హిమాచల్, గుజరాత్ లలో మళ్లీ కమల వికాసమే.. తేల్చేసిన సర్వే
posted on Nov 5, 2022 @ 12:54PM
హిమాచల్, గుజరాత్ రాష్ట్రాలలో మరోసారి కమలమే విజయకేతనం ఎగుర వేసి అధికారాన్ని నిలబెట్టుకోనుందని సర్వే వెల్లడించేసింది. ఆ రెండు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జగరనున్న సంగతి విదితమే. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఈ నెల 12 ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా, గుజరాత్ అసెంబ్లీకి వచ్చే నెల1, 5 తేదీలలో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ రెండు రాష్ట్రాలలో కూడా బీజేపీకే విజయావశాకాలున్నాయని ఇటీవల ఇండియా టీవీ-మాట్రిక్స్ నిర్వహించిన సర్వే పేర్కొంది. హిమాచల్ లో తొలి సారిగా ఆనవాయితీకి భిన్నంగా ఆ రాష్ట్రంలో వరుసగా రెండో సారి కమలం పార్టీ అధికార పగ్గాలు చేపట్టనుందని సర్వే పేర్కొంది. అలాగే గుజరాత్ లోనూ బీజేపీ జయకేతనం ఎగురవేయడం ఖాయమని పేర్కొంది.
రెండు రాష్ట్రాలలోనూ కూడా బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని అధికారం చేపడుతుందని సర్వే పేర్కొంది. అయితే హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటి వరకూ వరుసగా రెండు సార్లు ఒకే పర్టీ విజయం సాధించి అధికారం చేపట్టిన దాఖలాలు లేవు. ప్రతి సారీ ఆ రాష్ట్ర ప్రజలు అధికార పార్టీని ఓడించడం అన్నది ఆనవాయితీగా వస్తున్నది. అయతే ఈ సారి మాత్రం ఆ ఆనవాయితీని అధిగమించి హిమాచల్ లో మరో సారి బీజేపీ అధికార పీఠాన్ని చేజిక్కించుకుంటుందని సర్వే ఫలితం చెబుతోంది. హిమాచల్ ప్రదేశ్ లోని 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 12న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే! ఈ ఎన్నికల్లో 46 శాతం ఓటర్ల మెగ్గుతో బీజేపీ, 41 విజయం సాధిస్తుందని ‘ఇండియా టీవీ-మాట్రిక్స్’నిర్వహించిన సర్వే వెల్లడించింది.
ఇక కాంగ్రెస్ పాతిక స్థానాలకే పరిమితమౌతుందని పేర్కొంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్క స్థానం కూడా లభించే అవకాశం లేదని సర్వే తేల్చింది. అలాగే గుజరాత్ విషయానికి వస్తే.. టైమ్స్ నౌ- ఈటీజీ నిర్వహించిన సర్వేలో గుజరాత్ లో మరో సారి అధికారం బీజేపీదేనని పేర్కొంది. రాష్ట్రంలో ఆ పార్టీ 125 నుంచి 135 స్థానాల వరకూ కైవసం చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. కాంగ్రెస్ 29 నుంచి 31 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీ 20-24 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వే ఫలితం పేర్కొంది.