ప్రేమ కోసం పురుషుడిగా మారిన స్త్రీ.. లింగమార్పిడి చేయించుకుని మరీ వివాహం
posted on Nov 9, 2022 9:28AM
వాళ్లది విచిత్ర ప్రేమ. ప్రేమించుకునేందుకు అడ్డురాని లింగభేదం తీరా పెళ్లి చేసుకుని కలిసి జీవిద్దామని నిర్ణయించుకునే సమయంలో వచ్చింది. దీంతో ఆ సమస్యను అధిగమించేందుకు వారిలో ఒకరు లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న ఉదంతం ఇది. రాజస్థాన్ కు చెందిన మీరా ఓ పాఠశాలలో డ్రిల్ మాస్టారుగా పని చేస్తోంది.
అదే పాఠశాలలో చదువుకుంటున్న కల్పనతో ప్రేమలో పడింది. ఇరువురికీ స్నేహం కుదిరింది. కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడాన్ని సమాజం అంగీకరించదు కదా ఏం చేద్దాం అన్న ఆలోచనలో పడ్డారు. సరిగ్గా అప్పుడే మీరాకు ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది.
అంతే వెంటనే తాను లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని పురుషుడిగా మారిపోవాలని నిర్ణయించుకుంది. వెంటనే తన ఆలోచనను కార్యరూపంలోకి పెట్టేసింది. ప్రేమను గెలిపించుకోవడం కోసం పురుషుడిగా మారింది. ఆ తరువాత మీరా, కల్పనలిద్దరూ తమ తమ కుటుంబాలను ఒప్పించి పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.