అనంతబాబు బెయిల్ పిటిషన్ విచారణ డిసెంబర్ 12కు వాయిదా
posted on Nov 14, 2022 @ 3:56PM
డ్రైవర్ డెడ్ బాడీ డోర్ డెలివరీ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ బెయిలు పిటీషన్ విచారణను సుప్రీం కోర్టు డిసెంబర్ 12కు వాయిదా వేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన అనంతబాబును వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా అనంతబాబు తనకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈ బెయిలు పిటిషన్ సోమవారం (జులై 14) విచారణకు వచ్చింది. అనంతబాబు బెయిలు పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలంటూ సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వం, హతుడు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు నోటీసు జారీ చేసి, విచారణను వచ్చే నెల 12కు వాయిదా వేసింది. ఇప్పటికే అనంత బాబు దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్లను రాజమహేంద్ర వరం కోర్టు, హైకోర్టు తిరస్కరించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే అనంతబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన హత్య కేసుపై అనంతబాబు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. అనంతబాబు బెయిల్ పిటిషన్ పై విచారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది.
అయితే అదే సమయంలో ఈ పిటిషన్ విచారణలో భాగంగా తమ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ డ్రైవర్ సుబ్రహ్మణ్యం తండ్రి కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు... రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. తన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి మృత దేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంత బాబు మే 23వ తేదీ నుంచి రాజమహేంద్ర వరం సెంట్రల్ జైలులో ఉన్న సంగతి విదితమే.
అసలు ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణం మృతదేహం చూడగానే అది హత్యేనని ఎవరికైనా ఇట్టే అర్దమైపోతుంది. కానీ పోలీసులకు మాత్రం పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకూ అది హత్యేనన్న అనుమానమే రాలేదు. అందుకే మృతదేహాన్ని అనంతబాబు స్వయంగా తన కారులో హతుడి ఇంటి వద్దకు తీసుకువచ్చి కారు వదిలేసి పరారైనా..పోలీసులకు ఆయనను అరెస్టు చేయాలన్న ఆలోచనే రాలేదు. కనీసం ఆయనను నిందితుడిగా ప్రకటించడానికి కూడా నోరు రాలేదు. చివరకు పోస్టుమార్టం రిపోర్టులో డ్రైవర్ సుబ్రహ్మణ్యం అరెస్టుకు గురయ్యాడని తేలినా అరెస్టు జోలికి వెళ్లకుండా అనంతబాబు పరారీలో ఉన్నారంటూ ప్రకటించారు.
ఈ లోగా ఎమ్మెల్సీ అనంతబాబు మృతుడి కుటుంబ సభ్యులపై బెదరింపులకు పాల్పడ్డారు. ప్రలోభాలకు గురి చేశారు. వాటన్నిటికీ లొంగకుండా కుటుబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేినా పోలీసులు పట్టించుకోలేదు.చివరాఖరికి అనంతబాబు స్వయంగా లొంగిపోవడంతో ఆయన అరెస్టు చూపారు. ఆ తరువాత చార్జిషీటు దాఖలు చేయడంలోనూ పోలీసులు అలవిమాలిన జాప్యం చేశారు.