆ జట్లు ఇంగ్లాండ్-భారత్ జట్ల మధ్య జరిగే సెమీ ఫైనల్ లో విజయం సాధించిన జట్టుతో ఫైనల్ లో తలపడుతుంది. ఒక వేళ ఇంగ్లాండ్ పై భారత్ విజయం సాధించి ఫైనల్ లో పాకిస్థాన్ తో తలపడటమంటూ జరిగితే.. ఈ మ్యాచ్ వీక్షకుల సంఖ్య ఆకాశమే హద్దుగా పెరిగిపోతుంది. అలాగే స్పాన్సర్లకు పెద్ద ఫీస్ట్ గా మారిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకే కాదు... క్రికెట్ పై అంతగా ఆసక్తి లేని జనాలు కూడా ఆ మ్యాచ్ ఫలితంపై ఆసక్తి చూపుతారు. అసలు గ్రూప్ స్థాయిలో ఈ రెండు జట్ల మధ్యా జరిగిన మ్యాచ్ కే వీక్షకుల సంఖ్య రికార్డులను తిరగరాసింది. అటువంటిది ఈ రెండు జట్లూ ఫైనల్ లో తలపడ్డాయంటే ఆ మజాయే వేరబ్బా అన్నట్లుంటుంది. అయితే ఈ రెండు జట్ల మధ్యా ఫైనల్ వద్దే వద్దు అనుకుంటున్న జట్లు రెండు ఉన్నాయి. అవేమిటంటే సెమీస్ లో భారత్ తో తలపడనున్న ఇంగ్లాండ్ జట్టు ఒకటైతే... భారత్ తో ఫైనల్ లో తలపడటం ఇసుమంతైనా ఇష్టం లేని పాకిస్థాన్ జట్టు. ఈ రెండు జట్ల కెప్టెన్లూ ఇప్పటికే ఆ విషయాన్ని ట్వీట్ల ద్వారా వెల్లడించేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ ను పాకిస్థాన్ తో ఫైనల్ ఆడనీయం అంటూ ఇంగ్లాండ్ కెప్టెన్ ట్వీట్ చేస్తే ఇంగ్లాండ్ తో జరిగే ఫైనల్ మ్యాచ్ లో తాము భారత్ ఓటమినే కోరుకుంటున్నామని పాక్ కెప్టెన్ ట్వీట్ చేశారు. ఇక ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లైతే.. ప్లీజ్ కోహ్లీ సెమీ ఫైనల్ మ్యాచ్ కి సెలవు పెట్టవా అంటూ అభ్యర్థిస్తున్నారు. ఇక ఇంగ్లాండ్ తో భారత్ సెమీస్ లో అడిలైడ్ మైదానంలో తలపడనుంది. ఇప్పటికే ఈ టి20 ప్రపంచకప్ టోర్నీలో ఇదే మైదానంలో భారత్ రెండు మ్యాచ్ లు ఆడేసింది. ఈ టోర్నీలో అడిలైడ్ గ్రౌండ్ లో ఇంగ్లాండ్ కు ఇండియాతో తలపడపోయే మ్యాచ్  తొలి మ్యాచ్ అవుతుంది. దీంతో మైదానం, వాతావరణం, పిచ్ పరిస్థితుల విషయంలో ఇంగ్లాండ్ కంటే భారత్ కే ఎక్కువ అవగాహన ఉంటుంది. ఇది కచ్చితంగా టీమ్ ఇండియాకు కలిసొచ్చే అంశమే. అలాగే టోర్నీలో ఇరు జట్లూ సెమీస్ వరకూ వచ్చిన తీరు చూస్తే.. టీమ్ ఇండియా ఒకే ఒక్క పరాజయంతో దర్జాగా సెమీఫైనల్ కు చేరుకుంది. అదే ఇంగ్లాండ్ అయితే ఆపసోపాలు పడుతూ సెమీస్ కు వచ్చింది. అన్నిటికీ మించి ఇంగ్లాండ్ జట్లు అత్యంత బలమైన జట్టుగా పేపర్ మీద కనిపిస్తోందే తప్ప ఆ స్థాయి ఆట మైదానంలో కనబడరచడం లేదు. ఇక టీమ్ ఇండియా విషయానికి వస్తే కింగ్ కోహ్లీ అద్భుత ఫామ్, సూర్యకుమార్ యాదవ్ మెరుపులు, సరైన సమయంలో ఫామ్ దొరకబుచ్చుకున్న రాహుల్ లకు తోడు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా లయ దొరకబుచ్చుకుంటే.. ఇక భారత్ అజేయ జట్టే అవుతుంది. బౌలింగ్ లో కూడా అర్షదీప్ సింగ్, భువనేశ్వర్, షమీలు సమష్టిగా రాణిస్తుండటం టీమ్ ఇండియాకు కలిసొచ్చే అంశం. ఇంగ్లాండ్ బౌలింగ్ అటాక్ పేపర్ టైగర్ లా కనిపిస్తోందే.. కానీ ఈ వరల్డ్ కప్ లో ఆ జట్లు స్టార్ బౌలర్లెవరూ అనుకున్న స్థాయిలో రాణించలేదు. పైగా గాయాలు ఆ జట్లుకు ప్రతికూలాంశంగా మారాయి. ఫైనల్ ఎలెవెన్ లో ఆ జట్టులో ఎవరెవరన్నది మ్యాచ్ ముందు వరకూ సస్పెన్సే.

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేంద్రం సీరియస్

తెలంగాణ సర్కర్ పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేంద్రం సీరియస్ గా ఉందని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై రహస్య విచారణ జరుపుతోందని రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గవర్నర్ తమిళిసై స్వయంగా తన ఫోన్ ట్యాప్ అయ్యిందన్న అనుమానాలున్నాయని మీడియా సమావేశంలో ఆరోపించిన తరువాత ఇదే అనుమానాలు పలువురు రాజకీయ నేతల నుంచి కూడా వ్యక్తమయ్యాయి. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చాలా కాలం నుంచీ ఉన్నాయి. వోటుకు నోటు కేసు వ్యవహారంలో అప్పట్లో చంద్రబాబు ఫోన్ కూడా ట్యాప్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతే కాకుండా ఐటీ, ఈడీ దాడుల వ్యవహారాలన్నీ ముందుగానే సర్కార్ కు తెలుస్తున్నాయన్న అనుమానాలకు కూడా ఉన్నాయి. దీని వెనుక కూడా ఫోన్ ట్యాపింగ్ ఉందని అంటున్నారు. అలాగే వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో మోడీ ప్రకటన కంటే కేసీఆర్ తమ డిమాండ్ మేరకు కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేయనున్నదని ప్రకటించడాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. అలాగే గవర్నర్ తమిళిసై ఫోన్ కు వచ్చిన మెసేజ్ టీఆర్ఎస్ నాయకులకు ముందే ఎలా తెలిసిందని గవర్నర్ ప్రశ్నిస్తున్నారు. రాజ్ భవన్ ను ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో ఇరికించేందుకు తుషార్ పేరును తెరమీదకు తీసుకువచ్చారని అంటున్నారు. తెరాస హయాంలో తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థుల పోన్ ట్యాపింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉండగా...  ఇప్పుడు తాజాగా తమిళిసై కూడా అవే అనుమానాలు వ్యక్తం చేయడంతో కేంద్రం సీరియస్ గా రియాక్ట్ అయ్యిందనీ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రహస్య విచారణకు ఆదేశించిందనీ రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఒక్క గవర్నర్ అనే కాకుండా రాష్ట్రంలోని తెరాసయేతర పక్షాలన్నీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.  

మహిళా ఓటర్లే అధికం.. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో ముసాయిదా ఓటర్ల జాబితాను చీఫ్‌ ఎలక్ట్రోలర్‌ ఆఫీసర్‌ (సీఈవో)ముకేష్ కుమార్ మీనా ప్రకటించారు. బుధవార (నవంబరు 9) నాటికి రాష్ట్రంలో 3,98,54,093 మంది ఓటర్లు ఉండగా వారిలో  2,01,34,621 మంది మహిళా ఓటర్లు, 1,97,15,614 మంది పురుష ఓటర్లు, 68,115 సర్వీసు ఓటర్లు, 3,858 ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారని సీఈవో ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితా పేర్కొంది. 18-19 ఏళ్ల వయసున్న ఓటర్ల సంఖ్య 78,438గా ఉన్నట్లు వెల్లడించారు. నకిలీ ఓటర్లు, మృతులు, ఒకే పేరుతో వేర్వేరు చోట్ల నమోదైన ఓటర్లను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సాయంతో జాబితా నుంచి తొలగించినట్టు చెప్పారు. 10,52,326 మంది ఓటర్లను జాబితా నుంచి డిలీట్‌ చేశామని సీఈవో వెల్లడించారు. గత ఏడాది ఓటర్ల జాబితాతో పోలిస్తే ఈసారి 8,82,366 మంది ఓటర్లు తగ్గారని పేర్కొన్నారు. ఓటరు కార్డు కోసం ఆధార్‌ను తప్పనిసరి చేయడం లేదని సీఈవో స్పష్టం చేశారు. అయితే, ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే 60 శాతం మేర పూర్తయిందన్నారు.  ఓటరు నమోదు కోసం వాలంటీర్ల సేవలను వాడుకోవద్దని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు.  ఎమ్మెల్సీ పట్టభద్రులు, టీచర్ల ఓటర్ల నమోదు ప్రక్రియపై ఫిర్యాదులు వచ్చాయని, వీటిపై 19వ తేదీ వరకు విచారణ చేపడతామని తెలిపారు. తప్పుడు ధ్రువీకరణ ఇచ్చే అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈసారి నిరాశ్రయులకు ఓటరు కార్డు ఇవ్వాలని ఈసీ నిర్ణయించిందన్నారు. ఎలాంటి గుర్తింపూ లేకపోయినా విచారణ అనంతరం వారికి ఓటరు కార్డు జారీ చేస్తామని ప్రకటించారు

ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రమాణ స్వీకారం

మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి ఎమ్మెల్యేగా గురువారం(నవంబర్ 10) ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం పదకొండుగంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.  ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంతరెడ్డి, జగదీశ్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కూసుకుంట్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మునుగోడు నుంచి పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయంతో అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 105కు పెరిగింది. అదే సమయంలో కాంగ్రెస్ బలం ఐదుకు పడిపోయింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరబిందో ఫార్మా ఎండీ అరెస్టు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఈ స్కామ్ కు సంబంధించి  మరో ఇద్దరికి ఈడీ అరెస్టు చేసింది. తెలుగు రాష్ట్రాలలో ఈ అరెస్టులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఈడీ అరెస్టు చేసిన ఇద్దరూ కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే. వీరిలో ఒకరు అరబిందో ఫార్మా ఎండీ శరత్ చంద్రారెడ్డిని వినయ్ కుమార్ ను ఈడీ అదుపులోనికి తీసుకుంది. వీరిరువురినీ  ఢిల్లీలో రెండు రోజుల పాటు విచారించి ఆ తరువాత అరెస్టు చేసినట్లుప్రకటించింది. అరబిందో శరత్ చంద్రారెడ్డి, వినయ్ కుమార్ లకు కోట్లాది రూపాయల మద్యం వ్యాపారాలతో సంబంధాలున్నాయని ఈడీ పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీకి అనుగుణంగా అరబిందో శరత్ చంద్రారెడ్డి చెల్లింపులు చేసినట్లు అభియోగాలున్నాయని పేర్కొంది. రానున్నరోజులలో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. 

సైకో పాలన పోతుంది.. సైకిల్ పాలన వస్తుంది.. లోకేష్

జగన్ సర్కార్ పై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన, సైకో పాలన కొనసాగుతోందనీ, అధికార పార్టీ తప్ప ఇరత పార్టీలు సభలు సమావేశాలూ జరుపువడానికి వీల్లేదన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం తీరు ఉన్నదని దుయ్యబట్టారు. అయితే ఈ పరిస్థితి మరెంతో కాలం సాగదనీ, ఏపీలో సైకో పాలన సాగుతోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. జగన్ హయాంలో రాష్ట్రంలో జేసీబీ రాజ్యం కొనసాగుతోందని, కూల్చివేతలు, విధ్వంసాలు వినా మరేం లేకుండా పోయిందని విమర్శించారు. ఇప్పటంలో పర్యటించిన ఆయన జగన్ సర్కార్ పై విమర్శల వర్షం కురిపించారు. జగన్ రెడ్డి విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ అన్న లోకేష్ వైసీపీ ప్రభుత్వ అధికార వాహనం జేసీబీ అని విమర్శించారు. జగన్ కు నిర్మాణం గురించి అసలు తెలియదనీ, ఆయనకు తెలిసిందల్లా ఒక్క కూల్చివేత, విధ్వంసం మాత్రమేనని దుయ్యబట్టారు. సొంత నియోజకవర్గం పులివెందులలో బస్టాండ్ కూడా నిర్మించలేని జగన్ కు  కూల్చే హక్కు లేదన్నారు.  జగన్ రెడ్డి పెద్ద సైకో అయితే చిన్న సైకో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అన్నారు.   ఎక్కడైనా నాయకుడికి రోడ్లు వేస్తేనో, పేదలకు ఇళ్ళు కడితేనో, ఉద్యోగాలు ఇస్తేనో  ఆనందం వస్తుంది.  కానీ పెద్ద సైకో.. చిన్న సైకో లకు మాత్రం విధ్వంసంతో. పేదల ఇళ్ల కూల్చివేతలో, టిడిపి నాయకుల నిర్బంధంతో ఆనందం వస్తుందని లోకేష్ అన్నారు.  పేదల ఇళ్ళు జేసీబీతో కూల్చే వీడియోలు టివిలో చూసి ఆనందం పడే రకం ఈ పెద్ద సైకో, చిన్న సైకోలని దుయ్యబట్టారు.  ప్రజా వేదిక కూల్చడం తో మొదలైన జగన్ రెడ్డి జేసీబీ పాలన, టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు   ఇంటి గోడ , సబ్బం హరి గారి ఇంటి గోడ , గీతం యూనివర్సిటీ గోడ కూల్చివేతలతో సాగుతోందన్నారు.   రోడ్డు కి అడ్డంగా గోడలు కట్టడం, ప్రతిపక్ష నాయకుల పంట తగలబెట్టడం, ప్రతిపక్ష నాయకుల ఇళ్ళు కూల్చడం వీళ్లకు ఫ్యాషన్ గా మారిపోయింది.  పెద్ద సైకో జగన్ రెడ్డి మూడున్నర ఏళ్ల పాలనలో మొత్తం రాష్ట్రాన్నే కూల్చేసాడు. చిన్న సైకో ఆళ్ల రామకృష్ణా రెడ్డి మూడున్నర ఏళ్లలో మంగళగిరి ని కూల్చేసి,    మంగళగిరిని డిస్ట్రక్షన్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారని తీవ్రస్థాయిలో విమర్శించారు.  పేదల ఇళ్ళు కూల్చడానికి ఎమ్మెల్యే ఆర్కే ఏకంగా సొంతంగా జేసీబీనే  కొన్నారన్నారు.   ఇప్పటం లో జరిగింది మరీ అన్యాయమనీ, కేవలం రాజకీయ కక్షతోనే ఇక్కడ ఇళ్ళు కూల్చేసారనీ, రోడ్డు మీద గుంతలు పూడ్చలేని చెత్త ప్రభుత్వం రోడ్డు విస్తరణ అంటూ ఇళ్ళు కొట్టేయడం విడ్డూరంగా ఉందన్నారు.  దేశంలోనే అత్యంత చెత్త రోడ్లు ఉన్నది ఏపీలోనే...ఒక్క గుంత పూడ్చలేదు...ఒక్క కొత్త రోడ్డు వెయ్యలేదు. కానీ ఇప్పటంలో రోడ్డు విస్తరణ చేస్తామంటూ ఇళ్ళు కూల్చేసారు. ఇప్పటంలో రోడ్డు విస్తరణ అంటే కనీసం వైసీపీ వాళ్లైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. ఇప్పటం ఒక చిన్న గ్రామం...ఊరి బయట కేవలం 20 అడుగుల రోడ్డు మాత్రమే ఉంది.  కనీసం బస్సు సౌకర్యం కూడా లేని ఊరి రోడ్డుని 120 అడుగులు వెడల్పు చెయ్యడానికి కారణం కేవలం రాజకీయ కక్షసాధింపు మాత్రమేనన్నారు.  రాష్ట్రంలో ఎక్కడా లేని రోడ్డు విస్తరణ ఇప్పటంలోనే ఎందుకు అని ప్రశ్నించారు. జనసేన సభకి భూములు ఇవ్వడం తప్పా? వైసిపి తప్ప ఇతర పార్టీలు సభలు నిర్వహించుకోకూడదా? అని నిలదీశారు. జనసేన సభకి భూములు ఇచ్చారని, పోయిన ఎన్నికల్లో ఈ గ్రామంలో టిడిపి కి మెజారిటీ వచ్చిందనే కోపంతోనే ఇళ్లను కూల్చేసారని ఆరోపించారు.   

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. పీడీయాక్ట్ కింద ప్రభుత్వం విధించిన ఏడాది నిర్బంధాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఆయనను వెంటనే విడుదల చేయాలంటూ కండీషన్డ్ బెయిలు మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి బుధవారం విడుదయ్యారు. ర్యాలీలు నిర్వహించరాదనీ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదనీ, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదనీ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దనీ షరతులు విధించిన కోర్టు ఆయనకు బెయిలు ఇచ్చింది. కోర్టు షరతుల మేరకు జైలు నుంచి విడుదలైన రాజాసింగ్ మీడియాతో మాట్లాడకుండానే నేరుగా తన నివాసానికి చేరుకున్నారు. రాజాసింగ్ విడుదల సందర్భంగా ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో ఘోషామహల్ మార్మోగింది. రాజా సింగ్ విద్వేష ప్రసంగాలతో, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ గత ఆగస్టు 25న ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ జైలులోనే ఉన్న రాజాసింగ్ చివరాఖరికి హైకోర్టు తీర్పుతో విడుదలయ్యారు. శ్రీరాముడి ఆశీర్వాదంతోనే తాను జైలు నుంచి బయటకు వచ్చానని రాజాసింగ్ అన్నారు. ఇక రాజాసింగ్ పై బీజేపీ సస్పెన్షన్ వేటును కూడా ఎత్తివేసే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ మేరకు బీజేపీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.

నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సంచలన ఆరోపణ

తెలంగాణ గవర్నర్ తమిళి సై రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు గుప్పించారు. ఇందు కోసం ప్రత్యేకంగా విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రభుత్వ వైఖరిని తూర్పారపట్టారు. తనకు ప్రొటోకాల్ ఇవ్వకుండా అవమానించడమే కాకుండా వ్యక్తిత్వ హననానికి సైతం పాల్పడ్డారని విమర్శించారు. తన ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఏకంగా రాజ్ భవన్ ను ఫామ్ హౌస్ కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.  గతంలో రాజ్ భవన్ లో ఏడీసీగా పని చేసిన తుషార్ పేరునుఫామ్ హౌస్ కేసులో  ఉద్దేశపూర్వకంగా తీసుకు వచ్చారని తమిళిసై అన్నారు.  ప్రభుత్వం తనపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. తన వద్ద బిల్లులు పెండింగ్ లో ఉన్న విషయాన్నీ ఆమె ప్రస్తావించారు. ఔను నిజమే ప్రభుత్వం నుంచి కొన్ని బిల్లులు రాజ్ భవన్ కు వచ్చాయనీ,  ఒక్కొక్క బిల్లును సమగ్రంగా పరిశీలిస్తున్నానని చెప్పారు.  కానీ ఈ లోపే దుష్ప్రచారం మొదలెట్టేశారని గవర్నర్ తమిళి సై అన్నారు. యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్‌ బిల్లుపై ప్రభుత్వాన్ని క్లారిఫికేషన్‌ కోరానన్నారు. అయితే దానికీ వక్రభాష్యం చెప్పారని, తాను బిల్లులను అడ్డుకుంటున్నట్లుగా దుష్ప్రచారం చేశారని గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకుంటున్నట్లుగా ప్రచారం జరిగిందని తెలిపారు. కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ బిల్లుకే తొలి ప్రాధన్యత ఇచ్చానని పేర్కొన్నారు. అసలు కొత్తగా రిక్రూట్‌మెంట్‌ బోర్డు  ఎందుకు?.  కొత్త రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటుతో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి?.. అది యూజీసీ నిబంధనలకు లోబడి ఉంటుందా?.. లీగల్‌గా ఇబ్బందులు వస్తే ఏం చేస్తారు? బోర్డు ఏర్పాటులో ఎలాంటి ప్రోటోకాల్‌ పాటిస్తారు?..  వంటి వివరాలు కావాలని అడిగినా ప్రభుత్వం నుంచి కానీ, సంబంధిత మంత్రి నుంచి కానీ సమాధానం రాలేదని తమిళిసై అన్నారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న రాజ్ భవన్, ప్రగతి భవన్ సంబంధాలు మరో సారి భగ్గుమన్నాయి. తమిళిసై ప్రెస్ మీట్ తో దుమారం మరింత పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా యూనివర్సిటీల బిల్లు విషయంలో తాజా వివాదం ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య అగాధం మరింత పెరిగినట్లేనని అంటున్నారు. ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య అగ్గి మరింత రాజుకుంది. యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు విషయంలో తాజాగా వివాదం మొదలైంది. ఈ బిల్లుపై చర్చించడానికి నేరుగా విద్యా శాఖ మంత్రి రాజ్‌భవన్‌కు రావాలని గవర్నర్‌ తమిళిసై ప్రభుత్వానికి లేఖ రాశారు. దానిని నేరుగా సీఎం ముఖ్య కార్యదర్శికి పంపారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎలా స్పందిస్తారనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.  

దుబాయ్ పర్యటన ముగించుకుని హుటాహుటిన వెనక్కు మంత్రి గంగుల

 కుటుంబ సభ్యులతో కలిసిమంగళవారం(నవంబర్ 8న) దుబాయ్ పర్యటనకు వెళ్లిన గంగుల తన నివాసంలో ఐటీ, ఈడీ అధికారుల సోదాల విషయం తెలియగానే హుటాహుటిన పర్యటనను ముగించుకుని వెనక్కు బయలు దేరారు. మంత్రి గంగుల నివాసం తాళం వేసి ఉన్నప్పటికీ ఐటీ, ఈడీ అధికారులు తలుపులు పగులగొట్టి మరీ లోనికి వెళ్లారు.  కరీంనగర్ లో గంగుల నివాసంతో పాటు ఆయన సోదరుడు గంగుల వెంకన్న నివాసంలో కూడా అధికారులు సోదాలు జరుపుతున్నారు.   అలాగే మరో నాలుగు చోట్ల కూడా ఐటీ, ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి.   ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఈ సోదాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఫెమా నిబంధనల ఉల్లంఘనపై గతంలోనే ఈడీ నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నారు. మొత్తం 20 బృందాలు ఈ తనిఖీలలో పాల్గొన్నట్లు చెబుతున్నారు.