దర్యాప్తు సంస్థలతో రాజకీయ పబ్బం!
posted on Nov 15, 2022 8:48AM
తెరాస, బీజేపీలు పోటీలు పడి మరీ రాజకీయాలు చేస్తున్నాయా? ఇందు కోసం దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా వాడుకుంటున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడుగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ నేతలు టార్గెట్ గా ముందుకు సాగుతుంటే.. తెరాస సర్కార్ కూడా సిట్ ఏర్పాటు చేసి బీజేపీ నేతలను టార్గెట్ చేసింది.
ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు దర్యాప్తునకు తెలంగాష సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ కూడా దూకుడు పెంచి బీజేపీ నేతలే టార్గెట్ గా ముందుకు సాగుతోంది. అదే సమయంలో ఐటీ దాడులకు దీటుగా తెలంగాణ సర్కార్ రాష్ట్ర జీఎస్టీ దాడులతో బదులిస్తోంది. ఔను ప్రస్తుతం రాజకీయ వర్గాలలో జోరుగా నడుస్తున్న చర్చ ఇదే. లిక్కర్ స్కాం విషయంలో ఐటీ, ఈడీ, సీబీఐ దాడులను, అరెస్టులను రాజకీయ కక్ష సాధింపు గానే భావిస్తున్న తెలంగాణ సర్కార్ తానూ అదే బాట పట్టిందా అనిపించేలా ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం వెలుగులోనికి వచ్చిన వెంటనే బీజేపీ నేతలు కల్వకుంట్ల కుటుంబం లక్ష్యంగా విమర్శలు గుప్పించి.. కేసీఆర్ తనయ కవితను టార్గెట్ చేశారు.
ఆ కేసులో .. సీబీఐ, ఈడీ దూకుడు పెంచాయి. కవితకు సన్నిహితుల ఇళ్లపై దాడులు జరిగాయి. ఆమె మాజీ కార్యదర్శి అరెస్టయ్యారు. దీంతో తెరాస సర్కార్ కూడా దూకుడు పెంచింది. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు వ్యవహారంలో బీజేపీ నేతలే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు సాగుతోందని అంటున్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని తెలంగాణ సర్కార్ చాలా తీవ్రంగా తీసుకుందనడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ రాష్ట్రం దాటి వెళ్లి కూడా దర్యాప్తు సాగిస్తోంది.మొత్తం మీద ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారాన్ని దేశ వ్యాప్తంగా హైలైట్ చేయాలన్న కృతనిశ్చయంతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారం కేసీఆర్ జాతీయ పార్టీకి దేశ వ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకువచ్చేందుకు దోహదం చేస్తుందంటున్నారు.