గులాబి గూటికి ఈటల.. ఘర్ వాపసీయేనా?
posted on Nov 15, 2022 @ 12:58PM
ఈటల రాజేందర్ విషయంలో పొరపాటు చేశానని కేసీఆర్ ఫీలౌతున్నారా? మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తరువాత కేసీఆర్ ఈటల విషయంలో పనురాలోచనలో పడ్డారా? అంటే తెరాస శ్రేణులు ఔననే అంటున్నాయి. మునుగోడులో బీజేపీ తెరాసకు అంత గట్టి పోటీ ఇవ్వగలిగిందంటే అందుకు ఈటలే కారణమని కేసీఆర్ భావిస్తున్నారని తెరాస శ్రేణులు చెబుతున్నాయి. అందుకే కేసీఆర్ ఈటలను తెరాసలోకి ఆహ్వానించారని చెబుతున్నాయి.
ఈ విషయంలో నిజానిజాల సంగతి అలా ఉంచితే తెరాసలో మాత్రం ఈటల తెరాస గూటికి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. మరో వైపు ఈటల కూడా కమలం గూటిలో ఇరుకుగా ఫీల్ అవుతున్నారనీ, తన కష్టానికి తగ్గ గుర్తింపు కాషాయం పార్టీలో రావడం లేదన్న భావనలో ఉన్నారనీ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈటల మళ్లీ గులాబి గూటికి చేరుతారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కేసీఆర్ స్వయంగా ఈటలకు ఫోన్ చేసి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారనీ, మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారనీ కూడా చెబుతున్నారు. మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నికల ఫలితం కేసీఆర్ ఈటల విషయంలో పునరాలోచనలో పడేలా చేసిందన్నది మాత్రం వాస్తవమేననీ, జాతీయ రాజకీయాలపై తాను పూర్తిగా దృష్టి కేంద్రీకరించే ముందు రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలంటే ఈటల వంటి నాయకుడి అవసరం ఉందని కేసీఆర్ భావిస్తున్నారంటున్నారు.
మరో వైపు ఈటల వైపు నుంచి చూస్తే.. ఆయన గురించి తెలిసిన వారెవరూ కమలం గూటిలో ఈటల స్వేచ్చగా ఉన్నారని కలలో కూడా భావించరు. అసలు ఈటల టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చ కమలం తీర్థం పుచ్చున్నప్పుడే ఆయన రాజకీయ నేపథ్యం తెలిసిన వారంతా ఆశ్చర్యపోయారు. వామపక్ష భావజాలం ఉన్న ఈటల కమలం పార్టీలో చేరడమేమిటి? చేరినా అక్కడ ఇమడగలుగుతారా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. వారి అనుమానాలకు తగ్గట్టుగానే ఈటల కమలంలో చేరిన అనతి కాలంలోనే ఆయన అక్కడ ఇమడ లేకపోతున్నారనీ, ఉక్కపోతకు గురౌతున్నారన్న వార్తలు వినవచ్చాయి. అప్పట్లోనే ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టనున్నారన్న ప్రచారమూ జోరుగా సాగింది.
అప్పట్లో ఈటల సన్నిహితులు ఈ ప్రచారాన్ని కొట్టిపారేసినా ఈటల కమలం పార్టీలో ఇబ్బందిగానే కదులుతున్నారన్న ప్రచారానికి మాత్రం ఎప్పుడూ ఫుల్ స్టాప్ పడలేదు. బీజేపీ అభ్యర్థిగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల ఘన విజయం సాధించినా.. అది బీజేపీ ఖాతాలో కాకుండా ఈటల వ్యక్తిగత ఖాతాలోనే పడింది. నియోజకవర్గ ప్రజలే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ హుజూరాబాద్ లో ఈటల విజయం వెనుక ఉన్నది బీజేపీ అని భావించలేదు. ఈటల వ్యక్తిగత విజయంగానే దానిని అభివర్ణించారు. టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో విభేదించి, బహిష్కృతుడై బయటకు వచ్చిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించారు.
ఆ విజయంలో బీజేపీ పాత్ర దాదాపుగా శూన్యం అనే పరిశీలకులు అప్పట్లో విశ్లేషించారు. ఈటల చేరిక వల్లే బీజేపీకి తెలంగాణ అసెంబ్లీలో మరోక స్థానం వచ్చి చేరిందన్నది వారి విశ్లేషణల సారాంశం. అయితే ఆ విజయం బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో అసూయకు, భయానికి దారి తీసిందనీ, దీంతో ఈటల టాలెంట్ ను, పలుకుబడిని అండర్ ప్లే చేయడం మొదలైందని అప్పట్లోనే పలువురు సోదాహరణంగా చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈటల కమలం పార్టీలో ఇమడ లేకపోతున్నారని పెద్ద చర్చ కూడా జరిగింది. వ్యూహాత్మకంగానే కమలం పార్టీలో ఈటలను ఏకాకిని చేశారనీ, అందుకే అప్పట్లోనే గుర్తింపు లేని చోట మౌనంగా సర్దుపోవడం ఎదుకన్నభావనతో పార్టీకి గుడ్ బై చెప్పేయాలన్న యోచనను ఈటల తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేశారనీ కూడా చెబుతారు.
సరే ఇమడ లేక పోయినా సర్దుకు పోతూ కాషాయం గూటిలో కొనసాగుతున్న ఈటలకు ఇప్పుడు గులాబీ గూటి నుంచే ఆహ్వానం వచ్చిందంటున్నారు. అదీ స్వయంగా కేసీఆర్ నుంచే ఫోన్ వచ్చిందన్న సమాచారం మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్న తెరాస ఇప్పుడు ఈటలను గూలాబీ గూటిలోకి చేర్చుకోవడం ద్వారా బీజేపీకి తేరుకోలేని దెబ్బ కొట్టాలని భావిస్తోందంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో బీజేపీ ఒకింత డిఫెన్స్ లో ఉంది. ఈటలను గులాబి గూటికి చేర్చుకుంటే ఆ పార్టీని మరింత డిఫెన్స్ లో పడేయడమే కాకుండా ఆ పార్టీ నైతిక స్థైర్యాన్ని కూడా దెబ్బ తీయడమే తెరాస వ్యూహంగా కనిపిస్తోంది.