ఈటలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎర ? గులాబి గూటికి చేరకుండా జాగ్రత్తేనా?
posted on Nov 15, 2022 @ 3:54PM
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాల రాజకీయం నడుస్తోంది. సీబీఐ, ఐటీ, ఈడీల వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో తెరాస నేతలు లక్ష్యంగా దూకుడు ప్రదర్శిస్తుంటే.. సీట్, తెలంగాణ జీఎస్టీ వంటివి బీజేపీ నేతలు లక్ష్యంగా దూకుడుగా కదులుతున్నాయి. వాస్తవానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు రాజకీయాలకు సంబంధం లేకుండా స్వతంత్రం గా వ్యవహరించాల్సిన వ్యవస్థలు. అయితే అవి ఆ ప్రత్యేకతను కోల్పోయాయని రాజకీయ పరిశీలకులే కాదు.. సామాన్య జనం సైతం భావిస్తున్నారు. అందుకు అవి వ్యవహరిస్తున్న తీరే, అధికార పార్టీ కనుసన్నలలో పని చేస్తున్నట్లుగా కనిపిస్తున్న వైనమే కారణమనడంలో సందేహం లేదు.
సరే ఆ సంగతి పక్కన పెడితే ఇరు పార్టీలూ కూడా ఆపరేషన్ ఆకర్ష్ విషయంలోనూ పోటీలు పడుతున్నాయి. నువ్వొకరిని చేర్చుకుంటే.. నా కోటాకు ఇద్దరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక ముందు ఈ పోటీ ప్రస్ఫుటంగా కనిపించింది. సరే మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వచ్చిన తరువాత.. విజయం సాధించిన టీఆర్ఎస్, పరాజయం పాలైన బీజేపీ కూడా ఫలితంపై ఆత్మావలోకనం చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఆత్మావలోకనంలో రెండు పార్టీలకూ కూడా ఈటల రాజేందరే సెంట్రిక్ గా నిలిచారు. తెరాస అయితే మునుగోడులో మెజారిటీ అనుకున్నంతగా రాకపోవడానికి ఈటల వంటి నేత పార్టీకి దూరమవ్వడమే కారణమని తెరాస భావిస్తుంటే.. మునుగోడు బైపోల్ లో ఇంత గట్టి పోటీ ఇవ్వడానికి ఈటలే కారణమని బీజేపీ నిర్ధారణకు వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ తన స్వభావానికి విరుద్ధంగా ఈటలను పార్టీ నుంచి బహిష్కరించడం సరైన నిర్ణయం కాదన్న భావనతో పార్టీలోకి ఆహ్వానించే దిశగా అడుగులు వేస్తుంటే.. ఇంత కాలం ఈటలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా పొరపాటు చేశామన్న భావనతో బీజేపీ ఉంది.
దీంతో మునుగోడు వైఫల్యానికి బండిని బాధ్యుడిని చేసి ఆయన స్థానంలో ఈటల రాజేందర్ కు అధ్యక్ష పగ్గాలు అప్పగించాలన్న భావనతో బీజేపీ ఉంది. తెలంగాణలో మరోసారి అధికారం నిలుపుకోవడమే లక్ష్యంగా తెరాస అడుగులు వేస్తుంటే.. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేజిక్కించుకోవడమే ధ్యేయంగా బీజేపీ పావులు కదుపుతోంది. మామూలుగా తనను ధిక్కరించిన వారి ముఖం చూడడానికి కూడా ఇష్టపడని కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మరీ ఈటలను తెరాసలోకి ఆహ్వానించారని తెరాస శ్రేణుల నుంచే వస్తున్న సమాచారం పరిశీలకులను సైతం ఆశ్చర్య పరుస్తోంది.
బీజేపీ చేరికల కమిటీ సారథిగా ఈటల తెరాస కు గట్టి సవాల్ విసిరారనీ, ఆయన వల్లనే పలువురు కమలం వైపు మళ్లారనీ తెరాస శ్రేణులే కాదు స్వయంగా కేసీఆర్ కూడా భావించడం వల్లనే ఈటలకు తెరాస గూటికి మళ్లీ ఆహ్వానం అందిందనీ, అదీ స్వయంగా కేసీఆర్ నుంచి అందడమంటే మామూలు విషయం కాదనీ పరిశీలకులు అంటున్నారు. అలాగే కేవలం ఈటల వల్లే మునుగోడు ఉప ఎన్నికలలో తెరాసకు దీటుగా పోటీ ఇవ్వగలిగామన్న అభిప్రాయానికి బీజేపీ వచ్చి ఆయనకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవ్వడం ఇందుకోసం ఆయనను హస్తినకు పిలిపించుకోవడం బట్టి చూస్తే మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఒక్క సారిగా రెండు పార్టీలలోనూ ఈటల ప్రాముఖ్యతను పెంచేసిందని అంటున్నారు.
అసలు బీజేపీలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి గతంలో ఎన్నడూ ఇవ్వనంత ప్రాధాన్యత ఇప్పటికే ఈటలకు దక్కింది. అది చాలదన్నట్లు ఇప్పుడు ఏకంగా రాష్ట్ర పార్టీ పగ్గాలే అప్పగించడానికి సిద్ధమైందంటే తెలంగాణలో అధికారం చేపట్టాలంటే ఈటల వల్లే సాధ్యమన్న భావనకు వచ్చినట్లేనని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవలి తీరు వల్ల పార్టీకి మేలు కంటే నష్టమే ఎక్కువ జరిగిందన్న భావనకు రావడం కూడా ఒక కారణమంటున్నారు. అమిత్ షా చెప్పులు మోయడం దగ్గర నుంచి ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో బండి సంజయ్ ఓవర్ యాక్షన్ పార్టీకి బూమరాంగ్ అయ్యిందని అగ్రనాయకత్వం భావిస్తోందని బీజేపీ శ్రేణులే అంటున్నాయి. అదే సమయంలో బండి రాష్ట్ర పార్టీలోని ఇతర నాయకులను పెద్దగా పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరుపై కూడా బీజేపీ అధిష్ఠానం అసంతృప్తితో ఉందంటున్నారు.
అదంతా పక్కన పెడితే బీజేపీలో ఇమడ లేక ఇంత కాలం ఉక్కపోతతోనే నెట్టుకొచ్చిన ఈటలకు ఇప్పుడు తెరాస నుంచీ, బీజేపీ నుంచీ కూడా బంపరాఫర్లు వస్తున్న నేపథ్యంలో ఎటో అటు తేల్చుకోవలసిన సమయం వచ్చింది. అత్యంత అవమానకరంగా పార్టీ నుంచి బయటకు పంపి ఇప్పుడు త్వమేవ శరణం నాస్తి అన్నట్లుగా ఆహ్వానిస్తే మారు మాట్లాడకుండా వెళ్లిపోవడమా.. పార్టీ పగ్గాలే అప్పగిస్తాం అంటున్న బీజేపీ ఆఫర్ ను అంగీకరించి.. సిద్ధాంత వైరుధ్యమున్నా పదవి ఇస్తున్నారు కనుక ఉండిపోవడమా తేల్చుకోవలసింది ఈటలేనని పరిశీలకులు అంటున్నారు.