మోడీ మెప్పు కోసం జగన్ వెంపర్లాట
ప్రధాని మోడీ పట్ల ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంల తీరులో ఎంత తేడా.. ఎంత తేడా..!? ఒకరేమో మోడీ ముఖాన్ని చూసేందుకు కూడా ఇష్టపడకుండా కేసీఆర్ ప్రోటోకాల్ ను కూడా పక్కన పెట్టేస్తున్నారు. ప్రధాని మోడీ తెలంగాణ వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం సీఎం స్వాగతం పలకాలి. అయితే.. అలా స్వాగతం పలకకుండా కేసీఆర్ గైర్హాజరవుతున్నారు. కానీ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రం మోడీ మెప్పు కోసం తాను సాగిలపడడమే కాకుండా మొత్తం ప్రభుత్వాన్నే మోడీ కాళ్ల ముందు మోహరిస్తున్నారు. లక్షలాది మందితో ఘనంగా స్వాగతాలు పలుకుతున్నారు. ఇద్దరు సీఎం వ్యవహరిస్తున్న తీరు అరచేతిలో అద్దం మాదిరిగా అంతా స్పష్టంగా తెలిసిపోతోంది.
ప్రధాని నరేంద్ర మోడీ శుక్ర, శనివారాల్లో ఇరు తెలుగు రాష్ట్రాల సందర్శన సందర్భం ఇది. తొలి రోజు విశాఖపట్నంలో.. తరువాతి రోజు రామగుండంలో మోడి పర్యటన ఉంది. అయితే.. రెండు రాష్ట్రాల్లో జరిగే మోడీ పర్యటనల్లో పూర్తి విరుద్ధ వాతావరణం ఉండడం విచిత్రం.
ప్రధాని మోడీ మీద, కేంద్రంలో అధికార బీజేపీ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు తెలంగాణా సీఎం కేసీఆర్. కొంత కాలంగా మోడీ- కేసీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నదనే చెప్పాలి. కొద్ది నెలల క్రితం ప్రధాని మోడీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వస్తున్న సందర్భంగా.. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కేసీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల ధరలు, కరెంట్ మీటర్లు, ధాన్యం కొనుగోలు వంటి పలు అంశాల మీద కేసీఆర్ ప్రశ్నలు సంధించారు. అయితే.. మోడీ హైదరాబాద్ వచ్చారు కానీ, కేసీఆర్ ప్రశ్నలేవీ తనకు వినబడనట్లే వ్యవహరించి తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు. అప్పటికీ ఇప్పటికీ వేడి మరింత పెరిగింది. ‘మా మీదకు ఈడీ, సీబీఐ వేటకుక్కల్ని ఉసికొల్పుతారా..? మీ సంగతేంటో చూస్తా’ అంటూ ఫైరయిపోతున్నారు కేసీఆర్. కేసులు పెట్టినప్పుడు చూసుకుందాం అని గంభీరంగా ఉంటున్నారు. మునుగోడు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో బీజేపీని తన వ్యూహాలతో ఢీకొని విజయం సాధించారు. ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్- బీజేపీల మధ్య మాటలు చాలాదూరం వెళ్లాయి. మొత్తానికి మోడీ విషయంలో తనది పోరుబాటే అని కేసీఆర్ శపథం చేస్తున్నారు. మోడీ ముఖం చూసేందుకు కూడా ఇష్టపడడం లేదు. అందుకే ప్రోటోకాల్ నిబంధనను ఉల్లంఘించి, మోడీకి స్వాగతించకుండా గైర్హాజర్ అవుతున్నారు.
కానీ.. మోడీ పట్ల ఏపీ సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరు భిన్నంగా ఉంటోంది. మోడీ కోసం సాగిలపడడానికి, మోకరిల్లి మొక్కడానికి కూడా ఏ మాత్రం ఆలోచించడం లేదని పరిశీలకులు అంటున్నారు. మోడీ విశాఖపట్నం రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం కోసం మొత్తం ప్రభుత్వాన్ని మోహరించడం గమనార్హం. ఏ అధికారికీ వారం రోజులుగా వేరే పని లేదు. విజయసాయిరెడ్డి కూడా విశాఖలోనే తిష్టవేయడం విశేషం. మోడీ సభకు భారీగా జనాన్ని సమీకరించేందుకు చేయని ప్రయత్నంలేదు. విశాఖలో మోడీ పర్యటన మొత్తం జగన్ ఆయన పక్కనే ఉండేలా కార్యక్రమం రూపొందించుకోవడం గమనార్హం.
ఇక్కడే ఒక విషయం ప్రస్తావించుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మోడీని ఒక్క క్షణం కూడా విడిచి పెట్టేందుకు సిద్ధంగా జగన్ లేకపోవడానికి కారణం కేసీఆర్ కు లేని కేసుల సమస్య అంటున్నారు. సుప్రీంకోర్టు ఒత్తిడి మేరకు జగన్ మీద ఉన్న కేసుల విచారణ త్వరగా ముగిసిపోయే సూచనలు కన్పిస్తున్నాయంటున్నారు. ఈ సమయంలో ప్రధాని మోడీ ఆశీర్వాదం ఉంటే తప్ప ఆ చిక్కుల నుంచి బయటపడడం కష్టమనే భావనలో జగన్ ఉన్నారంటున్నారు. సీబీఐ, ఈడీ తరఫున జగన్ కేసులు వాదిస్తున్న న్యాయవాదులు తమ వాదనలో కొంత మెతక వైఖరి అవలంబిస్తే తప్ప తనపై కేసుల ఉచ్చు విడిపోవడం కష్టమే ఆందోళన వల్లే మోడీకి జగన్ ఇంతలా అడుగులకు మడుగులు వత్తుతున్నారనే ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్నాయి. ఈడీ, సీబీఐ అధికారులను ప్రభావితం చేయగలిగినవారు కేవలం మోడీ ఒక్కరే. అందుకే మోడీకి జీ హుజూర్ అనేందుకు జగన్ ఏమాత్రం ముహమాటం పడడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ప్రధాని పర్యటనకు వచ్చినప్పుడు ఆయా రాష్ట్రాల సీఎంలు పార్టీలకు అతీతంగా ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వాగతం పలుకుతారు. ప్రధాని, సీఎం ఒకే పార్టీకి చెందిన వారైనప్పుడు మాత్రమే సభలు కూడా నిర్వహిస్తారు. ఇద్దరు వేర్వేరు పార్టీల వారైతే.. ప్రధాని పార్టీకి చెందిన స్థానిక నేతలు సభల సంగతి చూసుకుంటారు. ముఖ్యమంత్రి మాత్రం ప్రధాని అధికారిక కార్యక్రమాలకే పరిమితం అవుతారు. మోడీ బీజేపీ అగ్రనేత. బీజేపీతో జగన్ వైసీపీకి ఎలాంటి పొత్తు కూడా లేదు. కానీ మోడీ విషయంలో మాత్రం తాను, బీజేపీ వేరు కాదనేట్లు జగన్ వ్యవహరిస్తుండడం గమనించదగ్గ అంశం. బీజేపీ నేతలు నిర్వహించాల్సిన సభ నిర్వహణ బాధ్యతను జగన్ తన భుజాల మీద వేసుకోవడం వెనుక వేరే లాజిక్కు ఉందంటున్నారు. ప్రధాని సభను బ్రహ్మాండంగా నిర్వహిస్తే, మోడీ తనను మెచ్చుకుని, కేసుల నుంచి బయటికి లాగుతారనే ఆశ జగన్ లో ఉండి ఉండొచ్చంటున్నారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రం ఏపీ, తెలంగాణగా విడిపోయిన క్రమంలో ప్రధాని విషయంలో భిన్న వైఖరులు ప్రదర్శిస్తుండడం ఆలోచించదగ్గ విషమే అంటున్నారు రాజకీయ పండితులు.