పార్లమెంటులో విద్యుత్ సవరణ బిల్లు.. జగన్ కు షాక్ తప్పదా?
ఈ ఏడాది పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. డిసెంబర్ 7వ తేదీన శీతాకాల సమావేశాలు ప్రారంభమై 29వ తేదీ వరకు 23 రోజులు నిర్వహించాలని నిర్ణయించినట్టు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 30 బిల్లుల దాకా ప్రవేశపెడుతుందని తెలుస్తోంది. వాటిలో విద్యుత్ సవరణ బిల్లు, వ్యక్తిగత సమాచారం భద్రత బిల్లు, వన్యప్రాణుల సంరక్షణ సవరణ బిల్లు, న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ సవరణ బిల్లు లాంటివి ఉన్నాయని సమాచారం.
పార్లమెంటులో ప్రవేశపెట్టే మిగతా బిల్లుల సంగతి పక్కన పెడితే.. విద్యుత్ సవరణ బిల్లు అటు వైసీపీని ఇటు జగన్ ను అడకత్తెరలో పోకచెక్క మాదిరి ఇరుకున పడేయడం తప్పదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే.. వ్యవసాయ బోర్ల మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగిస్తారు. దాంతో ఇప్పటి దాకా ఉచితంగా విద్యుత్ సరఫరా పొందుతున్న రైతులు విద్యుత్ ఇక బిల్లులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి, జగన్ కు అన్నదాత వాత తప్పదని అంటున్నారు
బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో వైసీపీ లేదు. అయినాసరే పార్లమెంటులో ఎప్పుడు ఏ బిల్లు ప్రవేశపెట్టినా.. జగన్ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తూ వస్తోంది. గడిచిన మూడున్నరేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. నిజానికి లోక్ సభలో గానీ, రాజ్యసభలో గానీ వైసీపీ మద్దతు లేకపోయినా బిల్లులను ఆమోదించుకోగల బలం ఎన్డీయే సర్కార్ కు ఉంది. అయినాసరే.. జానపదాల్లో ఉన్న ఓ క్యారెక్టర్ ‘జుట్టుపోలిగాడు’ మాదిరి జగన్ పార్టీ ఎంపీలు ప్రతిసారీ తగుదునమ్మా అంటూ అడగక ముందే మద్దతు ఇచ్చేస్తుండడం గమనార్హం.
మోడీ సర్కార్ కు వైసీపీ ఇలా బేషరతుగా మద్దతు ఇవ్వడం వెనుక జగన్ అక్రమాస్తుల కేసుల భయం కారణమంటారు. ఈడీ, క్విడ్ ప్రోకో, బెయిల్ రద్దు లాంటి 11 కేసుల కత్తి నిత్యం జగన్ మెడ మీద వేలాడుతున్న క్రమంలో మద్దతు ఇవ్వడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో జగన్ ఉన్నాడనీ, అందుకే బీజేపీ ప్రభుత్వం ఆడమన్నట్లు జగన్ ప్రభుత్వం ఆడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. కేసుల భయంతోనే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ రాజీ పడుతున్నారని, ప్రత్యేక హోదా విషయంలో, వెనుకబడిన జిల్లాల ప్యాకేజ్ ,, పోలవరం ప్రాజెక్టు నిధులు తదితర అంశాలలో పట్టుబట్టకుండా జగన్ కేంద్రం మాటకు, చేతకు తందానా అంటూ వస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పరిశీలకులు కూడా కేంద్రం ప్రతి మాటకూ డూడూబసవన్నలా తలూపడానికి కేసుల భయమే కారణమని విశ్లేషిస్తున్నారు.
బిల్లులు ఆమోదించుకోగల స్థాయిలో సభ్యుల బలం పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఎన్డీయే ప్రభుత్వానికి ఉంది. లోక్ సభలో పూర్తి స్థాయిలో మెజారిటీ ఉంది. పెద్దలసభ రాజ్యసభలో మాత్రం మిత్ర పక్షాలతో కలిపి బీజేపీకి బొటాబొటి మెజారిటీ ఉంది. ఎన్డీయే భాగస్వామ్య పక్షం అయిన ఒడిశాలోని బిజూ జనతాదళ్ పార్టీ అంశాల ప్రాతిపదికగా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుండడం గమనార్హం. అయితే.. బీజేపీ అడగడమే ఆలస్యం అనే తీరులో తన అవసరం ఉన్నా లేకపోయినా జగన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ సభ్యులు మాత్రం ఎన్డీయే సర్కార్ కు ముందే బేషరతుగా మద్దతు ఇచ్చేస్తున్నారు.
అయితే.. ఈసారి విద్యుత్ సవరణ బిల్లు పార్లమెంటులో వచ్చినప్పుడు ఏపీలో వైసీపీ సర్కార్ కు, జగన్ కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి చందం అవుతుందంటున్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో సమూల మార్పుల కోసమే ఈ బిల్లును తెస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. ఈ బిల్లుతో రైతులకు నష్టం వస్తుందని, వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ విత్యుత్ మీటర్లు పెడతారని, దాంతో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేయడం సాధ్యం కాదనే భయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. విద్యుత్ మీటర్లు అమర్చడం ద్వారా అన్నదాతల నడ్డి విరగ్గొట్టే ప్రయత్నం కేంద్రం చేస్తోందని ఇప్పటికే విపక్షాలన్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మీటర్లకు మోటార్లు బిగించడానికి జగన్ అంగీకారం, ఆమోదం తెలిపేసీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు పార్లమెంటులో విద్యుత్ సవరణ బిల్లుకు జగన్ పార్టీ మద్దతు తెలిపితే ఒక తంటా, తెలపకపోతే మరో తంటా అన్న పరిస్థితిలో ఉన్నారు.
అయితే.. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు పెడితే ఏమవుతుంది? ఆ బిల్లులు తామే చెల్లిస్తామంటూ రైతుల చెవిలో క్యాబేజీ పువ్వులు పెట్టే యత్నం వైసీపీ పెద్దలు చేస్తుండటం ప్రస్తావించాల్సిన అంశం. ఎందుకంటే.. ఇప్పటికే ఏపీని అప్పుల ఊబిలో దింపేసి, ఉద్యోగులకు కూడా సకాలంలో జీతాలు చెల్లించలేని దుస్థితిలో ఏపీ ఆర్థిక వ్యవస్థ ఉంది. అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. సంక్షేమ పథకాలు కూడా సజావుగా కొనసాగే పరిస్థితి లేదు.
అలాంటి స్థితిలో కొత్తగా రైతుల విద్యుత్ మోటార్లకు బిల్లుకు తామే కడతామంటే ఎలా నమ్మాలని రైతులు ఇప్పటికే ప్రభుత్వాన్ని సూటిగా నిలదీస్తున్నారు. వ్యవసాయ విద్యుత్ బిల్లుల డబ్బులు రైతుల ఖాతాల్లో వేస్తామంటూ ప్రభుత్వ పెద్దలు గొప్పగా చెబుతున్నారు. వారి మాటల్ని నమ్మి రైతులు ప్రభుత్వం డబ్బులు వేసే దాకా ఊరుకుంటే.. విద్యుత్ కనెక్షన్లను కట్ చేసే ప్రమాదం ఉందని వారు వాపోతున్నారు. విద్యుత్ బిల్లుకు వైసీపీ మద్దతు ఇస్తే.. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదు.. పోనీ మద్దతు ఇవ్వకుంటే.. డబుల్ ఇంజిన్ మోడీ షా జోడీ ఈడీ, అక్రమాస్తుల కేసు, బెయిల్ రద్దు అంశాలతో ఎక్కడ ప్రమాదం తెచ్చిపెడుతుందో అనే ఆందోళన జగన్ లో పెరిగిపోతోందంటున్నారు. అందుకే అనుకుంటా.. ఇటీవలి వైజాగ్ సభలో ప్రధాని మోడీకి సీఎం జగన్ పలుమార్లు రెండు చేతులూ ఎత్తి నమస్కారాలు చేశారన్న విషయాన్ని పలువురు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.