పార్టీ ఎమ్మెల్యేల కదలికలపై కేసీఆర్ నిఘా?
posted on Nov 16, 2022 5:38AM
కేసీఆర్ స్వరం మారింది. మునుగోడు ఉపఎన్నికలో విజయం ఇచ్చిన ధీమా ఎక్కడా కనిపించలేదు. ఎమ్మెల్యేలు కట్టుతప్పుతున్నారన్న బెరుకు, ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత వ్యక్తమౌతోందన్నఆందోళన ఆయన గొంతులో ప్రస్ఫుటమైంది. మంగళవారం(నవంబర్15)న జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంవలో కేసీఆర్ ప్రసంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ లు ఇవ్వడానికే ఎక్కువ సమయం కేటాయించారు. అదే సమయంలో తన బిడ్డ కవితపై లిక్కర్ స్కాం ఆరోపణలకు కారణం ఆమె బీజేపీలో చేరడానికి నిరాకరించడమే అని చెప్పడానికి ప్రయత్నించారు.
ఇక బీజేపీపై యుద్ధమేనంటూ పార్టీ క్యాడర్ కు పిలుపు నిస్తూనే.. ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగిపోతున్నారన్న భయాన్నీ వ్యక్తం చేశారు. ఎవరేం చేస్తున్నారో తనకు తెలుసుననీ, ఏం చేసినా తనకు తెలిసిపోతుందనీ హెచ్చరించారు. అందరి కదలికలపైనా నిఘా ఉందని చెప్పకనే చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించినా అనుకున్నంత మెజారిటీ రాలేదన్న ఆవేదన, మంత్రులు సరిగా పని చేయలేదన్న ఆగ్రహం ఆయన గొంతులో వినిపించింది.విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ టీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రలోభాలకు లొంగొద్దని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండమని సూచించారు.
మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో కేసీఆర్ ఫుల్ జోష్ లో ఉన్నారనీ, ఇక బీఆర్ఎస్ విస్తరణపైనే దృష్టి కేంద్రీకరిస్తారనీ అంతా ఊహించారు. అందుకే మంగళవారం(నవంబర్ 15) టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారని మీడియాలో ప్రచారమైంది. అయితే ఆ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులకు హెచ్చరికలు జారీ చేయడానికే ఎక్కువ సమయం కేటాయించారు. ఎవరేం చేస్తున్నారో తన వద్ద సమాచారం ఉందని, ఎవరేం చేసినా తనకు తెలిసిపోతుందని హెచ్చరించారు. ఒక వైపు భవిష్యత్ దిశా నిర్దేశం చేస్తూనే మరో వైపు ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారన్న అనుమానాలూ వ్యక్తం చేశారు. ప్రలోభాలకు లొంగి భవిష్యత్ నాశనం చేసుకోవద్దంటూ హితవూ పలికారు.
అదే సమయంలో బీజేపీపై విమర్శల వర్షం కురింపించారు. అదే సమయంలో బీజేపీపై సమరశంఖం పూరించారు. బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తోందనీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వల విసురుతోందనీ, ఆ వలలో పడకపోతే.. కేసులు, దాడులంటూ వేధిస్తుందనీ కేసీఆర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను అప్రమత్తం చేశారు. కేసులూ, దాడులకు భయపడొద్దని ధైర్యం చెప్పారు. బీజేపీ వారు స్వయంగా తన కుమార్తె కవితనే బీజేపీలో చేరాల్సిందిగా ఒత్తిడి తెచ్చారనీ, ఇంతకంటే దారుణం ఉంటుందా అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఆమె బీజేపీ గూటికి చేరడానికి నిరాకరించడం వల్లనే ఇరికించారని అన్యాపదేశంగా చెప్పారు. ఎమ్మెల్యేలపై కూడా ఈడీ దాడులు జరగొచ్చని, భయపడొద్దన్నారు.
ఏపీలో జగన్ సర్కార్ బీజేపీకి, కేంద్రంలోని మోడీ సర్కార్ కు అడుగులకు మడుగులొత్తుతున్నా అక్కడా సర్కార్ ను కూల్చేందుకు కుట్ర చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ బీజేపీ కుట్రలను ఎదుర్కొని గట్టి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్న భరోసా ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో మంత్రులు ఇన్ చార్జ్ లుగా ఉన్న చోట్ల బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి మెజారిటీ వచ్చిందంటూ, మునుగోడులో టీఆర్ఎస్ మెజారిటీ తక్కువగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు ఎన్నికల విషయంలో కూడా ఆయన ఈ సమావేశం వేదికగా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ముందస్తు ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, సిట్టింగులందరికీ పార్టీ టికెట్ లు గ్యారంటీ అని విస్పష్టంగా చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో ముచ్చటగా మూడో సారి అధికారం చేపడతామన్న ధీమా వ్యక్తం చేశారు.
పార్టీ శ్రేణులంతా ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలనిన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం కూడా లేదన్న కేసీఆర్.. మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని ఆదేశించారు. పార్టీ, ప్రభుత్వ పరంగా ఉన్న లోటుపాట్లను తన దృష్టికి తీసుకురావాలన్నారు. వంద ఓటర్లకు ఒక ఇంఛార్జిని నియమించాలనీ,. 10 రోజుల్లో ఇంఛార్జుల నియామకం పూర్తి కావాలని నిర్దేశించారు.