కింగ్ కోహ్లీకి గాయం.. రేపటి సెమీస్ లో ఆడతాడా?
posted on Nov 9, 2022 @ 12:23PM
భారత్ స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీ గాయపడ్డాడు. గురువారం (నవంబర్10) జరిగే సెమీ ఫైనల్ లో ఆడతాడా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. టి20 వరల్డ్ కప్ టోర్నీలో గురువారం (నవంబర్ 10) టీమ్ ఇండియా ఇంగ్లాండ్ తో తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఫైనల్ కు చేరాలన్నా, కప్ సాధించాలన్నా ముందు ఇంగ్లాండ్ తో జరిగే సెమీ ఫైనల్ లో విజయం సాధించి తీరాలి. అంతటి కీలక మ్యాచ్ ముందు కింగ్ కోహ్లీ గాయపడ్డాడన్న సమాచారం అభిమానుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది.
అయితే కోహ్లీ గాయం తీవ్రవైనది కాదనీ, కచ్చితంగా ఇంగ్లాండ్ తో జరిగే సెమీస్ లో కోహ్లీ ఆడతాడనీ టీమ్ ఇండియా వర్గాలు చెబుతున్నాయి. ఐసీసీ కూడా కోహ్లీ గాయం తీవ్రమైనదేమీ కాదని నిర్ధారించింది. ఇలా ఉండగా కీలక మ్యాచ్ ముందు ఆటగాళ్లకు ప్రాక్టీస్ అత్యంత అవసరం.. అయితే ప్రాక్టీస్ సెషన్ లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గాయాల పాటు కావడం తథ్యం.
మంగళవారం ప్రాక్టీస్ సెషన్ లో టీమ్ ఇండియా స్కిప్పర్ రోహిత్ గాయపడిన సంగతి విదితమే. ఆ గాయం కూడా తీవ్రమైనది కాకపోవడంతో టీమ్ ఇండియా ఊపిరి పీల్చుకుంది. మరుసటి రోజే అంటే బుధవారం కోహ్లీ గాయపడ్డాడన్న వార్త అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. మొత్తం మీద ఇద్దరికీ తీవ్ర గాయాలు కాదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.