ఒణికిస్తున్న చలిపులి, మంచుపొగ భూతం!
posted on Nov 5, 2022 @ 10:35AM
అరచేతులు రాసుకుంటూ పరుగున వెళ్లి వేడి వేడి మొక్కజొన్నపొత్తు తినేయడానికి సరదాపడడంలో సరదా పోయేంతగా చలి క్రమేపీ పెరిగిపోతోంది. ఇంట్లోనే పకోడీలు, ఆరు బయట కుంపటి , కర్రల మంట చుట్టూ చేరి కూచోడాలు అలవాటు చేసేసుకున్నవారందరికీ ఈసారి మరింత ఆటపాటలు అవసరమవుతాయేమో. ప్రతీ ఇంట్లొ జలుబు దగ్గుతో తుమ్ములతో తిరిగే వారి సంఖ్యా పెరుగుతోంది. చలి అమాంతం పట్టేసి ఇంట్లోంచి కదలనీయడం లేదు. చల్లగాలిలో అలా బండి మీద తిరగాలనుకునే జంటలకీ ఈసారి చలి పులి భయపెడుతోంది.
చలి ఒణికించేస్తోంది.. చలిమంటలు కాసుకోవలసివస్తోందని పల్లెప్రజలు అంటున్నారు. అయితే ఈసారి మరీ ఎక్కువగా ఉంది. పొగమంచుతో జలుబు, దగ్గు మించి జ్వరాలకు దారితీసేంతగా చల్లదనం పట్టే స్తోంది. చలి పులిని వది లించుకునే మార్గాలన్నీ వెదకడం మొదలయింది. మామూలుగా పల్లెల్లో అతిగా చలి అనిపిస్తుంది. కానీ ఈసారి పట్టణాల్లోనూ చలిపులి ప్రవేశించి ఇబ్బందికరంగా మారింది.
ఏ కాలానికి ఆ కాలం కవ్విస్తుంది, కొంత భయపెడుతుంది. కానీ చాలా కాలం నుంచి వాతావరణంలో మార్పులు వచ్చా యనే వాతావరణ నిపుణులూ చెబుతున్నారు. మరీ ఇటీవలి కాలంలో ఊహించని మార్పులేచోటుచేసుకుంటు న్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో స్థాయి పొగమంచు, చలిగాలులు దక్షిణాదిన కూడా వీస్తున్నాయి. దీనికి తోడు ఊహించని విధంగా హఠాత్తుగా మబ్బులు కమ్మేయడం అమాంతం భారీ వర్షం పడటం చలి ఒణికించేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలను పొగమంచు మేఘంలా కమ్మేస్తోంది. రమణీయ దృశ్యాలు ఓ వైపు ఆహ్లాదపరు స్తున్నా..మరోవైపు వాహనదారులకు నరకం చూపుతున్నాయి. విజయవాడ, రాజమండ్రి, ఆదిలాబాద్, మెదక్ వంటి ప్రాంతాలనే కాదు ఇతర పట్టణాలను కూడా పొగమంచు క్రమేపీ కప్పేస్తోంది. ముఖ్యంగా వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దారి సరిగా కనపడక ప్రమాదాలకు గురవుతున్నారు. విజయవాడ మచిలీపట్నం, రాజమండ్రి రైల్‌కమ్ బ్రిడ్జిపై దట్టమైన పొగమంచుతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. పచ్చని ప్రకృతి అందాలకు నెలవైన కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో.. చలి, పొగమంచు తీవ్రత మరింత పెరిగింది.