విభజన సమస్యలపై ఒంటి చేతి చప్పట్లా? కేంద్రానికి చిత్తశుద్ధి ఏదీ
posted on Nov 9, 2022 9:15AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్ల కావస్తోంది. ఇప్పటికీ విభజన సమస్యలు అలాగే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలే పరిష్కారం కాలేదు. ఇది ఇరు రాష్ట్రాల మధ్యా అగాధానికీ, వివాదాలకూ దారి తీస్తోంది.
అయినా కేంద్రం ఈ విషయంలో తన తాత్సార వైఖరిని ఇసుమంతైనా విడువడం లేదు. ఎప్పుడో తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా విభజన సమస్యలు ఉన్నాయని గుర్తుకు వచ్చినప్పుడు నామ్ కే వాస్తే ఓ సమావేశం ఏర్పాటు చేయడం.. ఇరు రాష్ట్రాల అధికారులనూ సమావేశ పరిచి కొద్ది సేపు ముచ్చట్లాడి మరోసారి కలుద్దాం అంటూ ముగించేయడమే ఈ ఎనిమిదేళ్ల కాలంలో జరుగుతూ వస్తోంది. ఇప్పుడు మరో మారు కేంద్రం అదే చేస్తోంది. అయితే ఈ సారి ఉభయ రాష్ట్రాల మధ్యా సమస్యల పరిష్కారం కోసం చర్చించేందుకు ఒక రాష్ట్రానికి మాత్రమే ఆహ్వానం పంపింది. ఒంటి చేతి చప్పట్లతో ఉభయ రాష్ట్రాల మధ్యా పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలను పరిష్కరించేస్తానంటోంది. ఇంతకీ విషయమేమిటంటే.. విభజన సమస్యల పరిష్కారం కోసం చర్చించేందకు ఈ నెల 23న కేంద్రం ఒక సమావేశం ఏర్పాటు చేసింది.
ఆ మేరకు సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఏపీకి ఆహ్వానం పింపింది. అయితే తెలంగాణకు మాత్రం ఎలాంటి ఆహ్వానం లేదు. విభజన సమస్యల పరిష్కారం కోసం సమావేశం అన్న సమాచారం మీడియా ద్వారా తెలుసుకున్న తెలంగాణ ఈ విషయంలో కేంద్రాన్ని సంప్రదించింది. అయితే కేంద్రం నుంచి ఎటువంటి సమాచారం లేదు. దీంతో 23నాటి సమావేశానికి కేంద్రం ఒక్క ఏపీకే ఆహ్వానం పంపిందన్న విషయం రూఢీ అయ్యింది. ఇంతకూ తెలంగాణకు ఎందుకు ఆహ్వానం పంపలేదయ్యా అంటే.. గతంలో జరిగిన సమావేశాలలో తెలంగాణ వైఖరి సానుకూలంగా లేదన్న సమాధానం వచ్చింది.
అడిగిన ఏ సమాచారాన్నీ కేంద్రానికి తెలంగాణ ఇవ్వడం లేదనీ, అందుకే విభజన సమస్యలపై ఈ నెల 23న ఏర్పాటు చేసిన సమావేశానికి తెలంగాణకు ఆహ్వానం పంపలేదనీ కేంద్రం వర్గాలు చెబుతున్నాయి. దీంతో 23నాటి సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరు కావడం లేదు. మరి ఒక ఏపీ నుంచి మాత్రం అధికారుల బృందం మాత్రం హాజరు కావడం వల్ల ఈ సమావేశం ద్వారా సాధించేదేముంటుందన్నది ప్రశ్న.