ఇప్పటం కూల్చివేతలపై చంద్ర నిప్పులు
posted on Nov 5, 2022 @ 2:53PM
ఏపీలో వైసీపీ దుర్మార్గాలతో పాటు అసాధ్యాలను చేస్తామంటూ అరాచకాలకూ పల్పడుతోంది. ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత ఆ కోవలోకే వస్తుంది. రాష్ట్రంలో రోడ్ల అధ్వాన స్థితిపై రోజూ వస్తున్న విమర్శలను పట్టించుకోవడం లేదు. సామాజిక మాధ్యమంలో ప్రభుత్వ నిర్వాకాన్ని ఏకి పాడేస్తున్నా ఖాతరు చేయడంలేదు.
కానీ అవసరం లేని చోట్ల రోడ్ల విస్తరణ అంటూ ఇళ్లను కూల్చేస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణే ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ పేరుతో 53 ఇళ్ల కూల్చివేత. ఇళ్ల కూల్చివేతను అడ్డుకోవాలంటూ ఆ గ్రామస్తులు కోర్టుకు వెళ్లారు. అయితే కోర్టు నిర్ణయం వెలువరించడానికి ముందే దౌర్జన్యంగా పోలీసుల పహారాతో గ్రామంలో ఇళ్లను కూల్చేశారు. దీనిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సర్కార్ కు పోయే కాలం దాపురించిందనీ, అందుకే దిక్కుమాలిన పనులన్నీ చేస్తోందనీ నిప్పులు చెరిగారు.
తప్పులు చేయడంలో జగన్ శిశుపాలుడిని దాటేశాడని దుయ్యబట్టారు. వంద తప్పులు చేసిన శిశుపాలుడికి శిరచ్ఛేదన జరిగిందనీ, వంద తప్పులు దాటేసిన జగన్ ప్రభుత్వం కూలిపోక తప్పదని అన్నారు. అరాచకపాలకు, విధ్వంసాలకు ఏపీని కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారని అన్నారు. సీఎం జగన్ అధికార మదానికి, అహంకారానికి, దౌర్జన్యాలకీ, దుర్మార్గాలకూ చరమ గీతం పాడేందుకు జనం సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు.
నిండా 600 గడప కూడా లేని ఇప్పటం గ్రామంలో 120 అడుగుల రోడ్డు నిర్మిస్తారా? అసలు మీవి రోడ్లేసే మొహాలేనా అంటూ చంద్ర నిప్పులు చెరిగారు. ఇప్పటం వెళ్లకుండా జనసేనానిని అడ్డుకునే ప్రయత్నాల ద్వారానూ, విద్యుత్ సరఫరా నిలిపివేసి మాపై రాళ్ల దాడి చేస్తేనో మిమ్మల్ని చూసి భయపడే పరిస్థితుల్లో ఎవరూ లేరని చంద్రబాబు అన్నారు. కూల్చవేతలకు కాదు.. ఏదైనా నిర్మించి చూడండి అని సవాల్ చేశారు.