మునుగోడు మెజారిటీపై కేసీఆర్ అసంతృప్తి.. ఇన్ చార్జ్ మంత్రిపై ఫైర్
posted on Nov 9, 2022 @ 10:51AM
మునుగోడు ఉప ఎన్నికలో విజయం పట్ల టీఆర్ఎస్ నేతలంతా సంబరాల్లో ఉంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రం మెజారిటీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక విజయం తరువాత కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకునేందుకు మునుగోడు నుంచి విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి, మంత్రి జి. జగదీశ్వర్ రెడ్డి ప్రగతి భవన్ కు వెళ్లారు.
ఈ సందర్భంగా మునుగోడులో విజయం సాధించినందుకు కూసుకంట్లను, ప్రచారంలో బాగా పని చేసినందుకు మంత్రి జగదీశ్వరరెడ్డిని అభినందించాల్సింది పోయి కేసీఆర్ మెజారిటీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ప్రచారం విషయంలో అలసత్వం ప్రదర్శించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వామపక్షాలతో పొత్తు పెట్టుకుని మరీ రంగంలోకి దిగినా.. విజయం ఘనంగా లేకపోవడం.. అంచనా మేరకు మెజారిటీ రాకపోవడం పట్ల కేసీఆర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఒక వైపు కమ్యూనిస్టుల మద్దతు, మరో వైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలిపోయే విధంగా పెద్ద సంఖ్యలో అభ్యర్థులూ ఉన్నా కూడా మెజారిటీ పెరగకపోవడమేమిటని కేసీఆర్ మంత్రి జగదీశ్వరరెడ్డిని ప్రశ్నించినట్లు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు ఇన్ చార్జలుగా ఉన్న చోట్ల కూడా మెజారిటీ ఎందుకు రాలేదని ప్రశ్నించినట్లు సమాచారం. ఒక వేళ కమ్యూనిస్టులను కలుపుకుపోకుండా ఉన్నట్లైతే పార్టీ పరువు గంగలో కలిసేదే కదా అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. కేవలం కమ్యూనిస్టుల వల్లే మునుగోడులో మనం గెలిచామని కేసీఆర్ అన్నారు.
అంతే కాకుండా బీజేపీకి ఏ మాత్రం పట్టు లేని మునుగోడులో ఆ పార్టీకి 87 వేల ఓట్లు రావడాన్ని కేసీఆర్ చాలా సీరియస్ గా తీసుకున్నారని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. కేవలం తన చొరవ వల్లే వామపక్షాలు తెరాసకు మద్దతు ఇచ్చాయనీ, ఇంత మందిని నియోజకవర్గంలో మోహరించి మానిటర్ చేయమంటే ఏం చేశారనీ, ఆశించిన స్థాయిలో ఓట్లు ఎందుకు రాబట్టలేకపోయారనీ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి.