మునుగోడులో మా విజయం వామపక్షాల చలవే.. అంగీకరించిన టీఆర్ఎస్
posted on Nov 8, 2022 @ 10:52PM
మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు వామపక్షాల చలవే అని టీఆర్ఎస్ అంగీకరించింది. కమ్యూనిస్టుల వల్లే తాము గెలిచామని మునుగోడు ఎలక్షన్‌కు ఇంచార్జ్‌గా వ్యవహరించిన మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. దీనిని బట్టే మునుగోడు విజయం బలుపు కాదన్న వాస్తవాన్ని టీఆర్ఎస్ అంగీకరించినట్లైంది. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి సహకరించినందుకు వామపక్షాలకు కృతజ్ణతలు తెలిపిన మంత్రి జగదీష్ రెడ్డి నేరుగా వారి కార్యాలయానికి వెళ్లి మరీ ధన్యవాదాలు చెప్పి వచ్చారు.
వామపక్షాలు టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలిపాయనీ, స్వయంగా ప్రచారంలోనూ పాల్గొన్నాయనీ జగదీశ్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. బీజేపీ కుట్రలను ఎదుర్కోవాలనే వ్యూహంలో భాగంగానే వామపక్షాలు తమకు అండగా నిలిచాయని చెప్పారు. ఒక విధంగా మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి క్రెడిట్ మొత్తం వామపక్షాలకు ఇచ్చేసినట్లు టీఆర్ఎస్ తీరును బట్టి తెలుస్తోంది. ప్రజలతోనే మా పొత్తు, పార్టీలతో కాదు అంటూ ఇంత కాలం చెబుతూ వచ్చిన టీఆర్ఎస్ అధినేత.. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయం వెన్నాడటంతో వామపక్షాలను శరణు జొచ్చారు. గతంలో కమ్యూనిస్టులా వారెక్కడున్నారు అంటూ ఎద్దేవా చేసిన కేసీఆర్.. ఇప్పుడు వారిని వెతుక్కుంటూ వెళ్లి మరీ పొత్తు పెట్టుకున్నారని విపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో వామపక్షాల ఓటు పది వేల వరకూ ఉంటుందని అంచనా. సరిగ్గా వామపక్షాల ఓట్లే టీఆర్ఎస్ కు మెజారిటీ తీసుకువచ్చాయని చెప్పవచ్చు.
ఆ ఓట్లే కనుక టీఆర్ఎస్ కు రాకుండా ఉంటే మునుగోడులో విజయం అందని ద్రాక్షగానే మిగిలి ఉండేదన్న విషయం అర్ధం కావడంతోనే కేసీఆర్ మంత్రిని సీపీఎం కార్యాలయానికి పంపి మరీ ధన్యవాదాలు చెప్పించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదీ కాక.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కు మద్దతుగా ఏ పార్టీ ముందుకు రాని పరిస్థితుల్లో కేసీఆర్ పూర్తిగా వామపక్షాల మీదే ఆధారపడ్డారనీ, బీజేపీ వ్యతిరేక విధానాలకు ఒక సిద్ధాంతం పునాదిగా వామపక్షాలను తోడు తెచ్చుకున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అందుకే కమ్యూనిస్టులా వాళ్లెక్కడ ఉన్నారన్న ఆయన ఇప్పుడు వారినే కోరి దగ్గరకు చేర్చుకున్నారంటున్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పొత్తులో భాగంగా వారికి ఎన్ని సీట్లిస్తారు? అసలు ఇస్తారా అన్న ప్రశ్నలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి. పైగా జాతీయ రాజకీయాల్లోనూ కమ్యూనిస్టుల మద్దతు కేసీఆర్ కు అవసరమాయే. అందుకే ప్రజలతోనే పొత్తన్న కేసీఆర్ ఇప్పుడు పొత్తులు ఉంటేనే ప్రజల వద్దకు అంటున్నారని సెటైర్లు పేలుతున్నాయి.