నిర్మాణాలు తెలియదు కానీ.. మహా జోరుగా కూల్చివేతలు.. జగన్ సర్కార్ స్పెషాలిటీ!
posted on Nov 9, 2022 5:30AM
నిర్మాణాలు, అభివృద్ధిని పట్టించుకోకపోయినా ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ విధ్వంసాల విషయంలో మాత్రం తెగ ఉత్సాహంతో పని చేస్తోంది. ప్రజా వేదిక కూల్చివేతతో ఆరంభమైన విధ్వంస కాండ ఈ మూడున్నరేళ్లలో రెట్టించిన ఉత్సాహంతో కొనసాగిస్తూనే ఉంది. మొన్నటికి మొన్న మంగళగిరి ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ పేరిట ఇళ్లను కూల్చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు విశాఖలోనూ కూల్చివేతల పర్వం కొనసాగించింది. మంగళగిరి ఇప్పటం లో జనసేన ఆవిర్భావ సదస్సుకు స్థలం ఇచ్చారన్న కక్షతో ఆ పార్టీ మద్దతు దారుల ఇళ్లు లక్ష్యంగా కూల్చివేతలకు పాల్పడిన జగన్ సర్కార్ విశాఖలో ప్రధాని మోడీ పర్యటన పేర ఈ కూల్చివేతల పర్వం కొనసాగించింది.
విశాఖ ఆంధ్రా వర్సిటీ మైదానం సమీపంలోని దుకాణాలను అధికారులు రాత్రికి రాత్రి జేసీబీలతో కూల్చివేశారు. నిజానికి ఈ నెల 12న ఆంధ్రావర్సిటీలో జరగనున్న ప్రధాని మోడీ సభ కోసం ఈ దుకాణాలను కూల్చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు వాటిని మూసి ఉంచితే సరిపోతుంది. అధికారులు తొలుత ఆయా దుకాణదారులను అదే సమాచారం ఇచ్చారు. నవంబర్ 12న మోడీ సభ కారణంగా ఆ రోజు దుకాణాలు తెరవవద్దని ఆదేశించారు. అందుకు దుకాణ దారులు అంగీకరించారు కూడా. కానీ అంతలోనే ఏమైందో ఏమో కానీ సోమవారం(నవంబర్7) అర్ధరాత్రి చెప్పా పెట్టకుండా, కనీసం దుకాణ దారులకు సమాచారం కూడా ఇవ్వకుండా దుకాణాలను జేసీబీలతో కూల్చేశారు.
మంగళవారం ఉదయం తమ దుకాణాలను తెరుద్దామని వచ్చే వరకూ ఈ కూల్చివేతల సంగతి దుకాణదారులకు తెలియనే తెలియదు. గత పాతికేళ్లుగా తాము అక్కడే తమ వ్యాపారాలు చేసుకుంటున్నామనీ, కనీస సమాచారం లేకుండా తమ దుకాణాలను కూల్చివేయడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోడీ సభ రోజున దుకాణాలు తెరవవద్దని మాత్రమే తమకు సమాచారమిచ్చారని వారు చెబుతున్నారు. అలా కాకుండా దుకాణాలను కూల్చేస్తామని చెప్పి ఉంటే వాటిలోని విలువైన వస్తువులు, సామగ్రిని తరలించుకునే వాళ్లం కదా అని ప్రశ్నిస్తున్నారు. ఉక్రెయిన్ మీద రష్యా అణుబాంబు వేసినట్లుగా జగన్ ప్రభుత్వం తమ మీద కూల్చివేతల బాంబు వేసిందన్నారు.
ఇలా ఉండగా ఈ కూల్చివేతలపై విపక్షాలు మండి పడుతున్నాయి. సంబంధం లేకుండా తగుదునమ్మా అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి మోడీ పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు నడుం బిగించడమేమిటి? ఇప్పుడు ఆ సభకు ఎంత మాత్రం అడ్డు కానీ దుకాణాలను కూల్చివేయడమేమిటని ప్రశ్నిస్తున్నాయి. విశాఖ కబ్జాల పర్వంలో ఇది కూడా ఒక భాగమేనని ఆరోపిస్తున్నాయి. ఈ స్థలం మీద విజయసాయి కన్ను పడటం వల్లనే దుకాణదారులు రోడ్డు పాలయ్యారని ఆరోపిస్తున్నాయి. ప్రధాని మోదీ పర్యటనను అవకాశంగా తీసుకుని దుర్మార్గంగా దుకాణాల కూల్చివేతకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు.