ఉత్కంఠ రేపుతున్న మునుగోడు కౌంటింగ్.. రౌండ్ రౌండ్ కూ మారుతున్న ఆధిక్యత
posted on Nov 6, 2022 @ 11:13AM
మునుగోడు ఉఫ ఎన్నిక కౌంటింగ్ ప్రతి రౌండ్ కూడా హార్స్ రేస్ ఫొటో ఫినిష్ లా ఉత్కంఠగా సాగుతోంది. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యత సాధిస్తే, రెండు, మూడు రౌండ్లలో బీజేపీ ఆధిక్యత కనబరిచింది. మళ్లీ నాలుగు, ఐదు రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది. ఇలా రౌండ్ రౌండ్ కూ ఫలితం దోబూచులాడుతూ ఉత్కంఠను పెంచేస్తోంది. మొదటి నుంచీ పరిశీలకులు అంచనా వేసినట్లు గ్రామీణ ప్రాంతంలో టీఆర్ఎస్, అర్బన్ ఏరియాల్లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తూ వస్తోంది. బీజేపీకి కాంగ్రెస్ వల్ల ఎక్కువ నష్టం జరుగుతోందని అంటున్నారు.
ఆ పార్టీ ఆశించినట్లుగా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణులు కమలం గూటికి చేరకపోవడం.. అలాగే కాంగ్రెస్ ఓటు పెద్దగా బీజేపీకి అనుకూలంగా టర్న్ కాకపోవడం ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాన్ని బట్టి స్పష్టమౌతోంది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ బీజేపీ కంటే 613 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో ఉంది. టీఆర్‌ఎస్ కు 26,343, బీజేపీ 25,730, కాంగ్రెస్ 8,200, బీఎస్పీ 907ఓట్లు వచ్చాయి.
ఇప్పటి వరకూ వెలువడిన ఫలితం సరళిని బట్టి చూస్తూ ఏ పార్టీ విజయం సాధిస్తుంది అన్నిది చివరి వరకూ తేలే అవకాశం లేదని అంటున్నారు. ఇక ఐదో రౌండ్ ఫలితం వెలువడటంలో జాప్యంపై హై డ్రామా నడిచింది. టీఆర్ఎస్ కు మెజారిటీ వస్తే తప్ప ఫలితం వెలువరించరా అంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. రౌండ్ల వారీ ఫలితాల వెల్లడిలో ఇంత జాప్యం ఎందుకని ప్రశ్నించారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇది నైతిక ఓటమి అన్నారు. ఇప్పటి వరకూ వెలువడిన రౌండ్ల ఫలితాలను గమనిస్తే బీజేపీ గెలవబోతున్నదని స్పష్టమౌతున్నదన్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల స్వగ్రామంలో బీజేపీకి ఆధిక్యత లభించిందన్నారు. అలాగే మంత్రులు ఇన్ చార్జీలుగా ఉన్న ప్రాంతాలలో కూడా బీజేపీ ఆధిక్యత కనబరిచిందని చెప్పారు. అలాగే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. చౌటుప్పల్ లో అనుకున్నంత మెజారిటీ రాలేదని అంగీకరించారు. ప్రస్తతానికి టీఆర్ఎస్ ఆధిక్యతలో ఉన్నా.. రౌండ్ రౌండ్ కూ ఫలితం మారుతోందనీ, బీజేపీ విజయం తథ్యమనీ అయితే చివరి వరకూ హోరాహోరీ పోరు ఉంటుందని చెప్పారు.