సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు
posted on Nov 15, 2022 5:58AM
సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యలతో గత కొంత కాలంగా బాధపడుతున్న కృష్ణ ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (నవంబర్ 15) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆదివారం నవంబర్ 14)ఆర్ధరాత్రి దాటిన కృష్ణ ఆరోగ్యం విషమించడంతో హుటాహుటిన ఆయన కుమారుడు మహేశ్‌బాబు కృష్ణను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
వైద్యులు ఆయన్ను ఎమర్జెన్సీ వార్డుకు తరలించి సీపీఆర్ నిర్వహించారు. అనంతరం కృష్ణను ఐసీయూకి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు.ఆ తర్వాత వైద్యులు ప్రెస్‌మీట్ పెట్టి.. కృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మరో రెండు రోజులు గడిస్తేనే కానీ ఏమీ చెప్పలేమని స్పష్టత ఇచ్చారు. అయితే మంగళవారం(నవంబర్ 15) తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
1943, మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో ఘట్టమనేని శివరామకృష్ణ (కృష్ణ) జన్మించారు. 1960లో ఏలూరు సి.ఆర్.రెడ్డి. కాలేజీలో బిఎస్సీ డిగ్రీ పట్టాను అందుకున్నారు. వెండి తెరపై నటుడిగా ‘కొడుకులు కోడళ్ళు’ చిత్రంతో అవకాశం వచ్చినా ఆ సినిమా ఆగిపోయింది. ‘తేనె మనసులు’ కోసం నూతన నటీనటులు కావాలనే పేపర్ యాడ్ చూసి ఆడిషన్‌కి వెళ్ళి ఎంపికయ్యారు శివరామ కృష్ణ. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. తొలి చిత్రంతోనే నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్నారు.
ఆ తరువాత ఆయన చిత్రపరిశ్రమలో రికార్డులు సృష్టించే హీరోగా ఎదిగాు. ఒక్కో ఏడాది దాదాపు పదికిపైగా చిత్రాలు విడుదల అయ్యాయి. రోజుకి మూడు షిప్ట్‌ల చొప్పున బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయి. నిర్మాతల హీరోగా పేరొందిన కృష్ణని అభిమానులు ‘సూపర్‌స్టార్’ అని పిలుచుకుంటారు. 350 పైగా చిత్రాల్లో ఎన్నో సాంఘిక, జానపద, పౌరాణిక,జేమ్స్‌బాండ్, కౌబాయ్ వంటి డిఫరెంట్ చిత్రాల్లో మెప్పించిన సూపర్ స్టార్. ఆయన మృతితో తెలుగుచిత్ర సీమ శోక సంద్రంలో మునిగిపోయింది.