పేరుకు ఖర్గే.. పెత్తనం అంతా గాంధీ కుటుంబానిదే!
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల క్రతువు పూర్తయ్యింది. కొత్త అధ్యక్షుడు పగ్గాలు చేపట్టి నెల రోజులు దాటిపోయింది. దాదాపు పాతికేళ్ళ తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక జరిగింది. ఎన్నిక అన్నారు కనుక ఎన్నిక అంతే.. మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ లు ఇరువురు పోటీ చేశారు అని చెప్పుకోవడానికే. కానీ మల్లికార్జన్ కర్గే పేరు సోనియా ప్రతిపాదించిన క్షణంలోనే కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు ఆయనేనని ఎన్నిక అయ్యి, ఫలితం వచ్చే వరకూ ఆగకుండానే పార్టీ శ్రేణులూ, రాజకీయ వర్గాలూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేశాయి. ఫలితాల్లోనూ అదే తేలింది. గాంధీ నెహ్రూ కుటుంబం నుంచి బయటి వ్యక్త పార్టీ పగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్ లో ఏమైనా మార్పు కనిపించిందా అంటే ఏం లేదనే చెప్పాలి. వాస్తవానికి సోనియా గాంధీ తొలుత పార్టీ అధ్యక్ష పదవికి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ను ఎంపిక చేశారు.
అధిష్టానం అభ్యర్ధిగా ఆయన్ని బరిలో దించాలని ఆశించారు. ఆయన్ని ఒప్పించారు. కానీ ఆయన అంగీకరించినట్లే అంగీకరించి చివరిక్షణంలో చెయ్యిచ్చారు. ఆ తరువాత పలు ఆప్షన్లను పరిశీలించి చివరకు సోనియా మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేశారు. ఎనిమిది పదుల ఖర్గేను ఎంపిక చేశారు. ఇక అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసిన శశి థరూర్ గాంధీల నాయకత్వాన్ని సవాలు చేసిన జీ 23 సభ్యుడు. దీంతో సోనియా గాంధీ ఆశీస్సులు ఎవరికున్నాయో వేరే చెప్పనవసరం లేకుండానే తేలిపోయింది. ఆ విషయం అద్యక్ష ఎన్నికకు ముందే.. శశి థరూర్ కు విషయం అర్థమైపోయింది. అందుకే ఆయన తీరిగ్గా,అభ్యర్థులకు సమాన అవకాశాలు లేవని, అభ్యర్థుల మధ్య తారతమ్యాలు చూపుతున్నారని, అయిన వారికి ఆకుల్లో కానీ వారికీ కంచాల్లో అన్నట్లుగా పార్టీ నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తున్నారని ఆరోపించేసి చేతులు దులుపుకున్నారు. అవును మరి నాడా దొరికిందని, గుర్రాన్ని కొంటే ఇలాగే ఉంటుందని అప్పట్లో భాష్యాలు కూడా చెప్పారు.
జరిగినమ్మ జల్లెడతోనైనా నీళ్ళు తెస్తుంది అన్నట్లుగానే అధిష్టానం అండదండలున్న మల్లిఖార్జున ఖర్గే సునాయసంగా అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. ఆయన పగ్గాలు చేపట్టి కూడా నెల రోజులు దాటిపోయింది. శశి థరూర్ తాను అధ్యక్షుడినైతే పార్టీలో సమూల మార్పులు తెస్తానని ప్రచార సమయంలో చెప్పుకున్నారు.అయితే ఖర్గే మాత్రం సోనియా గాంధీ, రాజమాతగా, రాహుల్ గాంధీ కాంగ్రెస్ రారాజుగా నే కొనసాగుతారని చెప్పకనే చెప్పారు. అంటే తాను అధ్యక్షుడినైనా గాంధీ కుటుంబం పెత్తనం ఇసుమంతైనా మారదని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతోంది.
కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు గెలిచినా నిర్ణయాలు తీసుకునే అధికారం సోనియా కుటుంబానిదే అని అప్పట్లోనే పరిశీలకులు చెప్పారు. అందులో ఇసుమంతైనా మార్పు ఉండదని కొత్త అధ్యక్షుడి నెల రోజుల హయాంలో ప్రస్ఫుటంగా తేలిపోయింది. ఇక పోతే శశి థరూర్ ను స్టార్ క్యాంపెయినర్స్ జాబితా నుంచి తాజాగా తొలగించడం ద్వారా గాంధీ కుటుంబాన్ని ధిక్కరించిన వారికి కాంగ్రెస్ లో స్థానం ఏమిటో మరోసారి స్పష్టంగా చూపినట్లైంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసేందుకు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో శశి పేరు లేకపోవటం అందుకే పెద్దగా ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు.
థరూర్ ను తాము పక్కన పెట్టలేదని, శశి థరూర్ పేరు ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ జాబితాలో గతంలో ఎప్పుడూ చేర్చలేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడమే ఆశ్చర్యంగా ఉంది. తిరువనంతపురం ఎంపీ అయిన థరూర్ 2011,2016 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా బాధ్యతలు నిర్వహించారు. 2014, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ముంబై, కోల్ కతా, చెన్నై నగరాల్లో శశి థరూర్ విస్తృతంగా ప్రచారం చేశారు. ఇటీవలే నోయిడా లో జరిగిన బై పోల్స్ లోనూ ఆయన పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఆయన్ను స్టార్ క్యాంపెయినర్ గా గుర్తించకపోవటమంటే పొమ్మనలేక పొగబెట్టడమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
ఇదొక్కటే కాదు ధిక్కారాన్ని గాంధీ కుటుంబం సహించదనడానికి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే జీ-23లో ఒకరైన ఆనంద్ శర్మ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ హోదాను కోల్పోయారు. అలాగే మనీష్ తివారి, రణదీప్ సింగ్ సూర్జేవాలాకు కూడా అదే మర్యాద దక్కింది. తొలుత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బదులుగా రూపొందిన కొత్తగా వచ్చిన కమిటీలో ఆయనకు చోటు దక్కలేదు. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ గా కూడా ఆయన్ను దూరం పెట్టడంతో శశి థరూర్ రాజకీయ భవితవ్యంపై మబ్బులు కమ్ముకున్నాయి. తాజా విషయాలపై స్పందించిన ఆయన తాను కేవలం మేధావినేనని భారత వ్యతిరేకిని, మోడీ వ్యతిరేకిని కానేకాననటం విశేషం. హిమాచల్, గుజరాత్ అసెంబ్లీఎన్నికల్లో ప్రచారం చేయాలని తాను వ్యక్తిగతంగా భావించినప్పటికీ స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో తనకు చోటు లేకుండా చేశారని, బహుశా పార్టీకి తన సేవలు అక్కర్లేదేమోనని ఆయన వ్యాఖ్యానించటం విశేషం.