రాటుదేలిన షర్మిల రాజకీయం.. ప్రతి అడుగులోనూ అన్న జగన్ కు చెక్!
posted on Nov 6, 2022 @ 10:37AM
ఏదీ ఏమైనా వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టీపీ) పార్టీని స్థాపించి ఆ రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర ద్వారా సాధించిన గుర్తింపు కంటే.. తెరాస అధినాయకత్వంపై విమర్శలు, కేసీఆర్ కుటుంబ అవినీతిపై చేసి ఫిర్యాదుల ద్వారానే ప్రాచుర్యం పొందారని చెప్పారు. అయితే.. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఆమె ప్రస్థానాన్ని గమనిస్తే ఆమె ప్రతి మాటలోనూ, ప్రతి అడుగులోనే తన తండ్రి రాజశేఖరరెడ్డిని స్ఫురింప చేస్తున్నారన్న చర్చ అయితే రాకీయ వర్గాలలోనూ, జన బాహుల్యంలోనూ జోరుగా సాగుతోంది.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆహార్యాన్ని పుణికి పుచ్చుకోవడమే కాకుండా.. ఆయన ప్రదర్శించిన రాజకీయ చాణక్యాన్ని సైతం ఆమె ప్రదర్శిస్తున్నారన్న భావన ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ వ్యక్తమౌతోంది. షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో కొత్త పార్టీ స్థాపించి.. పాదయాత్ర ప్రారంభించడం.. అలాగే రైతులు, నిరుద్యోగుల కోసం దీక్షలు చేపట్టడాన్ని తొలుత అంతా లైట్ తీసుకున్నప్పటికీ, ఇటీవల వైయస్ షర్మిల దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కేసీఆర్ ప్లస్ మెగా కృష్ణారెడ్డిల అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేసి రావడం... ఆ తర్వాత అంటే పక్షం రోజులకే షర్మిల హస్తినకు పోయి ఇదే అంశంపై ఫిర్యాదు చేయడాన్ని జనం ప్రస్తావిస్తున్నారు.
అలాగే ఢిల్లీ పర్యటనలో భాగంగానే వైయస్ వివేకా హత్య కేసులో సీబీఐకి షర్మిల స్వయంగా వాంగ్మూలం ఇవ్వడంపై ఆమె ధైర్యాన్ని, చిత్తశుద్ధని, పట్టుదలను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. షర్మిల వాంగ్మూలం ఈ కేసు దర్యాప్తులో అత్యంత కీలకం కానుందని.. ఈ నేపథ్యంలో జగన్ ఫ్యామిలీలో చోటు చేసుకొన్న పరిణామాలను చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైయస్ షర్మిల తరువాత ఏం చేయబోతోందన్న ఆసక్తి కూడా అందరిలో నెలకొంది. షర్మిల తండ్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి... నమ్మితే ప్రాణాలు ఇస్తారని.. అదే తోక జాడిస్తే మాత్రం కత్తిరించేస్తారని..షర్మిల తీరు కూడా అచ్చు గుద్దినట్లు.. తండ్రి లాగే ఉందన్న మాట ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో వినిపిస్తోంది.
జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయకోసం జగనన్న వదిలిన బాణం అంటూ ఆమె పాదయాత్ర చేయడమే కాదు.. బై బై బాబు లాంటి నినాదాలు ఇచ్చిన షర్మిలను ఆ తర్వాత జగన్.. ముఖ్యమంత్రి అయిన తరువాత ఆమెను దూరం పెట్టడాన్ని వారీ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఇక సొంత బాబాయ్ వివేకా హత్య కేసు దర్యాప్తు నీరు గార్చే ప్రయత్నం సోదరుడు జగన్ చేస్తున్నారన్న విషయంపై షర్మిల వాంగ్మూలం ఇవ్వడం నిజంగా సాహసమేననీ, అదే సమయంలో వాస్తవాలు వెలికిరావాలన్న ఆమె పట్టుదలకు నిదర్శనమని అంటున్నారు. వైఎస్ వివేకా కేసులో సీబీఐకి షర్మిల వాంగ్మూలం ఇవ్వడం జగన్ గట్టి దెబ్బేనని కడప జిల్లా వాసులు పేర్కొంటున్నారు. ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్లు.. రాబోయే రోజుల్లో ఈ ఇంటి గుట్టు తాడేపల్లి ప్యాలెస్‌కు చేటు అన్నట్లుగా ఉండవచ్చునని జిల్లా వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మటికి మహానేత రాజకీయ చతురత అని చెబుతున్నారు. దీంతో సోదరుడిని సీఎం పీఠం ఎక్కించడమే కాదు.. అవసరమైతే ఆ పీఠం మీద నుంచి కిందకు దింపడం కూడా.. షర్మిలకు తెలుసుననే గుసగుసలు ఇప్పటికే కడప జిల్లాలో వివవస్తున్నాయి.
మరోవైపు తెలంగాణలో వైయస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వైయస్ షర్మిలలోని పోరాట పటిమను.. పట్టుదలను ఈ సందర్భంగా ఆమె తల్లి వైయస్ విజయమ్మ గుర్తు చేసిన విషయాన్ని సైతం ఉమ్మడి కడప జిల్లా వాసులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
గతేడాది జులై 8న వైయస్ఆర్ తెలంగాణ పార్టీని వైయస్ షర్మిల స్థాపించి.. అదే ఏడాది అక్టోబర్ 20వ తేదీన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి వైయస్ షర్మిల తన పాదయాత్రను ప్రారంభించారు. కానీ వైయస్ షర్మిల పాదయాత్రకు ప్రజల్లో మైలేజ్ రావడం లేదని.. ప్రజల్లో ఆమెకు అదరణ కరువైందనే ఓ చర్చ అయితే నిన్న మొన్నటి వరకు తెలంగాణ సమాజంలో కొనసాగింది.
కానీ ప్రస్తుతం వైయస్ షర్మిల పాదయాత్రే కాదు.. ఢిల్లీ యాత్రను సైతం తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం చాలా ఆసక్తిగా గమనిస్తున్నారనే వారు పేర్కొంటున్నారు. ఏదీ ఏమైనా మహానేత తనయగా.. షర్మిల తన రాజకీయాన్ని మరింత పదును పెడుతోందని.. అందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని ఉమ్మడి కడప జిల్లా వాసులు చెబుతున్నారు. అలాగే కాళేశ్వరం అవినీతిపై ఫిర్యాదు నుంచి వైఎస్ వివేకా హత్య కేసులో వాంగ్మూలం వరకూ ఆమె వేస్తున్న అడుగులు జగన్ కు చెక్ పెట్టేవిగా ఉన్నాయని కూడా అంటున్నారు. అన్నిటికీ మించి హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్వహిస్తున్న టాక్ షోకు ఆమె హాజరు కావడానికి అంగీకరించడం అంటే జగన్ తో అమీతుమీ తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.