తాడేపల్లి ప్యాలెస్ కు జెట్ సెట్ గో సెగ?

ఢిల్లీ మద్యం కుంభకోణం మూలాలన్నీ ఏపీ సీఎం జగన్ సన్నిహితుల చుట్టూనే తిరుగుతున్నాయి. తాజాగా మద్యం కుంభకోణంకు సంబంధించి కోట్లాది రూపాయలను బేగం పేట విమానాశ్రయం నుంచి ప్రైవేట్ చార్టర్డ్ విమానాల ద్వారా తరలించారని ఈడీ వెల్లడించిన నేపథ్యంలో ఈ సొమ్ము తరలింపునకు ఉపయోగించిన ప్రైవేట్ విమానాలు ఈ స్కాంలో అరెస్టయిన అరబిందో డైరెక్టర్ భార్య కనికా టేక్రీవాల్ రెడ్డికి చెందిన జెట్ సెట్ గో సంస్థవేనని తేలడంతో ఇప్పుడు చూపులన్నీ జగన్ కు సన్నిహితులైన వారిపైకి మళ్లాయి. ముఖ్యంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి శరత్ చంద్రారెడ్డి సమీప బంధువు. విజయసాయి అల్లుడి అన్న శరత్ చంద్రారెడ్డి. ఆ శరత్ చంద్రారెడ్డి భార్యే కనికా టేక్రీవాల్ రెడ్డి. దీంతో మద్యం కుంభకోణం వ్యవహారంలో విజయసాయి పాత్రపై లోతైన విచారణ జరగాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తోంది. బేగంపేట విమానాశ్రం  నుంచి ప్రవేటు విమానాల రాకపోకలు, వాటిలో ప్రయాణించిన వారి గురించి ఆరా తీసిన విధంగానే గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రైవేటు విమానాల రాకపోకలు, వాటిలో ప్రయాణించిన వారి వివరాలనూ కూడా ఈడీ దర్యాప్తు చేయాలని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిథి పట్టాభి డిమాండ్ చేశారు.   ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన శరత్ చంద్రారెడ్డికి వైసీపీ అగ్రనాయకత్వంతో అనుబంధం చిన్నదేమీ కాదు. శరత్ చంద్రారెడ్డికి వైసీపీ ఎంపీ విజయసాయితో చుట్టరికం ఉందని మాత్రమే ఇంత కాలం అనుకుంటూ వచ్చాం. కానీ విజయసాయితో చుట్టరికానికి ముందే ఆయనకు వైఎస్ జగన్ తో అనుబంధం ఉందన్నదీ వెలుగులోకి వచ్చింది. ఎలా అంటే  జగన్ అక్రమాస్తుల కేసులో శరత్ చంద్రారెడ్డి కూడా సహ నిందితుడు. ఆ అనుబంధంతోనే శరత్ చంద్రారెడ్డికి జగన్ ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి దక్కేలా చేశారు. ఔను పీనపాక శరత్ చంద్రరెడ్డి ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు. జగన్ తో అసోసియేషన్ కారణంగానే శరత్ చంద్రారెడ్డికి ఏపీ క్రికెట్ అసోసియేషన్ పదవి దక్కిందన్న విమర్శలు ఉన్నాయి. వీరిరువురి మధ్యా అసోసియేషన్ జగన్ అక్రమాస్తుల కేసులో శరత్ చంద్రారెడ్డి కూడా ఒక నిందితుడు అవ్వడంతోనే అర్ధమౌతుంది. ఆయనే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఏపీలో అరబిందో ఎన్నో ప్రాజెక్టులు దక్కించుకుంది.  అలాగే అంబులెన్స్ కాంట్రాక్ట్ కూడా అరబిందోకే దక్కింది.   అలాగే అధికార బలం అండతో  ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌  అద్యక్ష పదవీ శరత్ చంద్రారెడ్డి దక్కించుకున్నారు. తన అల్లుడి సోదరుడు అయిన శరత్ చంద్రారెడ్డి జగన్ అధికారం చేపట్టిన అనతి కాలంలోనే ఏసీఏ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన అధ్యక్షుడయ్యాకే  ఏసీఏ అవినీతి ఊబిలో కూరుకుపోయింది. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.  దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో ఆ కుంభకోణానికి ఏపీతో లింకులు ప్రస్ఫుటమయ్యాయి.   ఈ స్కామ్ కు సంబంధించి   ఈడీ అరెస్టు చేసింది.  అరబిందో ఫార్మా ఎండీ శరత్ చంద్రారెడ్డిని, వినయ్ కుమార్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిరువురినీ  ఢిల్లీలో రెండు రోజుల పాటు విచారించి ఆ తరువాత అరెస్టు చేసినట్లు ప్రకటించింది. అరబిందో శరత్ చంద్రారెడ్డి, వినయ్ కుమార్ లకు కోట్లాది రూపాయల మద్యం వ్యాపారాలతో సంబంధాలున్నాయని ఈడీ పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు కావడంతో ఆ సెగ తాడేపల్లి ప్యాలస్ కు తగిలింది. దీంతో సకల శాఖల మంత్రి సజ్జల రంగంలోకి దిగి శరత్ చంద్రారెడ్డి విజయసాయి అల్లుడు కాదనీ, ఆయన సోదరుడనీ చెబుతూ.. సోదరుడి అక్రమాలతో విజయసాయి అల్లుడికి ఏం సంబంధం అని మీడియా ముఖంగా చెప్పారు. అయితే ఏ సంబంధం, అనుబంధం లేకుండానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పదవిని శరత్ చంద్రారెడ్డికి కట్టబెట్టారా?  ఏ సంబంధం లేకుండానే జగన్ అక్రమాస్తుల కేసులో ఏ1, ఎ2తలో పాటు శరత్ చంద్రారెడ్డి కూడా నిందితుడిగా ఉన్నారా అని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో లిక్కర్ స్కాం దర్యాపులో ఈ లింకులు ఎంత వరకూ ఉన్నాయో బహిర్గతమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మద్యం స్కాం సొమ్ముల తరలింపులో శరత్ చంద్రారెడ్డి భార్యకు చెందిన జెట్ సెట్ గో సంస్థ విమానాలను వినియోగించారని తమ దర్యాప్తులో తేలిందని ఈడీ వెల్లడించింది. అంతే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల అండతోనే ప్రైవేటు ఛార్టర్డ్ విమానాల ద్వారా నగదు తరలింపు జరిగిందని భావిస్తున్నట్లు ఈడీ పేర్కొంది. దీంతో బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ప్రైవేట్ చార్టర్డ్ విమానాల రాకపోకలను  నిలిపివేశారు. ఇక విజయవాడ నుంచీ ఈ సంస్థకు చెందిన ప్రైవేట్ విమానాల ద్వారా రాకపోకలు సాగించిన వారి వివరాలనూ ఈడీ సేకరిస్తే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. ఆ దిశగా ఈడీ అడుగులు వేయాలన్న డిమాండ్ జోరందుకుంది.

పోలవరం ముంపుపై తెలంగాణ తొండి వాదన..పిపిఎ సమావేశం బాయ్ కాట్

ఏపీకి జీవనాడి వంటి పోలవరం విషయంలో తెలంగాణ అభ్యంతరాలతో బుధవారం జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం అర్ధంతరంగా ముగిసింది. ముఖ్యంగా ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో ముంపు ముప్పు ఉందని తెలంగాణ, అసలు ముప్పే లేదని ఏపీ అధికారుల వాదనతో సమావేశం హీటెక్కింది. ఇరు రాష్ట్రాల అధికారులు తమతమ వాదనలకే కట్టుబడి ఉండటంతో సమావేశం అర్ధంతరంగా ముగిసింది.    ముంపు ముప్పుపై చర్చకోసం తెలంగాణ పట్టుబట్టింది అలాగే వరద నుంచి రక్షణకు చర్యలు తీసుకోవాల డిమాండ్ చేసింది. దీనికి ప్రతిగా ఏపీ  పోలవరంలో 150 అడుగుల ఎత్తులో నీటినిల్వ ఉన్నప్పుడు బ్యాక్‌వాటర్‌ ప్రభావం తెలంగాణపై ఇసుమంతైనా ఉండదని తేల్చి చెప్పింది.   పదే పదే ముంపుపై చర్చెందుకని నిలదీసింది. అలాగే ముంపు  అంశాన్ని కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ), కేంద్ర జలశక్తి శాఖకు నివేదించినప్పుడు ఇప్పుడీ సమావేశంలో చర్చ అనవసరమని పోలవరం ప్రాజెక్టు అధారిటీ చైర్మన్ పేర్కొన్నారు.   అయితే అందుకు ససేమిరా అన్న పోలవరం ప్రాజెక్టు వల్ల కిన్నెరసాని, ముర్రేడువాగుల ప్రవాహంపై ప్రభావం పడుతుందని తెలిపింది. ఎన్జీటీలో దాఖలైన కేసులో ఆర్నెల్లలోపు ముంపు ముప్పుపై సర్వే చేపట్టాలని ఆదేశాలున్నాయనీ పట్టుబట్టింది.  అయితే తెలంగాణ వాదనను పోలవరం ప్రాజెక్టు అధారిటీ తిరస్కరించింది. దీంతో తెలంగాణ అధికారులు సమావేశాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. 

జగన్ ముఖ్యమంత్రా మద్యం వ్యాపారా.. రాష్ట్రంలో డిస్టిలరీలు..ఆయనవే పంపిణీ ఆయనదే.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా మద్యం వ్యాపారంలో మునిగి తేలుతున్నారా? ఆయనకు పాలన చాత కాదా? నవరత్నాల పేరుతో నవ మోసాలకు పాల్పడ్డారా? ఔను నిజమే అంటున్నారు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. కర్నూలు జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం ఆయన పత్తి కొండలో బాదుడే బాదుడు సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయనకు జనం బ్రహ్మరథం పట్టారు. ఒర్వకల్లు విమానాశ్రం వద్ద ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. అంతకు ముందు  దేవనకొండ, కోడుమూరు లలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అడుగడుగునా చంద్రబాబుకు జనం నీరాజనం పలికారు. జగన్ సర్కార్ పై ఆయన విమర్శలకు జనం నుంచి బ్రహ్మాండమైన స్పందన లభించింది. పాలన చేతకాని ముఖ్యమంత్రి జగన్ అని దుయ్యబట్టారు. జగన్ అసమర్థ పాలనతో జనం అష్టకష్టాలూ పడుతున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలూ నిర్వీర్యం చేశారనీ, జనాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశారనీ విమర్శలు గుప్పించారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలకు జగన్ విధానాలే కారణమన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏం చేస్తున్నాయని నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, పత్రికల్లో వార్తలు రాసినా దాడులు, కేసులు ఇదా ప్రజాస్వామ్యమంటే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో సీఐడీ తాడేపల్లి ప్యాలెస్ తాబేదారుగా మారిపోయిందని చంద్రబాబు విమర్శించారు.  జడ్జిలపై కూడా వదల్లేదు. సామాజిక మాధ్యమంలో  పోస్టులు పెట్టి అవమానపరుస్తున్నారన్నారు.   మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారనీ, దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చంద్రబాబు అన్నారు. తుగ్లక్ వ్యవహారం కాకపోతే దేశంలో ఏ రాష్ట్రానికైనా మూడు రాజధానులున్నాయా? అని ప్రశ్నించారు. అమరావతిలో ప్రభుత్వ, రైతులు ఇచ్చిన భూములు కలిపి 50వేల ఎకరాలు ఉన్నాయి. అన్ని నిర్మాణాలు పోనూ 10వేల ఎకరాలు మిగులుతాయి. ఎకరా రూ.10 కోట్లయినా లక్ష కోట్లు. రూ.30 కోట్లయితే.. మూడు లక్షల కోట్లు. ఈ ఆస్తిని జగన్‌ విధ్వంసం చేశారు.  మీకు ముద్దులు పెట్టాడు..ఒక్క చాన్స్‌ అని జగన్‌ వచ్చాడు..  ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు. ప్రజల జీవితాలను, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.  రాయలసీమకు తుగ్లక్ సీఎం ఒక్క పరిశ్రమనైనా తీసుకు వచ్చారా అని ప్రశ్నించారు  తెలుగుదేశం హయాంలో  అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమను తెచ్చామని చెప్పారు. జగన్‌ గొప్పగా చెప్పుకుంటున్న నవరత్నాలు నిజానికి నవమోసాలని చంద్రబాబు అన్నారు. నవరత్నాలు పేరిట గోరంత ఇచ్చి కొండంత దోచుకుంటున్నారని విమర్శించారు.  నందిగామలో నాపై రాళ్లు వేస్తే.. సెక్యూరిటీ అధికారికి గాయమైంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే... పూలలో రాయి వచ్చిందన్నారు. రేపు పూలలో బాంబు కూడా ఉంటుందేమో అని అనుమానం వ్యక్తం చేశారు.  ఆనాడు బాబాయిని చంపి, నారాసుర రక్త చరిత్ర అని ప్రచారం చేశారు.  ప్రభుత్వం వచ్చాక నిందితులను ఎందుకు పట్టుకోలేదు? తండ్రిని చంపిన హంతకులను శిక్ష పడాలని వివేకానందరెడ్డి కుమార్తె సునీత సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆమె చేస్తున్న న్యాయపోరాటానికి అండగా నిలుద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.  నేను సీనియర్‌ నాయకుడిని.. నన్ను అవమానించే సాహసం ఎవరూ చేయరు. అసెంబ్లీకి వెళ్లిన నన్నే కాదు.. నా భార్యను కూడా అవమానించారు. ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని బయటకు వచ్చా. మళ్లీ క్షేత్ర స్థాయిలో గెలిచి గౌరవ సభలో అడుగు పెడతా. నేను అసెంబ్లీకి వెళ్లాలంటే.. రాజకీయాల్లో ఉండాలంటే.. ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే.. ఎన్నికల్లో మనమంతా కష్టపడి గెలవాలని చంద్రబాబు అన్నారు.  జగన్ మద్యం వ్యాపారం చేస్తున్నారు. రాష్ట్రంలోని మద్యం డిస్టిలరీలన్నీ జగన్ వే. పంపిణీ మొత్తం ఆయనదే. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జే బ్రాండ్లే అమ్ముతున్నారు.  డబ్బులన్నీ ఆయనకే చేరిపోతాయి.. ఢిల్లీలో మద్యం స్కాం జరిగింది. ఈడీ, ఐటీ దర్యాప్తు చేస్తున్నాయి. ఏపీలో ఢిల్లీ మద్యం స్కాంను మించిన మద్యం స్కాం జరుగుతోంది. మరి నిఘా సంస్థలు ఈ వైపు దృష్టి సారించవా అని నిలదీశారు.  

ఫిఫా వరల్డ్ కప్ లో డ్రెస్ కోడ్.. ఎక్స్ పోజింగ్ చేస్తే చర్యలే

ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్ ఫిఫా వరల్డ్ కప్ 2022 నవంబర్ 29 నుంచి ఖతార్ వేదికగా ఆరంభం కానుంది. అయితే ఈ వరల్డ్ కప్ పోటీలను వీక్షించాలనుకునే మహిళా అభిమానులకు నిర్వాహకులు షాక్ ఇచ్చారు. స్టేడియంలకు వచ్చి పోటీలు వీక్షించాలంటే మాత్రం డ్రెస్ కోడ్ పాటించి తీరాలన్న కండీషన్ పెట్టారు. బిగుతుతుగా ఉండే దుస్తులు, ఎక్స్ పోజింగ్ డ్రెస్ లను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. భుజాలు కప్పుతూ, మోకాళ్లకు దిగువగా ఉండే దుస్తులనే మహిళలు ధరించాలని, అలా అయితేనే మ్యాచ్ లు వీక్షించడానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. ఫిఫా వరల్డ్ కప్ కే వేదివక అయిన ఖతార్ లో ఉండే చట్టాలను అనుగుణంగా ఈ నిబంధనలు విధించినట్లు చెప్పారు. నవంబర్ 20 నుంచి ప్రారంభం అయ్యే ఫిఫా వరల్డ్ కప్ 22 పోటీలను వీక్షించడానికి ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో అభిమానులు ఖతార్ చేరుకున్నారు. ఈ వరల్డ్ కప్ లో మొత్తం 32 దేశాలు పాల్గొంటున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచీ వచ్చిన మహిళా అభిమానులు డ్రెస్ కోడ్ పై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖతార్ లో చట్టాలకు అనుగుణంగానే ఈ నిబంధన విధించామని నిర్వాహకులు చెబుతున్నారు. ఫిఫా వెబ్ సైట్ లో డ్రెస్ కోడ్ గురించి ఎలాంటి ఆంక్షలూ లేవని పేర్కొన్నప్పటికీ ఖతార్ చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఖతార్ చట్టాల ప్రకారం ఎవరైనా తమకు నచ్చిన దుస్తులు ధరించవచ్చు.. కానీ బహిరంగ ప్రదేశాలను సందర్శించేటప్పుడు మాత్రం భుజాలు, మోకాళ్లు కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి.  ఖతార్‌లో ప్రయాణించే మహిళలు బిగుతైన దుస్తులు ధరించడం నిషేధం.  కాగా, డ్రెస్ కోడ్‌ను పాటించని వారికి కఠిన శిక్షలు ఉంటాయని, జైలుకి కూడా పంపొచ్చని స్థానిక అధికారులు హెచ్చరించారు.

విమాన ప్రయాణాల్లో మాస్కులు ఇక మస్ట్ కాదు!

విమాన ప్రయాణాలలో మాస్క్ ఇక మస్ట్ కాదు. కోవిడ్ ప్రొటోకాల్ కు సవరణలు చేస్తూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం ఈ మేరకు ప్రకటించింది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నిరోధించేందుకు గతంలో విమానప్రయాణీకులు మాస్కులు వాడటం తప్పని సరి చేసిన సంగతి విదితమే. అప్పటి నుంచి అదే నిబంధన కొనసాగుతూ వస్తోంది. అయితే  కోవిడ్-19 మహమ్మారి నిరోధం కోసం ఇకపై వ ప్రయాణాలలో మాస్కులు, ఫేస్ షీల్డులు వాడాల్సిన అవసరం లేదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. అయితే  అయితే కరోనా వైరస్ ముప్పు దృష్ట్యా ప్రయాణికులు ఫేస్ మాస్క్‌  లను వాడటం శ్రేయస్కరమని ఆ ప్రకటనలో పేర్కొంది. కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖను సంప్రదించి, విమానాల్లో ప్రయాణించేటపుడు ప్రయాణికులు ఫేస్ మాస్క్‌లు, ఫేస్ కవర్ల వాడటంపై సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇకపై విమానాలలో ప్రయాణికులను ఉద్దేశించి  చేసే ప్రకటనల్లో ఫేస్ మాస్క్ వాడకపోతే జరిమానా, దండన చర్యల   ప్రస్తావన వద్దని  ఆదేశించింది. కరోనా వైరస్ ముప్పు దృష్ట్యా ఫేస్ మాస్క్ వాడటం శ్రేయస్కరమని మాత్రమే చెప్పాలని తెలిపింది.

క్యాసినో కేసులో మంత్రి తలసాని సోదరులను విచారించిన ఈడీ

తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం(నవంబర్15) తెరాస విస్తృత స్థాయి సమావేశంలో ఈడీ దాడుల విషయాన్ని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. అయితే అలా ఆరోపించి ఊరుకోలేదు. మరిన్ని దాడులు జరుగుతాయనీ, ఎమ్మెల్యేలు, తెరాస నాయకుల నివాసాలలో కూడా ఈడీ తనిఖీలు నిర్వహించే అవకాశాలున్నాయనీ, అయితే వాటికి ఎవరూ భయపడొద్దనీ అన్నారు. అలా అని 24 గంటలు గడిచాయో లేదో ఇలా ఈడీ తెలంగాణ మంత్రి సోదరులను విచారణకు పిలిచింది. ఆ మంత్రి ఎవరో కాదు.. తలసాని శ్రీనివాస యాదవ్. శ్రీనివాస యాదవ్ సోదరులు తలసాని మహేశ్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్ లను ఈడీ బుధవారం దాదాపు పది గంటల పాటు విచారించింది.  క్యాసినో కింగ్ పిన్ చీకోటి ప్రవీణ్ యాదవ్ తో కలిసి వీరు కాసినో నిర్వహణలో పాలుపంచుకున్నారని  దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొంది. గతంలోనే ఈడదీ చీకోటి ప్రవీణ్ నివాసం, కార్యాలయాలలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే చీకోటి ప్రవీణ్ ను రోజుల తరబడి విచారించి రాబ్టిన సమాచారం ఆధారంగానే మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సోదరులను విచారించిందని చెబుతున్నారు.   ఐటీ , ఈడీ , సీబీఐ దాడులు జరిగే అవకాశం ఉందని ఎవరూ భయపడవద్దని కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పిన గంటల వ్యవధిలోనే మంత్రి సోదరులను ఈడీ విచారించడంతో ఎమ్మెల్యేలలో ఆందోళన వ్యక్తమౌతోంది. ఇటీవలే టీఆర్ఎస్ నేతలకు చెందిన గ్రానైట్ పరిశ్రమపై  ఈడీ అధికారులు దాడులు నిర్వహించి అవకతవకలు గుర్తించినట్లు పేర్కొన్నారు. అలాగే మనీ ల్యాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తంచామని చెప్పారు. ఆ తరువాత ఇప్పుడు క్యాసినో కేసులో తలసాని సోదరులను ఈడీ ప్రశ్నించింది.  రాత్రి 9 గంటలకు ఈడీ విచారణ నుంచి తలసాని సోదరులు బయటకు వచ్చారు. గురువారం (నవంబర్ 17)న మరో సారి వారిని ఈడీ విచారించనుంది. మంత్రి తలసాని సోదరులు ఇద్దరు మీడియా కంటపడకుండా వెళ్లిపోయారు. రేపు మరోసారి వారు విచారణ కోసం ఈడీ ఎదుట హాజరుకానున్నారు. క్యాసినో వ్యవహారానికి సంబంధించి ఈడీ నజర్ లో సుమారు వంద మంది వరకూ ఉన్నట్లు చెబుతున్నారు.   చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి కాల్ డేటా ఆధారంగా ఈడీ వివరాలను సేకరించిందంటున్నారు. కాగా ఇదే కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ, మెదక్ డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డికి ఈసీ బుధవారం (నవంబర్ 16) నోటీసులు ఇచ్చింది.   

ఢిల్లీ లిక్కర్ స్కాం.. తెలుగు రాష్ట్రాలలో డొంకలు కదులుతున్నాయి

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సంచలన వెలుగులోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులకు ఈ స్కాంతో లింకులు ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఈ స్కాంకు సంబంధించి బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ప్రైవేట్ చార్టర్డ్ విమానాల ద్వారా భారీ ఎత్తున  నగదును ఢిల్లీ,  తదితర ప్రాంతాలకు తరలించారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల అండతోనే ప్రైవేటు ఛార్టర్డ్ విమానాల ద్వారా నగదు తరలింపు జరిగిందని విశ్వసిస్తున్నాయి. బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ప్రైవేట్ చార్టర్డ్ విమానాల రాకపోకలను  నిలిపివేశారు.   అంతే కాకుండా ఈ నగదు తరలింపునకు జెట్ సెట్ గో విమానాలను ఉపయోగించారని అనుమానిస్తున్న ఈడీ ఆ విమానాల ద్వారా ప్రయాణించిన వారి జాబితాను కోరుతూ ఈడీ లేఖ రాసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇక ప్రత్యేకంగా పేర్కొనాల్సిన విషయమేమిటంటే ప్రైవేటు చార్టర్డ్ విమానాలను అద్దెకిచ్చే సెట్ జెట్ గో కంపెనీ ఓనర్ కనికా టేక్రివాల్ రెడ్డి అనే మహిళ. ఈ కనికా టేక్రీవాల్ రెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఇటీవల అరెస్టయిన అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి సతీమణి. కనికా టేక్రీవాల్ రెడ్డి జెట్ సెట్ గో కంపెనీ ద్వారా ప్రైవేట్ ఛార్టర్డ్ విమాన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈమె కంపెనీకి చెందిన విమానాల రాకపోకలు, వాటిలో ప్రయాణించిన వారి వివరాలనే కోరుతూ ఇప్పుడు ఈడీ   ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది. అక్టోబర్ 17న ఈడీ రాసిన లేఖను  ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా  దేశంలోని అన్ని విమానాశ్రయ   డైరెక్టర్లకు పంపింది. కనికా టేక్రీవాల్ రెడ్డి చెందిన విమానాల్లో కీలక వ్యక్తులు, ప్రముఖులు ప్రయాణాలు సాగించినట్లు ఇప్పటికే ఈడీ నిర్ధారించింది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సహా    తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు కనికా  టేక్రీవాల్ రెడ్డి కంపెనీకి చెందిన విమానాలను ఉపయోగిస్తున్నారని కూడా ఈడీ దర్యాప్తులో తేలిందని అంటున్నారు.  ఏపీకి చెందిన రాజకీయ నాయకులు, ప్రముఖులు   ఎవరికి ప్రైవేట్ ఛార్టరడ్డ్ ఫ్లైట్ అవసరమైనా సమకూర్చేది కనికా టేక్రీవాల్ రెడ్డేనని దర్యాప్తులో వెల్లడైనట్లు ఈడీ చెబుతోంది. చార్టెర్డ్ విమానాలకు అధిక అద్దెలు వసూలు చేసినట్లు ఇప్పటికే కనికా టేక్రీవాల్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్‌లో ఏపీకి చెందిన ఉన్నత స్థాయి నేతలు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఢిల్లీ మద్యం స్కాంకు సంబంధించిన నగదును కనికా టేక్రీవాల్ రెడ్డి కి చెందిన విమానాలలోనే తరలించారని ఈడీ అనుమానిస్తోంది. అందుకే ఈ కంపెనీకి చెందిన విమానాలు బేగంపేట నుంచి ఎక్కడెక్కడకు వెళ్లాయి.. ఈ విమానాల్లో ఎవరెవరు ప్రయాణించారన్న వివరాలను ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ రాసి మరీ సేకరించింది. ఈ వివరాలతో ఢిల్లీ లిక్కర్ స్కాం పాత్రధారులు, సూత్ర ధారులెవరన్నది పూర్తి ఆధారాలతో సహా బయటపడతాయని భావిస్తున్నారు.   

కాంగ్రెస్ లో లుకలుకలు.. స్టార్ క్యాంపెయినర్ జాబితాలో శవిథరూర్ కు దక్కని చోటు

కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు గాంధీయేతర కుటుంబానికి చెందిన మల్లికార్జున్ ఖర్గే చేపట్టిన తరువాత కూడా పార్టీలో జి23 నేతల ప్రభావంపై పార్టీలో ఆందోళన ఇసుమంతైనా తగ్గలేదు.  పైపెచ్చు వారికి  పార్టీలో ప్రాధాన్యతను తగ్గిస్తున్నారు. తద్వారా పొమ్మన లేక పొగపెట్టిన చందంగా వారంతట వారే బయటకు వెళ్లే పరిస్థితి కల్పిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో.. అంటే సోనియా గాంధీ అధినేత్రిగా ఉన్న సమయంలో ఆమె నిర్ణయాలను ప్రశ్నించిన సీనియర్లను పక్కన పెట్టిన సంగతిని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. వారిలో గులాం నబీ ఆజాద్ ఆయనంతట ఆయనగా పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకున్న సంగతి విదితమే. ఇప్పుడు కాంగ్రెస్ లో ఆ పరిస్థితి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ కు ఎదురౌతున్నట్లుగా కనిపిస్తున్నది.  తాజాగా పార్టీ అధ్యక్ష ఎన్నికలో మల్లికార్జున్ ఖర్గేకు పోటీగా నిలబడి పరాజయం పాలైన శశిథరూర్ కు అవమానం ఎదురైంది. గుజరాత్ అసెంబ్లీ  ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని రాజకీయ పార్టీలు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్ కూడా ఆ రాష్ట్రంలో బాగా పుంజుకుందని సర్వేలు చెబుతున్న   వేళ  గ్రాండ్ ఓల్డ్ పార్టీలో విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్‌ నేత శశిథరూర్‌కు పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో స్థానం దక్కలేదు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ సీనియర్లు పార్టీ అధ్యక్షుడి తీరును తప్పుపడుతూ   పార్టీని వీడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో శశిథరూర్‌కు స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో స్థానం కల్పించకుండా అవమానించడం ద్వారా పార్టీ ఆయనకు బయటకు దారి చూపిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో శిశిథరూర్ కు స్థానం కల్పించకపోయినా గుజరాత్ లో ప్రచారానికి రావాల్సిందిగా ఆ రాష్ట్ర విద్యార్థి సంఘం ఆయనను ఆహ్వానించింది. అయితే వారి ఆహ్వానాన్ని శశిథరూర్ మన్నించలేదు. ఇక, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 40 మందితో​ కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్ల  జాబితాను విడుదల చేసింది.  ఆ జాబితాలో  పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజస్థాన్‌ సీఎం అశోక​్‌ గెహ్లాట్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌, దిగ్విజయ్‌ సింగ్‌, కమల్‌నాథ్‌, సచిన్‌ పైలట్‌, కన్హయ్య కుమార్‌, అశోక్‌ చవాన్‌, తదితరులు ఉన్నారు. మరో వైపు రాజస్థాన్ లోనూ పార్టీలో లుకలుకలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ పదవికి పార్టీ సీనియర్ నేత అజయ్ మకేన్ రాజీనామా చేశారు. ఈ రాజీనామాకు ఆయన చెబుతున్న కారణం.. ఇటీవల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌కు మద్దతుగా తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై   పార్టీ అధిష్ఠానం   చర్యలు తీసుకోకపోవడమే అంటున్నారు. తన రాజీనామా లేఖను మకేన్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపినట్లు చెబుతున్నారు.  గత సెప్టెంబర్‌లో కాంగ్రెస్ అధ్యక్షు ఎన్నికలో పోటీ చేసేందుకు సిద్ధపడిన అశోక్ గెహ్లాట్   స్థానంలో మరో వ్యక్తిని ఎన్నుకునేందుకు కీలక సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ గెహ్లాట్ విధేయులైన 90 మందికి పైగా ఎమ్మెల్యేలు ఆ సమావేశానికి గైర్హాజరై తన ధిక్కారాన్ని వ్యక్తం చేశారు. సీఎం పదవి నుంచి గెహ్లాట్‌ను తప్పించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా తమ రాజీనామా పత్రాలను సమర్పించేందుకు స్పీకర్ వద్దకు వెళ్లారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు ఎమ్మెల్యేలు మహేష్ జోషి, ధర్మేంద్ర రాథోర్, శాంతి ధరివాల్‌ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అజయ్ మాకెన్ అధిష్ఠానానికి సిఫారసు చేశారు. అయితే, ఇంతవరకూ వారిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడంపై అజయ్ మాకెన్ కొద్దికాలంగా అసంతృప్తితో ఉన్నారు. దానికి తోడు ఇప్పడు గెహ్లాట్ కు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చోటు కల్పించడంతో మాకేన్ రాజీనామా చేశారని అంటున్నారు. రాజస్థాన్‌లో రాజకీయ అస్థిరతకు చరమగీతం పాడాలంటూ రెండు వారాల క్రితం సచిన్ పైలట్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో మకేన్ రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది. రాజస్థాన్‌లోని వచ్చే నెల ప్రారంభంలో భారత్ జోడో యాత్ర రానుండటం, డిసెంబర్ 4న ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో మకేన్ రాజీనామా పార్టీని సంక్షోభంలోకి నెట్టేసినట్లైంది. 

సూపర్ స్టార్ కృష్ణకు కన్నీటి వీడ్కోలు

మహాప్రస్థానంలో సూపర్‌స్టార్‌ కృష్ణ అంతిమ సంస్కారాలు  ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. అంతకు ముందు బుధవారం ఉదయం ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన కృష్ణ అభిమానులు పద్మాలయ స్టూడియోకు చేరుకుని  తమ అభిమాన నటుడి పార్థివదేహం వద్ద నివాళులర్పించి వద్ద పుష్పాంజలి ఘటించారు. అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య పద్మాలయ స్టూడియోస్‌ నుంచి మహాప్రస్థానం వరకూ కృష్ణ అంతిమయాత్ర సాగింది.   తమ అభిమాన హీరోని కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తరలివచ్చి అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. సూపర్‌స్టార్ కృష్ణ  మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి విదితమే.    కు పోటెత్తారు. పద్మాలయా స్టూడియోస్‌లో కృష్ణ పార్థివదేహానికి పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీస్‌ బ్యాండ్‌ మధ్య అంతమ యాత్ర కొనసాగింది. పోలీసులు మహాప్రస్థానంలోకి అందరినీ అనుమతించలేదు. సన్నిహితులను మాత్రమే లోపలకు పంపి, ఇతరులందరినీ బయటే ఆపేశారు. మహాప్రస్థానం కు చేరుకున్న తర్వాత కృష్ణ పాడెను ఆయన చిన్ననాటి మిత్రుడు, సినీ నటుడు మురళీమోహన్‌, టీడీపీ నేత బుద్దా వెంకన్న మోశారు. కృష్ణ కుమారుడు హీరో మహేష్ బాబు కృష్ణ చితికి నిప్పంటించారు. 

ఏపీలో పోటాపోటీ యాత్రలు

వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత.. జనవరి 27 నుంచి ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి. ఎమ్మెల్సీ నారా లోకేశ్ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. దాదాపు ఏడాది పాటు పాదయాత్ర చేసి ప్రజలలో మమేకం కావాలని లోకేష్ కొనసాగే లోకేష్ పాదయాత్రను ఆయన తండ్రి, మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలో జనవరి 27న ప్రారంభిస్తారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు ఆయన పాదయాత్ర కొనసాగుతుంది. మొత్తం 4 వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను, రోడ్ మ్యాప్ ను లోకేష్  సిద్ధం చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. జనం నుంచి ఎదురవుతున్న తీవ్ర వ్యతిరేకతలు, సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న అసంతృప్తులు, విపక్షాల నుంచి దూసుకు వస్తున్న విమర్శల నేపథ్యంలో పరువు మరింతగా దిగజారిపోకుండా ఉండాలంటే జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలు తీసుకొస్తే.. ఆ పరిస్థితి వేరే. ఏపీలో రాజకీయ నేతలు పాదయాత్రలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ అధికారంలో ఉండి, కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి  ప్రజా ప్రస్థానం  పేరుతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  వస్తున్నా.. మీకోసం  పేరిట ఏపీలో పాదయాత్ర చేశారు. తర్వాత వైఎస్ జగన్ కూడా  ప్రజా సంకల్ప యాత్ర  యాత్ర చేశారు. అక్రమ ఆస్తుల కేసులో జగన్ అరెస్టయి జైలులో ఉండడంతో ఆయన సోదరి షర్మిల  మరో ప్రజా ప్రస్థానం  అంటూ పాదయాత్ర కొనసాగించారు. అయితే.. తాజాగా నారా లోకేశ్ చేస్తున్న పాదయాత్ర చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్, జనసేన, బీజేపీ పార్టీలు కూడా పాదయాత్రలు, బస్సు యాత్రలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తుండడం విశేషం. తొలుత పాదయాత్ర చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నా.. తర్వాత దాన్ని బస్సు యాత్రగా మార్చుకున్నారు. వాస్తవానికి అయితే.. ఈ సంవత్సరం అక్టోబర్ లోనే జనసేనాని  యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. సంక్రాంతి తర్వాత ఏపీలో బస్సు యాత్ర చేయాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అవడం గమనార్హం. మరో పక్కన ఏపీని అడ్డగోలుగా విభజించిందనే కోపంతో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు కోలుకోలేని విధంగా గుణపాఠం చెప్పారు. అలాంటి పార్టీ ఒకటి ఉందనే ఏపీ లో ఆ పార్టీ పరిస్థితి తయారైంది.  ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికిని కాపాడుకునేందుకు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ కూడా పాదయాత్రకు  సిద్ధం అవుతున్నారు.   వచ్చే డిసెంబర్ నుంచి  రాష్ట్రంలో పాదయాత్ర చేయనున్నట్లు  శైలజానాథ్ ప్రకటించారు. ఏపీకి మేలు చేయడం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం అనేది శైలజానాథ్ చెబుతుండడం విశేషం. అందుకే తన పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్ కు తాను అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళల్లో ఒక్కటంటే ఒక్క మేలు   కూడా చేయని బీజేపీ కూడా పాదయాత్ర చేసేందుకు ముందుకొస్తోంది. బీజేపీకి ఏపీలో ఓటింగ్ శాతం అతి తక్కువ.  గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు సాయంతో కొన్ని అసెంబ్లీ సీట్లలో బీజేపీ గెలిచింది. అయినప్పటికీ ప్రజలకు ఆ పార్టీ వల్ల ఏమి ఒరిగింది అంటే గాల్లో లెక్కలు వేసుకోవాల్సిందే. అలాంటి బీజేపీ ఇప్పుడు ఏపీలో ఉనికి కోసం పాదయాత్ర చేస్తానంటోంది. కానీ.. మిగతా పార్టీల మాదిరి వ్యక్తిగత పాదయాత్ర కాదంటోంది. ఒక్కో ప్రాంతంలో కొందరు బీజేపీ నేతలు కలిసి రాష్ట్రం అంతా పాదయాత్రగా పర్యటిస్తామని ఆ పార్టీ నేత సత్యకుమార్ వెల్లడించారు. బీజేపీ పాదయాత్ర సంక్రాంతి తర్వాత ఆరు నెలల పాటు సాగుతుందని ఆయన తెలిపారు. ఏపీలో   పట్టణాల్లో అంతంత మాత్రంగా  బీజేపీకి ఉనికి ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ పెద్ద జీరో అని చెప్పొచ్చు. అందుకే పట్టణ ప్రాంత ఓటర్లను పాదయాత్ర సందర్భంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుందని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.ఈ ఏడాది చివరి నుంచి వచ్చే సంవత్సరం ఆఖరి దాకా ఏపీలో రాజకీయ పార్టీల పాదయాత్రలతో సందడిగా మారబోతోందనేది వాస్తవం.

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఈటల?.. హస్తిన పిలుపు వెనుక కారణం అదేనా?

ఈటలకు బీజేపీ అనూహ్య ప్రమోషన్ ఇస్తోందా? తెలంగాణ పార్టీ బాధ్యతలను ఆయనకు అప్పగించాలని అధిష్ఠానం నిర్ణయించిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలంగాణ బీజేపీ బాధ్యతలను పార్టీ అధినాయకత్వం ఈటలకు అప్పగింనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా ఈటల సారథ్యంలో వచ్చే ఎన్నికలలో బీజేపీ విజయం సాధిస్తే.. ముఖ్యమంత్రి పదవి కూడా ఈటలకే అప్పగించనున్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. అందు కోసంమే  ఈటలకు హస్తిన నుంచి పిలుపు వచ్చిందంటున్నాయి. మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నిక ఓటమి పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ ఖాతాలో పడితే.. అదే సమయంలో ఇదే ఉప ఎన్నికలో తెరాసకు దీటుగా బీజేపీ పోటీ  ఇచ్చిందనీ.. ఆ క్రెడిట్ ఈటల ఖాతాలోనూ పడిందని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. బీజేపీ అధిష్ఠానం పిలుపు మేరకు ఈటల రాజేందర్ హుటాహుటిన మంగళవారం ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. చాలా కాలం నుంచీ ఈటల బీజేపీలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదన్న అసంతృప్తితో  వార్తలొస్తున్నాయి. తెరాస సర్కార్ లో మంత్రిగా పనిచేసిన ఆయనకు చేరికల కమిటీ ఛైర్మన్‌ పదవితో సరిపెట్టారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఈటల బీజేపీకి గణనీయంగా ఓట్లు రాబట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పలుకుబడి కారణంగానే బీజేపీ మునుగోడులో తెరాసకు దీటుగా పోటీ ఇవ్వగలిగిందని బీజేపీ అధిష్ఠానం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు కీలక పదవి కట్టబెట్టాలన్న నిర్ణయానికి వచ్చిందంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈటలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పగ్గాలు అప్పగించనున్నారు. ఈ విషయాన్ని అమిత్ షా స్వయంగా ఈటలకు చెప్పారంటున్నారు. అంతే కాకుండా చేరికల కమిటీ చైర్మన్ గా ఈటల స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చనీ, పార్టీలో చేరికల విషయంలో ఈటల ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదనీ, చివరకు అధిష్ఠానం అనుమతి కోసం కూడా వేచి చూడాల్సిన అవసరం లేదని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ షా ఈటలకు విస్పష్టంగా చెప్పారని అంటున్నారు. ఇప్పటి వరకూ చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్నప్పటికీ.. సొంతగా నిర్ణయం తీసుకోలేని బంధనాలు ఆయనకు సంకెళ్లుగా ఉన్నాయని ఈటల వాపోయిన సందర్బాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు చెప్పారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీకి ఈటలకు ప్రజలలో ఉన్న పలుకుబడి పూర్తిగా అర్దం కావడంతో వచ్చే ఎన్నికలలో తెలంగాణలో అధికారం చేపట్టాలన్న లక్ష్యం నెరవేరాలంటే రాష్ట్ర పార్టీ పగ్గాలు ఆయనకు అప్పగించడమే మార్గమని బీజేపీ హైకమాండ్ నిర్ణయానికి వచ్చిందంటున్నారు. కాగా తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నట్లు స్వయంగా అమిత్ షా ఈటలకు చెప్పారని తెలుస్తోంది. ఈ సందర్బంగా రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు. అంతే కాకుండా తమతో ఏమైనా సంప్రదించాలనుకుంటే స్వయంగా హస్తినకు వచ్చి మాట్లాడాలే తప్ప.. ఎవరి ద్వారాను సమాచారం చేరవేయవద్దనీ, అలాగే ఫోన్ లో కూడా సంప్రదించొద్దనీ చెప్పినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కు గురయ్యే అవకాశం ఉందన్న భావనతోనే అమిత్ షా ఈటలకు ఈ సూచనలు చేశారంటున్నారు. గతంలో కూడా తెలంగాణ వ్యవహారాలను చర్చించేందుకు అమిత్ షా స్వయంగా ఈటలను హస్తినకు పిలిపించుకున్న సందర్బాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటలకు ప్రజలలో మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికీ పలువురు తెరాస నేతలు ఈటలతో టచ్ లో ఉన్నారని చెబుతారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో పని చేసిన వారు తరచూ ఈటలను కలిసి మాట్లాడుతారని చెబుతారు. ఈ నేపథ్యంలోనే ఈటలకు కీలక బాధ్యతలు అప్పగిస్తే అది కచ్చితంగా బీజేపీకి మేలు చేస్తుందన్న అభిప్రాయం బీజేపీ అధిష్ఠానంలో బలంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈటలను హస్తినకు పిలిపించుకుని మరీ తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించనున్నట్ల సమాచారం ఇచ్చారని అంటున్నారు. ఈటలతో పాటు పార్టీ సీనియర్ నాయకురాలు డీకే ఆరుణ, పార్టీ మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి కూడా అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. వారిరువురికీ కూడా ఈటలకు పార్టీ పగ్గాలు అప్పగించనున్నట్లు తెలిపి పూర్తి సహకారం అందించాలని సూచించిట్లు తెలుస్తోంది. అతి త్వరలో ఈటలను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.   ఇలా ఉండగా టీఆర్ఎస్ కూడా ఈటలకు ఆహ్వానం పలికిందనీ, స్వయంగా కేసీఆర్ ఫోన్ చేసి మరీ టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారనీ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరితో ఈటలకు ఉప ముఖ్యమంత్రి పదవిని కేసీఆర్ ఆఫర్ చేశారని కూడా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే గతంలో టీఆర్ఎస్ విడిచి వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకునే ప్రక్రియకు కేసీఆర్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.  స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ వంటి నేతలకు గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం తెలిసిందే. అదే విధంగా ఈటలకు కూడా ఆహ్వానం అందినట్లు చెబుతున్నారు. అయితే కేసీఆర్ ఆహ్వానాన్నీ, ఆఫర్ ను ఈటల నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లు చెబుతున్నారు.   కాగా ఒక వైపు ఈటలను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించి డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని ప్రలోభ పెడుతూనే మరో వైపు దేవర్ యాంజాల్ లోని సీతారామచంద్రస్వామి దేవాలయ భూముల కబ్జా అంటూ తెరాస సర్కార్ బెదరింపులకు దిగుతోందని, భూ కబ్జా ఆరోపణలను తెరమీదకు తెస్తూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతోందనీ బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దేవరయాంజాల్‌లోని సీతారామచంద్రస్వామి దేవాలయ భూముల కబ్జాపై విచారణ జరిపిన ఐఏఎస్‌ అధికారుల కమిటీ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించిన సంగతి విదితమే.  ఒక వైపు ప్రలోభాలు, మరో వైపు బెదరింపులతో ఎలాగైనా ఈటలను తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టకండా నిలువరించాలన ప్రయత్నిస్తోందని  ఆ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ బీజేపీ పగ్గాలు ఈటల చేతికి అప్పగిస్తే రాష్ట్రంలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందన్న ధీమా అయితే బీజేపీ శ్రేణుల్లో వ్యక్తమౌతోంది.

దక్షిణాది పై పట్టు కోసం కమల వ్యూహం

భారతీయ జనతా పార్టీ, 2024 ఎన్నికలలో ముచ్చటగా మూడవసారి విజయం సాధించి, హ్యాట్రిక్ సొంతం చేసుకునేందుకు,   పావులు కదుపుతోంది. ఒకప్పుడు కేవలం ఉత్తరాది రాష్రా లకే పరిమితమైన పార్టీ, ఇప్పుడు  దేశం అంతటా ప్రాబల్యం పెంచుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ముఖ్యంగా 2024 ఎన్నికల నాటికి  దక్షిణాదిలో పాగా వేసేందుకు, వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే బీజేపీ సౌత్ మిషన్ అంటూ బ్లూప్రింట్‌ను సిద్ధం చేసిందని పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. ఇందు భాగంగానే, కమల దళం ఉభయ తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిందంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో పాగాకు బీజేపీ  గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఆ క్రమంలో రాష్ట్రంలో ఇప్పటికే బలోపేతమైందని పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. మునుగోడులు టీఆర్ఎస్ కు దీటుగా బీజేపీ గట్టి పోటీ ఇవ్వడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. వాస్తవానికి 2014లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా పగ్గాలు చేపట్టిన నాటి నుంచే కమలం పార్టీ  ఇప్పటి వరకూ అందని ద్రాక్షలా ఉన్న దక్షిణ, తూర్పు రాష్ట్రాలలో అధికారమే లక్ష్యంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ లక్ష్యం దిశగా బీజేపీ వేసిన అడుగులలో భాగంగానే  అస్సాంతో సహా పలు  ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ జెండా ఎగరేసింది.  కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్, ఒడిశాలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది.  అయితే, మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో మాత్రం బీజేపీ వ్యూహాలు  ఫలించలేదు.  ఇతర పార్టీల నుండి పేరొందిన నాయకులను దిగుమతి చేసుకోవడం, ఇతర రాష్ట్రాల నుండి సొంత నాయకులను తీసుకు రావడం, ప్రముఖ సినీ తారలను ఆకట్టుకోవడం, ప్రాంతీయ  పార్టీలలో చీలికలను ప్రోత్సహించడం వంటి అనేక ప్రణాళికలతో దూకుడు ప్రదర్శించినా ఫలితాలు మాత్రం ఆశాజనకంగా రాలేదు.  అయితే ఇప్పుడు  2024 ఎన్నికలలో దక్షిణాదిలో పాగాయే లక్ష్యంగా   కీలక మార్పులతో సరికొత్త ప్రణాళికతో సిద్ధమవుతోంది. దక్షిణాదిన పాగా వేయాలంటే కొత్త ఎత్తులు, వ్యూహాలు అవసరమని పార్టీ అగ్ర నాయకత్వం గ్రహించింది.  ఉత్తరాదిలో మంచి ఫలితాలు ఇస్తున్న హిందుత్వ రాజకీయాలకు భిన్నమైన రీతిలో, సైద్ధాంతిక అంశాలకు, సంక్షేమ కార్యక్రమాలకు  మధ్య గల సరిహద్దులను అధిగమించి దక్షిణాది ప్రజలకు ఆమోదయోగ్యమైన పార్టీగా నిలబడే కృషి ప్రారంభించారు. ఐదు దక్షిణాది రాష్ట్రాలలో మూడింటిలో ప్రాంతీయ పార్టీలు రాజకీయ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నందున, ఈ ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవడానికి బిజెపి వారసత్వ రాజకీయాలపై పోరాటం ఆయుధాన్ని ఎంచుకొంది.  కాంగ్రెస్-ముక్త్ భారత్, అవినీతి రహిత భారతదేశంఅన్నవే 2014 నుండి  బీజేపీ నమ్ముకున్న నినాదాలు. వాటికి తోడుగా  2024లో `వారసత్వ ముక్త - భారత్’ నినాదాన్ని జోడించాలని నిర్ణయానికి వచ్చింది. ఆ నినాదంతో  యువతను టార్గెట్ చేయాలని భావిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కేడర్‌ను ఉద్దేశించి చేసిన ప్రసంగంతో ప్రారంభించి ప్రధాని మోడీ  అప్పటి నుంచి తన ప్రతి ప్రసంగంలోనూ కుటుంబ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో మోడీ , బీజేపీకి కుటుంబ పాలన వ్యతిరేక సెంటిమెంట్  రాజకీయంగా మంచి ఫలితాలు ఇస్తుందని వివ్వసిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా, ఎన్నికలలో ఇప్పటికీ ప్రాబల్యం చూపించలేక  పోతున్న  రాష్ట్రాల్లో పార్టీ సరికొత్త విధానాన్ని ఆవలంభించ వలసిన అవసరాన్ని గుర్తించింది. పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో తప్ప మిగిలిన రాష్ట్రాలలో క్షేత్రస్థాయిలో బీజేపీ పటిష్టంగా లేదన్నది వాస్తవం. కాబట్టి ఆయా రాష్ట్రాలలో కొన్ని నియోజకవర్గాలను కైవసం కోవడంపై దృష్టి సారిస్తూ, ఆ బాధ్యతలను కేంద్ర మంత్రులకు  అప్పచెప్పి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా అక్కడ పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది. ఉదాహరణకు, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు సాపేక్షంగా మెరుగైన పనితీరు కనబరిచిన కేరళలోని లోక్‌సభ నియోజకవర్గాలకు కేంద్ర మంత్రులు ఎస్ జైశంకర్, అశ్విని కుమార్ చౌబే, శోభా కరంద్లాజేలను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి తెలంగాణలో నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు.  ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులలో పార్టీ అధికారాన్ని దక్కించుకునేంతగా బలోపేతం కష్టమన్న విషయాన్ని గ్రహించిన కమలనాథులు.. ఆయా రాష్ట్రాలలోని కొన్ని నియోజకవర్గాలలోనైనా బలోపేతం కావాలన్న ప్రయత్నాలకు పరిమితమౌతున్నారు. అయితే  తెలంగాణలో మాత్రం బీజేపీకి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవకాశాలున్నాయని భావిస్తోంది. అందుకే ఆ రాష్ట్రంపైనే ప్రధానంగా దృష్టి సారించింది.   ప్రముఖ క్రీడాకారిణి పి టి ఉష (కేరళ), సంగీత మాంత్రికుడు ఇళయరాజా (తమిళనాడు), వితరణశీలి వీరేంద్ర హెగ్డే, సినీ రచయిత కె వి విజయేంద్ర ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)లను రాజ్యసభకు నామినేట్ చేయడానికి ప్రభుత్వం ఇటీవల తీసుకున్న  నిరణయం దక్షిణాది రాష్ట్రాలపై పట్టు సాధించాలన్న వ్యూహంలో భాగమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   2024లో కేంద్రంలో అధికారాన్ని నిలుపుకోవడంతో పాటుగా, ప్రాంతీయ పార్టీల ప్రాబల్యానికి చెక్ పెట్టడమన్న వ్యూహంతో బీజేపీ అడుగులు వేస్తోందని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. 

పొత్తులే సార్వత్రిక ఫలితాన్ని నిర్ణయిస్తాయా?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు. శాశ్వత శతృవులు ఉండరు... ఇది ఎవరంగీకరించినా అంగీకరించకున్నా యూనివర్సల్ ట్రూత్.. అందుకే  పార్టీల మధ్య స్నేహ సంబంధాలు అటూ ఇటూ కావడం తరచూ జరుగుతుంటుంది. పొత్తులు, కూటములు విచ్చిన్నం కావడం.. అలాగే పాత పొత్తులు వాడి,  కొత్త పొత్తులు చిగురించడం రివాజు. ఇటీవల బీహార్ లో ఏం జరిగిందో చూశాం. మహారాష్ట్రలో శివసేన ఎలా చీలిపోయిందో చూశాం. ఇలా చీలిక వర్గం చిటికెలో కమలంతో ఎలా జట్టు కట్టిందో చూశాం.  బీహార్ లో అయితే రెండేళ్ళ క్రితం 2020 అక్టోబర్, నవంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనతా దళ్ (యు) పార్టీలు పొత్తు పెట్టుకుని, ఒకే కూటమిగా (ఎన్డీఎ) పోటీ చేశాయి. కూటమి విజయం సాధించింది. ఎన్డీఎ ప్రభుత్వం ఏర్పడింది. జేడీయు కంటే బీజేపీకి రెట్టింపు సీట్లు వచ్చినా, మిత్ర ధర్మం మేరకు  జేడీయు నేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా  బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ మిత్రధర్మాన్ని బీజేపీ జేడీయూలు రెండేళ్లు కూడా పూర్తిగా పాటించలేకపోయారు.   నితీష్ కుమార్  బీజేపీని వదిలించుకుని ఆర్జేడీ చేయి పట్టుకున్నారు. మళ్లీ బీహార్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.  నితీష్ కుమార్ మనసు మళ్ళీ ఎప్పుడు మారుతుంది, ఈ ప్రభుత్వం ఎంతకాలం మనుగడ సాగిస్తుందనే ప్రశ్నలను పక్కన పెడితే..  రాజకీయ ఎన్నికల పొత్తులకు సంబంధించి  ఎప్పుడు ఏం జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఈ ఉదంతం రుజువు చేసింది. ఔను నిజమే ఎందుకంటే.. ఇంతకు ముందు ఇదే బీహారులో ఇదే తరహ పొత్తులు కుడి ఎడమలు అయిన సందర్భాలున్నాయి. మహారాష్ట్రలోనూ కొంచెం అటూ ఇటుగా అదే జరిగింది. ఇతర రాష్ట్రలలోనూ, చివరకు జాతీయ స్థాయిలోనూ ఇలాంటి ఉదంతాలు అనేక ఉన్నాయి. కూటమిలో వచ్చిన కుమ్ములాటల కారణంగా ఒకే ఒక్క ఓటు తేడాతో  అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం కూలి పోయింది. అదలా ఉంచితే, ఇప్పుడు జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల వరకు పొత్తులు, ఎత్తులకు సంబంధించిన చర్చలే జోరుగా జరుగుతన్నాయి. టీవీ డిబేట్స్ మొదలు రచ్చబండ రాజకీయ చర్చల  వరకు పొత్తుల  సెంట్రిక్ గానే జరిగాయి. ఎవరితో ఎవరు జట్టు కడతారు, ఎవరితో ఎవరు చేతులు కలుపుతారు ఎవరు ఎవరితో చేతులు కలిపితే ఫలితాలు ఎలా తారుమారు అవుతాయి అనే లెక్కల చుట్టూనే చర్చలు సాగుతున్నాయి.       ఆంద్ర ప్రదేశ్’ లో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తుపొడుపు కథ రోజుకో మలుపు తిరుగుతోంది.  ఆ మధ్య కేంద్రం ఆహ్వానం మేరకు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు హస్తిన వెళ్లిన చంద్రబాబుతో.. మడీ ఆప్యాయంగా మాట్లాడటం.. తనంత తానే స్వయంగా చంద్రబాబు వద్దకు వచ్చి మరీ మాట్లాటం, మరో మారు కలుద్దామంటూ ఆహ్వానించడంతో ఏపీ నేతపై మరోసారి కమలం సైకిల్ కలిసి నడుస్తాయన్న చర్చ విస్తృతంగా నడిచింది. అయితే ఆ తరువాత ఆ దిశగా ఎలాంటి పురోగతీ కనిపించలేదు.  అసలు అంత కంటే ముందుగానే పొత్తు పొడుపుల చర్చకు జనసేనాని పవన్ కల్యాణ్ తెరలేపారు. రాష్ట్రంలో ప్రబుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీల నీయను అంటూ.. పొత్తుల ఊహాగాన సభలకు తెర తీశారు. అదలా ఉంచితే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా  ఏపీ అభివృద్ది కోసం అవసరాన్ని బట్టి పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడం ద్వారా పొత్తు ఊహలను సజీవంగా ఉంచడానికి తన వంతు దోహదం తాను చేశారు.  నిజం, గతంలోనూ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే, ప్రత్యేక  హోదా కోసమే  పెట్టుకున్న పొత్తును తుంచేసుకుంది.   ఇప్పుడు కూడా అదే పద్దతిలో, ఎన్నికలు వచ్చినప్పుడు, అప్పటి రాజకీయ పరిస్థితి, రాజకీయ అవసరాలు, అన్నిటినీ  మించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవడమే సరైన నిర్ణయం అవుతుందని టీడీపీ భావిస్తోంది.చంద్రబాబు నాయుడు చెప్పింది కూడా అదే. నిజానికి ఇప్పడు కాదు, మొదటి నుంచి చంద్ర బాబు నాయుడు పొత్తుల చర్చలకు ఇంకా సమయం రాలేదనే అభిప్రాయం తోనే ఉన్నారు. అయితే పొత్తుల ఊసును పూర్తిగా కొట్టిపారేయకండా చర్చలో ఉండేలా మాట్లాడారు. అదలా ఉంటే తెలంగాణలో   మునుగోడులో అధికార తెరాసకు మద్దతు ఇవ్వడం ద్వారా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కేసీఆర్ జాతీయ పార్టీకి అండగా ఒక ప్లాట్ ఫామ్ కు క్రియేట్ చేశారని చెప్పాలి.   అంతే కాకుండా కొత్త పొత్తులకు పాత తగవులు అడ్డు రావని, లెఫ్ట్ పార్టీలు ఈ పొత్తు ద్వారా నిరూపించారు. ఇక ఇప్పుడు ఆ పార్టీలకు బీజేపీ తెలుగుదేశం పార్టీల పొత్తు.. ఒక వేళ  భవిష్యత్ లో కుదిరితే.. మాట్లాడే నైతికత లేనట్లేనని పరిశీలకులు అంటున్నారు. అయితే ఇక్కడ నైతిక విలువలు అవీ ఇవీ అని మాట్లాడవలసిన అవసరం లేదు.   సిపిఐ, సిపిఎం పార్టీలు బీజేపీని ఓడించేందుకు తెరాసకు మద్దతు ఇస్తున్నామని చెప్పుకోవడం తాడి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే ... ఆవుదూడ మేతకు అన్నట్లు ఉందని కొందరు అంటున్నారు , అందుకు కారణం, గతంలో కేసేఆర్ లెఫ్ట్ పార్టీలను, ఆ పార్టీ నాయకులను ఎంతగా చులకన చేశారు, ఎంతగా అవహేళన చేశారు, అలాగే లెఫ్ట్ నేతలు కేసీఆర్ ను  ఏ భాషలో దూషించారు, అనేది అందరికీ తెలిసినదే. ఇక దేశ వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా చూస్తున్నది ఏపీలో పొత్తులు ఎటు తిరిగి ఎటు కుదురుతాయి అన్న అంశంపైనే. విశాఖలో జనసేనాని పర్యటనను అధికార పార్టీ అడ్డుకున్న తరువాత ఆవేశంతో ఆయన చేసిన ప్రసంగం, చంద్రబాబు స్వయంగా కదిలి వచ్చి మరీ తెలిపిస సంఘీ భావం తరువాత తెలుగుదేశం, జనసేనల మధ్య పొత్తు పొడిచేసిందనే విశ్లేషణలు వెల్లు వెత్తాయి. చంద్రబాబు, పవన్ సంయుక్తంగా అప్పట్లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా పవన్ కల్యాణ్ రాష్ట్రంలో బీజేపీ నేతలతో కలిసి ముందుకు నడవలేని పరిస్థితి ఉందన్న నిర్వేదం వ్యక్తం చేశారు. దీంతో తెలుగుదేశంతోనే ఆయన అడుగులు వేయనున్నారన్న నిర్ధారణకు రాజకీయ వర్గాలు వచ్చేశాయి. అయితే తాజాగా విశాఖలో మోడీతో భేటీ తరువాత పవన్ స్వరంలో మార్పు కనిపించింది. ఒంటరి పోరుపై సంకేతాలిస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా జాతీయ స్థాయిలో పొత్తు పొడుపులే సార్వత్రిక ఫలితాన్ని నిర్ణయిస్తాయన్న చర్చ అయితే రాజకీయ వర్గాలలో విస్తృతంగా జరుగుతోంది.

ఎందరు ఛీ అన్నా మోడీ ప్రభ వెలిగిపోతోంది?! కారణమిదేనా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ళ పాలనలో, దేశానికి పనికొచ్చే ఒక్క మంచి పనిచేసింది, లేదు. ఏ వర్గాన్ని సంతృప్తి పరిచిందీ లేదు. మోడీ వట్టి పనికిమాలిన  ప్రధాని. ఇంత పనికి మాలిన ప్రదానిని నేను నా 40 సంవత్సరాల  రాజకీయ జీవితంలో చూడలేదు. తెలంగాణ గడ్డపై నుంచే మోడీ పతనానికి పోరు మొదలౌతుంది. ఈడీ దాడులకు భయపడవద్దు.. ఈ మాటలు ఎవరివో వేరే చెప్పనక్కరలేదు. ఈ మధ్య కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరచు మోడీ లక్ష్యంగా కేంద్రంపైనా, బీజేపీపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక్క కేసీఆర్ అనే కాదు..  , కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదలు రేవంత్ రెడ్డి వరకు. ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరూ, మోడీని విమర్శించడంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఇలా బీజేపీయేతర పార్టీల నాయకులందరూ మోడీని విమర్శించడమే కాదు.. ఆయన విధానాలు దేశాన్ని ఎంతగా భ్రష్టు పట్టించాయో సమయం, సందర్భం లేకుండా ఉద్ఘాటించేస్తుంటారు. అయితే విపక్షాలు ఎంతగా విమర్శించినా జాతీయంగా, అంతర్జాతీయంగా మోడీ ప్రతిష్ట మసకబారుతున్న పరిస్థితి అయితే కనిపించడంలేదు.   రాహుల్ గాంధీ సహా ప్రధాని రేసులో ఉన్న ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరి కంటే,ఇప్పటికీ  మోడీయే ఫస్ట్ ప్లేస్’లో ఉన్నారు. ఇండియా టుడే  నిర్వహించిన  మూడ్ ఆఫ్ డి నేషన్ సర్వే ఇదే తేల్చి చెప్పింది.   53 శాతం మంది ప్రజలు మరోమారు  మోడీయే ప ప్రధాని కావాలని కోరుకుంటున్నారన్నది మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితం పేర్కొంది. అయితే మోడీ తరువాత అత్యధికులు రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపుతున్నారు. అయతే రెండో స్థానంలో ఉన్న రాహుల్ కు మద్దతు ఇచ్చిన వారు   కేవలం 9 శాతం మంది మాత్రమే.  ఆ తరువాతి స్థానం కేజ్రీవాల్ ది. ఆయనను పీఎంగా చూడాలనుకుంటున్న వారి శాతం   జస్ట్   7 శాతం మంది.   సో, రాహుల్ గాంధీ, కేసీఆర్ వంటి ప్రతిపక్ష పార్టీల నాయకులు మోడీని  పనికిమాలిన ప్రధాని అని ఎద్దేవా చేసినా దేశ ప్రజలు మాత్రం  మోడీకే జై కొడుతున్నారన్నమాట.  సర్వేలే కాదు. వివిధ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయి. అలాగే దేశీయంగానే కాదు, అంత‌ర్జాతీయంగా కూడా  ప్రధాని మోడీ ఛ‌రిష్మా పెరుగుతూనే ఉంది. ప్రధాని పదవిలో ఎనిమిదేళ్లు పూర్తిచేసుకున్న మోడీకి జాతీయంగా, అంత‌ర్జాతీయంగా కూడా ప్రతిభ మసకబారడం లేదంటే అందుకు కారణం.. దేశంలో మోడీని వ్యతిరేకించే శక్తుల అనైన్యత అని అనుకోవచ్చు. మరి అంతర్జాతీయంగా ఛరిష్మా ఇసుమంతైనా తగ్గక పోవడానికి కారణమేమిటి?  ఇండోనేషియాలో జరుగుతున్న జీ-20 శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని మోడీకి జో బైడెన్ సెల్యూట్ చేయడం... బ్రిటిష్ ప్రధాని మోడీతో భేటీకి అత్యుత్సాహం చూపడం, మోడీతో భేటీ అయిన గంటల వ్యవధిలోనే భారత్ అనుకూలంగా బ్రిటిస్ విసా విధానాన్ని ప్రకటించడం ఇవన్నీ దేనిని సూచిస్తున్నాయి? ఇటీవల అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ప్ర‌పంచ అత్యుత్త‌మ నేత  ఎవరనేఅంశంపై నిర్వహించిన స‌ర్వేలో కూడా  మోడీ మళ్ళీ మొదటి స్థానంలో నిలిచారు. మొత్తం 22 మంది అంతర్జాతీయ నేత‌ల‌పై నిర్వహించిన సర్వేలో  అత్యధికంగా 75 శాతం రేటింగ్ మోడీకే దక్కింది. ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నా.. అమెరికా ఆంక్షల హెచ్చరికలు చేసినా భారత్ రష్యా నుంచి అయిల్ కొనుగోలు విషయంలో వెనక్కు తగ్గలేదు. ఈ నిర్ణయంతో మోడీ గ్రాఫ్ అంతర్జాతీయంగా పడిపోతుందని అంతా భావించారు. అయితే పరిస్థితి అంతకు భిన్నంగా ఉంది. కారణం? అంతర్జాతీయంగా భారత్ మార్కెట్ విస్తరిస్తుండటం. అదే సమయంలో చైనా విధానాలపై ప్రపంచ దేశాలలో వ్యతిరేకత వ్యక్తం అవుతుండటం అంతర్జాతీయంగా మోడీ ప్రతిష్ట ఇనుమడించడానికి కారణమంటున్నారు. ఇక దేశీయంగా విపక్షాలలో రాజకీయ అనైక్యత మోడీ ప్రతిభ మసకబారకుండా ఉండటానికి కారణమంటున్నారు. దేశీయంగా బీజేపీయేతర పక్షాలు ఐక్యంగా ముందుకు సాగే పరిస్థితులు నెలకొని ఉంటే ఈ సర్వేల ఫరితాలు పూర్తిగా ఇప్పుడున్న వాటికి భిన్నంగా ఉండేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

సమీక్షల ప్రహసనం.. జగన్ మాటలపై నమ్మకం కోల్పోయిన క్యాడర్!?

 రాజుగారి దేవతా వస్త్రాల కథలా తయారైంది ఏపీ సీఎం జగన్ పరిస్థితి. ఎంత రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తూ.. భుజ కీర్తులతో తమ అధినేతను ఆకాశానికి ఎత్తేసే వంది మాగధులు ఉన్నా.. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి పై సమీక్షలు నిర్వహించక తప్పని పరిస్థితి. అందుకే అనివార్యంగా నియోజకవర్గ సమీక్షలు నిర్వహిస్తున్నారు. గుర్తుకు వచ్చినప్పుడు నచ్చిన నియోజకవర్గం నుంచి తను మెచ్చిన ఓ 50 మందిని తాడేపల్లికి పిలిపించుకుని ప్రసంగాలిచ్చేసి పంపించేస్తున్నారు. అయితే  ఎన్నికల కసరత్తులంటూ జగన్ చేస్తున్న నియోజకవర్గాల సమీక్షలపై పార్టీ కేడర్ ఆసక్తి కోల్పోయింది. ఆయన మాటలు వారిలో విశ్వాసం నింపడం లేదా? అసలు సమీక్ష అంటేనా.. వారు ఎందుకొచ్చిన గొడవరా బాబూ అనుకుంటున్నారా? అయినా వైసీపీ అధినేత జగన్ దృష్టిలో నియోజకవర్గ సమీక్ష అంటే ఆ నియోజకవర్గం మొత్తం నుంచి తనకు నచ్చిన, తనకు సమస్యల చిట్టా విప్పరన్న నమ్మకం ఉన్న ఓ 50 మందిని ఎంపిక చేసి తాడేపల్లి ప్యాలస్ కు పిలిపించుకుని తాను చెప్పదలుచుకున్నది చెప్పేయడమే. సమీక్షలో మరో కండీషన్ కూడా ఉంది. ఎవరూ మాట్లాడడానికి ప్రయత్నించకూడదు. చెప్పింది వినాలి అంతే. అందుకే వైసీపీ శ్రేణులే జగన్ నిర్వహిస్తున్న సమీక్షలపై జోకులు వేసుకునే పరిస్థితి. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చాం.. మరొక్క చాన్స్ అంటూ జనంలోకి వెళ్లండి. ఈ సారి అధికారం అందుకుంటే.. ఇక అంతే మనల్ని ఎవరూ కదపలేరు. మూడు దశాబ్దాల పాటు మనదే అధికారం అంటే ఆ వచ్చిన వారిలో ఉత్సాహం నింపడానికి జగన్ నానా ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. బటన్ నొక్కి కోట్లకు కోట్ల రూపాయలు పందేరం చేస్తున్నా.. మనకు ఓట్లు ఎందుకు రావు.. 175కు 175 అసెంబ్లీ స్థానాల్లోనే మనం ఎందుకు గెలవం.. మీరు నియోజకవర్గంలో పని చేయండి చాలు మిగతాదంతా (బటన్ నొక్కడం) నేను చూసుకుంటాను అంటూ భరోసా నింపేస్తున్నారు. అయితే ఈ ప్రసంగాలేవీ క్యాడర్ లో అసంతృప్తిని చల్లార్చడం లేదు. నియోజకవర్గ సమీక్షలకు వచ్చిన వారంతా జగన్ కు వీర విధేయులే అయినా.. వారు కూడా మధ్య మధ్యలో జగన్ ప్రసంగానికి అడ్డు తగులుతున్నారు. నియోజకవర్గంలో సమస్యలను ఏకరవు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే జగన్ కు నచ్చడం లేదు. నేను చెబుతున్నాను కదా అన్నట్లు ఓ లుక్కేసి సమస్యలేమైనా ఉంటే పరిష్కరించడం అంటూ సీఎంవో అధికారులను ఆదేశించేస్తున్నారే తప్ప ఆ సమస్య ఏమిటన్నది కూడా వినిపించుకోవడం లేదు. ఎన్నో ఫిల్టర్ల తరువాతే జగన్ నియోజకవర్గ సమీక్షలకు వచ్చే క్యాడర్ ను ఎంపిక చేస్తున్నారు. వారెవరూ కచ్చితంగా నోరెత్తరని నిర్ధారణ చేసుకునే.. అందుకు అనుగుణంగా వారికి ట్రైనింగ్ ఇచ్చి మరీ వారిని జగన్ సుముఖానికి అంటే సమీక్షకు పిలుస్తున్నారు. అయినా కూడా ఈ సమీక్షల్లో అంత ఫిల్టరై వచ్చిన వారు కూడా సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే విజయం కష్టం అన్నసూచనలూ  ఇస్తున్నారు. అయితే జగన్ మాత్రం అవన్నీ మీరు పట్టించుకోవద్దు.. సమస్యలు పరిష్కారమౌతాయి.. పందేరాలు కొనసాగుతాయి.. మనదే విజయం.. అందుకు మీరు చేయాల్సింది ఐక్యంగా పని చేయడం అంటూ వారి నోరు మూయిస్తున్నారు. జగన్ ఈ వైఖరి కారణంగానే క్యాడర్ లో కూడా పని చేసే ఉత్సాహం అడుగంటి పోయిందంటున్నారు. ఆయన ఎలాగూ బటన్ నొక్కుతున్నారుగా.. ఇక మనం పని చేసేదేముంది  అంటూ సరదా వ్యాఖ్యలు చేసుకుంటున్న పరిస్థితి దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ నెలకొని ఉందని వైసీపీ వర్గాలే అంతర్గత  సంభాషణల్లో చెబుతున్నాయి. జగన్ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. పగటి కలో, ఆత్మ విశ్వాసమో తెలియదు కానీ విజయంపై తనకున్న ధీమాను క్యాడర్ లోనూ కలిగించేందుకు సమీక్షల పేర ఉద్బోధలు మాత్రం నిరాటంకంగా చేసుకుంటూ పోతున్నారు. కానీ పార్టీలో మాత్రం సమీక్షల తీరు మారాలనీ, పెద్ద సంఖ్యలో క్యాడర్ ను సమీక్షలకు పిలిచి వారి అభిప్రాయాలను తీసుకోవాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే పిల్ల మెడలో గంట ఎవరు కడతారు? జగన్ మాటలు దేవతావస్త్రాల్లా ఉన్నాయని ఎవరు చెబుతారు? ఈ ప్రశ్నకు పార్టీ నేతలు ఎవరి నుంచీ సమాధానం ఉండదు. అంతా గప్ చిప్

ఆల్ ఇండియన్స్ ఆర్ హిందూస్: మోహన్ భగవత్

భారత దేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు  అన్నట్లుగానే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇప్పుడు  భారతీయులందరూ హిందువులే (ఆల్ ఇండియన్స్ ఆర్ హిందూస్) అంటున్నారు. కులం, మతం, ఆహారపుటలవాట్లు వీటి వేటితోనూ సంబంధం లేకుండా భారత్ లో నివసించే వారంతా హిందువులే అని ఉద్ఘాటిస్తున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మొదటి నుంచీ ఇదే చెబుతోందన్నారు. ఛత్తీస్ గఢ్ లోని అంబికాపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రజల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించడమే హిందుత్వ సిద్ధాంతమని మోహన్ భగవత్ సెలవిచ్చారు. అఖండ భారత్ లో భాగమైన అందరి డీఎన్ఏ ఒక్కటేనన్నారు. మత సామరస్యం, పరస్పర గౌరవం నేటి అవసరాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ సంస్కృతీ సంప్రదాయలను పాటిస్తూ, గౌరవిస్తూనే.. ఇతరుల సంస్కృతీ సంప్రదాయాలను కూడా గౌరవించాలన్నారు. సొంత లబ్ధి కోసం, లక్ష్యాల సాధన కోసం దేశంలో మత సామరస్యానికి భంగం కలిగేలా ద్వేషపూరిత వాతావరణానికి కారణం అవ్వడం ఎంతమాత్రం సరి కాదని మోహన్ భగవత్ చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం భాతర ఆత్మ అని గుర్తు చేశారు. కరోనా మహమ్మరి విజృంభిస్తున్న కాలంలో దేశంలో కనిపించిన ఐక్యత ఎల్లకాలం కనిపించాలన్నారు. 

ఏపీ సర్కార్ కు ఎన్జీటీ ఫైన్..రూ.5 కోట్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోర్టుల్లో మొట్టికాయలు, హరిత ట్రైబ్యునల్ జరిమానాలు ఒక అలవాటుగా మారిపోయాయా. పర్యావరణ పరిరక్షణ, నిబంధనలు, కోర్టు ఉత్తర్వులు అంటే ఖాతరీ లేని తీరే ఇందుకు కారణమా అంటే పరిశీలకులు క్షణం ఆలస్యం చేయకుండా ఔనని బదులిచ్చేస్తున్నారు. తాజాగా జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఏపీ సర్కార్ కు రూ.5 కోట్లు జరిమానా విధించింది. పేదలకు ఇళ్ల పేర ఏపీ సర్కార్ మడ అడవులను ధ్వంసం చేసేసిందని పేర్కొంటూ ఈ జరిమానా విధించింది. కాకిడాన శివారు దమ్మాల పేటలోని మడ అడవులను జగన్ ప్రభుత్వం ద్వంసం చేసేసిందని పేర్కొంది.  సీఆర్‌జడ్ నిబంధనలు, పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని జగన్ సర్కార్  ఉల్లంఘించిందంటూ అందిన ఫిర్యాదు మేరకు విచారించిన ట్రిబ్యునల్ పర్యావరణ విధ్వంసం వాస్తవమేనన్న నిర్ణయానికి వచ్చి ఈ మేరకు జరిమానా విధించింది.   ఇళ్ల స్థలాల పేరుతో అడవులను ధ్వంసం చేయడాన్ని ఎన్జీటీ తీవ్రంగా తప్పుబట్టింది. సీఆర్ జడ్-1ఏ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో ఇళ్ల స్థలాల ప్రాజెక్టు చేపట్టొద్దని విస్పష్టంగా ఆదేశించింది. మడ అడవుల సంరక్షణపై ప్రభావం పడేలా భూ వినియోగ మార్పిడి కోసం అధికార యంత్రాంగం ప్రయత్నించడం తగదని హెచ్చరించింది.  ఇప్పటికే అక్కడ జరిగిన విధ్వంసానికి మధ్యంతర పరిహారం కింద ఆరు నెలల్లోగా రూ. 5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.   ఈ జరిమానా మొత్తాన్ని మడ అడవుల సంరక్షణకు వ్యయం చేయాలని ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొంది. అలాగే అడవుల విధ్వంసం ఏ మేరకు జరిగింది, ధ్వంసమైన మేర అడవులను పునరుద్ధరించేందుకు ఎంత వ్యయం అవుతుంది అన్న అంశాలపై అధ్యయనం కోసం  ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది.

తెలంగాణపై చలి పులి పంజా!

తెలంగాణ చలిపులి పంజా దెబ్బకు విలవిలలాడుతోంది. ఒక్క సారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఉదయం పది గంటల వరకూ బయటకు రావాలంటేనే జనం భయపడే పరిస్థితి నెలకొని ఉంది. విపరీతమైన చలి కారణంగా ఆరోగ్య సమస్యలు సైతం తలెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  మంగళవారం(నవంబర్15)న రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా బేలలో అత్యల్పంగా 0.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 20వ తేదీ వరకూ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల వరకూ పడిపోవచ్చని పేర్కొన్నారు. విపరీతంగా పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. శ్వాస సంబంధిత రుగ్మతలు ఉన్న వారు మరీ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పొగ మంచు కారణంగా వాయుకాలుష్యం కూడా హెచ్చుగా ఉంటుందని హెచ్చరించారు. మాస్కుల వాడకం ద్వారా కాలుష్యం ముప్పును కొంత వరకూ అధిగమించవచ్చని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాను వణికిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చలి తీవ్రంగా ఉంటోంది. దీంతో జిల్లా ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. చలికి తోడు గాలులు కూడా వీస్తుండడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గత ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి.మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.  

ధర ఎక్కువ.. మరి నాణ్యత?.. ఏపీలో అందుబాటులోకి మరో 10 మద్యం బ్రాండులు

ఆంధ్ర ప్రదేశ్ లో మద్య నిషేధం సంగతేమో కానీ.. ఎక్కడా కనీ వినీ ఎరుగని బ్రాండ్లు మాత్రం తెగ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. తాజాగా మరో పది కొత్త మద్యం బ్రాండులు ఏపీలో అందుబాటులోకి రానున్నాయి. వీటినిక ఏపీ ఎబీసీఎల్ అనుమతులు ఇచ్చేసింది. వీటి ప్రత్యేకత ఏమిటంటే అదే కేటగిరిలో ఇప్పటికే అందుబాటులో ఉన్న బ్రాండ్ల మద్యం కంటీ వీటి ధర ఎక్కువ. ప్రస్తుతం  ఏపీలో అందుబాటులో ఉన్న కొన్ని కేటగిరిల బీరు ధర రెండు వందల రూపాయలు అయితే.. ఇప్పుడు అ అదే కుటగిరిలో కొత్తగా అనుమతి వచ్చిన బ్రాండ్ బీరు ధర అంతకంటే ఎక్కువ. కొత్త బ్రాండ్ ధరను 220 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే క్వార్టర్ మద్యం ధర రూ.110లు కాగా కొత్తగా అనుమతి పొందిన బ్రాండ్ ల మద్యం క్వార్టర్ ధర 130 రూపాయలుగా నిర్ణయించారు.  తమిళనాడుకు చెందిన ఎస్ఎన్‌జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్ లిమిటెడ్ సంస్థతోపాటు మరికొన్ని మద్యం సరఫరా కంపెనీలకు చెందిన కొత్త బ్రాండ్లకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. కాగా, కొత్తగా అనుమతులు పొందిన బ్రాండ్లు, వాటికి నిర్ణయించిన ధరల విషయంలో ఏపీఎస్‌బీసీఎల్ అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. మందుబాబులు మద్యం తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మరీ ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తూ ఉంటారు. మన దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలే ఆయా ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరులని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం తమకు ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని చెప్పింది. చెబుతోంది. దశలవారీగా మద్య నిషేధం చేస్తామని, ఐదేళ్లలో రాష్ట్రంలో పూర్తిగా మద్య నిషేధం చేస్తామని అధికార పగ్గాలు చేపట్టడానికి ముందు స్వయంగా జగనే ప్రకటించారు. కానీ, ప్రభుత్వం చెప్పిన దానికి రాష్ట్రంలోజరుగుతున్న దానికి పొంతనే లేకుండా పోయింది. మద్యం మీద ప్రభుత్వం ఆదాయం ఏమాత్రం తగ్గలేదు. సరికదా ప్రభుత్వం ఒప్పుకోకపోయినా ఆదాయం విపరీతంగా పెరిగిందన్నది మాత్రం సత్యం. ఇక ప్రభుత్వమే చేస్తున్న మద్యం వ్యాపారంలో నాణ్యత లేని బ్రాండ్లను సరఫరా చేస్తూ, వాటిని కూడా గతంలో కంటే అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజల జేబులనే కాకుండా ఆరోగ్యాన్ని కూడా గుల్ల చేస్తోంది.    మద్యం ధరలు పెంచి మద్యం ప్రియులను దానికి దూరం చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో మద్యం దుకాణాలు మూతపడి, తెరిచిన తర్వాత.. లిక్కర్‌ పై మొత్తం 75 శాతం పన్నులను పెంచింది. మద్యం అందుబాటు ధరలో లేకపోవడంతో శానిటైజర్లు తాగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.  దీంతో తీవ్ర విమర్శలు రావడంతో మద్యం ధరలను స్వల్పంగా తగ్గించింది. అలాగే ప్రభుత్వం వింత వింత పేర్లున్న బ్రాండ్లను తీసుకురావడంతో.. నాసిరకం మద్యాన్ని ఎక్కువ ధరలకు అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో, జీవితాలతో ఆటలాడుతున్నారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు, పొరుగు రాష్ట్రాల నుండి భారీగా అక్రమ మద్య రవాణా జరుగుతోంది. దీనికితోడు నాటుసారా తయారీ, అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి.  ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని.. ఏటా 20 శాతం చొప్పున మద్యం దుకాణాలు తగ్గించి, ఐదేళ్ల నాటికి కేవలం స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం అందుబాటులో ఉండే విధంగా చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ   జరిగిన, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మద్య నిషేధం సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రేట్ల పెంపుతో ప్రభుత్వ ఆదాయానికి ఏ లోటు లేదు.. కేవలం రేట్లు పెంచితే చాలు మద్యం ప్రియులు మందుకు దూరమవుతారంటూ ధరలను పెంచేసుకుంటూ పోవడమే కాకుండా.. ఏకంగా వచ్చే పాతికేళ్ల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకున్న ప్రభుత్వ నిర్వాకం చూస్తుంటే మద్య నిషేధం అన్న మాటను సర్కార్ అటకెక్కించేసిందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.