సాహసానికి బ్రాండ్ అంబాసిడర్.. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ హీరో కృష్ణ
posted on Nov 15, 2022 @ 12:49PM
కృష్ణ ఈ పేరు సాహసానికి బ్రాండ్ అంబాసిడర్. సంచలనాలకు మరో పేరు. అందరూ ఇప్పటికీ, ఎప్పటికీ ఆయనను సూపర్ స్టార్ అనే పిలుస్తారు. ఆయన నటుడిగా సాధించిన విజయాలకూ, తీసుకున్నసంచలన నిర్ణయాలకు జనం ఇచ్చిన బిరుదు. హీరో కృష్ణ తెలుగు చలన చిత్ర సీమకు, భారతీయ సినిమాకు చేసిన సేవలను పరిగణనలోనికి తీసుకుంటే.. ఆయన సినిమా నటుడు, నిర్మాత, స్టూడియో అధినేత, దర్శకుడు మాత్రమే కాదు.. అంతకు మించి అనిపించక మానదు.
కృష్ణ సినీ రంగాన్ని సాంకేతికంగా పరిపుష్టం చేశారు. పరిశ్రమ పచ్చగా ఉండాలంటే సినిమాల షూటింగ్ లు నిర్విరామంగా సాగుతూనే ఉండాలని భావించారు. సినిమాల సంఖ్య పెరిగితేనే పరిశ్రమలో అందరికీ పుష్కలంగా పని దొరుకుతుందని విశ్వసించారు. ఆ విశ్వాసాన్నిఆచరణలో పెట్టి ఫలితం చూపించారు. అందు కోసం తాను స్వయంగా రోజుకు మూడు షిఫ్టులు పని చేసి పరిశ్రమ నిత్య కల్యాణం పచ్చ తోరణంగా పరిఢవిల్లేందుకు దోహదం చేశారు.
సినీ పరిశ్రమలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ కృష్ణ. కౌబాయ్ చిత్రాలు, జేమ్స్ బాండ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది కృష్ణ. తొలి సినిమా స్కోప్ సినిమా నిర్మాత హీరో కృష్ణ, తొలి 70ఎంఎం సినిమా దర్శకుడు కృష్ణ. సాహసోపేత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ కృష్ణ. రాజకీయంగా ఎన్టీఆర్ తో విభేదించి రాజకీయాలలో కూడా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఏలూరు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు. ఒక కొత్త ప్రయోగం చేద్దామంటే ఎవరైనా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కానీ కృష్ణ మాత్రం అలా కాదు.. ఏదైనా అనుకున్నారంటే చేసి చూపించే వారు.
ఆ విషయంలో ఎన్నికష్ట నష్టాలున్నా భరించేవారు. నిర్మాతల శ్రేయస్సే పరిశ్రమకు శ్రీరామరక్ష అని భావించిన కృష్ణ తనతో సినిమా చేసిన ఏ నిర్మాత అయినా నష్టపోతే.. ఆయనకు మరో సినిమాను ఉచితంగా చేసి ఆదుకున్న మంచి మనిషి. తేనెమనసులు సినిమాతో తనతో పాటు చిత్ర పరిశ్రమకు పరిచయమైన రామ్మోహన్ ను చివరి వరకూ ఆదుకున్న మంచి స్నేహితుడు ఆయన. కృష్ణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అనడంలో సందేహం లేదు. ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతోంది తెలుగువన్.