తప్పులెన్నువారు తమ తప్పులెరుగరయ్యా కొడాలి నానీ!
posted on Nov 5, 2022 @ 11:26AM
‘ఒళ్లు బలిసిన కోడి మిద్దెనెక్కి పిచ్చికూతలు కూసిందట’ అన్న చందంగా ఉంది మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీరు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ చంద్రబాబు ఏర్పాటు చేసిన వలయం ఉందని, పవన్ కళ్యాణ్ కు మంచి జరిగినా.. చెడు జరిగినా చంద్రబాబే కారణం అని కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కోడి కూతల సామెతను గుర్తు చేస్తున్నాయంటారు. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడంపై స్పందిస్తూ.. చంద్రబాబు నాయుడు ‘పవన్ కళ్యాణ్ మీద దాడులు చేస్తారా? చంపేస్తారా?’ అని వ్యాఖ్యానించిన సంగతి విదితమే. దీనిపై బూతులు అలవోకగా మాట్లాడి, బూతుల మంత్రిగా ప్రసిద్ధుడైన కొడాలి నాని స్పందన బలిసిన కోడి సామెతలా ఉందంటున్నారు.
కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ కారును గుర్తు తెలియని వ్యక్తులు వెంబడిస్తున్నారని, బైక్ లపై కూడా ఫాలో అవుతున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన విడుదల చేశారు. చివరికి పవన్ కళ్యాణ్ నివాసం వద్ద రెక్కీ చేసిన విజువల్స్ కూడా కొన్ని మీడియాల్లో ప్రసారం కావడం కలకలం రేపింది. తనను, తన భార్యా, పిల్లలను చంపేస్తామంటూ తనకు బెదిరింపులు వస్తున్నాయని పవన్ కళ్యాణే స్వయంగా తన పార్టీ నేతల సమావేశంలో చెప్పడం గమనార్హం.
పవన్ కళ్యాణ్ నివాసం కొందరు యువకులు అర్ధరాత్రి పూట కారు నిలపడమే కాకుండా ఇదేమిటని అడిగిన ఆయన భద్రతా సిబ్బందిని దూషించిన వైనం మీడియాలో విజువల్స్ తో సహా ప్రముఖంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై దాడికి కుట్ర జరుగుతోందంటూ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి బయటికి వెళ్లినా.. బయటి నుంచి ఇంటికి వచ్చినా కార్లలో కొందరు వెంబడించడమే కాకుండా పవన్ రాకపోకలను నిశితంగా పరిశీలిస్తున్నారని, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ లపై సమీపం నుంచి ఫాలో అవుతుండడం కలకలం రేపిన సంగతి విదితమే.
ఈ అంశంపై కొడాలి నాని స్పందిస్తూ.. ‘నాదెండ్ల మనోహర్ ఎవడు..? జనసేన పార్టీనా గాడిదగుడ్డా..? జనసేనలో చంద్రబాబు నియమించిన ఏజెంటు నాదెండ్ల మనోహర్. పవన్ పై రెక్కీ నిర్వహిస్తున్నారని నాదెండ్ల మనోహర్ అనటం హాస్యాస్పదం. పవన్ కల్యాణ్ కోసం ఎవరైనా రెక్కీ నిర్వహించినా.. ఆయనను చంపాలనుకున్నా తెలుగుదేశం పార్టీ.. చంద్రబాబు నాయుడే చేస్తారు. చంద్రబాబు నాయుడు సానుభూతి రాజకీయాల్లో ఆరితేరిపోయారు. పవన్ కళ్యాణ్ చుట్టూ చంద్రబాబు వలయం ఉంది. పవన్ కు ఏం జరిగినా.. అంటే మంచి జరిగినా.. చెడు జరిగినా.. చంద్రబాబుదే బాధ్యత’ అన్నారు. పవన్ పై కుట్ర చేస్తే.. అది చంద్రబాబే చే అన్నారు.
‘పవన్ కళ్యాణ్ చుట్టూతా ఉండేది ఎవరు? నాదెండ్ల మనోహర్. చంద్రబాబుకు సలహాలు చెప్పేది రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు. పవన్ కళ్యాణ్ కు సలహాదారులు ఎవరు? పవన్ కళ్యాణ్ ఎలా నడవాలి? ఎలా ఉండాలని ఎవరు చెబుతారు. పవన్ చుట్టూ ఎవరి వలయం ఉంది? నా వలయం ఉందా? చంద్రబాబు నాయుడి వలయం ఉంది. పవన్ కళ్యాణ్ ను ముంచినా.. తేల్చినా.. బతికించినా.. చంపేసినా.. ఏం చేసినా చంద్రబాబు నాయుడే.. చంద్రబాబుకు ఏది ఎడ్వాంటేజ్ అంటే అదే చేస్తాడు. ముక్కుసూటిగా వెళ్లి గుద్దడమే జగన్ కు తెలుసు. ఈ రెక్కీలు నిర్వహించడం.. రిహార్సల్స్ చేయడాలు, డైలాగ్ ట్రైనింగ్ లు ఇవ్వడాలు.. ఇవన్నీ సినిమా పరిశ్రమలో ఉంటాయి’ అనడాన్ని జనం తప్పుపడుతున్నారు.
రాజకీయ లబ్ధి కోసం వైసీపీ చీఫ్ ఎంతకైనా వెళ్తారనే ఆరోపణలు ఉన్నాయి. సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య విషయంలో ఆయనపైన కూడా ఆరోపణలు వస్తున్న విషయం కొడాలికి తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ మృతికి కారణంటూ ఆయన బంధువులు కొడాలి నానిని శ్మశానంలోనే నిలదీసిన వైనాన్ని ఇంకా ఎవరూ మరిచిపోలేదంటున్నారు. అలాగే అడపా బాబ్జీ బావమరిది వంకా విజయ్ ఆత్మహత్యతో కూడా కొడాలికి లింక్ ఉందనే ఆరోణలున్నాయి. ఎన్నో తప్పులు తన కింద పెట్టుకున్న కొడాలి నాని నిస్సిగ్గుగా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని జనం ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై రెక్కీ జరగడాన్ని చంద్రబాబు, బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఖండిస్తుంటే.. కొడాలి నాని కనీసం మనిషిగా స్పందించకపోగా ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి.