గుజరాత్ ఫలితంపై మోడీ భయానికి కారణమదేనా? చాపకింద నీరులా విస్తరిస్తోందన్న హెచ్చరిక అందుకేనా?
గుజరాత్ లో కాంగ్రస్ పార్టీ చాప కింద నీరులా విస్తరిస్తోందా? మోడీని తిట్టకుండా, మొట్ట కుండా, ఒక మాటైనా అనకుండా, గ్రామీణ ప్రాంతాలలో సైలెంట్’గా ప్రచారం సాగిస్తోందా? అంటే, అవుననే అంటున్నారు. అది కూడా ఎవరో కాదు, స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీనే కాంగ్రెస్ పార్టీ విషయంలో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలని తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను హెచ్చరించారు. అయితే ఆయన అలా ఎందుకు అన్నారు? మాటకు ముందు.. మాటకు వెనుకా కూడా కాంగ్రెస్ ముక్త భారత్ అనే ప్రధాని మోడీ.. తన సొంత రాష్ట్రం గుజరాత్ విషయంలో కాంగ్రెస్ పుంజుకుంటోందని ఎందుకు గాభరా పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కొత్త పంథాలో గ్రామీణ ప్రాంతాలో సైలెంట్’గా నిశ్శబ్ద విప్లవానికి పావులు కదుపుతోంది, తస్మాత్ జాగ్రత్త అని మోడీ హెచ్చరించారు.
అయితే, నిజంగా గుజరాత్ లో కాంగ్రెస్ బలం పుంజుకుంటోందా? వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా? లేక బీజేపీకి రియల్ త్రెట్ గా భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ కు అక్ష్సిజన్ అందించే ప్రయత్నం మోడీ చేస్తున్నారా? ఎవరి వ్యూహం ఏమిటి అంటే, ఎవరి వ్యూహాలు వారికుంటాయి, అంటున్నారు విశ్లేషకులు.వివరాలోకి వెళితే ...
రాజకీయ పార్టీల సిద్ధాంతాలు ఏవైనా, అధికారం తప్ప అసలు వేరే సిద్ధాంతాలే లేని పార్టీలే అయినా, ఎన్నికల వ్యూహాలు,వ్యూహ కర్తలు అయితే ఉంటారు. సహజంగానే,రాజకీయ పార్టీలు వ్యూహాలు, ఎత్తుగడలను ఎప్పటి కప్పుడు మార్చుకుంటాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతాయి. (అఫ్కోర్స్ పిడివాదం వదలని కమ్యూనిస్టులు ఉంటారనుకోండి అది వేరే విషయం.) అయితే అందులోనూ,ఎన్నికలు జరుగుతోంది, ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్ అయి ప్పుడు వ్యూహ ప్రతి వ్యూహాలు ఎంత పదునుగా ఉంటాయో వేరే చెప్పనక్కరలేదు.
డిసెంబర్ మొదటి వారంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అయితే, అక్కడ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. కానీ అంతకు ముందే ప్రధాని మోడీ గుజరాత్ లో బీజేపీ హవా తగ్గందన్న సంగతిని గుర్తించేశారు. ఆప్ కాదు కాంగ్రెస్సే బీజేపీకి గట్టి పోటీ ఇచ్చి సవాల్ విసురుతున్నదని గ్రహించేశారు. అందుకే ఆయనతో సహా బీజేపీ అగ్ర నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల షెడ్యూల్ కు ముందే విమర్శలను లెక్క చేయకుండా వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంఖుస్థాపనాలు చేసేశారు. రాష్ట్రంలో ఇప్పటికే వరసగా ఐదుసార్లు విజయ సాధించిన బీజేపీ ఆరో గెలుపుకోసం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు సాగుతోంది.
నిజానికి, గుజరాత్ లో మళ్ళీ గెలుపు బీజీపీదే అని ప్రీ పోల్ సర్వేలు, కోడై కూస్తున్నాయి.అంతే కాదు, కాంగ్రెస్ పార్టీకి గతంలో వచ్చిన 77 సీట్లలో సగం కూడా ఈసారి రావని, బీజేపీ గతంలో కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధించి, స్పష్టమైన భారీ మెజారిటీతో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రీ పోల్ సర్వేలు చెప్పాయి.
అయినా, ప్రధాని మోడీ, పార్టీ క్యాడర్ ను హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ పని పోయిందని, అనుకోవద్దని, కొత్త పంథాలో,కొత్త వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ కదులుతోందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ తనను దూషించడం మానేసిందని, గ్రామీణ ఓట్లను సొంతం చేసుకోవడం కోసం నిశ్శబ్దంగా పని చేసుకుంటోందని చెప్పారు. ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. అయితే, నిజంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనే భయం మోడీని వెంతడుతోందా?అంటే, తాజాగా ఎస్ఏఎస్ గుజరాత్ లో చేసిన సర్వే ఫలితం చూస్తే ఔననక తప్పదు. మరోవంక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఆశలు వదులుకుందని,అందుకే రాహుల్ గాంధీ భారత్ జోడు యాత్రలో, గుజరాత్ ను చేర్చలేదని మీడియాలో కథనాలు వెలువడినా కాంగ్రెస్ పుంజుకుంటోంది తస్మాత్ జాగ్రత్త అని మోడీ క్యాడర్ ను హెచ్చరించారు హెచ్చరించడానికి కారణమేమిటో ఇప్పుడు అందరికీ అర్ధమపోయింది. ఇప్పడు రాజకీయ, మీడియా వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది.
నిజానికి మోడీ,షా జోడీ మార్క్ రాజకీయాలను గమనిస్తే, ప్రత్యర్ధుల బలహీనత కంటే, బలం పైనే దృష్టి పెడతారని అంటారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సూక్తిని పాటిస్తారని అంటారు. అదే సమయంలో, కాంగ్రెస్ పార్టీ మోడీ జోలికి వెళ్ళక పోయినా, మోడీ మాత్రం కాంగ్రెస్’ పార్టీని టార్గెట్ చేయడం వెనక,(మన కేసీఆర్ భాషలో చెప్పాలంటే, నువ్వు గోకినా గోకకపోయిన నేను గోకుతూనే ఉంటా అన్నట్లుగా) రాష్ట్రంలో చురుగ్గా అడుగులు వేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని కట్టడి చేసే వ్యూహం ఉందని గతంలో పరిశీలకులు విశ్లేషించారు.అయతే మోడీ రాజకీయ ఎత్తుగడగా కాంగ్రెస్ పుంజుకుంటోందన్న అనలేదనీ, గుజరాత్ లో క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకతను ఆయన అందరి కంటే ముందే గుర్తించారని ఎస్ ఎ ఎస్ సర్వే వెల్లడైన తరువాతే అందరికీ అర్ధమైంది. ఇంతకీ వరుసగా గుజరాత్ లో అధికారాన్ని నిలుపుకుంటూ వస్తున్న బీజీపీకి ఈ సారి మాత్రం గడ్డు పరిస్థితులు ఎదురు కాక తప్పదని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా గుజరాత్ లో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుందంటున్నాయి. రంగంలో ఆప్ ఉండటంతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ అనివార్యమైన పరిస్థితుల్లో తాజాగా శ్రీ ఆత్మసాక్షి (ఎస్ఎఎస్) సర్వే ఫలితాలు పట్టణ ప్రాంతాలకే ఆప్ ప్రభావం పరిమితమైందని తేల్చింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల అంటే డిసెంబర్ 1,5 తేదీలలో రెండు ధఫాలుగా జరగనున్న సంగతి విదితమే. ఈ ఎన్నికలలో బీజేపీ- కాంగ్రెస్ ల మధ్య హోరా హోరీ పోరు జరగనుందని ఎస్ఎఎస్ సర్వే పేర్కొంది. అయితే పట్టణ ప్రాంతాలలో కాంగ్రెస్ అవకాశాలపై ఆమ్ఆద్మీ పార్టీ తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నప్పటికీ గ్రామీణప్రాంతాలలో మాత్రం కాంగ్రెస్ పై చేయి సాధించడం ఖాయమని సర్వే తేల్చింది. గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ కంటే కాంగ్రెస్ కు 4.5 నుంచి 5 శాతం ఓట్లు అధికంగా వస్తాయని పేర్కొంంది.
ప్రధానంగా సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్ లలో బీజేపీ అభ్యర్థులు తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని ఎస్ఎఎస్ సర్వే పేర్కొంది. నిరుద్యోగ యువత, రైతులు, మత్స్య కారులు, ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీలలో బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని పేర్కొన్నారు. అయితే ఇప్పటికిప్పుడు గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే 94 నుంచి 98 స్థానాలలో బీజేపీ విజయం సాధించే అవకాశాలున్నప్పటికీ.. ఎన్నికల ప్రక్రియ కొనసాగే క్రమంలో రాష్ట్రంలో బీజేపీ తన ఓట్ల శాతాన్ని గణనీయంగా కోల్పోయే అవకాశాలు ప్రస్ఫుటుంగా కనిపిస్తున్నాయని సర్వే పేర్కొంది.
బీజేపీలో మరో సారి అధికారం చేపట్టాలన్న బీజేపీ ఆకాంక్షసులభ సాధ్యం అయితే కాదని సర్వే ఫలితం వెల్లడించింది. ఇప్పటికే ఆప్, కాంగ్రెస్ పార్టీల వాగ్దానాలు జనంలోకి వెళ్లిపోయాయనీ, అయితే ఇతర పార్టీలతో పోలిస్తే క్షేత్ర స్థాయిలో బీజేపీ కేడర్ కు ప్రభావమంతమైన క్యాడర్ ఉండటం ఒక్కటే ఆ పార్టీకి కలిసి వచ్చే అంశమని సర్వే పేర్కొంది. అయితే గ్యాస్, పెట్రోల్, డీజిల్ధరలపెరుగుదల, నిరుద్యోగం, లోపభూయిష్టంగా విద్యా సంస్థల పని తీరు, 33 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, 8 మంది మంత్రులకు టికెట్లు నిరాకరిండం వంటి అంశాలు బీజేపీకి వ్యతిరేకంగా ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయని సర్వే పేర్కొంది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం బీజేపీకి దాదాపు 6.25 శాతం మందిని ఓట్లను దూరం చేసే అవకాశం ఉందంటున్నారు.
కాగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతంలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ల మధ్య త్రిముఖ పొరు హోరాహోరీగా జరిగే అవకాశం ఉండగా.. గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్య ముఖాముఖీ పోరే జరుగుతుందని సర్వే వివరించింది. 48 అసెంబ్లీ స్థానాలున్న సౌరాష్ట్ర ప్రాంతంలో బీజేపీ కేవలం 11 నుంచి15స్థానాలలోనే విజయం సాధించే అవకాశాలున్నాయనీ, అదే కాంగ్రెస్22నుంచి23 స్థానాలలోనూ, ఆప్ మూడు నుంచి నాలుగు స్థానాలలోనూ గెలుపు అవకాశాలున్నాయనిఎస్ఎఎస్ సర్వే పేర్కొంది. మరో 6స్థానాలలో తీవ్రమైన పోటీ నెలకొని ఉన్నట్లు సర్వే తేల్చింది.