సేఫ్ ఫార్మాను అన్ సేఫ్ చేసిన వైసీపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న రాజధానిని గాలికొదిలేసి మూడు రాజధానులు తెస్తానంటున్న వైసీపీ ప్రభుత్వం తాజాగా మరో రాజధానిని కూడా తయారు చేస్తోంది. దేశంలోనే అధికంగా గాంజాయి సప్లై చేస్తున్న రాష్ట్రంగా పేరు సంపాదించిన ఆంధ్రప్రదేశ్ కీర్తి ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా విస్తరించింది.  నరసరావు పేటలోని సేఫ్ ఫార్మాలో తయారైన డ్రగ్స్ ప్రపంచంోని అన్ని దేశాలకూ ఎగుమతి అవుతున్నాయని జతీయ మీడియా ప్రచురించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఈ వార్తా కథనంతో సేఫ్ ఫార్మా డ్రగ్స్ దందా ప్రపంచానికి తెలిసింది.   గత మూడు రోజులుగా జిల్లాలో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కర్యక్రమంపై స్పందించిన వైసీపీ నేతలు చంద్రబాబును విమర్శించడమే కాకుండా.. కోడెల శివప్రసాద్ పేరును, ఆయన మరణానికి కారణాలను చర్చించారు. అంటే సేఫ్ ఫార్మా విషయం వారికి ముందే తెలుసని అందుకే కోడెల ప్రస్తావన తెచ్చారని మీడియా మిత్రులు చెబుతున్నారు.  1982లో స్థాపించిన సేఫ్ ఫార్మా గతంలో డాక్టర్ కోడెల అధీనంలో ఉండేది.  వైసీపీ అధికారంలోకి  వచ్చిన తరువాత సేఫ్ ఫార్మాని బలవంతగా  లాక్కొని కోడెల మరణానికి వైసీపీ కారణమయ్యారని నరసరావుపేట ప్రజలు బాహాటంగానే చెప్పుకుంటారు. నొప్పుల నివారణకు వినియోగించే ట్రమడాల్  అనే డ్రగ్ ఉత్పత్తికి  కోడెల అంగీకరించకపోవడమే  ఆయన ఆత్మ హత్యకు కారణమని ఆయన అభిమానులు అంటున్నారు. దీంతో కోడెలపై కక్ష కట్టిన వైసీసీ గ్యాంగ్ఆయనను వేధించి  చివరకు ఆయన చావుకు కారణమయ్యారని వారి వాదన. తాజాగా  ఫిబ్రవరి 27వ తేదీన సుడాన్  దేశంలో అక్కడి కస్టమ్స్ అధికారులు 21 కోట్ల రూపాయల విలువైన ట్రమడాల్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.  సేఫ్ ఫార్మా తయారు చేసిన డ్రగ్స్   సుడాన్ ద్వారా మిగిలిన దేశాలకు సరఫరా అవుతున్నాయని  అధికారులు గమనించారు. ఈ డ్రగ్స్ ను ఎక్కువగా  ఉగ్రవాదులు వినియోగిస్తున్నారనీ, వారి కోసమే ఈ డ్రగ్ ప్రత్యేకంగా తయారౌతోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన తీగను లాగితే.. దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ లోని నరసరావుపేటలో ఉన్న సేఫ్ ఫార్మాస్యూటికల్స్ ప్రయివేట్ లిమిటెడ్ అనే కంపెనీ చరిత్ర బయటకు వచ్చింది. డ్రగ్స్ కంట్రోల్ మీడియా సర్వీసెస్ అనే  ఆర్గనైజేషన్ ఈ నెల 26న ఈ విషయాన్ని పేర్కొంది. బెంగళూరు తో సహా మరికొన్నినగరాలలో పరిశీలించిన అధికారులు సేఫ్ ఫార్మా డైరెక్టర్ శనగల శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేశారు.   మరో డైరెక్టర్ గాదె కనిగిరి ప్రస్తుతం అందుబాటులో లేరని తెలుస్తోంది. వీరు ఇరువురూ  2020 మే 13వ తేదీన ఈ కంపెనీ డైరెక్టర్లుగా ఎంట్రీ ఇచ్చారు. 2019 సెప్టెంబర్ 16న కోడెల మరణం తరువాత కొత్త బోర్డు ఏర్పాటైంది. ఈ స్మగ్లింగ్ తో వైసీపీ ఎంపీకి కూడా సంబంధాలున్నాయని ఆరోపణలున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సేఫ్ ఫార్మాకు ఆర్డర్లు భారీ స్థాయిలో అందడం కొసమెరుపు. 

కమలానికి విజయం ఎంతో దూరం!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ వేడి భగ్గుమంటోంది. నిజానికి, మే 10న జరిగేది అసెంబ్లీ ఎన్నికలే అయినా, ఈసంవత్సరం చివరి వరకు  మరో ఆరేడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను, అలాగే, 2024 లోక్ సభ ఎన్నికలకు కర్ణాటక ఫలితాలు  టర్నింగ్ పాయింట్ కావడంతో, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను  అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికారాన్ని నిలుపుకునేందుకు బీజేపీ, చేజారిన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు అందిపు చ్చుకు నేందుకు కాంగ్రెస్, అధికారం కోసం హంగ్ కలలు కంటున్న జేడీఎస్ మాత్రమే కాకుండా కర్నాటక ఎన్నికలు జాతీయ స్థాయిలో కూడా అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నాటక ఎన్నికలలో విజయం ఎవరిదన్న దానిపై ఇప్పటి వరకూ వచ్చిన పలు ప్రీ పోల్ సర్వేలు రాష్ట్రంలో హంగ్ అనివార్యం అని పేర్కొన్నాయి. అయితే తాజాగా కర్నాటక ఎన్నికలపై శ్రీ ఆత్మసాక్షి సర్వే మాత్రం ఆ రాష్ట్రంలో బీజేపీకి విజయం చాలా దూరం అని పేర్కొంది.  కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి అవసరమైన స్థానాలను సాధిస్తుందనీ, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ అయిన 113 స్థానాల కంటే ఎక్కువ స్థానాలనే కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని పేర్కొంది.   శ్రీ ఆత్మసాక్షి సర్వే ప్రకారం కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ 115 నుంచి 127 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక  ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విజయం సాధించే స్థానాలు 77 నుంచి 88 వరకూ ఉండోచ్చని తేల్చింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుందనీ, హంగ్ ఏర్పడితే కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందనీ అంచనాలున్న జేడీఎస్ 29 నుంచి 36 స్థానాలకు పరిమితమౌతుందనీ శ్రీ ఆత్మసాక్షి సర్వే తేల్చింది. ఇతరులు మూడు నుంచి ఎనిమిది స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది.  ఆత్మసాక్షి సర్వే 2018లో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేసిన సర్వే అంచనాలు కచ్చితంగా రావడంతో తాజా ప్రీపోల్ సర్వేపై కూడా రాజకీయ పరిశీలకులు విశ్వసనీయత వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో శ్రీ ఆత్మసాక్షి సర్వే బీజేపీ 102 నుంచి 105 స్థానాలలో విజయం సాధిస్తుందని అంచనా వేయగా.. ఆ పార్టీ 104 స్థానాలలో విజయం సాధించింది. అదే విధంగా కాంగ్రెస్ 76 నుంచి 78 స్థానాలలో గెలిచే అవకాశాలున్నాయని పేర్కొనగా ఆ పార్టీ 78 స్థానాలలో విజయం సాధించింది. అలాగే జేడీఎస్ కు 35 నుంచి 38 స్థానాలలో గెలిచే అవకాశాలున్నాయని అంచనా వేస్తే ఆ పార్టీ 37 స్థానాలలో గెలుపొందింది. ఈ సారి కర్నాటకలో  కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది.  రాష్ట్రంలో హంగ్ పరిస్థితి లేదని ఆ సర్వే తేల్చింది. 

కేసీఆర్ హెచ్చరికతో అవినీతి ఎమ్మెల్యేలు పునీతులు!

గతం గతహ: పాత తప్పుల గురించి పట్టించుకోను.. ఇకపై తప్పు చేస్తే వదలనంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. అది అలాంటి ఇలాంటి హెచ్చరిక కాదు.. దళిత బంధు పథకం అమలులో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలు ఎవరన్నది తనకు తెలుసునని చెబుతూ ఆయన ఒకపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అంటే ఇక ముందు నిజాయితీగా ఉంటే.. గతంలో చేసిన అవినీతిని క్షమించేస్తాననీ, రైటాఫ్ చేసేస్తాననీ కేసీఆర్ చెప్పారా అన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది. గంగలో మునిగితే పాపాలు ప్రక్షాళన అయిపోయినట్లు.. కేసీఆర్ హెచ్చరికతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నీతిపరులైపోయారా?  అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. దీనినే వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ఎత్తి చూపారు.  తప్పు చేస్తే తన బిడ్డయినా, కొడుకైనా వదిలిపెట్టేది లేదు..  జైలుకు పంపుడే అన్న కేసీఆర్‌.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను వదిలిపెట్టేశారనీ, ఇప్పటికే ఆయన కొడుకు, కుమారుడూ అవినీతిలో కూరుకుపోయారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారనీ, వారిని వెనకేసుకొస్తున్న కేసీఆర్..తన ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే ధైర్యం ఎలా చేస్తారని అందేరూ ఇర మేందు అవినీతికి దూరంగా ఉంటే మీ అందరూ పునీతులే అంటున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. తన పార్టీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని స్వయంగా కేసీఆరే అంగీకరించారని, దళిత బంధులో రూ.3 లక్షల లంచం తీసుకుంటున్నారని ఓపెన్ గా చెప్పేసి చర్యలు తీసుకోవడం లేదంటీ అర్ధమేమిటని నిలదీశారు.    ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన బిడ్డ కవిత  విూద ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తారనే  ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చేశారా అని షర్మిల కేసీఆర్ ను నిలదీశారు.    

అవినీతి జరిగితే పట్టదా?

మీ అవినీతి చిట్టా నా వద్ద ఉంది. ఒక్కో ఎమ్మెల్యే రూ 3 లక్షలు తీసుకున్న సమాచారం నా వద్ద ఉంది అని బీఆర్ఎస్ అధ్యక్షుడు కెసీఆర్ ప్లీనరీ సమావేశంలో చేసిన హెచ్చరికలు  చర్చనీయాంశమయ్యాయి. కూత వేటు దూరంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న సమయంలో  దళిత బంధులో అవినీతి జరిగింది అని కేసీఆర్ చెప్పడం తన ప్రభుత్వాన్నేతానే  ఇరకాటంలో పెట్టింది. మరి ఇంత అవినీతి  నాలుగున్నరఏళ్లు జరిగినప్పుడు ఎంక్వైరీ గట్రా ఉండదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ వద్దే జాబితా ఉన్నప్పుడు చర్య ఎందుకు తీసుకోవడం లేదో ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ఎమ్మెల్యే అనుచరులు కూడా పైసలు వసూలు చేస్తున్నారు వారి సమాచారం కూడా తన వద్ద ఉందని కేసీఆర్ చెబుతున్నారు. మరి ఎందుకు ఈ ఊదాసీనత? ఇలాంటివి రిపీట్ అయితే టికెట్ ఉండదు, సరిగా పని చేయనివారి తోక కత్తిరిస్తా, మీ అనుచరులు తీసుకున్నా మీరే బాధ్యత అని ప్లీనరీలో కెమెరాలను ఆపి కేసీఆర్ క్లాస్ తీసుకున్నారు.   ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాల్లో అవినీతి చాలాకాలంగా జరుగుతుంది. కేసీఆర్ ఈ విషయాన్ని  ఓ వైపు ఒప్పుకుంటేనే మరో వైపు మీకు టికెట్లు రావు అని హెచ్చరించడం ఎటువంటి సంకేతాలు ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఏ సంక్షేమ పథకమైనా అమలు కావాలంటే ప్రజలు ఇచ్చే పన్నుల మీదే. కోట్లాది రూపాయలు సంక్షేమ పథకంలో అవినీతి జరిగితే వాళ్ల మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి పార్టీ ప్లీనరీ సమావేశాల్లో హెచ్చరికలు చేయడంతో అవినీతి ఆగిపోతుందా అనేది కేసీఆర్ సమాధానం చెప్పాలి. ఎన్నికలలో డబ్బు, మద్యం పంచడం షరా మామూలే. ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి ఇటువంటి చర్యలకు కఠినంగా శిక్షలు ఉంటాయి.  ఆసరా పింఛన్లు,  షాదీ ముబారక్, రైతుబంధు వంటి పథకాలు చట్టబద్దంగా వోటర్లను ప్రలోభపెట్టడమే అనే ఆరోపణ కేసీఆర్ ప్రభుత్వంపై ఉంది. ఎన్నికలకు కొన్ని గంటల ముందు డబ్బు, మద్యం సరఫరా చేస్తే నేరం. కానీ సంక్షేమ పథకాల పేరిట కేసీఆర్ ప్రభుత్వం వోటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చాలా కాలంగా చేస్తుంది. ఏళ్ల తరబడి కొనసాగిస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరుపై కేసీఆర్ ప్రభుత్వం నిఘా పెట్టినట్లు లేదు.  ఆసరా పించన్లు తీసుకునే వాళ్లకు భవనాలు, కార్లు ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దారిద్యరేఖకు దిగువ ఉన్న వారికే వైట్ రేషన్ కార్డు ఉండాలి. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైట్ రేషన్ కార్డుల పంపిణీ జరిగినప్పటికీ ఎలాంటి నియమ నిబంధనలు  పాటించలేదు. ఒక వేళ నిబంధనలు పాటిస్తే వోట్లు రావు అన్న భయం కావచ్చు. అప్పట్లో హైదరాబాద్లో వరదలు వస్తే ఒక్కో ఇంటికి పదివేల నష్ట పరిహారం ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. మంచిదే. బాధితులకు న్యాయం జరిగితే ఎవరైనా హర్షించాల్సిందే. కానీ హైదరాబాద్ శాలి బండ వంటి ఎగువ ప్రాంతాల్లో వరదలు ఎలా వచ్చాయో కేసీఆర్ ప్రభుత్వానికే తెలియాలి. 1972లో మూసీ వరదలు వచ్చినప్పటికీ శాలిబండ ప్రాంతంలో చుక్క నీరు రాలేదు మరి వరదలు ఎలా వచ్చాయో ప్రభుత్వానికే తెలియాలి. ఈ విషయం అధికారులకు తెలుసు. అయినా అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తే అధికారగణాలు ఉన్నప్పుడు చెవులు ఉండి వినలేరు. కళ్లు ఉండి చూడలేని పరిస్థితి. మీ సేవా సెంటర్ కు వెళ్లి డిటైల్స్ ఇస్తే సాయంత్రం వరకు తమ అకౌంట్లో పది వేలు జమ అయ్యాయి.  ప్రజల పన్నులతో సంక్షేమ పథకాలు అమలు చేసే పాలకులకు అవినీతి జరిగితే పట్టదా? ఇటువంటి నేరాలకు పాల్పడిన వారికి జైలు శిక్షలు ఉంటాయి అని చట్టంలో ఉంది. అయినా ప్రభు త్వం    సీరియస్ గా ఉన్నట్లు కనబడట్లేదు.  వోట్ బ్యాంక్  రాజకీయాల్లో అవినీతి  భాగమైపోయింది. చట్టబద్దమైంది కూడా. 

షిర్డీ బంద్.. ఎందుకంటే..?

మహారాష్ట్రలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన షిర్డీ లో మే 1నుంచి నిరవధికంగా బంద్‌ చేయనున్నారు. సాయిబాబా ఆలయాన్ని సంరక్షించేందుకు సెంట్రల్‌ ఇండస్టియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ని నియమించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఆలయ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఆలయ భద్రతా అవసరాలను నిర్వహించడానికి సెంట్రల్‌ ఇండస్టియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ అవసరం లేదని సాయిబాబా ఆలయ నిర్వాహకులు విశ్వసిస్తున్నారు. షిర్డీ పట్టణంలోని సాయిబాబా ఆలయం అత్యంత ముఖ్యమైన ఆలయం. ఈ చిన్న పట్టణం ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం, ప్రపంచవ్యాప్తంగా అన్నీ మతాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు షిర్డీ ఆలయాన్నిసందర్శించుకుందుకు వస్తుంటారు.   అహ్మద్‌నగర్‌-మన్మాడ్‌ రహదారిపై ఉన్నఈ ఆలయాన్ని శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ నిర్వహిస్తోంది. 2018లో షిర్డీ విమానాశ్రయం భద్రతా వ్యవహారాలను సిఐఎస్‌ఎఫ్‌కి అప్పగించారు. ఇప్పుడు సాయిబాబా ఆలయ రక్షణ బాధ్యతలను సైతం  ప్రభుత్వం కేంద్ర బలగాలకు అప్పగించాని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని  వ్యతిరేకిస్తున్న వివిధ సంస్థలు .. ఇక్కడ అన్ని మార్కెట్‌లు, రవాణాదారులు, వాణిజ్య మరియు ఆతిథ్య పరిశ్రమల మూసివేతకు పిలుపు నిచ్చాయి. పట్టణ ప్రజల సమ్మెతో శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ కి ఎలాంటి సంబంధం లేదని ఆలయ అధికారి ఒకరు తెలిపారు. కానీ సాయిబాబా ఆలయంలో కార్యకలాపాలన్నీ యథావిధిగా పనిచేస్తాయి... కేంద్ర బలగాలు భద్రత బాధ్యతను ఎప్పుడు తీసుకుంటాయన్నది తెలియదని ట్రస్ట్ చెబుతోంది.   ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులే  ఇక్కడి భద్రతను పర్యవేక్షిస్తున్నారనీ,  మెటల్‌ డిటెక్టర్లు, ఇతర భద్రతా ఏర్పాట్లు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయని ట్రస్ట్‌ పేర్కొంది. ప్రధాన  ఆలయం 4.5 ఎకరాలలో విస్తరించి ఉండగా... కార్యకలాపాలు దాదాపు 350 ఎకరాలలో ఉన్నాయి. అయినప్పటికీ భద్రత పర్యవేక్షణ ఆలయ ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతుంది. షిర్డీ పట్టణంలో దాదాపు 25,000 మంది జనాభా ఉన్నారు. సాయిబాబా ఆలయాన్ని ప్రతిరోజూ 50,000 మంది భక్తులు సందర్శిస్తారు. షిర్డీ వంటి మతపరమైన పుణ్యక్షేత్రం ప్రత్యేక భద్రతా సవాళ్లను నిర్వహించడానికి  ప్రత్యేక దళం అవసరం లేదని పట్టణ ప్రజలు అంటున్నారు. ఈ షట్‌డౌన్‌ వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థపై పెద్ద దెబ్బ పడుతుంది. ఇది దాని మనుగడ కోసం పూర్తిగా మతపరమైన పర్యాటకంపై ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, ఆలయ నిర్వాహకులు ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మతపరమైన పుణ్యక్షేత్రం కాబట్టి   భద్రతా పర్వవేక్షణకు కేంద్ర బలగాలు అవసరం లేదని ఆలయ నిర్వాహకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

నేనలా అనలేదు బాబోయ్.. ఖర్గే మాట మార్చారా?

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  కర్నాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆనక తీరిగ్గా నాలుక్కరుచుకున్నారు. కలబురగిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం  వేళ   మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోడీని విషసర్పంతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.   సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.  మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు. అలాంటి వ్యక్తి  మోడీని విష సర్పం అంటూ చేసిన వ్యాఖ్యలపై  కర్ణాటక  సీఎం బసవరాజ్ బొమ్మై మండిపడ్డారు.  నరేంద్ర మోడీ..   దేశానికి ప్రధాని. ప్రపంచం మొత్తం ఆయనను గౌరవిస్తోంది. అలాంటి వ్యక్తిపై ఇలాంటి పదజాలం వాడడం సరికాదన్నారు. దీనికి బదులు కాంగ్రెస్ మునిగిపోయిందని చెప్పాల్సింది. మోడీపై చేసిన వ్యాఖ్యలకు ఖర్గే దేశానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే డిమాండు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు ఈ స్థాయిలో రాజకీయ రచ్చకు కారణం కావడంపై.. ఖర్గే స్పందించారు. తాను ప్రధాని మోడీని వ్యక్తిగతంగా ఏమీ అనలేదని.. తాను బీజేపీని అన్నానని వివరణ ఇచ్చారు. బీజేపీ భావజాలం గురించి చెబుతూ.. ఆ వ్యాఖ్యలు చేశానని స్పష్టం చేశారు. ఆ భావజాలం విషం లాంటిదని.. మద్దతిస్తే మెడకు చుట్టుకుంటుందని తాను అన్నానని వివరించారు. నేనలా అనలేదు బాబోయ్ అంటూ ఖర్గే మొత్తుకుంటున్నారు.  ఖర్గే విష సర్ప వ్యాఖ్యలపై ముందు ముందు బీజేపీ ఇంకెంత తీవ్రంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.  

జీఎస్టీ పేరుతో జనం నెత్తిన ధరల బండ!

దేశంలో అన్ని వస్తువుల,సేవల ధరలూ పెరిగిపోతూ వుంటే, దాని ప్రభావాన్ని తట్టుకుని భరించే స్థితిలో సామాన్య ప్రజలు లేరు. ప్రభుత్వాలు తాము పెంచుతున్న ధరలు కావచ్చు.. జిఎస్టీ కావచ్చు..గ్యాస్‌ కావచ్చు సామాన్యులకు భారం పడదన్న ధోరణిలో ఉన్నారు. నిజానికి ఏ వస్తువు అయినా ధరలు వెచ్చించి సామా న్యులు కొనాల్సిందే. ఏకీకృత పన్ను విధానం పేరుతో తీసుకుని వచ్చిన జిఎస్టీ ఇప్పుడు సామాన్యులకు గుదిబండగా మారింది. పాన్‌, ఆధార్‌ లింక కూడా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారనుంది. దీనికి తోడు కనీసం వేయి రూపాయల ఛార్జీ వడ్డిస్తున్నారు. వారి ఆదాయాలు పెరగకుండా ధరల పెరుగుదల ను భరించే స్థితిలో ప్రజలు ఉన్నారా లేరా..అన్నది కూడా పాలకులు ఆలోచన చేయడం లేదు. శ్రామిక వర్గ ఆదాయాలు పెరిగే ధరలకు అనుగుణంగా పెరగగకుంటే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం ప్రభుత్వానికి సాధ్యం కాదు. శ్రామిక వర్గం ఆదాయాలు పెరగవని, పెరగడం లేదని కూడా తెలుసు. భారమంతా శ్రామిక వర్గమే అంతిమంగా భరించాల్సి వస్తుందని కూడా పాలకులు తెలుసు. తెలిసి కూడా పెట్రో,గ్యాస్‌, జిఎస్టీ ధరల  అడ్డూఅదుపు లేకుండా పెంచేస్తున్నారు. ఇక సామాన్యుల ఇంటి కలను ఛిద్రం చేసేసారు. సామాన్యులు సొంతంగా ఇల్లు కల్లుకునే పరిస్థితి లేదు. మరోపక్క పేదవారి పట్ల పార్టీలు వేరైనా పాలకులంతా మొసలి కన్నీరు కారుస్తున్నారు. అంతర్జాతీయ చమురు ధరలు పెరిగిన ప్రతిసారీ, దేశీయంగా పెట్రో ధరలను పెంచి తీరాలన్న సూత్రం ఏదీ లేదు. కానీ అలా పెంచడం వల్ల ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. పెట్రోల్‌ అన్నది ఇప్పుడు కేంద్రానికి ఆదాయవనరుగా మారింది. పెట్రో ధరల పెంపు అనేది ప్రభుత్వం అనుసరించే ద్రవ్య వ్యూహాన్ని బట్టి ఉంటుంది. ఈ ద్రవ్య వ్యూహాన్ని ప్రభుత్వం ఎప్పటి కప్పుడు మార్చుకునే వీలున్నా అందుకు కేంద్రం సిద్దంగా లేదు. పెట్రో ధరలను తమకు ఇష్టం లేకున్నా పెంచవలసి వస్తోందని వాపోవడం కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి తప్ప మరోటి కాదు. పెట్రో ఉత్పత్తుల ధరలో దాదాపు సగం భాగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులకే పోతుంది. ఈ పన్నులకి, అంతర్జాతీయ చమురు ధరలకి సంబంధం లేదు. అయినా ఆ పన్నులను పెంచుకుంటూ పోతోంది. తన వంతు అదనంగా ప్రజల విూద కేంద్రంలోని వెూడీ ప్రభుత్వం భారాన్ని వెూపుతూనే పోతోంది. రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని కొంత వరకూ అర్ధం చేసుకోవచ్చు. వాటి పరిధిలో పరిమితమైన ఆదాయ వనరులే ఉన్నాయి. ముఖ్యంగా జి.ఎస్‌.టి విధానం వచ్చాక రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలు బాగా తగ్గిపోయాయి. పెట్రో ఉత్పత్తులు జిఎస్‌టి పరిధి లోకి రావు. అందుకే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు పెట్రో ఉత్పత్తుల విూద పన్నులు వసూలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యక్ష పన్నులు విధించే అధికారం లేనందువలన వాటికి వేరే దారి లేదు. కాని కేంద్ర ప్రభుత్వం వేరు. వేర్వేరు మార్గాల్లో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాని కావాలనే అది ఆ మార్గాలను ఉపయోగించడంలేదు. సంపన్నుల విూద ప్రత్యక్ష పన్నులు విధించవచ్చు. ఆ సంపన్నుల పట్ల పక్షపాత వైఖరితో ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రత్యామ్నాయాన్ని అది ఆలోచించడం లేదు. సంపన్న వర్గాలే పెట్రో ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగిస్తాయి గనుక పెట్రో ఉత్పత్తుల విూద ధరలు పెరిగితే వారి విూదే భారం ఎక్కువగా పడుతుందని ఎవరైనా భావిస్తే అది చాలా పొరపాటు. పెట్రో ఉత్పత్తులలో సామాన్య ప్రజలు నేరుగానే వినియోగిస్తారు. ఇందుకు ఉదాహరణ వంట గ్యాస్‌. ఇక పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగితే రవాణా చార్జీలు అనివార్యంగా పెరుగుతుంటాయి. దానితోబాటు వినిమయ వస్తువుల ధరలన్నీ పెరుగు తాయి. వాటిలో ఆహార ధాన్యాలతో సహా చాలా వస్తువులను ప్రజలే ఎక్కువగా వినియోగిస్తారు. ఇక సంపన్నులు పెట్రో ఉత్పత్తులను వినియోగించి ఉత్పత్తి చేసే వివిధ రకాల సరుకుల రేట్లను పెంచి అమ్ముతారు. ఆ విధంగా కూడా అంతిమంగా వినియోగదారుల పైనే భారం అంతా పడుతుంది. అంతర్జాతీ యంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పుడు పెట్రో ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించు కోవడం కూడా అవసరమే. పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచితే అపðడు వాటి వినియోగం తగ్గుతుంది. పెట్రో ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలని సామాన్య ప్రజలు మాత్రమే కోరుకుంటారు. ఎందుకంటే వారే నేరుగా బాధ్యలు కనుక. వినిమయం తగ్గితే మార్కెట్‌లో మాంద్యం మరింత పెరుగుతుంది. అది మరింత ఎక్కువ గా నిరుద్యోగానికి దారి తీస్తుంది. ఆ విధంగా ఒక వైపు ద్రవ్యోల్బణం, మరోవైపు మాంద్యం ఆర్థికంగా దెబ్బ తీస్తుంది. ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల పంపిణీని నియంత్రించి రేషనింగ్‌ విధానాన్ని అమలు చేయడం ద్వార కొంత నియంత్రించ వచ్చు. నిజాయితీ ఉంటే ప్రత్యామ్నాయ ద్రవ్య విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధపడాలి. అది కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించాలి. అపðడే ప్రజలపై భారం పడదు. నిజానికి ప్రజల నుంచి డబ్బులు గుంజడమెలా అన్నది కేంద్రం చేస్తున్న ఆలోచన.. జిఎస్టీతో ప్రజలు అల్లాడుతున్నా..పన్నులు కట్టలేక చస్తున్నా..పెట్రోల్‌ ధరలతో దాడులు చేస్తున్నా.. పట్టించు కోని ప్రధాని వెూడీ రాష్టాలు వ్యాట్‌ తగ్గించాలని గతంలో చేసిన సూచనలు ప్రజలంతా గమనిస్తున్నారు. వెూడీ వచ్చాక వివిధ రూపాల్లో జిఎస్టీ వసూళ్లు లక్షల కోట్లలో పెంచుకుంటున్నారు. కానీ ప్రజలపై పడుతున్న భారాలపై మాట్లాడడం లేదు. ఈ రోజు వరకు పెట్రోల్‌, డీజిల్‌ విూద ఒక పైస కూడా టాక్స పెంచలేదని సిఎం కెసిఆర్‌ ఇప్పటికే కుండబద్దలు కొట్టారు. నిజానికి వెూడీ రాష్టాలను విశ్వాసంలోకి తీసుకుని ఏ అంశం పైనా చర్చించడం లేదు. నిజానికి విజన్‌ ఉన్న ప్రధానిగా..అంతా బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రధానిగా దేశానికి ఒరిగిందేమిటన్న ఆలోచనచేయడం లేదు. ప్రజలను విస్మరించి చేస్తున్న పాలన కారణంగా ప్రజలు నానా యాతన పడుతున్నారు. ఈ అంశాలపై విస్తృత చర్చ జరగాలి. ప్రజలు చైతన్యవంతులు కావాలి. అప్పుడే పాలకులు ఈ విధానాలను మార్చుకుంటారు.  వాస్తవానికి గత ఆరేళ్లుగా పెట్రో  ధరలపై ప్రధాని మోడీ చెబుతున్నవి అవాస్తవాలే.   చమురు కంపెనీలు ధరలు పెంచుతూపోవడమంటే.. అది ఒక్క పెట్రో ధరలతో ఆగిపోదు..  అనేక వస్తువుల ధరలు దాని ఫలితంగా పెరుగుతాయి. కాంగ్రెస్‌ హయాంలో పెట్రో ధరలపై విరుచుకు పడ్డ వెూడీ  ఇప్పుడు ఆ విషయం ఉద్దేశపూర్వకంగా విస్మరించారు.   కేంద్రంపెట్రోల్‌పై ముందుగా ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించి,  ఆ తర్వాత వ్యాట్‌ తగ్గించమని రాష్టాలకు చెప్పివుంటే ఎంతో కొంత సబబుగా ఉండేది. వెూడీ అధికారంలోకి వచ్చాక లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని రూ.18 కిపైగా పెంచిందవి. యూపీఏ హయాంలో లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.84 ఎక్సైజ్‌ డ్యూటీ ఉండగా.. వెూడీ దాన్ని రూ.27.90కు, లీటర్‌ డీజిల్‌పై రూ.3.56గా ఉన్న సుంకాన్ని రూ.21.80కు పెంచారు. వ్యాట్‌ తగ్గించమని రాష్టాలను కోరే ముందు ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించి చిత్తశుద్ది చాటుకుని ఉండాల్సింది. ఇదిలా ఉంటే సెంట్రల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్ రూపంలో లక్షల కోట్లు ఆదాయం వస్తున్న విషయాన్ని ప్రధాని ప్రజలకు చెప్పడం లేదు. ఎక్సైజ్‌ సుంకం ద్వారా కేంద్రానికి రూ.26 లక్షల కోట్ల ఆదాయం వచ్చిన విషయాన్ని ప్రధాని ఎక్కడా ప్రస్తావించడంలేదు.   జీఎస్టీ వసూళ్లలో రాష్టాల వాటాను సకాలంలో చెల్లించడం లేదు. కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని.. ఆ తర్వాత రాష్టాలు వ్యాట్‌ ని తగ్గించాలి. అప్పుడే పెట్రో ధరలు తగ్గి రవాణా ఛార్జీలు తగ్గుతాయి. దీంతో సరకు రావాణా భారం కూడా తగ్గుతుంది.  ప్రతిపక్ష పాలిత రాష్టాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అధికంగా ఉన్నాయని, అక్కడి ప్రభుత్వాలు విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌) తగ్గించకపోవడమే ఇందుకు కారణమని బిజెపి నేతలు నీతులు వల్లిస్తున్నారు. ఓ రకంగా పెట్రో ధరలపై రాష్టాలను అప్రతిష్టపాలు చేయాలన్న దురుద్దేశంగానే దీనిని చెప్పాల్సి ఉంటుంది.  

మోడీ ఓటమే లక్ష్యం.. ఎవరి వ్యూహాలు వారివే!

నిజానికి ఏ రాజకీయ పార్టీకి అయినా అధికారమే అంతిమ లక్ష్యం. అలాగే ఏ రాజకీయ నాయకునికి అయినా పదవే పరమావధి. సో .. 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారం దక్కించుకునేందుకు అన్ని పార్టీలు  ప్రయత్నాలు చేస్తున్నాయి. అదే క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు, 2024 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్’ మెజారిటీ సాధిస్తుందని విశ్వాసం వ్యకం చేశారు. అలాగే, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని దేశం అంతటా అమలు చేస్తామని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహ సాక్షిగా వాగ్దానం చేశారు. అవును, అంబేడ్కర్ జయంతి, అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ వేదిక నుంచి కేసీఆర్ దేశ ప్రజలకు ఈ వాగ్దానం చేశారు. నిజానికి 2024 ఎన్నికల్లో ఏదో విధంగా బీజేపీ మోదీలను ఓడించి ప్రధాని పదవిని అలంకరించాలని ఒక్క కేసీఆర్  మాత్రమే కాదు, రాహుల్ గాంధీ మొదలు చాలా మంది మహా నాయకులు ఆశ పడుతున్నారు. రేసులో పరుగులు తీస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్’లో కేసేఆర్’ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయానికి కొద్ది గంటల అటూ ఇటుగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్    2024 ఎన్నికల్లో బీజేపీ, మోదీలని ఓడించడం ఎలా ? అనే విషయంగా మంతనాలు సాగిస్తున్నారు. అంతకు ముందు ఇదే విషయంగా నితీష్ కుమార్, బిహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత  తేజస్వి యాదవ్ తో కలిసి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో సమాలోచనలు జరిపారు. అలాగే ఇటీవల జాతీయ హోదా కోల్పోయిన సిపిఐ జాతీయ నేత డి.రాజ, సిపిఎం నేత సీతారాం ఏచూరితోనూ..హౌ టూ డిఫీట్  బీజేపీ అండ్ మోదీ  అనే విషయంపై  చర్చలు సాగించారు. అలాగే మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ ఇలా చాలా చాలా మందితోనే నితీష్ చర్చలు జరిపారు. అంత కంటే చాలా ముందుగానే.. అంటే బీఆర్ఎస్ ఆలోచన మొగ్గ తొడగక ముందే.. ప్రత్యామ్నాయ కూటమి అంటూ కేసీఆర్ వీరందరితోనూ చర్చించారు. ఇందు కోసం ఆయన కాళ్లకు బలపం కట్టుకుని మరీ రాష్ట్రాలు చుట్టేశారు. నిజానికి, వచ్చే ఎన్నికల్లో మోడీని గద్దె దించి, ఆ కుర్చీలో తాము కూర్చోవాలని ఆశపడని విపక్ష నేత బహుశా ఎవరు లేరని చెప్పవచ్చు. అయితే, అది అయ్యే పనేనా? అనేదే ఇప్పడు అందరి ముందున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం కోసమే ప్రాంతీయ పార్టీల జాతీయ నేతలు మంతనాలు సాగిస్తున్నారు. మల్లగుల్లాలవుతున్నారు. ఎక్కే గడప దిగే గడప అన్నట్లుగా అటూ ఇటూ పరుగులు తీస్తునారు.  అయితే, టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చింది మొదలు, జాతీయ రాజకీయాలపై దృష్టి నిలిపిన కేసీఆర్  ఇతరుల కంటే ఒకడుగు ముందుకేసి, ఏకంగా హామీలు కురిపించే వరకు వెళ్లారు. నిజానికి నిన్నమొన్న ఢిల్లీలో కాంగ్రెస్ మొదలు కమ్యూనిస్టుల వరకు అందరినీ కలిసిన నితీష్ కుమార్ కు ఇతర పార్టీల నుంచి కొంత సానుకూల స్పందన వచ్చింది. ప్రతి నియోజక వర్గంలో విపక్ష్ల పార్టీల ఉమ్మడి అభ్యర్ధిని నిలిపాలనే ఆయన ప్రతిపాదనను అన్ని పార్టీలూ సూత్ర ప్రాయంగా అయినా అంగీకరించాయి. కానీ  గతంలో కేసీఆర్ ఇలాగే అనేక పార్టీల నాయకులను కలిసినా  నితీష్ సహా ఏ  ఒక్కరూ కుడా సానుకూలంగా స్పందించలేదు. అయినా కేసీఆర్  ఇప్పుడు ప్రగతి భవన్ గడప దాటకుండానే  ఢిల్లీ పీఠానికి నిచ్చెనలు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం బీఆర్ఎస్‌దే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చేసిన కింది స్థాయి నేతల్ని చేర్చుకుంటూ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ప్రకటనలు చేస్తున్నారు. అయితే, కేసీఆర్ చెప్పేదానికి క్షేత్ర స్థాయి పరిస్థితులకు పొంతన కుదరడం లేదని  బీఆర్ఎస్ నాయకులే పెదవి విరుస్తున్నారు. 

బీఆర్ఎస్ తో పొత్తుకు సై.. బట్ కండీషన్స్ అప్లై!

దేశంలో ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న, అవిభక్త భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) ఆ తర్వాత ఎన్ని చీలికలు పేలికలుగా విడిపోయినా 2004 వరకు సిపిఐ, సిపిఎం పార్టీలు, అలాగే ఫార్వార్డ్ బ్లాక్ వంటిమరో ఒకటి రెండు లెఫ్ట్ పార్టీలు చట్టసభల్లో తమ గళాన్ని గట్టిగానే వినిపించాయి. 2004లోక్ సభ ఎన్నికల్లో వామపక్ష కూటమి 62 సీట్లు గెలుచుకుంది. అయితే, హిందూ మతోన్మాద బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇచ్చి, ఆ తర్వాత అమెరికాతో యూపీఏ ప్రభుత్వం అణు ఒప్పందం కుదుర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ  మన్మోహన్ సింగ్  ప్రభుత్వానికి మద్దతు ఉప సంహరించుకుంది. ఇక అక్కడి నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీల కథ కంచి యాత్ర, అంటే ముగింపు ప్రస్థానం  మొదలైంది. ప్రస్తుత లోక్ సభలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు కలిపి కేవలం ఐదుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. పార్లమెంట్ లోనే కాదు రాష్ట్రాలలోనూ ఎర్ర జెండా వెలుగు తగ్గింది. చివరకు 30 ఏళ్లకు పైగా వామపక్ష కూటమి పాలించిన  పశ్చిమ బెంగాల్లో ఇంచేమించుగా అంతే కాలం అధికారంలో ఉన్న త్రిపురలోనూ కమ్యూనిస్ట్ పార్టీలు వరస ఓటములతో ఉనికిని కోల్పోయాయి. మూడు దశాబ్దాలకు  పైగా తిరుగులేని శక్తిగా నిలిచిన పశ్చిమ బెంగాల్ లో అయితే ఎర్రజెండాకు అసెంబ్లీలో ఎంట్రీయే లేకుండా పోయింది. కనీసం సింగిల్.  కేరళలో అధికారంలో ఉన్నా, లోక్ సభ  ఎన్నికల్లో కేరళ నుంచి ఒకరిద్దరు మాత్రమే గెలిచారు.  నిజానికి పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళ రాష్ట్రాల తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలకు మంచి పట్టున్న రాష్త్రం అవిభక్త ఆంధ్ర ప్రదేశ్.అందులోనూ తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలలో ఒకటిగా చెలామణి అవుతూ వచ్చాయి.  రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇప్పటికీ  తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీలకు కొంత ఓటు బ్యాంకు ఇంకా మిగిలేవుంది. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలో సిపిఐ,సిపిఎం పార్టీలకు కొంత పట్టుంది. అయితే ఎంత పట్టున్నా సొంతంగా పోటీ చేసి, కనీసం ఒకటి రెండు సీట్లు అయినా గెలుచుకునే పరిస్థితి మాత్రం లేదు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ సారథ్యంలో ఏర్పడిన  మహాకూటమిలో సిపిఐ భాగస్వామ్య పార్టీగా ఉన్నా ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయింది. అలాగే  ప్రజాసంఘాల ఐక్య వేదికను ఏర్పాటు చేసి సుదీర్ఘ పోరాటం చేసిన సిపిఎంకు చివరకు పోరాటమే మిగిలింది  ఫలితం మాత్రం దక్కలేదు.  ఈ నేపధ్యంలోనే  ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలూ మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ముఖ్యమంత్రి కేసిఆర్ పిలుపునందుకుని బీఆర్ఎస్ తో చేతులు కలిపాయి.  గులాబీ పార్టీ అభ్యర్ధికి మద్దతు నిచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర రెడ్డి కేవలం పది వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక అక్కడి నుంచి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఎర్ర కాలర్ ఎగరేయడం మొదలు పెట్టాయి. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచించి బీఆర్ఎస్ అయినా  కూసుకుంట్లను గెలిపించింది తామేనని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. అంతే కాదు, బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి కేసేఆర్ కు మాతో  పొత్తు కావాలంటే.. అంటూ షరతులు విధిస్తున్నాయి. రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తుతుందనే సామెతను గుర్తు చేస్తూ  బీఆర్ఎస్ బలహీనతను ఆసరాగా చేసుకుని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు రానున్న ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేస్తాయి. బీఆర్ఎస్ తో కలిసి పనిచేసే యోచనలో ఉన్నాం. మా బలానికి తగినట్లు సీట్లు ఇవ్వాలని అడుగుతాం. ఇవ్వకపోతే విడిగా పోటీ చేస్తాంఅని ముఖ్యమంత్రి కేసీఆర్  కు సిపిఎం నేత తమ్మినేని అల్టిమేటం జారీ చేశారు. అలాగే కేంద్రంలో బీజేపీని ఓడించే శక్తి కాంగ్రెస్ కు  ఉందని భావిస్తే, ఆ పార్టీతో కూడా సీట్ల సర్దుబాటు చేసుకుంటామని ఆయన చెప్పారు. అయితే, బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు లేని బలాన్ని ఉహించుకుని ఎగిరెగిరి పడుతున్నాయని, అంటున్నారు. కుక్క తోక ను ఊపితే ఓకే, కానీ, తోక కుక్కను ఉపాలనుకుంటే అస్సలు బావోదు.. అనే అర్థం వచ్చేలా బీఆర్ఎస్ నాయకులు కమ్యూనిస్ట్ నాయకుల సమక్షంలోనే సరదాగా చురకలేస్తున్నారు. అదలా ఉంటే కమ్యూనిస్టులతో పొత్తు విషయంలో ముఖ్యమంత్రి సైలెంట్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీల మధ్య  పొత్తు ఉంటుందా ? ఉంటే ఎన్ని సీట్లకు పరిమితం చేస్తారు?  కామ్రేడ్ల ఆలోచనేంటి?  కామ్రేడ్ల ముందు కేసీఆర్ సరికొత్త ప్రతిపాదన పెట్టనున్నారా? వంటి పలు అంశాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి.

కాంగ్రెస్ కు బీఆర్ఎస్ నిధులు 

బీఆర్ఎస్ పై మరోసారి విరుచుకుపడ్డారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీసే విధంగా బీఆర్ ఎస్ వ్యవహరిస్తున్నట్టు కనబడుతోంది.   పైకి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ  లోపల అదే పార్టీని బీఆర్ ఎస్ ను ప్రోత్సహిస్తుందా అనే అనుమానాలు తెరలేచాయి.  వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తమ పార్టీకి ప్రధాన శత్రువు అని బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టేట్ మెంట్ ఇచ్చిన 24 గంటల్లో  పూర్తి విరుద్ద ప్రకటన చేశారు బండి సంజయ్. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి ఈ కొత్త ఆరోపణ చేశారు.  బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో అడుగిడిన తర్వాత పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు.  కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి బీఆర్ఎస్ నిధులు సమకూరుస్తుందని బండి ఆరోపించారు. ఒక్కో వోటుకు పది వేల రూపాయలను కాంగ్రెస్ పంచుతుందని ఆయన వాదన. 2019లో కాంగ్రెస్ యేతర , బీజేపీ యేతర కూటమి అయిన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ ప్రస్తుతం నేరుగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం  ఏమిటా అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూనే ఎవరికీ అనుమానం రాకుండా కేటీఆర్  బీఆర్ఎస్ ప్లీనరీలో కాంగ్రెస్ ను విమర్శించారని వాళ్లు అనుకుంటున్నారు. కాంగ్రెస్ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేదు కాబట్టి కాంగ్రెస్ కు వోటు వేస్తే ఎలాంటి ప్రయోజనం లేదని మురికి కాల్వలో వోటు పడేసినట్టేనని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.కర్ణాటక బాగేపల్లి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మునిరాజ్ పోటీ చేస్తున్నారు.ఈ అభ్యర్థిని ఓడించడానికే బీఆర్ఎస్ నిధులు సమకూరుస్తుందనే ఆరోపణ ఉంది. మహరాష్ట్ర ఎన్నికలతో బాటు కర్ణాటక ఎన్నికలలో బీజేపీ ప్రచారాన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు   తన స్ట్రాటజీని మారుస్తున్నట్లు కనబడుతుంది. బండి సంజయ్ ఆరోపిస్తున్నట్టుగా  కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నిధులు పుష్కలంగా నిధులు సమకూర్చడానికి  కారణాలలో బీజేపీని ఓడించడమే  అనేది సుస్పష్టమవుతుంది.    కాంగ్రెస్ పార్టీకి తెరవెనుక బీఆర్ఎస్  సపోర్ట్ చేస్తుంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన పార్టీకి నిధుల సమస్య కూడా లేనట్టు కనబడుతుంది. కేవలం వడ్డీలే  రూ 767 కోట్ల రూపాయలు వస్తాయని ప్లీనరీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అంగీకరించారు.  రూ 1, 250 కోట్ల రూపాయల బ్యాంకు డిపాజిట్లు బీఆర్ఎస్ వద్ద ఉన్నాయి.  ఈ నిధులతోనే పార్టీ కార్యకలాపాలకు తెలంగాణేతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ వెచ్చిస్తుంది. పంజాబ్ రైతులకు ఆర్థిక సహకారం అందించడంతో పాటు ఇటీవలె మహరాష్ట్ర  ఔరంగాబాద్ లో  భారీ ఖర్చులు  చేసింది  ఈ నిధుల నుంచే. ఢిల్లీ, పంజాబ్ , మహరాష్ట్ర తదితర రాష్ట్రాలలో భారీగా యాడ్స్ రిలీజ్ చేసింది బీఆర్ఎస్. నిధుల కొరత లేదు కాబట్టి బీఆర్ఎస్ భారీగా నిధులు వెచ్చిస్తున్నట్టు కనబడుతోంది.   2021లో  బీఆర్ఎస్ వద్ద కేవలం రూ 425 కోట్ల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉండేవి.  రెండుకోట్ల రూపాయలు వడ్డీ వచ్చేది. అప్పట్లో ఈ వడ్డీతోనే బీఆర్ఎస్ ఒక దినపత్రిక , చానెల్ నడిపిందని  పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి

దేశంలో కరోనా వ్యాప్తి.. మరణాల సంఖ్య పెరుగుతోందా?

దేశంలో కరోనా వ్యాప్తి ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. ప్రతీ రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదౌతున్నాయి. వారం కిందటి వరకూ రోజుకు పది వేలకు పైగా కేసులు నమోదౌతూ వచ్చినా ఆ తరువాత ఆ సంఖ్య ఒకింత తగ్గింది. దీంతో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గుముఖం పట్టిందని అంతా భావించారు. ఇక కరోనా ఎంత మాత్రం పెండమిక్ కాదనీ, అది ఎండమిక్ దశకు చేరుకుందనీ, భయం అవసరం లేదనీ నిపుణులు కూడా చెబుతూ వచ్చారు. అయితే ఉన్నట్లుండి కరోనా కారణంగా సంభవిస్తున్న మరణాల సంఖ్య పెరగడం సర్వత్రా ఆందోళనకు కారణమౌతోంది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 44 మంది మరణించారు. ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటి సారి. అదే సమయంలో కొత్తగా 7533 మందికి కొత్తగా కరోనా సోకింది. సామాజిక దూరం, మాస్కుల ధారణ గురించి వైద్య శాఖ ఎంతగా చెబుతున్నా, ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా జనం ఖాతరు చేయడం లేదు. అయితే ఈ అలక్ష్యం ప్రమాదకరమని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. స్థిరంగా కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూ ఉండటం..  మరణాలు కూడా సంభవిస్తుండటంతో కరోనా జాగ్రత్తలు పాటించడం అనివార్యమని కేంద్రం ఆరోగ్య శాఖ చెబుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం గత 24 గంటలలో  కొత్తగా 7533 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో 44 మరణాలు సంభవించాయి. దీంతో  దేశంలో ఇంత వరకూ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,31,468కి చేరింది.  ఔను నిజమే ఇటీవలి కాలంలో దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజదాని ఢిల్లీ  సహా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ ఆయా  రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్‌లతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా కట్టడికి తగు చర్యలు చేపట్టాలని కోరింది. ఈ మేరకు 8రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఆరోగ్యశాఖ సెక్రటరీలకు ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. గత నెల ప్రారంభం నుంచీ దేశంలో కొవిడ్ కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, గడచిన వారం రోజుల్లో కొత్తగా నమోదవుతున్న రోజువారీ కేసుల సంఖ్య పదివేలకు పైగా ఉంటోందని కేంద్ర ఆరోగ్య సఖ కార్యదర్శి పక్షం రోజుల కిందట రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్యదర్శులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అప్పటికీ ఇప్పటికీ కేసులలో స్వల్ప తగ్గుదల తప్ప పెద్దగా మార్పు లేదు.  కరోనా  మహమ్మారి నియంత్రణకు ఐదు అంచెల వ్యూహాన్ని అనుసరించాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి భూషణ్ ఆ లేఖలో రాష్ట్రాలకు సూచించారు. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ అంశాలపై కీలక దృష్టితో సత్వర సమర్థవంతమైన ప్రజారోగ్య చర్యలను ప్రారంభించడం చాలా కీలకమని తెలిపారు. కోవిడ్ మహమ్మారి పూర్తిగా అంతమొందలేదని, నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదమని హెచ్చరించారు. మహమ్మారి పూర్తిస్థాయిలో అరికట్టాలంటే డేటా ఎప్పటికప్పుడు క్రమబద్దీకరించడం చాలా కీలకమని అన్నారు.  అయితే  ఆ దిశగా రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. 

నేను చూడను.. నేను వినను దాకా.. జగన్ కొత్త పంధా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. ప్రజలలోకి వెళ్లడం అటుంచి వారు ఆయనకు తమ సమస్యలను ఫోన్ ద్వారా నివేదించేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముందు.. జగన్ నిత్యం ప్రజలతో మమేకమై తిరిగారు. పాదయాత్ర పేరుతో ఆయన జనానికి ముద్దులు పెట్టారు. అడుగుకో వాగ్దానం చేసేశారు. అయితే అధికారం చేపట్టిన తరువాత మాత్రం ఆయన జనానికి ముఖం చాటేశారు. వారి వద్దకు వెడితే పాదయాత్రలో తాను ఇచ్చిన వాగ్దానాల గురించి అడుగుతారన్న జంకు అయి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బటన్ నొక్కుడు కార్యక్రమాల కోసం ఎంపిక చేసిన ప్రాంతాలలో వేదికపై నుంచి ప్రసంగాలు చేసినా.. ఆయా సందర్భాలలో కూడా ఆయన జనానికి దూరంగానే ఉంటున్నారు. అంతెందుకు ముఖ్యమంత్రి ప్రసంగాలు వినేందుకు జనంలో ఆసక్తి కనిపించడం లేదు. అందుకే బటన్ నొక్కి ఆయన ప్రసంగం ప్రారంభించగానే గట్లు తెంచుకుని వరద నీరు పారినట్లు.. సభా ప్రాంగణం నుంచి జనం గుంపులు గుంపులుగా బయటకు వెళ్లిపోతున్నారు.  దీంతో  ఐప్యాక్ సలహాతో ఆయన ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. అదే జనం తనకు కనబడకుండా.. జనానికి తాను కనబడకుండా ‘జగనన్నకు చెప్పుకుందాం’ పేరు మీద ఓ కాల్ సెంటర్ ప్రారంభించేందుకు నిర్ణయించారు. అంటే జనం తమ సమస్యలను నేరుగా జగన్ కు చెప్పుకునేలా ఫోన్ చేసేందుకు అవకాశం ఇవ్వడమన్నమాట. ఈ నెల  13 నుంచి  ‘జగనన్నకు చెప్పుకుందా’ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రారంభం కాలేదు. అసలు ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న విషయంపై కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. నువ్వే మా నమ్మకం జగన్ అంటూ ప్రారంభించిన స్టిక్కర్ల కార్యక్రమం ఘోరంగా విఫలం కావడంతో  ఈ కాల్ సెంటర్ ప్రారంభించే ధైర్యం వైసీపీ అధినేత చేయలేకపోతున్నారని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. స్టిక్కర్ల కార్యక్రమంలో వైసీపీ నేతలు ఇలా వచ్చి స్టిక్కర్ అంటించి వెళ్లగానే  ఆ స్టిక్కర్ ను ఆ ఇంటి వాళ్లు అలా పీకేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో కంగుతిన్న జగన్ సర్కార్ ఇప్పుడు ఫోన్ ద్వారా సమస్యలు నివేదించే అవకాశాన్ని ప్రజలకు ఇస్తే..  విపక్ష నేతగా ఉండగా జగన్ ఇచ్చిన హామీల గురించి నిలదీతలకే ఆ కార్యక్రమం పరిమితమౌతుందన్న భయం అధికార పార్టీలో నెలకొందని పరిశీలకులు అంటున్నారు. అందుకే ప్రభుత్వం వెనక్కు తగ్గిందంటున్నారు.  

కోడికత్తి కేసు విచారణ మే 10కి వాయిదా

కోడి కత్తి కేసు విచారణ మరోసారి వాయిదా పడింది.  ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్‌ ను రాజమండ్రి జైలు నుంచి వీడియో కాల్లో ఎన్‌ఐఏ కోర్టు విచారించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని గతంలో సీఎం జగన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అడ్వకేట్‌ కమిషనర్‌ను నియమించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టాలని అభ్యర్ధించారు. అయితే ఈ రోజు కీలకమైన విచారణ జరుగుతుందని భావించినప్పటికీ.. తాత్కాలిక న్యాయమూర్తి కావడం.. పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించకపోవడంతో కేసును వాయిదా వేశారు. ప్రధానంగా సీఎం జగన్‌ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. తాను కోర్టుకు హాజరు కాలేనని పేర్కొంటూ ఒక పిటిషన్‌.. దానికి సంబంధించి అడ్వకేట్‌ కమిషనర్‌ను ఏర్పాటు చేసి విచారించాలని కోరారు. దీనిపై ఇప్పటికే నిందితుడి తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఇవాళ వాదనలు జరగాల్సి ఉంది. అదే సమయంలో మరో పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. ఎన్‌ఐఏ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి విచారణ జరపలేదని, పూర్తి స్థాయిలో మరొకసారి ఈ కేసుపై విచారణ చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అంటే తాను సాక్షిగా  ఉన్న ఈ కేసు విచారణ సాధ్యమైనంత సుదీర్ఘ కాలం సాగాలని  జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే.. కోడికత్తి దాడి కేసులో  ఎలాంటి కుట్ర కోణం లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్పష్టం చేసింది. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరపాలంటూ జగన్ ఎన్ఐఏ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలని కోరింది. ఈ కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదనీ.. ఇదంతా సమయం వృధా వ్యవహారమనీ ఎన్ఐఏ కుండ బద్దలు కొట్టేసింది. ఈ కేసులో నిందితుడిగా గత నాలుగేళ్లుగా జైల్లో ఉన్న జనుపల్లి శ్రీను తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు కాదని పేర్కొంది. దీంతో తన హత్యకు కుట్ర అంటూ విపక్ష నేతగా పట్టుబట్టి సాధించుకున్న ఎన్ఐఏ దర్యాప్తు, జగన్ నాడు చెప్పిన దాంట్లో  ఇసుమంతైనా వాస్తవం లేదని తేల్చేసింది.  కోడికత్తి కేసులో మరింత లోతైన దర్యాప్తు జరపాలంటూ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్ కు ఎన్ఐఏ కౌంటర్ వేసింది.  ఎయిర్ పోర్టులోని ఫ్యూజన్ రెస్టారెంట్ ఓనర్‌కు   ఈ ఘటనతో సంబంధం లేదని స్పష్టం తేల్చేసింది. గత వాయిదాలో సీఎం జగన్ తరపు న్యాయవాది రెండు పిటిషన్ లు దాఖలు చేశారు. విచారణకు రాకుండా మినహాయింపు ఇవ్వాలని, అలాగే కోడి కత్తి కేసులో కుట్ర కోణాన్ని వెలికి తీయడంలో ఎన్ఐఏ విఫలమైందనీ, మరింత లోతైన విచారణ చేపట్టేలా ఎన్ ఐ ఏ ను ఆదేశించాలని ఆ  పిటిషన్లలో కోరారు.  ఈ నేపథ్యంలోనే గురువారం (ఏప్రిల్ 27)న విచారణ కీలకం కానుందని అంతా భావించారు. అయితే ఈ కేసు విచారణ చేసిన న్యాయమూర్తి ప్రవెూషన్‌పై కడప జిల్లా కోర్టుకు బదిలీ కావడంతో  ఆ స్థానంలో వచ్చిన తాత్కాలిక న్యాయమూర్తి.. పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత విచారిస్తానని పేర్కొంటూ కేసును మే 10వ తేదీకి వాయిదా వేశారు.

అవినాష్ సెల్ఫీ వీడియో.. లాజిక్ మిస్సయ్యారు!

వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పీకల్లోతు ఇరుక్కున్నారు. అందులో సందేహం లేదు. దర్యాప్తు సంస్థ సీబీఐ మాత్రమే కాదు పులివెందుల మొత్తం వివేకా హత్య వెనుక ఉన్నది అవినాషేనని నమ్ముతున్నారు. ఎందుకంటే వివేకా హత్య కేసు దర్యాప్తులో ఎదురైన అడ్డంకులు, వాటికి కారణం ఏమిటన్నది ఈ నాలుగేళ్ల కాలంలో అందరూ గమనించారు. ఇక గొడ్డలి పోటుకు గురైన వివేకానందరెడ్డి.. గుండెపోటుతో మరణించాడంటూ తొలుత ప్రచారం చేయడం దగ్గర నుంచి సంఘటనా స్థలంలో సాక్ష్యాలను చెరిపివేయడానికి చేసిన ప్రయత్నాలు, వివేకా భౌతిక కాయానికి కుట్టు వేసి బ్యాండేజీలు కట్టడం వరకూ అన్నీ అవినాష్ సమక్షంలోనే జరిగాయన్నది కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ బాగా ఎస్టాబ్లిష్ చేయగలిగింది. వాస్తవంగా గంటల వ్యవధిలో ఛేదించేయడానికి అవకాశం ఉన్న వివేకా హత్య కేసు దర్యాప్తు ఏళ్ల తరబడి కొనసాగడానికి.. హత్య జరిగిన నాటికి విపక్షంలో ఉన్న వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ కారణం. ఈ హత్య నారాసుల రక్త చరిత్రలో భాగమనీ, స్థానిక పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదనీ, సీబీఐకి అప్పగించాల్సిందేననీ డిమాండ్ చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత సీబీఐ అవసరం లేదంటూ ఈ కేసు దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేశారు. అక్కడ వైఎస్ వివేకా కుమార్తె రంగ ప్రవేశం చేసి సిట్ కాదు.. సీబీఐ దర్యాప్తు కావాలంటూ న్యాయపోరాటం చేసి సాధించుకున్నారు. ఇక అప్పటి నుంచీ కూడా వివేకా హత్య కేసు ఇటీవలి కాలం వరకూ ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కుఅన్నచందంగా సాగి.. మళ్లీ సునీత న్యాయపోరాటం కారణంగానే.. కేసు విచారణ ఏపీ నుంచి తెలంగాణకు మారి వేగం పుంజుకుంది. కేసు తెలంగాణకు మారిన తరువాతే.. వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరన్నది మరింత స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో సీబీఐ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అవినాష్.. చేయగలిగిన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ముందస్తు బెయిలు కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. సీబీఐ దర్యాప్తు సవ్యదిశలో సాగడం లేదని ఆరోపణలు గుప్పించారు. హత్యకు వివేకా కుటుంబంలో ఉన్న ఆస్తి తగాదాలే కారణమంటూ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించారు. వివేకా రెండో పెళ్లి, అక్రమ సంబంధాలు, లైంగిక వేధింపులు అంటూ మరణించిన తరువాత ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి కూడా వెనుకాడ లేదు. వివేకాను ఆస్తి కోసం ఆయన కుమార్తె, అల్లుడే హత్య చేశారంటూ ఆరోపణలు గుప్పించారు. అయితే ఇంత చేసిన అవినాష్ రెడ్డి సంఘటన జరిగిన రోజు సాక్ష్యాల మాయం, మృతదేహానికి కుట్లు, బ్యాండేజీల సమయంలో తాను అక్కడే ఉండి కూడా ఏం చేశారు?ప్రేక్షక పాత్ర వహించారా? అన్న ప్రశ్న ఉత్పన్నమౌతుందన్న లాజిక్  ఎలా మిస్సయ్యారు? అంతేనా.. వివేకా కుటుంబంలో ఆస్తి తగాదాలు అన్నవి నిజంగా ఉంటే.. అవి హత్యకు ముందురోజు వచ్చినవి కాదు కదా? అన్న లాజిక్ కూడా మిస్సయ్యారు. ఈ విషయం ఆయనకు తప్ప ఆయన విడుదల చేసిన సెల్ఫీ వీడియో చూసిన అందరికీ బాగానే అర్ధమయ్యింది. అదీ  కాకుండా  ఇన్నివిషయాలు తెలిసీ ఆయన ఈ నాలుగేళ్లూ ఎందుకు మౌనం వహించారు? నారాసుర రక్త చరిత అంటూ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న  వైసీపీ ఆరోపణలు గుప్పిస్తున్నప్పుడు వాస్తవం ఎందుకు చెప్పలేదు. సీబీఐ తొలుత అనుమానితులుగా బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి వంటి వారిని విచారించినప్పుడు ఎందుకు నోరెత్తలేదు. ఇప్పుడు తన దాకా వచ్చేసరికి ఇంత కాలం కనిపించని వివేకా కుటుంబంలో ఆస్తితగాదాలు గుర్తొచ్చాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.   అవినాష్ సెల్ఫీ వీడియోలో చేసిన ఆరోపణల్లోని డొల్ల తనాన్ని ఏపీ సీఎం జగన్ కు స్వయాన సోదరి అయిన వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల బట్టబయలు చేశారు. వివేకా హత్య కేవలం కడప ఎంపి సీటు కోసమే జరిగిందనీ, ఆస్తుల తగాదా అన్నప్రశక్తే లేదనీ ఆమె కుండ బద్దలు కొట్టేశారు. ఒక వేళ ఆస్తుల కోసమే అయితే సునీతను హత్య చేసి ఉండేవారని చెప్పడం ద్వారా అవినాష్ నన్ను నమ్మండి నిజమే చెబుతున్నానంటూ సెల్ఫీ వీడియోలో చెప్పినవన్నీ అబద్ధాలేననీ, తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి అల్లిన కట్టకథలనీ తేటతెల్లమైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

సునీతకు షర్మిల అండ

ఆడదానికి ఆడదే శత్రువు అంటారు... కానీ వైఎస్ వివేకా కుమార్తె సునీత విషయంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) అధ్యక్షురాలు షర్మిల వ్యవహరిస్తున్న తీరుతో అది తప్పుని తేలిపోయింది.  వివేకా హత్య జరిగిన నాటి నుంచి  సునీతకు.. వైఎస్ ఫ్యామిలీలో ఎవరైన అండ దండగా నిలిచారంటే.. అది ఒక్క   షర్మిల మాత్రమే.   తాజాగా మరోసారి  సునీతకు మద్దతుగా నిలుస్తూ వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు..  పోలిటికల్ సర్కిల్‌లో   కాక రేపుతోన్నాయి. ఇటీవల వైయస్ వివేకా ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రిభాస్కరరెడ్డిలు చేసిన వ్యాఖ్యలపై  వైయస్ షర్మిల తాజాగా హైదరాబాద్‌లో తనదైన శైలిలో స్పందించారు. వారి వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. అలాగే వివేకా హత్య వెనుక ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఉన్నారంటూ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అర్థరహితమని ఆమె కొట్టిపారేశారు. వివేకా పేరిట ఎలాంటి ఆస్తుల్లేవని, అవన్నీ ఆయన కుమార్తె సునీత పేరు మీదే ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. అలాంటప్పుడు తమ సొంత చిన్నాన్న హత్య వెనుక సునీత, ఆమె భర్త ఉన్నారనే ఆరోపణలు చేయడం సరికాదని వైయస్ షర్మిల అభిప్రాయ పడ్డారు.   పోనీ.. ఓ వేళ సునీత భర్త ఆస్తి కోసం ఇదంతా చేశాడనుకుంటే... చంపాల్సింది  వివేకానందరెడ్డిని కాదు.. సునీతను.. అంటు వైయస్ షర్మిల పక్కా క్లారిటీగా వివరించారు. అలాగే చిన్నాన్న వివేకా వ్యక్తిత్వంపై ఆరోపణలు చేయడం చాలా అన్యాయమన్నారు. ప్రజల కోసం పని చేసిన ఆయన వ్యక్తిగత జీవితంపై మాట్లాడే అర్హత ఎవరికీ లేదని చెప్పారు.  ప్రజా నాయకుడైన ఆయన వ్యక్తిత్వం గురించి మాకంటే.. ఉమ్మడి కడప జిల్లా ప్రజలకు, అలాగే పులివెందుల ప్రజలకే ఎక్కువగా తెలుసునని  షర్మిల స్పష్టం చేశారు. వివేకా హత్య కేసు విషయంలో  షర్మిల  ఇలా స్పందించడం ఇదే తొలిసారి కాదు.. గతంలో కూడా చాలా సార్లు ఇలాగే స్పందించారు.  ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. ఈ హత్య కేసులో ఢిల్లీ వెళ్లీ ఆమె స్వయంగా సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడమే కాదు... ఆ సీబీఐ కార్యాలయం వెలుపలే.. మీడియా ముందు మాట్లాడుతూ.. వివేకా హత్య కడప ఎంపీ సీటు విషయంలోనే జరిగిందంటూ ప్రకటించారని... ఆ తర్వాత.. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ తాబేలు స్పీడ్‌తో సాగుతోంటే.. లోటస్ పాండ్‌లోని తన పార్టీ కార్యాలయంలో.. ప్రెస్‌మీట్ పెట్టి..   ఏళ్లకు ఏళ్లు గడుస్తోన్నా.. తన సొంత చిన్నాన్న హత్య కేసులో ఇంత వరకు అతీగతీ లేదంటూ.. సదరు దర్యాప్తు సంస్థపై వైయస్ షర్మిల విమర్శలు సైతం గుప్పించారు. ఆ తర్వాతే ఈ హత్య కేసులో విచారణను సీబీఐ వేగవంతం చేసిందనే ఓ చర్చ సైతం రాజకీయ వర్గాలలో సాగుతోంది.   ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. వివేకా హత్య కేసును.. అటు దర్యాప్తు చేస్తున్న సీబీఐ మరిచిపోయినా.. ఇటు ప్రజలు మరిచిపోయినా.. షర్మిల మాత్రం రంగంలోకి దిగి..  ప్రెస్‌మీట్ పెట్టి.. ఆ అంశాన్ని తెరపైకి తీసుకు వస్తూ వచ్చారన్న అభిప్రాయం  పోలిటికల్ సర్కిల్‌లో వ్యక్తమవుతోంది.  ఓ సోదరుడు  జగన్ ముఖ్యమంత్రిగా... మరో సోదరుడు   అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ఉండి కూడా తనకు న్యాయం జరగడం లేదని గ్రహించి.. న్యాయం కోసం.. న్యాయస్థానం మెట్లెక్కిన సునీతకు అన్ని విధాల  షర్మిల మద్దతుగా నిలిచారనడంలో సందేహం లేదు.   మరోవైపు సీమ పౌరుషానికి కడప పురిటిగడ్డ... ఫ్యాక్షనిజానికి కడప అడ్డా, మాట తప్పం.. మడం తిప్పమంటూ లాంటి డైలాగులు సినిమా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడానికో.. .. ఎన్నికల ప్రచారంలో ఓట్లు దండుకోవడానికో ఉపయోగపడతాయనే అభిప్రాయం సైతం సదరు సర్కిల్‌లో వినిపిస్తోంది.  ఇంటి ఆడపడుచు.. స్వయంగా గుమ్మంలోకి వచ్చి.. నాకు ఆస్తి కాదు.. అంతస్తు కాదు.. నాకు న్యాయం కావాలి... కన్న తండ్రి హత్య కేసులో దోషులు ఎవరో బయటకు రావాలి.. వారికి శిక్ష పడాలి... అలా అయితేనే.. భవిష్యత్తులో ఇటువంటి తప్పులు మళ్లీ మళ్లీ జరగకుండా సమాజానికి ఓ స్పష్టమైన సందేశం ఇచ్చిన వారమవుతామంటూ ముఖ్యమంత్రి  జగన్‌ని ప్రాధేయపడిన ఓ చెల్లికి.. ఆయన ఎంత న్యాయం చేశారో ఏమో కానీ.. ఓ సోదరిగా   సునీతకు ఆమె చేస్తున్న  న్యాయపోరాటంలో   షర్మిల నూటికి నూరు శాతం మద్దతుగా నిలుస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వివేకా హత్య కేసు దర్యాప్తు ఇక్కడి దాకా వచ్చిందంటే.. అదంతా  సునీత,   షర్మిల వల్లే సాధ్యమైందనే ఓ చర్చ వైసీపీ శ్రేణుల్లోనే జరుగుతోంది.

పాయె.. ఆంధ్రా భవనూ పాయే.. అంతేనా?..అంతేనా?

రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కుదేలై పోయింది. గత నాలుగేళ్లుగా ఆ పరిస్థితి మరింత దిగజారి పోయింది. మరోవైపు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ నుంచి రావాల్సిన వాటా తెచ్చుకోవడంలో..  ప్రస్తుత జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైయిందనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు.. గతంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల రవాణా అంశంలో ఇరు రాష్ట్రాల్లో చోటుచేసుకొన్న పరిణామాలు. అలాగే హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ భవనాలలో ఆంధ్రప్రదేశ్‌కి  వాటాను  కేసీఆర్ ప్రభుత్వానికి వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే.. గిఫ్ట్ డీడ్‌లాగా అప్పగించేయడం.. దాంతో హుస్సేన్‌సాగర్ సమీపంలోని సచివాలయ భవనాలను కూల్చేసి.. వాటి స్థానంలో కొత్త సచివాలయాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ భవనం ఏఫ్రిల్ 30న కేసీఆర్ చేతుల మీదగా ప్రారంభంకానుంది.   అయితే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌ను పూర్తిగా తమకు వదిలేయాలని ఆంధ్ర్రప్రదేశ్ అధికారులను తెలంగాణ అధికారులు కోరారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌కు అనుకొని ఉన్న ఆ స్థలంతో తెలంగాణ ప్రజలకు భావోద్వేగ సంబంధాలున్నాయని ఈ సందర్భంగా ఆంధ్రా అధికారులకు తెలంగాణ అధికారులు తెలిపారు. అందుకు ప్రతీగా పటౌడీ హౌస్‌లో గల ఏడెకరాల పైచిలుకు స్థలాన్ని తీసుకొని.. అక్కడ కొత్త భవనం నిర్మించుకోవాలంటూ ఏపీ అధికారులకు వారు సూచించారు. అయితే ఈ అంశాన్ని తమ సీఎం జగన్‌తో చర్చించిన తర్వాతే తాము ఏ నిర్ణయం తెలియజేస్తామని తెలంగాణ అధికారులకు ఏపీ అధికారులు స్పష్టం చేయడం గమనార్హం. దీంతో ఇది కూడా.. త్వరలో ఏపీ నుంచి తెలంగాణ ప్రభుత్వ ఆస్తుల ఖాతాలోకి వెళ్లి పోయే పరిస్థితులు ఉన్నాయనే ఓ చర్చ సోషల్ మీడియాలో ఊపందుకొంది.   తాజాగా ఢిల్లీలో రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న ఏపీ- తెలంగాణ భవన్, ఇతర స్థిరాస్తుల విభజనపై కేంద్ర హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఈ భవనం ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే.  ఇప్పటికే టీటీడీ పాలక మండలిలో కానీ.. ప్రభుత్వంలో సలహాదారుల రూపంలో ప్రాంతాలకు అతీతంగా.. ఇబ్బడి ముబ్బడిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ నియమిస్తూ వస్తున్నారు. ఓ వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదన్న సంగతి తెలిసి కూడా ఆయన ఇలా వ్యవహరించడం పట్ల.. సర్వత్రా విమర్శులను ఎదుర్కొంటున్నారు. కానీ పక్క రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు.. పూర్తి విరుద్దంగా ఉంది. ఆయన ప్రభుత్వం నియమించిన ప్రభుత్వ సలహాదారుల్లో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఎవరైనా ఉన్నారా? అనే ప్రశ్న ప్రపంచంలోని తెలుగు వారిలో ఉత్పన్నమవుతోంది.  మరోవైపు తమ పార్టీ అధికారంలోకి వస్తే.. కేంద్రం మెడలు వంచి... రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి రావాల్సిన అన్నింటిని తీసుకు వస్తామంటూ 2019కి ముందు నాటి ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ ..తన పాదయాత్రలో ఢంకాభజాయించి మరీ చెప్పారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత.. వాటి సాధనలో విషయంలో ఆయన అడుగులు   ముందుకు పడలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయనను, ఆయన మాటలను  నమ్మి 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించినా.. ప్రతిపక్షనేతగా ఆయన ఇచ్చిన హామీలను.. ముఖ్యమంత్రి అయిన తరువాత నెరవేర్చడంలో జగన్ పూర్తిగా  విఫలమయ్యారనే చర్చ సైతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మరి వాటి సాధనాలో భాగంగా  జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా అంటే.. సందేహమే అనే సమాధానం వస్తోంది. దీంతో అన్ని ఉన్నా .. కానీ అదేదో తక్కువైందన్నట్లుగా   జగన్   ప్రభుత్వ తీరు ఉందనే విమర్శలు సైతం సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.

మరక పడితే మార్పు తప్పదు

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కే.చంద్రశేఖర రావు, క్లారిటీ ఇచ్చారు. ముందస్తు  ఎన్నికల ముచ్చట లేదని తేల్చేశారు. ఒక్క ముందస్తు ఎన్నికల విషయంలోనే కాదు, పార్టీ టికెట్ల విషయంలోనూ కేసీఆర్  పూర్తి క్లారిటీ ఇచ్చారు. గతంలో సిట్టింగులు అందరికీ టికెట్లు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పడు వడపోత తప్పదని స్పష్టం చేశారు. ప్రజల్లో ఉండి బాగా పని చేసే వారికే వచ్చే ఎన్నికల్లో టికెట్లు యిస్తామని కేసీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ ప్రతినిధుల సభలో మాట్లాడిన ఆయన.. జాగ్రత్తగా లేకుంటే మీకే ఇబ్బంది అని ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ఒక విధంగా, క్షేత్ర స్థాయిలో పరిస్థితి అనుకున్నంత ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి పరోక్షంగానే అయినా అంగీకరించారు.  బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న టీఆర్ఆస్ ఆవిర్భవించగా..టీఆర్ఎస్... బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి)గా మారిన తర్వాత జరగుతున్న తొలి వేడుకలు ఇవి. ఈ సందర్భంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా మెుత్తం 279 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని తేల్చి చెప్పారు. ప్రజల్లో ఉండి బాగా పని చేసిన వారికే టికెట్లు కేటాయిస్తామని స్ఫష్టం చేశారు. అదే సమయంలో గోడ మీది పిల్లి వాటంగా  ఉన్న పలువురు ఎమ్మెల్యేలకు కేసీఆర్ క్లాస్ తీసుకుంటున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా.. నేతలంతా హైదరాబాదులోనే ఉండడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దాహం వేసినప్పుడు బావి తవ్వే రోజులు పోయాయని ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఎమ్మెల్యేలంతా ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని.. ప్రజల్లో ఆదరణ ఉన్న వారికే రాబోయే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని కేసీఆర్ తేల్చిచెప్పారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ లో ఒక్క సారిగా ఈ మార్పు ఎందుకొచ్చింది? గతంలో సిట్టింగులు అందరికీ టికెట్లు ఇస్తామని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు పనితనం ఆధారంగానే టికెట్లు ఇస్తామని కొత్త బాణీ ఎందుకు ఎత్తుకున్నారు? అంటే, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవని కొంత ఆలస్యంగానే అయినా  ముఖ్యమంత్రి గుర్తించారని, అందుకే  టికెట్ వస్తే గెలిచినట్లే అనే ధీమాతో నియోజక వర్గాలకు వెళ్ళకుండా హైదరాబాద్ కే పమితం అవుతున్న ఎమ్మెల్యేలను అదిలించేందుకే ముఖ్యమంత్రి కేసేఆర్ ఈ హెచ్చరిక  చేశారని బీఆర్ఎస్ నేతలు చెపుతున్నారు. అయితే అది కొంతవరకే నిజమని  టీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన ఒరిజినల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో సగం మందికి పైగా ఎమ్మెల్యేల పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అలాగే, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలలో ఒకరిద్దరు మినహా మిగిలిన ఎమ్మెల్యే పరిస్థితి మరింత దారుణంగా ఉందని, అందుకే ముఖ్యమంత్రి ముందస్తు హెచ్చరిక చేశారని సీనియర్ నేతలు చెప్పుకొస్తున్నారు.ముఖ్యంగా 42 మంది ఎమ్మెల్యేల పట్ల ప్రజా వ్యతిరేకత చాలా చాలా తీవ్రంగా ఉందని, సర్వేలలో తేలిన నేపధ్యంలోనే ముఖ్యమంత్రి హెచ్చరిక చేశారని అంటున్నారు. అయితే ఈ 42 మంది  ఎమ్మెల్యేలు ఎవరనేది, తెలియలేదు. అయితే, ఈ 42 మందిని హెచ్చరించడం వెనక ఇతరేతర కారణాలు కూడా ఉన్నాయని, అంటున్నారు.

గర్భధారణ పరీక్షలా  హవ్వ..

మధ్య ప్రదేశ్ ప్రభుత్వ అరాచకాలకు ఆకాశన్నంటుతున్నాయి. సభ్య సమాజం సిగ్గుపడేలా చర్యకు పాల్పడింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం  మధ్య ప్రదేశ్ లోని దిండోరీ జిల్లాలో 100 మంది అమ్మాయిలకు గర్భధారణ పరీక్షలు చేసి ఫలితాలను బీజేపీ ప్రభుత్వం బహిర్గతం చేసింది.  మధ్య ప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన పథకం అమలు చేయడంలో భాగంగా అర్హులైన అమ్మాయిలను ఎంపిక చేయడానికి  గర్భధారణ పరీక్షలు జరిపింది. గర్బిణీ అమ్మాయిలను ఈ స్కీం నుంచి ఏరి వేయడానికి బీజేపీ ప్రభుత్వం చట్టబద్దంగా అమ్మాయిలకు గర్భధారణ పరీక్షలు జరపడాన్ని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ ఖండించారు. ఇది  మహిళలను అవమానపరిచే చర్య అని ఆయన అభివర్ణించారు. గర్భధారణ పరీక్షలపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని ఆయన జాతీయ మహిళా కమిషన్ చైర్మెన్ రేఖా శర్మను కోరారు.  మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలకు చక్కటి నిదర్శనం  ఈ పరీక్షలను  ప్రభుత్వం నిర్వహించడం మహిళల ప్రైవసీని నేరుగా దెబ్బతీయడమే అవుతుంది. గిరిజన అమ్మాయిలకు గర్భధారణ పరీక్షలు నిర్వహించడంతో ఆ రాష్ట్రంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమ్మాయిలకు కన్యత్వ పరీక్షలు చేయడం ఏ నాగరికత చెప్పలేదు. అయినా అక్కడి ప్రభుత్వం కన్యత్వ పరీక్షల మాదిరిగా చట్టబద్దంగా గర్భధాణ పరీక్షలు జరుపుతోంది. 

ఖాకీవనం.. పోలీసుల దైన్యం

తలపై మూడు సింహాల టోపి.. చేతిలో లాఠీ.. నడుముకి బెల్ట్ పెట్టుకొని.. కాళ్లకు బూట్లు వేసుకొని.. టాప్ టూ బోటమ్..  ఖాకీ దుస్తుల్లో కనిపించే పోలీసుల ఆహార్యంలో కానీ, వారి వ్యవహార శైలిలో కానీ  కర్కశంగా... కఠిన్యంతో నిండిపోయి ఉంటుందని దాదాపుగా అంతా భావిస్తారు. కానీ వారూ మనుషులే.. వారికీ మనసు  ఉంటుందని.. వారికీ  కుటుంబం ఉంటుందనీ..   సెంటిమెంట్లు ఉంటాయని.. ఎవరు  అనుకోరు, భావించరు. అంతే కాదు డ్యూటీలో భాగంగా వారు తీవ్ర ఆందోళనలకు లోనవుతారని.. వారి మానసిక సంఘర్షణ కారణంగా ఎంతో  కొంత  క్షోభకు గురవుతారని..  ఆ ఆవేదనను వారు.. మనసు పొరల్లో నిగూఢంగానే దాచేసకుంటారనీ,  ఈ పరిస్థితిని ప్రతి పోలీసూ.. ఎప్పుడొ ఒకప్పుడు.. ఎక్కడో అక్కడ.. ఎదుర్కొనే ఉంటారు. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే..  రాష్ట్రంలోని పోలీస్ బాస్ డీజీపీ స్థాయి నుంచి సాధారణ కానిస్టేబుల్ వరకు ఈ పరిస్థితికి ఎవరూ అతీతులు కారు. ఇందులో ఎలాంటి ఎటువంటి సందేహం అవసరం లేదు.   తాజాగా హైదరాబాద్‌లో  వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు   షర్మిల.. ఆమె తల్లి  విజయమ్మ.. పోలీసుల పట్ల వ్యవహరించిన తీరుపై విమర్శలు  వెల్లువెత్తుతున్నాయి. షర్మిల, విజయమ్మ పోలీసుల పట్ల వ్యవహరించిన తీరును హైదరాబాద్ నగర పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు నల్లా శంకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇటువంటి సంఘటనల వల్ల పోలీసుల ఆత్మాభిమానం దెబ్బ తింటుందని.. పోలీసుల సహానాన్ని పరీక్షించడం తగదంటూ హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం.. నిరంతరం పాటు పడే పోలీసులపై ఇటువంటి దాడులు జరగడం ఇదే తొలిసారా? అంటే కచ్చితంగా కాదు. బీఆర్ఎస్  నాయకులు, ప్రస్తుత మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు  గతంలో  అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులపై దాడి చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు  .. మీడియాలో, సోషల్ మీడియలో  అప్పట్లో విపరీతంగా వైరల్ అయినాయి. అదే విధంగా గతంలో ఏపీ మంత్రి,  వైసీసీ నాయకుడు గుమ్మనూరి జయరాం స్వగ్రామమైన కర్నూలు జిల్లాలోని గుమ్మనూరు పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు.. ఆ గ్రామానికి చేరుకొని.. పేకాటరాయుళ్ల నుంచి భారీగా నగదు, సెల్ ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకొన్న పోలీసులపై సదరు మంత్రి గారి సోదరుడు ఆయన  అనుచరులు కారం పోడితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇక గత ఏడాది హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అయితే.. సాక్షాతూ ఎస్ఐ కాలర్ పట్టుకొని ప్రశ్నిస్తూ.. గుంజడం జాతీయ మీడియాలో సైతం ప్రసారమైంది. ఇలా చెప్పుకొంటూ పోతే పోలీసులపై రాజకీయ నేతలు చేసిన దాడులు జాబితా  కొండవీటి చాంతాడంత  ఉంటుంది.  మరోవైపు ఇటువంటి సంఘటనలు తెలుగు రాష్ట్రాలకే పరిమితమా? అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా పోలీసులపై నాయకుల వ్యవహారశైలి ఇలాగే  ఉంటోందని చెప్పడానికి లెక్కలేనన్ని దాఖలాలున్నాయి.   అయితే పోలీసులపై వివిధ రాజకీయ నేతలు దాడి చేస్తున్న వీడియోలు... అందుకు సంబంధించిన వార్తా కథనాలు..ఇటు మీడియాలో... అటు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంటే.. దాడికి గురైన పోలీసుల కుటుంబాల్లో కలవరం రేగడం సహజం. ఇటువంటి పరిస్థితుల్లో బాధితులుగా మారుతున్న పోలీసులు.. ఆ ఆవేదనను పంటిబిగువునే భరిస్తూ.. మళ్లీ విధినిర్వహాణలో భాగస్వాములవుతోన్నారు.