తప్పుడు లెక్కలలో జగన్ ప్రావీణ్యం.. సత్యకుమార్
posted on Nov 9, 2022 @ 9:36AM
ఏపీని అన్ని విధాలా భ్రష్టు పట్టించిన సీఎం జగన్ తప్పుడు లెక్కలు చూపించడంలో కూడా సిద్ధహస్తుడు అయ్యారా? బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్ తన ట్విటర్ వేదిక చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే నిజమే అనిపించక మానదు. చివరికి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించాల్సిన కార్యక్రమంలో కూడా తప్పుడు లెక్కలతో నింపేశారని సత్యకుమార్ ‘జల్ జీవన్ మిషన్- హర్ ఘర్ జల్’ నివేదికలోని స్క్రీన్ షాట్ తో సహా తెరమీదకు తీసుకొచ్చారు.
‘తప్పుడు లెక్కలు, ఉత్తుత్తి ప్రకటనలతో ప్రజలను మోసం చేసే సీఎం వైఎస్ జగన్ జల్ జీవన్ మిషన్ లెక్కలనూ టాంపరింగ్ చేశారని సత్యకుమార్ ఆరోపిస్తున్నారు. ఏపీలో 3 వేల 544 గ్రామాలకు నూరు శాతం కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్లు లెక్కలు చూపారు. కానీ 735 అంటే కేవలం 20 శాతం గ్రామ పంచాయతీలు మాత్రమే పని పూర్తి అయినట్లు సర్టిఫికెట్లు ఇచ్చాయి. మిగిలిన 80.26 శాతం మోసం’ అంటూ సత్యకుమార్ చేసిన ట్వీట్ అందరినీ ఆకర్షిస్తోంది.
గ్రామాల్లోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ చేపట్టింది. అయితే.. ఆశించిన ఫలితాలు సాధించడంలో ఏపీ ఘోరంగా విఫలమైందని సత్యకుమార్ దుయ్యబడుతున్నారు. జల్ జీవన్ మిషన్ పథకాన్ని ఏపీలో వంద శాతం అమలు చేసినట్లు కేంద్రానికి వైసీపీ ప్రభుత్వం నివేదిక పంపించిందని సత్యకుమార్ తెలిపారు. అయితే.. జల్ జీవన్ మిషన్ నివేదిక ప్రకారం కేవలం 20 శాతం గ్రామాలకు మాత్రమే ఈ పథకం ఫలాలు అందాయని ఆయన చెబుతున్నారు. ఈ విషయమై వైసీపీ ప్రభుత్వం పైన, ఏపీ సీఎం జగన్ పైన సత్యకుమార్ ఘాటుగా విమర్శల దాడి చేస్తున్నారు.
తప్పుడు సలహాలు ఇచ్చేందుకే జగన్ ప్రత్యేకంగా 45 మంది సలహాదారులను పెట్టుకున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. తప్పుడు సలహాలు ఇచ్చేందుకు ఆ సలహాదారులకు 130 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సోషల్ మీడియాలో దుయ్యబడుతున్నారు. తప్పుడు ప్రచారం చేస్తూనే జగన్ ఈ మూడున్నరేళ్లుగా పాలన లాగించారని సత్యకుమార్, నెటిజన్లు ఆరోపిస్తున్నారు.