టి20 వరల్డ్ కప్ ఫైనల్స్ కు పాకిస్థాన్.. న్యూజిలాండ్ ఇంటి ముఖం
posted on Nov 9, 2022 @ 4:00PM
టి20 వరల్డ్ కప్ లో కేవలం అదృష్టం కలిసి వచ్చి నాకౌట్ కు చేరుకున్న పాకిస్థాన్ సెమీస్ లో అదరగొట్టింది. అన్ని విధాలుగా తన కంటే బలమైన న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ లో సమష్టి గా రాణించింది. చివరికి 7 వికెట్ల తేడాతో కవీస్ ను మట్టికరిపించి ఘనంగా ఫైనల్ లో అడుగు పెట్టింది. ఫైనల్ లో పాకిస్థాన్ ప్రత్యర్థి ఎవరన్నది తేలాలంటే గురువారం (నవంబర్ 10 వరకూ ఆగాల్సిందే.
ఆ రోజు భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో విజేత జట్టుతో పాక్ ఫైనల్ లో తలపడుతుంది. ఇక న్యూజిలాండ్- పాకిస్థాన్ మ్యాచ్ విషయానికి వస్తే అన్ని విభాగాల్లోనూ పాకిస్థాన్ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. ఆట మొత్తంలో ఎక్కడా న్యూజిలాండ్ కు అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యాన్నిప్రదర్శించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.
కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ 42 బంతుల్లో 1 ఫోర్, ఒక సిక్స్ తో 46పరుగులు చేశాడు. డెరిల్ మిఛెల్ మెరుపు బ్యాటింగ్ తో 35 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ తో 53 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. దీంతో 153 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. బాబర్ అజామ్ సరిగ్గా సమయానికి ఫామ్ దొరకపుచ్చుకున్నాడు. 43 బంతుల్లో 7 ఫోర్లతో 53 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు.
మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ కూడా చెలరేగి ఆడటంతో ఏ దశలోనూ న్యూజిలాండ్ పోటీలో లేకుండా పోయింది. రిజ్వాన్ 43 బంతుల్లో 5 ఫోర్లతో 57 పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్ లో ఫిలిప్స్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తరువాత 19వ ఓవర్ చివరి బంతికి మహ్మద్ హారిస్ ఔటయ్యాడు.శాంట్నర్ బౌలింగ్ లో అలెన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
హారిస్ 26 బంతుల్లో రెండు ఫోర్లు 1 సిక్సర్ తో 30 పరుగులు చేశాడు. విజయానికి చివరి ఓవర్ లో పాకిస్థాన్ రెండు పరుగులు చేయాల్సి ఉంది. చివరి ఓవర్ తొలి బంతిని సౌథీ వైడ్ వేశాడు. ఆ తరువాతి బంతికి మసూద్ సింగిల్ తీసి లాంఛనం పూర్తి చేశాడు. ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే పాకిస్థాన్ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. దీంతో పాకిస్థాన్ టి20 ఫైనల్ కు దూసుకెళ్లింది.