జగన్ దారెటు..? గడప గడపకూ లక్ష్యం ఏమిటి?.. ఎమ్మెల్యేల ఆందోళనకు కారణం?
అభివృద్ధి, సంక్షేమం గురించి పట్టించుకోకండి.. ప్రజా విమర్శలను లెక్క చేయకండి.. నిరసన సెగలు మాడ్చేస్తున్నా గడపగడపకూ తిరగండి అంటూ పార్టీ ఎమ్మెల్యేలకు జగన్ హుకుం దేనికి సంకేతం. రోగం ఒకటైతే జగన్ మందు మరొకటి వేస్తున్నారంటూ పార్టీ నాయకులు, విపక్షాలే కాదు.. విమర్శకులు, విశ్లేషకులు కూడా పదే పదే చెబుతున్నా అయిన ఎందుకు పట్టించుకోవడం లేదు? చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్లు, ఆయన తన ఎదుట నోరెత్తలేరన్న నమ్మకంతో ఎమ్మెల్యేలకు పాఠాలు బానే చెపుతున్నారు.
గడప గడపకు వెళ్ళక పోతే గండం తప్పదని, టికెట్ రాదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీటింగుల్లో, వర్క్ షాపుల్లో పేరు పెట్టి మరీ క్లాసులు పీకుతున్నారు. ఈ తంతు ఒక విధంగా గుడ్డొచ్చి పిల్లను ఎక్కిరించింది అన్నట్లు ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. రాజకీయాలలో డక్కీమొక్కీలు తిన్న సీనియర్ మంత్రులు,ఎమ్మెల్యేలకు జగన్ గెలుపు పాఠాలు వినిపిస్తున్నారు. రాజకీయాల్లో షార్ట్కట్స్ ఉండవని చెప్పు కొస్తున్నారు. నిజానికి, ఆయన క్లాస్ పీకుతున్న వైసీపీ ఎమ్మెల్యేల విషయం పక్కన పెడితే జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినది మాత్రం అడ్డదారిలోనే. వైఎస్సార్ ఆకస్మిక, మరణాన్ని జగన్ రెడ్డి సానుభూతిగా మలచుకుని అడ్డదారుల్లో రాజకీయ నిచ్చెనలు ఎక్కారు. అంతే కానీ, కష్టపడి కింది నుంచి పైకొచ్చిన నాయకుడు కాదు. ఆయన ఆస్తులు ఎలా సంపాదించారో, అధికారాన్ని అదే దారిలో అందుకున్నారు.
అయినా, ఆయన ఇప్పుడు రాజకీయాల్లో నిలబడాలంటే కష్టపడవలసిందే, జనంలో ఉండవలసిందే అంటూ,గడప గడప గడపకు వెళ్లి, జనం, ‘దీవెనలు’ అందుకోవాలని చెపుతున్నారు. నిజానికి, ముఖాన నెత్తురు చుక్కలేకుండా అయన ఎదురుగా కుర్చుని పాఠాలు వింటున్నవారిలో చాలా మందికి జగన్ రెడ్డి కంటే చాలా చాలా అనుభవమే వుంది. రాజకీయాల్లో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి గెలుపు ఓటముముల పోరాటంలో ఎదిగొచ్చిన వారే. అలాంటి సీనియర్ ఎమ్మెల్యేలకు జగన్ రెడ్డి పాఠాలు చెప్పడం, అయితే ఆయన గడుసు తనం అవుతుంది, కాదంటే అజ్ఞానం అనిపించుకుంటుంది. అదీ కాదంటే ఆ ఎమ్మెల్యేల ఖర్మ అవుతుంది తప్ప మరొకటి కాదని పరిశీలకులు అంటున్నారు.
అసలింతకీ, జగన్ రెడ్డి ఎందుకు, గడప గడపకు కార్యక్రమం ఒక్కటే గెలుపు మంత్రం అని ఎందుకు అనుకుంటున్నారు. సమీక్షలు పెట్టి మనీ మంత్రులు, ఎమ్మెల్యేల ముఖాన, ఓటమి ముద్ర వేసి కించపరుస్తున్నారు. అంత్య నిష్టూరం, కంటే ఆది నిష్టూరం మేలని భావించి ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారా? వాస్తవానికి ముఖ్యమంత్రి జగనే గత మూడేళ్ళుగా ప్యాలెస్ గడప దాటకుండా, దాటినా పోలీసు బందోబస్తు మధ్య జనానికి ముఖం చూడకుండా పరదాలు కప్పించుకుని మరీ తిరుగుతున్నారు. అలాంటి సీఎం గడప గడపకు మంత్రులు, ఎమ్మెల్యేలను బలవంతంగా ఎందుకు తరుముతున్నారు? ప్రజా వ్యతిరేకతను అధిగమించి.. మరో సారి అధికారంలోకి రావాలంటే.. తన నిష్క్రియాపరత్వంతో ప్రజలలో డమ్మీలుగా మారిన ఎమ్మెల్యేలను వదిలించుకుని కొత్త వారితో మరోసారి అధికారం కోసం ప్రయత్నించాన్న వ్యూహమే ఇందుకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏం చేసినా ఎంతమందిని మార్చినా ఓటమి తప్పదంటూ సర్వేలు ఘోషిస్తున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో మూడొంతుల మందిని పక్కన పెట్టి కొత్త వారిని రంగంలోకి దింపే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని పరిశీలకులు అంటున్నారు.
విజయంపై జగన్ కు మిగిలిన దింపుడు కళ్లెం ఆశ అది ఒక్కటే అని అంటున్నారు. అందుకే వర్క్ షాపులు, సమీక్షల పేరిట ఎమ్మెల్యేలకు పొమ్మనలేక పొగపెట్టే చర్యలకు ఉపక్రమిస్తున్నారని చెబుతున్నారు. జగన్ పాచిక పారుతున్నట్లే కనిపిస్తోందని అంటున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలా మంది పోటీకి విముఖత చూపుతున్నారన్న సంకేతాలు కనిపించడం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. జగన్ చెబుతున్నట్లు గడప గడపకూ మన ప్రభుత్వం నిజంగానే గెలుపు మత్రం అయి ఉంటే జగన్ హెచ్చరికలను ఎమ్మెల్యేలు లైట్ గా తీసుకునే అవకాశం ఇసుమంతైనా ఉండేది కాదనీ, కానీ జగన్ చెప్పినా, హెచ్చరించినా, టికెట్ ఉండదని చెబుతున్నా ఎమ్మెల్యేలు పెద్దగా పట్టించుకోకుండా ఎందుకు ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జగన్ ప్రజా విశ్వసనీయత సంగతి పెడితే సొంత పార్టీలు, ఎమ్మెల్యేల విశ్వాసమే కోల్లోయారని, అందుకు నిదర్శనమే చాలా మంది సీనియర్ నేతలకు కూడా వచ్చే ఎన్నికలలో పోటీకి పెద్దగా సుముఖత లేకపోవడమే నిదర్శనమని అంటున్నారు. బుగ్గన, పేర్ని నాని వంటి నేతలే అధినేత స్వయంగా చెప్పినా పోటీకి ససేమిరా అంటున్న పరిస్థితి. ఇస్తే వారసులకు టికెట్ ఇవ్వండి.. లేకుంటే లేదు.. మేం మాత్రం ఎన్నికల బరిలో పోటీకి తీరేది లేదని కుండబద్దలు కొడుతున్నట్లు చెప్పడానికి వెనుక కారణం ఓటమి భయమేనని అంటున్నారు. అలాగే సీనియర్ నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ కూడా మాకే గెలిచే అవకాశాలు అంతంత మాత్రం అనుకుంటుంటే... ఇక వారసులను దింపి ఉపయోగమేమిటనీ, వారిని గెలిపించుకునే పరిస్థితి లేదని అన్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వైసీపీ నాయకులు వచ్చే ఎన్నికలలో గెలిచేది ఎలాగూ లేదన్న నిర్ణయానికి వచ్చేశారా అంటే.. ఇటీవల ఒక సందర్భంలో మంత్రి బొత్స సత్యనారాయణ అన్న మాటలను బట్టి ఔననే అనుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఇటీవల బొత్స ఓ సందర్భంలో ప్రతి విషయం ప్రజలకు చెప్పి, వారి ఆమోదం పొంది చేయడం మా వల్ల కాదు అని ఊరుకోకుండా.. మహా అయితే ఏమౌతుంది ఓడిపోతాం అంతేగా అంటూ వ్యాఖ్యానించారు. ఆ మాటల ద్వారా ప్రజా శ్రేయస్సు, ప్రజాభీష్టం, ప్రజల ఆకాంక్షలు తమ సర్కార్ కు ఏ మాత్రం పట్టవని తాము తలచిందే చేస్తాం, మా ప్రభుత్వం మొండి కేసేసిందని చెప్పకనే చెప్పారు. వాస్తవానికి సీఎం జగన్ కు కూడా ఓటమి విషయంలో ఒక స్పష్టత వచ్చేసిందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యమంత్రి ఇటీవల నిర్వహించిన వర్క్ షాపులో 27 మంది ఎమ్మెల్యేల పేర్లను మాత్రమే ఓటమి జాబితాలో చేర్చినా, వాస్తవానికి మొత్తం 151 మంది ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేలలో కనీసం 27 మంది కూడా విజయం సాధించే అవకాశాలు లేవన్నది జగన్ కు అందిన నివేదికలు, ఇటీవలి సర్వేల సారాంశమని వారు విశ్లేషిస్తున్నారు.
అయితే పార్టీ ప్రస్తుత పరిస్థితి ఎమ్మెల్యేలు ఒక కారణమైతే.. ఆ ఓటమికి ప్రధాన బాధ్యత మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అనుభవ రాహిత్యంతో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు. ఎమ్మెల్యేలను ఉత్సవ విగ్రహాలు చేసి వారికి విధులు, నిధులు లేకుండా చేసి, వాలంటీర్లతో పనులు కానీయడంతో ఎమ్మెల్యేలకు ప్రజలతో సంబంధాలు తెగిపోయేలా చేసిన విధానాలు ప్రధాన కారణమని అంటున్నారు. అలాగే గత మూడేళ్ళుగా నియోజక వర్గం అభివృద్ధి నిధులు విడుదల కాకపోవడంతో ప్రజలు అడిగే ఏ చిన్నపని చేయలన్నా, చేతులు ఆడని పరిస్థితిలో ఎమ్మెల్యేలు దిక్కులు చూస్తున్నారు. మరోవంక మీట నొక్కితే ఓట్లు రాలతాయని ఆయన వేసుకున్నతప్పుడు లెక్కలూ ఇవన్నీ కలిసి వైసీపీ ప్రస్తుత పరిస్థితికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ప్రజా వ్యతిరేకత అంతా ఎమ్మెల్యేల మీదే అని నిర్ధారించి, వారిని వదిలించుకునేందుకే జగన్ గడప గడప అంటూ జపం చేస్తున్నారంటున్నారని చెబుతున్నారు. మీట నొక్కి డబ్బులు లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు వేస్తున్నా జనం వ్యతిరేకత ఎందుకు అని జగన్ ఆశ్చర్యపోతున్నారంటున్నారు. నిజానికి ప్రజలు సంక్షేమ పథకాలు అందితే చాలని అనుకోవడం లేదు. అభివృద్ధి కూడా కావాలని కోరుకుంటున్నారు.
మౌలిక సదుపాయాల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కడని ప్రశ్నిస్తున్నారు.సంక్షేమ పథకాలు ప్రయోజనాలు అందుకుంటున్న ప్రజలు కూడా, గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. విద్యా వైద్య సదుపాయాల గురించి అడుగుతున్నారు? మూడేళ్ళలో విద్యుత్ చార్జీలు ఏడు సార్లు, ఆర్టీసీ చార్జీలు నాలుగు సార్లు ఎందుకు పెంచారని ప్రశ్నిస్తున్నారు. నిత్యావసర సరకుల ధరలను అదుపు చేయడం చేతకాదా? అని దుయ్యబడుతున్నారు.
అంచల వారీ మధ్య నిషేధం ఏమైందంటున్నారు. సంక్షేమ పథకాల పేరున చేస్తున్న అప్పులు, వసూలు చేస్తున్న పన్నులు ఏమవుతున్నాయని అడుగుతున్నారు. ఈ చేత్తో ఇస్తూ ఆ చేత్తో అంతకు పదిరెట్లు గుంజుకుంటున్న సర్కార్ దగాకోరు విధానాలను ప్రశ్నిస్తున్నారు. అందుకే, ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లేందుకు గజగజలాడుతున్నారు. నిజానికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి కాలు కదపకుండా నిర్ణయాలు తీసుకుని జగన్, బటన్లు నొక్కి, రాష్ట్రంలో 85 శాతం మందికి ప్రభుత్వ సహాయం అందుతోందని లెక్కలు చెబుతున్నదీ ఆయనే , అయినా పేరుకు మాత్రమే పదవులలో ఉన్న ఎమ్మెల్యేలపై నెపం నెట్టి చేతులు దులిపేసుకునేందుకే జగన్ ప్రయత్నిస్తున్నారు.