వైసీసీలో లుకలుకలు.. ముదిరిన విభేదాలు.. జిల్లా అధ్యక్షపదవులకు రాజీనామాలు!
posted on Nov 9, 2022 @ 9:51AM
జగన్ పార్టీలో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. పార్టీ జిల్లా అధ్యక్ష పదవులకు సీనియర్లు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. పార్టీ పరువు బజారున పడకండా ఉండేందుకు రాజీనామాల ప్రకటన వద్దని వైసీపీ అగ్రనాయకత్వం బుజ్జగింపులను కూడా వినే పరిస్థితుల్లో సీనియర్లు లేరు. పార్టీ ప్రతిష్ట మంటగలిసినా బేఫికర్ అంటూ తమ అసమ్మతి గళాన్ని విప్పుతున్నారు. వారిలో అసంతృప్తి ఎంతగా గూడు కట్టుకుందంటే.. తమ రాజీనామాతో హైకమాండ్ ను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశమే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
పార్టీలో అసమ్మతి జ్వాలలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయన్న వార్తలు చాలా కాలంగానే వినవస్తున్నాయి. వైసీపీ శ్రేణులు కూడా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచేందుకు ఏమీ పెద్దగా ప్రయత్నించలేదు. జగన్ ఎప్పుడైతే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారో.. నాటి నుంచే వైసీపీ అప్పటి దాకా మూసి ఉంచిన గుప్పెట తెరిచేసినట్లైంది. జగన్ మాటే వేదం, ఆయన నిర్ణయమే శిరోధార్యం అంటూ పార్టీలో అప్పటి దాకా ఉన్న బిల్డప్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తరువాత మటు మాయమైంది. బహిరంగంగా నిరసనలు వెల్లువెత్తాయి, జగన్ స్వయంగా బుజ్జగింపులకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. సరే ఎలాగో అప్పటికి పరిస్థితి సద్దుమణిగినా.. అప్పటి నుంచి వైసీపీలో అసమ్మతి జ్వాలలు నివురుగప్పిన నిప్పులా అలాగే ఉన్నాయి.
తాజాగా అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి కాపు రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు. ఇక ఆయన స్థానంలో మరొకరిని నియమించాలన్నా ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొని ఉంది. కానీ ఈ పరిస్థితి ఒక్క అనంతపురం జిల్లాకే పరిమితం కాలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి మాజీ మంత్రి సుచరిత రాజీనామా చేశారు. ఇదే దారిలో పలు జిల్లాల అధ్యక్షులు ఉన్నారని చెబుతున్నారు. వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్ష పదవులను ఒక బుజ్జగింపు విధానంగా మార్చింది. తొలి సారి మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన వారికీ, అలాగే మంత్రిపదవులు ఆశించి రానివారికీ తాయిలం ఇచ్చినట్లుగా జిల్లా అధ్యక్ష పదవులను కట్టబెట్టింది.
మీమీ జిల్లాలలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే ఆ అభ్యర్థికి మంత్రి పదవి గ్యారంటే అని జగన్ బంపరాఫర్ కూడా ఇచ్చారు. అంటే జిల్లా అధ్యక్షులకు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అవకావం ఉండదు.. ఎవరినో గెలిపించడానికి, వారికి మంత్రిపదవి ఇప్పించడానికి కష్టపడాలా అన్న భావన వారిలో నెలకొంది. ఈ కారణంగానే పార్టీ పదవులంటే వద్దు బాబోయ్ అని పారిపోయే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది.