ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్.. రాజకీయాల్లో ట్రెండీ డైలాగ్
posted on Nov 15, 2022 @ 2:20PM
దేశ రాజకీయాల్లోకి కొత్త ట్రెండ్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో ఈ ట్రెండ్ మరింత బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. అదేంటంటే.. ‘ఒక్క ఛాన్స్’. ‘అధికారంలోకి రావడానికి ఒక్క అవకాశం ఇవ్వండి.. నేనేంటో, నా పరిపాలనా విధానం ఏంటో చూపిస్తా..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటర్లను కోరడంతో ఈ ‘ఒక్క ఛాన్స్’ రాజకీయంగా ఇప్పడు విస్తృత చర్చకు దారి తీస్తోంది. కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంలో ప్రధాని మోడీతో భేటీ అయిన తర్వాతి రోజు విజయనగరం జిల్లా టూర్ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు పొలిటికల్ ఎరీనా మీద ‘ఒక్క ఛాన్స్’ను మళ్లీ తెర మీదకు తీసుకొచ్చాయి. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసి, ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కు ఈ సారి ఎన్నికల్లో ‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ మంత్రంతో ఏమైనా ప్రయోజనం కలుగుతుందా?! అనుకుంటున్నారు.
నిజానికి ‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. నేనేంటో నిరూపించుకుంటా..‘ ఇది సూపర్ హిట్ మూవీ ‘ఖడ్గం’లో నటి సంగీత చెప్పిన డైలాగ్.. అప్పట్లో అది బాగా ప్రాచుర్యం పొందింది. అదే డైలాగ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా హల్ చల్ చేస్తోంది.
గతంలో 2014 ఎన్నికల్లో వెంట్రుకవాసిలో అధికారం అధికారం అందకుండా పోయి, ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఇచ్చిన నినాదం ‘ఒక్క ఛాన్స్’. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా జనంలోకి వెళ్లిన జగన్ ఏపీలో పాదయాత్ర చేస్తూ.. దారి పొడవునా.. ప్రతిచోటా ‘ఒక్క ఛాన్స్’ అంటూ అందరినీ అభ్యర్థించిన విషయం తెలిసిందే. ఈ ‘ఒక్క అవకాశం.. ఒకే ఒక్క అవకాశం’ అని జగన్ అర్థించడం ఏపీ ప్రజల మైండ్ పై బాగా పనిచేసిందనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో జగన్ ను ఏపీ జనం అధికార పీఠంపై కూర్చోబెట్టిన ప్రధాన కారణాల్లో ఒకే ఒక్క ఛాన్స్ కూడా ఒకటని చొప్పొచ్చు. అయితే.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ గడిచిన ఈ మూడున్నరేళ్లలోనూ ‘భస్మాసుర హస్తం’ మాదిరి జనం నెత్తిన చెయ్యిపెట్టారని ప్రతిపక్ష నేతలు ప్రధానంగా టీడీపీ నేతలు దెప్పిపొడుస్తూనే ఉంటారు.
చంద్రబాబు కేబినెట్ లో ఐటీ, పంచాయతీరాజ్ మంత్రిగా.. ప్రభుత్వంలో కీలకనేతగా వ్యవహరించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి బరిలో దిగి ఒక్క ఛాన్స్ నినాదమే వినిపించారు. ‘ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఏమిటో మీకు చూపిస్తా.. నన్ను నమ్మండి..’ అంటూ ఓటర్లను ఆకట్టుకోడానికి యత్నించారు. అయితే.. ఆయనకు మాత్రం ఈ ఒక్క ఛాన్స్ మంత్రం ఫలితాన్ని ఇవ్వలేదు. ఓటమి చవి చూసినప్పటికీ కూడా లోకేశ్ మంగళగిరిలోనే తిష్ట వేసి, ‘ఒక్క ఛాన్స్’ నినాదాన్ని నియోజకవర్గం ప్రజలకు వినిపిస్తూనే ఉండడం విశేషం.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మంచి ఊపు తీసుకొచ్చిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ‘ఒక్క ఛాన్స్’ నినాదాన్ని ఓ నిండు బహిరంగ సభలో దద్దరిల్లిపోయేలా రిక్వెస్ట్ చేయడం విశేషం. ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. ఒకే ఒక్కసారి.. అంటూ సంజయ్ ఓ రేంజ్ లో చేసిన విజ్ఞప్తిపై ప్రత్యర్థుల నుంచి వ్యంగ్యాస్త్రాలు కూడా పడ్డాయి. అయితే.. బండి సంజయ్ విజ్ఞప్తి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రయోజనం కలిగిస్తుందో లేదో వెయిట్ చేయాల్సి ఉంది.
దేశంలోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన కన్యాకుమారి నుంచి కశ్మీర్ ‘భారత్ జోడో’ పాదయాత్రలో కూడా ఆయన ‘ఒక్క ఛాన్స్’ ఇవ్వండని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. నిజానికి రాహుల్ కు, కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు. దశాబ్దాల పాటు దేశంలో అధికారం చెలాయించిన పార్టీ కాంగ్రెస్. ఈ సారి తనకు ప్రధానమంత్రిగా ఛాన్స్ ఇవ్వాలని రాహుల్ దేశ వాసులకు రిక్వెస్ట్ చేస్తుండడం గమనార్హం. రాహుల్ వినతికి ప్రజలు ఎలా స్పందిస్తారో.. 2024 ఎన్నికల తర్వాతే స్పష్టం అవుతుంది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా ‘ఒక్క ఛాన్స్’ ప్లీజ్ అని జనానికి విజ్ఞప్తి చేస్తుండడం గమనార్హం.
‘ఒక్క ఛాన్స్’ సినిమా డైలాగ్ రాజకీయ వర్గాల్లో ఓ పవర్ ఫుల్ నినాదంలా మారిపోయింది. రాజకీయ నేతలకు ఇప్పుడది సెంటిమెంట్ అస్త్రంగా మారిందనడంలో సందేహం లేదు.